రివ్యూ: యాక్షన్‌
సినిమా: యాక్షన్‌
నటీనటులు: విశాల్‌, తమన్నా, ఐశ్వర్య లక్ష్మి, ఆకాంక్షా పూరి, ఛాయా సింగ్‌, యోగిబాబు, ఆనందరాజ్‌ తదితరులు
దర్శకుడు: సి. సుందర్‌
నిర్మాత: ఆర్‌. రవీంద్రన్‌
కూర్పు: ఎన్‌.బి. శ్రీకాంత్‌
సంగీత దర్శకుడు: హిప్‌హాప్‌ తమిళ
విడుదల తేదీ: 15-11-2019


తెలుగులో విశాల్‌కి మంచి మార్కెట్ ఉంది. మాస్‌కి న‌చ్చే సినిమాలు, కొత్త త‌ర‌హా క‌థ‌లు ఎంచుకుంటారని పేరుంది. ఇటీవ‌ల ‘డిటెక్టివ్‌’, ‘అభిమ‌న్యుడు’ చిత్రాల‌తోనూ ఆక‌ట్టుకున్నారు. ఈసారి ఏకంగా రూ.60 కోట్ల బ‌డ్జెట్‌తో ఓ సినిమా తీశారు. అదే ‘యాక్షన్‌’. త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టించారు. మాస్ ప‌ల్స్ తెలిసిన సి. సుంద‌ర్ దర్శక‌త్వం వ‌హించారు. మ‌రి ఈ ముగ్గురి ‘యాక్షన్‌’ ఎలా ఉంది? మాస్‌కి న‌చ్చిందా? విశాల్ మ‌రో హిట్టు కొట్టారా?


క‌థేంటంటే:
సుభాష్ (విశాల్‌) ఆర్మీ అధికారి. సాహ‌స‌వంతుడు. త‌న‌కు కుటుంబం అంటే చాలా ఇష్టం. నాన్న ముఖ్యమంత్రి. అన్నయ్య ఉప ముఖ్యమంత్రి. సుభాష్‌ మ‌ర‌ద‌ల్ని పెళ్లి చేసుకుందామ‌నుకుంటాడు. కానీ మాలిక్ అనే ఉగ్రవాది వ‌ల్ల త‌న కుటుంబం విచ్ఛిన్నమవుతుంది. అన్నయ్య చ‌నిపోతాడు. నాన్నపై నింద‌ప‌డుతుంది. మ‌ర‌ద‌ల్ని చంపేస్తారు. దీనంత‌టికీ కార‌ణ‌మైన మాలిక్‌ని ప‌ట్టుకోవాలన్నది సుభాష్ ప్రయ‌త్నం. మ‌రి అది ఎంత వ‌ర‌కు విజ‌య‌వంత‌మైంది? పాకిస్థాన్‌లో రాజ‌భోగాలు అనుభ‌విస్తున్న మాలిక్‌ని, ఆ దేశం వెళ్లి సుభాష్ ఎలా తీసుకొచ్చాడు? అనేది తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే:
పేరుకు త‌గ్గట్టు సంపూర్ణమైన యాక్షన్ చిత్రమిది. సినిమాలో స‌గం పోరాటాలూ, ఛేజింగులే ఉంటాయి. అవ‌న్నీ మాస్‌కి న‌చ్చేలా తీర్చిదిద్దారు ద‌ర్శకుడు. అందుకోసం చాలా ఖ‌ర్చు పెట్టారు కూడా. మ‌రీ ముఖ్యంగా  విశ్రాంతి ముందొచ్చే స‌న్నివేశం హాలీవుడ్ సినిమాల్ని త‌ల‌పించేలా ఉంటుంది. ద్వితీయార్ధంలో జ‌రిగే ఛేజింగులు కూడా ఒళ్లు గ‌గుర్పాటుకు గుర‌య్యేలా తెర‌కెక్కించారు. వీటితో పోలిస్తే క్లైమాక్స్లోనే వేగం త‌గ్గిన‌ట్టు అనిపిస్తుంది. అయితే ఈ యాక్షన్ స‌న్నివేశాల‌న్నీ ఫైట్ కోసం ఫైట్ అన్నట్లు కాకుండా, క‌థ‌లో భాగంగానే వ‌స్తాయి. కాబట్టి.. యాక్షన్ ఎక్కువైనా.. ఆ భావ‌న రాదు. 


ఇక క‌థ విష‌యానికొస్తే...
చాలా చిన్న క‌థ‌. ఇది వ‌ర‌కు చూసిన క‌థే. ‘బేబీ’ లాంటి బాలీవుడ్ సినిమాల స్ఫూర్తి ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. మ‌రీ ముఖ్యంగా ద్వితీయార్ధంలో మాలిక్‌ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చే ఎపిసోడ్ మొత్తం ఆ సినిమాని పోలి ఉంటుంది. ప్రథమార్ధంలో ల‌వ్ ట్రాక్ కాస్త నెమ్మదిగా సాగిన‌ట్టు అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో తొలి స‌గం కూడా అంతే బోరింగ్‌గా అనిపిస్తుంది. బ్యాంక్‌లో చొర‌బ‌డి, ఎకౌంట్‌ని హ్యాక్ చేసే స‌న్నివేశం ఉత్కంఠ‌ క‌లిగిస్తుంది. అక్కడక్కడ ఉత్కంఠ‌.. చాలా చోట్ల బోరింగ్‌.. అంత‌టా యాక్షన్‌.. ఇదీ.. ఈ సినిమా ప్రత్యేక‌త‌. యాక్షన్ అంటే ఆస‌క్తి ఉన్నవాళ్లు ఒక్కసారి చూడొచ్చు.


ఎవ‌రెలా చేశారంటే:
విశాల్‌కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. ఓ సైనికుడిగా, ఓ తండ్రికి కొడుకుగా, ప్రియుడిగా.. త‌న ల‌క్ష్యాన్ని నెర‌వేర్చే పాత్రలో ఒదిగిపోయారు. యాక్షన్ స‌న్నివేశాల్లో చాలా స‌హ‌జంగా న‌టించారు. క‌బీర్ సింగ్ పాత్ర ఏం ప్రత్యేకంగా లేదు. త‌మ‌న్నాకు ఇది కొత్త త‌రహా పాత్ర. ప్రథమార్ధంలో చాలా త‌క్కువే క‌నిపించినా, ద్వితీయార్ధంలో ఆ లోటు తీర్చింది. ఆమె నటన ఆకట్టుకుంటుంది. ఐశ్వర్య ల‌క్ష్మి అందంగా ఉన్నారు. ఆకాంక్షా పూరి గ్లామ‌ర‌స్‌గా క‌నిపించారు. రాంకీ చాలా రోజుల త‌ర‌వాత క‌నిపించారు.
యాక్షన్‌కి పెద్ద పీట వేసిన సినిమా ఇది. ఆ స‌న్నివేశాల్ని తెర‌కెక్కించిన విధానం బాగుంది. నిర్మాణ ప‌రంగా బాగా ఖర్చు పెట్టారు. ప్రతీ పైసా తెర‌పై క‌నిపిస్తుంది. కెమెరా ప‌నిత‌నం, నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటాయి. పాట‌లు త‌క్కువే. క‌థ ప‌రంగా గొప్పద‌నం ఏమీ లేదు. కానీ యాక్షన్ జోడించి, కాస్త ఆక‌ట్టుకునేలా మాత్రం తెర‌కెక్కించారు.


బలాలు

+ యాక్షన్ సన్నివేశాలు
+ భారీద‌నం

బలహీనతలు

- క‌థ‌, క‌థ‌నం
- సాదాసీదా మ‌లుపులు

చివరగా: ‘యాక్షన్‌’ ప్రియులకు మాత్రమే.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.