రివ్యూ: అర్జున్ సుర‌వరం
చిత్రం: అర్జున్‌ సురవరం
న‌టీన‌టులు: నిఖిల్‌, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల‌కిషోర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌రుణ్ అరోరా, నాగినీడు, స‌త్య‌, విద్యుల్లేఖా రామ‌న్, త‌దిత‌రులు. 
ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం: టి.సంతోష్‌
నిర్మాత‌: రాజ్‌కుమార్ అకెళ్ల
సంగీతం: సామ్ సి.ఎస్
ఛాయాగ్రహ‌ణం: సూర్య 
స‌మ‌ర్పణ‌: ఠాగూర్ మ‌ధు.
సంస్థ‌: మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి
విడుద‌ల‌ తేదీ: 29 న‌వంబ‌రు 2019

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన చిత్రం ‘క‌ణిత‌న్‌’. చాలా మంది తెలుగు క‌థానాయ‌కులు ఈ సినిమాపై ఆస‌క్తి ప్రద‌ర్శించారు. ఆ అవ‌కాశం నిఖిల్‌కి ద‌క్కింది.  కానీ కొన్ని కార‌ణాల‌వ‌ల్ల చిత్రం విడుద‌ల కావ‌డంలో ఆల‌స్యమైంది. అయినా ప్రచార కార్యక్రమాల‌తో సినిమాపై ఆస‌క్తిని రేకెత్తించారు. మ‌రి సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు కథేంటో చూద్దాం...  క‌థేంటంటే:
అర్జున్ లెనిన్ సుర‌వ‌రం (నిఖిల్‌) కుటుంబం త‌రాలుగా పాత్రికేయ వృత్తిలో ఉంటుంది. అర్జున్‌ని వాళ్ల నాన్న (నాగినీడు) ఇంజినీరింగ్ చ‌దివించి, సాఫ్ట్‌వేర్ రంగంవైపు పంపించినా అతడు మాత్రం జ‌ర్నలిస్టుగా ఒక టీవీ ఛాన‌ల్‌లో చేర‌తాడు. సామాజిక బాధ్యత‌తో ప‌నిచేస్తుంటాడు. ఎప్పటికైనా బీబీసీలో ఉద్యోగం సంపాదించాల‌నేది అతడి క‌ల‌. ఆ క‌ల సాకారమ‌వుతున్న  క్రమంలోనే ఎడ్యూకేష‌న్ లోన్ తీసుకొని బ్యాంకుని మోసం చేశాడ‌నే కేసులో పోలీసులు అర్జున్‌ని అరెస్టు చేస్తారు. అందుకు కార‌ణం న‌కిలీ స‌ర్టిఫికెట్ల త‌యారీ అనే విష‌యం తెలుస్తుంది. ఎలాగైనా ఆ చీక‌టి కోణాన్ని బ‌య‌ట పెట్టేందుకు న‌డుం బిగిస్తాడు. స్వత‌హాగా పాత్రికేయుడైన అర్జున్ త‌నకున్న తెలివితేట‌ల‌తో స‌ర్టిఫికెట్ల మాఫియా బండారాన్ని ఎలా బ‌య‌ట పెట్టాడ‌నేదే మిగ‌తా సినిమా. 


ఎలా ఉందంటే:
ప‌రిశోధ‌నతో సాగే ఓ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ప‌రిశోధ‌న అంటేనే ఆస‌క్తి రేకెత్తించే అంశం. తీగ లాగడం, డొంక క‌ద‌ల‌డం, ఆ వెన‌క న‌మ్మలేని నిజాలు బ‌య‌టికి రావ‌డం.. ఇలా ప్రతి ద‌శ కూడా త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఉత్సుక‌త‌ని రేకెత్తించేదే. ఈ సినిమాని కూడా ద‌ర్శకుడు అదే త‌ర‌హాలో తీర్చిదిద్దారు. తొలి స‌న్నివేశ‌మే ఆస‌క్తిని రేకెత్తిస్తుంది.  క‌థానాయ‌కుడు న‌కిలీ స‌ర్టిఫికెట్ల కుంభ కోణంలో నిందితుడుగా క‌నిపిస్తాడు. అదెలాగో చెప్పే క్రమంలో మొద‌ల‌య్యే ఫ్లాష్‌బ్యాక్‌తో అస‌లు క‌థ ప్రారభమవుతుంది. పాత్రికేయుడిగా క‌థానాయ‌కుడు చేసే స్టింగ్ ఆప‌రేష‌న్లు, ఆ క్రమంలోనే క‌థానాయిక ప‌రిచ‌యం కావడం, వాళ్లిద్దరి మ‌ధ్య ప్రేమ‌, అంత‌లోనే అనుకోని మ‌లుపు.. ఇలా ప్రేక్షకుడిని క‌థ‌లో చ‌క్కగా నిమ‌గ్నం చేశాడు ద‌ర్శకుడు. న‌కిలీ స‌ర్టిఫికెట్ల మాఫియా కోసం క‌థానాయ‌కుడు రంగంలోకి దిగ‌డం, దాని వెన‌క వ్యక్తుల్ని బ‌య‌టికి తీసుకొచ్చేందుకు వేసే ఎత్తుగ‌డ‌ల‌తో క‌థ మ‌రింత ఆస‌క్తిగా మారుతుంది. ద్వితీయార్ధంలో కొన్ని స‌న్నివేశాలు పున‌రావృతం అవుతున్నట్టు అనిపించినా.. భావోద్వేగాల్ని రాబ‌ట్టడంలో ద‌ర్శకుడు మంచి ప‌నితీరు ప్రద‌ర్శించారు. న‌కిలీ స‌ర్టిఫికెట్ల వ‌ల్ల జ‌రిగే ప‌రిణామాల్ని చెబుతూ.. స్కూలు కూలిపోయే స‌న్నివేశాల్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. ప‌తాక స‌న్నివేశాలు కూడా ఆక‌ట్టుకుంటాయి. క‌థానాయ‌కుడు బ‌య‌ట పెట్టిన న‌కిలీ స‌ర్టిఫికెట్లని ఎలా అస‌లువిగా మార్చారు? న‌కిలీ స‌ర్టిఫికెట్లని ఎలా చేస్తారో చూపించే స‌న్నివేశాలు కాస్త గంద‌ర‌గోళంగా అనిపిస్తాయి.

ఎవ‌రెలా చేశారంటే:
నిఖిల్ అభిన‌యం ఆక‌ట్టుకుంటుంది. పాత్రికేయుడి పాత్రకు త‌గ్గట్టుగా చ‌క్కగా న‌టించాడు. యాక్షన్ స‌న్నివేశాలు కూడా చాలా బాగా చేశాడు. కావ్య అనే యువ‌తి పాత్రలో లావ‌ణ్య త్రిపాఠి ప‌రిధి మేర‌కు న‌టించింది. స‌త్య‌, వెన్నెల కిషోర్‌, విద్యుల్లేఖ రామ‌న్ కొద్దిమేర హాస్యం పంచారు. క‌థానాయ‌కుడికి త‌ల్లిదండ్రులుగా నాగినీడు, ప్రగ‌తి, ఓ మంచి పాత్రలో పోసాని కృష్ణముర‌ళి క‌నిపిస్తారు. రాజా ర‌వీంద్ర, త‌రుణ్ అరోరా త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్రల్లో క‌నిపిస్తారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సూర్య కెమెరా ప‌నిత‌నం, సామ్‌.సి.ఎస్ సంగీతం ఆక‌ట్టుకుంటుంది. విదేశాల్లో తీసిన ఒక పాట చిత్రీక‌ర‌ణ కూడా మెప్పిస్తుంది. రీమేక్ చేస్తున్నప్పుడు, అది కూడా మాతృక‌ని తీసిన ద‌ర్శకుడే ఆ బాధ్యత‌ల్ని నిర్వర్తిస్తున్నప్పడు క‌థ‌, క‌థ‌నాలు మ‌రింత ప‌దునుగా ఉండాలి. కానీ ద‌ర్శకుడు కొన్ని స‌న్నివేశాలపై ప‌ట్టుని కోల్పోయిన‌ట్టు అనిపిస్తుంది. నిర్మాణ విలువ‌లు సినిమాకి ప్రధాన ఆక‌ర్షణ‌గా నిలుస్తాయి.

బ‌లాలు
+ క‌థ‌
+ క‌థ‌నం
+ హాస్య స‌న్నివేశాలు
+ న‌టీన‌టులు


బ‌లహీన‌త‌లు
- ద్వితీయార్ధంలో కొన్ని స‌న్నివేశాలుచివ‌రిగా: అర్జున్ ప‌రిశోధ‌న ఆక‌ట్టుకుంటుంది


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.