రివ్యూ: చాణక్య
సినిమా : చాణక్య
నటీనటులు : గోపీచంద్‌, మెహరీన్‌, జరీన్‌ ఖాన్‌, సునీల్‌, నాజర్‌, రాజేష్‌ ఖత్తర్‌, అలీ, రఘుబాబు తదితరులు
సంగీతం:  విశాల్‌ చంద్రశేఖర్‌, శ్రీ చరణ్‌ పాకాల
సినిమాటోగ్రఫీ : వెట్రి పళనిస్వామి
మాటలు : అబ్బూరి రవి
నిర్మాత : రామబ్రహ్మం సుంకర
కథ, స్క్రీన్‌ప్లే,  దర్శకత్వం : తిరు
నిర్మాణ సంస్థ : ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీ : 05-10-2019


విలన్‌గా తెలుగు తెరపై మెరిసి కథానాయకుడిగా మారి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు గోపీచంద్‌. గత కొన్నేళ్లుగా ఆయన సరైన బ్రేక్‌ కోసం ఎదురుచూస్తున్నారు. 2018లో వచ్చిన ‘పంతం’ కూడా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఆయన భారతీయ ‘రా’ ఏజెంట్‌గా నటించి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘చాణక్య’ అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘సైరా’ వంటి భారీ బడ్జెట్‌ చిత్రం విడుదలైనా బాక్సాఫీస్‌ వద్ద తమ చిత్రం కూడా సత్తా చాటుతుందని నమ్మకం వ్యక్తం చేశారు గోపీచంద్‌. అంతేకాదు, ఈ సినిమా తన కెరీర్‌కు ప్లస్‌ అవుతుందని, అందరి అంచనాలను అందుకుంటుందని చెప్పారు. మరి ఈరోజు విడుదలైన ‘చాణక్య’ ఆకట్టుకుందా? గోపిచంద్‌కు హిట్‌ ఇచ్చిందా?, ఈ స్పై థ్రిల్లర్‌ ఎలా ఉంది?

కథేంటంటే
: అర్జున్‌ అలియాస్‌ రామకృష్ణ‌(గోపీచంద్‌) ఒక బ్యాంకు ఉద్యోగి. పైకి బ్యాంకు ఉద్యోగిలా కనిపించే రామకృష్ణ విపత్కర పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడే ‘రా’ ఏజెంట్‌. అర్జున్‌తో పాటు మరో నలుగురు ఒక బృందంగా అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ చేస్తుంటారు. కరాచీలో దాక్కొని, భారతదేశంపై దాడి చేయాలనుకుంటున్న ఒక తీవ్రవాదిని పట్టుకోవడానికి అర్జున్‌ అతని టీమ్‌ ప్రయత్నిస్తుంటుంది. అయితే, ఆ విషయాన్ని ముందే గమనించి, తీవ్రవాదులు అర్జున్‌ టీమ్‌లోని మిగిలిన నలుగురిని కిడ్నాప్‌ చేస్తారు. ఆ నలుగురిని రక్షించడానికి అర్జున్‌ ఒక్కడే కరాచీ వెళ్తాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి, వారిని ఎలా రక్షించాడు? ఆ తీవ్రవాది నుంచి దేశాన్ని ఎలా కాపాడాడు? అన్నదే ‘చాణక్య’ కథ.


ఎలా ఉందంటే
: ఇదో స్పై థ్రిల్లర్‌. ‘రా’ అధికారుల పనితీరు ఎలా ఉంటుంది? వాళ్ల గూఢచార్య నైపుణ్యాలు ఏంటి? దేశాన్ని కాపాడటానికి వాళ్లు ఏం చేస్తారు? ఎంతకు తెగిస్తారు? అన్న అంశాలను స్పృశిస్తూ, ఒక కమర్షియల్‌ సినిమాను తీసే ప్రయత్నం చేశారు. గూఢచారి తరహా కథలు ఎప్పుడూ ఉత్కంఠ కలిగిస్తాయి. సరైన స్క్రీన్‌ప్లే, మలుపులు తోడైతే, ఆ ప్రయత్నం మరింత ఆకట్టుకుంటుంది. చాణక్యలోనూ అలాంటి అంశాలు కనిపిస్తాయి. ఈ కథను ఒక యాక్షన్‌ ఎపిసోడ్‌తో ప్రారంభిస్తారు. కరాచీలో బంధించబడిన నలుగురు స్నేహితులను కాపాడటానికి హీరో చేసే ప్రయత్నాలు ఈ కథకు మూల స్తంభాలుగా నిలుస్తాయి. అయితే, వాటి చుట్టూ, సన్నివేశాలను ఆసక్తిగా, ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే బాగుండేది.

ప్రథమార్ధంలో బ్యాంకు ఉద్యోగి రామకృష్ణ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడికి బోరు కొట్టిస్తాయి. మెహరీన్‌తో లవ్‌ ట్రాక్‌, వినోదం కోసమే సృష్టించిన ఆయా సన్నివేశాలు ఇబ్బంది కలిగిస్తాయి. కామెడీ లేకపోగా పంటి కింద రాయిలా తగులుతాయి. విశ్రాంతి ముందు వరకూ కథలో ఎలాంటి అలజడి ఉండదు. విశ్రాంతి తర్వాత దర్శకుడు కథను ట్రాక్‌ ఎక్కించాడు. కరాచీ వెళ్లి తన స్నేహితులను ఎలా కాపాడాడన్నది ద్వితీయార్ధం. అక్కడ ఆపరేషన్‌ ఆసక్తికరంగా ఉంటే సినిమా మరో స్థాయికి వెళ్లేది. ఈ టైటిల్‌కు తగ్గట్టు కథానాయకుడు తెలివి తేటలు ప్రదర్శించకపోవడంతో ఆ సన్నివేశాలన్నీ కాస్త దారి తప్పాయి. అయితే, పతాక సన్నివేశాలు మాత్రం థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. అక్కడ దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్‌ ఈ చిత్రానికి ఆయువు పట్టు, ఆయా సన్నివేశాలు ప్రేక్షకుడిని ఉత్కంఠతో ఊపేస్తాయి. యాక్షన్‌ సన్నివేశాలు, వాటిని తెరకెక్కిన విధానం, లొకేషన్‌లు ఇవన్నీ మాస్‌కు బాగా నచ్చుతాయి.


ఎవరెలా చేశారంటే
: యాక్షన్‌ ఇమేజ్‌ ఉన్న గోపీచంద్‌కు మరోసారి తన శైలికి తగిన పాత్ర దొరికింది. ‘రా’ అధికారిగా చాలా నిజాయతీగా కనిపిస్తారు. బ్యాంకు ఉద్యోగిగా అమాయకత్వం ప్రదర్శిస్తారు. యాక్షన్‌ సీన్లను ఎప్పటిలాగే చురుగ్గా చేశారు. మెహరీన్‌ పాత్ర పరిమితం. ఆమె ఒక లవ్‌ ట్రాక్‌, పాటలకే పరిమితం అయింది. కథానాయిక పాత్రకంటే జరీన్‌ఖాన్‌ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అర్జున్‌కు సహకరించే ఆ పాత్రలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. సునీల్‌, అలీ, రఘుబాబు నవ్వులు పంచే ప్రయత్నం చేశారు. ప్రతినాయకులుగా నటించిన వారు తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేనివారు కావడంతో ఆయా పాత్రల్ని ప్రేక్షకులు ఆకళింపు చేసుకోవడం కష్టమవుతుంది. దర్శకుడు తిరు ఎంచుకున్న నేపథ్యం కొత్తది. అయితే, దానికి బలం చేకూర్చే సన్నివేశాలు ఇంకొన్ని రాసుకుని ఉంటే బాగుండేది. ‘చాణక్య’ టైటిల్‌కు తగినట్లు సన్నివేశాలు లేవు. ఒకటి రెండు ట్విస్ట్‌లు మినహా మిగిలిన సన్నివేశాలు సాదాసీదాగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. అయితే, పాటలు కథా గమనానికి బ్రేక్‌లు వేస్తాయి. నిర్మాణ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తెరపై భారీదనం కనిపిస్తుంది. యాక్షన్‌ సన్నివేశాల కోసం, లొకేషన్ల కోసం చాలా ఖర్చు పెట్టారు.

బలాలు
+ క్లైమాక్స్‌ ట్విస్ట్‌
+ యాక్షన్‌ సన్నివేశాలు
+ నిర్మాణ విలువలు

బలహీనతలు
- స్క్రీన్‌ప్లే
- లవ్‌ ట్రాక్‌

చివరిగా: తెలివి తేటలు వాడని ‘చాణక్యుడు’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.