రివ్యూ: జాను
చిత్రం:జాను
న‌టీన‌టులు: శ‌ర్వానంద్‌, సమంత‌, వెన్నెల‌కిషోర్‌, శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌, తాగుబోతు ర‌మేష్‌, వ‌ర్ష బొల్ల‌మ్మ‌, ర‌ఘుబాబు, గౌరి, సాయికిర‌ణ్ కుమార్ తదిత‌రులు.
సంగీతం: గోవింద్ వ‌సంత‌
ఛాయాగ్ర‌హ‌ణం: మ‌హేంద్ర‌న్ జ‌య‌రాజ్‌
క‌ళ‌: రామాంజ‌నేయులు
మాట‌లు: మిర్చి కిర‌ణ్‌
పాట‌లు: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, శ్రీమ‌ణి
నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్‌
ద‌ర్శ‌క‌త్వం: సి.ప్రేమ్‌కుమార్‌.
సంస్థ‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
విడుద‌ల‌: 7 ఫిబ్ర‌వ‌రి 2020

సృష్టించడం... పునః సృష్టించం. వీటి మ‌ధ్య చాలా వ్య‌త్యాస‌ముంది. పునః సృష్టించ‌డంలో ఒరిజినాలిటీ కోల్పోయే అవ‌కాశాలే ఎక్కువ. అందుకే చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చాలా వ‌ర‌కు రీమేక్‌ల జోలికి వెళ్ల‌రు. ఇక క్లాసిక్ అనిపించుకున్న సినిమాల జోలికి వెళ్లాలంటే చాలా భ‌య‌ప‌డ‌తారు. త‌మిళంలో తెర‌కెక్కిన `96` అక్క‌డ ఘన విజ‌యం సాధించింది. తెలుగులో దాన్ని రీమేక్ చేస్తున్నార‌న‌గానే చాలా పెద్ద చ‌ర్చ సాగింది. కానీ దిల్‌రాజు క‌థ‌పై న‌మ్మ‌కంతో, మాతృక‌ని తీసిన ద‌ర్శ‌కుడు ప్రేమ్‌కుమార్‌తోనే `96` సినిమాని `జాను`గా రీమేక్ చేశారు. అందులో శ‌ర్వానంద్‌, స‌మంత న‌టించ‌డంతో సినిమాపై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? మాతృక త‌ర‌హాలోనే భావోద్వేగాలు పండాయా? త‌దితర విష‌యాల్ని తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం ప‌దండి...

@ క‌థ
రామచంద్ర అలియాస్ రామ్ (శర్వానంద్), జానకి దేవి అలియాస్ జాను (సమంతా) పాఠశాలలో సహవిద్యార్థులు. ప‌దో త‌ర‌గ‌తిలోనే ఒక‌రిపై మ‌రొక‌రికి ఇష్టం ఏర్ప‌డుతుంది. ఆ త‌ర్వాత పరిస్థితులు వాళ్ల‌ని విడిపోయేలా చేస్తాయి. అప్ప‌ట్నుంచి ఒక‌రినొక‌రు చూసుకోరు. రామ్ ట్రావెల్ ఫొటోగ్రాఫ‌ర్‌గా స్థిర‌ప‌డిపోతాడు. జాను పెళ్లి చేసుకుని సింగ‌పూర్ వెళ్లిపోతుంది. 17 యేళ్ల త‌ర్వాత పూర్వ విద్యార్థుల స‌మ్మేళ‌నంలో క‌లుసుకుంటారు. మ‌రి అప్పుడు ఒక‌రినొక‌రు చూసుకున్న‌ప్పుడు ఎలా స్పందించారు? ప‌్రేమ గురించి, చిన్న‌ప్ప‌టి బంధం గురించి ఏం మాట్లాడుకున్నారు? ఒక రోజు రాత్రి క‌లిసి గడిపే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు వాళ్లు ఏం చేశారు? రామ్‌కి ఇంకా పెళ్లి కాలేద‌ని తెలుసుకున్న జాను ఏం చేసింది? ఇంత‌కీ రామ్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


@ విశ్లేష‌ణ‌
రీమేక్ సినిమా అనగానే పోలిక‌లు వెద‌క‌డం స‌హ‌జం. బాల్యం, తొలి ప్రేమ అనేవి అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే విష‌యాలు. అలాంటి నేప‌థ్యంలో క‌థ‌, స‌న్నివేశాలంటే వాటిలో స‌హజంగానే పండే ల‌క్ష‌ణం ఉంటుంది. ఆ న‌మ్మ‌క‌మే ఈ సినిమా చేయ‌డానికి కార‌ణ‌మైందని చెప్పొచ్చు. మాతృక‌తో పోల్చినా దీని ప్ర‌త్యేక‌త దీనికి క‌నిపిస్తుంది. కొత్త క‌థ‌, కొత్త జాను, కొత్త మేజిక్ తెర‌పై క‌నిపిస్తుంటుంది. ఇది రీమేక్ సినిమా అనే భావ‌న క‌ల‌గ‌నీయ‌కుండా ద‌ర్శ‌కుడు స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. దాంతో ప్రేక్ష‌కుడు ఆరంభం నుంచే క‌థ‌లో లీన‌మైపోతాడు. క‌థానాయ‌కుడు స్కూల్‌లోకి అడుగుపెట్టిన‌ప్ప‌ట్నుంచి ఇక ప్ర‌తి ఒక్క‌రూ ఆ పాత్ర‌లో త‌మ‌ని తాము చూసుకుంటారు. పూర్వ‌విద్యార్థుల స‌మ్మేళనం ఆలోచ‌న‌, ఆ నేప‌థ్యంలో పండే వినోదం ఆక‌ట్టుకుంటుంది. ఇక చిన్న‌ప్ప‌టి రామ్‌, జానుల ప్రేమ‌క‌థ ప్ర‌తి ఒక్క‌రినీ వాళ్ల స్కూల్ రోజుల్లోకి తీసుకెళుతుంది. తొలి ప్రేమ‌ని మ‌రోసారి గుర్తు చేస్తుంది. 17 యేళ్ల త‌ర్వాత రామ్‌, జాను ఒక‌నొక‌రు క‌ల‌వ‌డం, వాళ్ల మ‌ధ్య అంతే ప్రేమ ఉండ‌టం, ఆ నేప‌థ్యంలో స‌న్నివేశాలు హృద‌యాల్ని హ‌త్తుకుంటాయి. ఇక విరామం స‌మ‌యంలో వ‌చ్చే స‌న్నివేశాలైతే మ‌రో ఎత్తు. రామ్ పెళ్లి చేసుకోలేద‌ని తెలిసిన‌ప్పుడు జాను పాత్రలో మ‌థ‌నం, ఆమె పడే సంఘ‌ర్ష‌ణ సినిమాకి ప్ర‌ధాన బ‌లం. ద్వితీయార్థంలో భావోద్వేగాలు మ‌రోస్థాయిలో పండాయి. ఒక‌రంటే ఒక‌రికి ఎంత ఇష్టం? వాళ్ల‌ని ప‌రిస్థితులు ఎలా వేరు చేశాయి? ఆ జ్ఞాపకాల్ని అన్నేళ్ల త‌ర్వాత ఎంత మొహ‌మాటంతో ఒక‌రికొక‌రు చెప్పుకున్నారనే విష‌యాలు హృద‌యాల్ని స్పృశింప‌జేస్తాయి. జాను నుంచి దూర‌మైనా ఆమె గురించి తెలుసుకున్న విష‌యాల్ని హోట‌ల్ గ‌దిలో చెప్పడం... ఆ త‌ర్వాత త‌మ ప్రేమ‌క‌థ‌ని మ‌రోలా మార్చి రామ్ స్టూడెంట్స్‌కి జాను చెప్ప‌డం... అక్క‌డ పండిన భావోద్వేగాలు కూడా సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్లాయి. స్వ‌చ్ఛ‌మైన క‌థ‌, భావోద్వేగాల‌తో కూడిన సినిమా ఇది. ప్రతి గుండెనీ బ‌రువెక్కించేలా స‌న్నివేశాలు సాగుతుంటాయి. మ‌ధ్య మ‌ధ్య‌లో పండే హాస్యం కాస్త మ‌న‌సుని తేలిక‌పడేలా చేస్తుంది. మాతృక‌ని చూసినా, మాతృక‌తో పోల్చినా మ‌రోసారి మేజిక్ క్రియేట్ అయ్యింద‌నిపించే ఓ మంచి ప్ర‌య‌త్నం ఈ సినిమా.


@ న‌టీన‌టులు... సాంకేతిక‌త‌
శ‌ర్వానంద్‌, స‌మంత‌ల ఎంపిక తెలివైన నిర్ణ‌య‌మ‌ని వాళ్లిద్ద‌రి క‌లిసిన తొలి స‌న్నివేశంలోనే అర్థ‌మైపోతుంది. స‌న్నివేశాలు సాగుతున్న‌కొద్దీ వీళ్లు త‌ప్ప మ‌రొక‌రు ఈ పాత్ర‌ల్లో క‌నిపిస్తే క‌ష్ట‌మేనేమో అనిపిస్తుంది. వాళ్ల న‌ట‌నే చిత్రానికి ప్ర‌ధానబ‌లం. కొన్ని స‌న్నివేశాలు నాలుగు గోడ‌ల మ‌ధ్యే సాగుతుంటాయి. అలాంటి స‌న్నివేశాల్ని ఒక‌రినొక‌రు చూసుకుంటూ, మాట్లాడుతూ ర‌క్తిక‌ట్టించ‌డం ఆషామాషీ కాదు. కానీ శ‌ర్వా, స‌మంత‌లు త‌మ అనుభ‌వాన్నంతా నూరిపోసి వాటిని పండించారు. చాలా స‌న్నివేశాలు ఇద్ద‌రి మ‌ధ్యే సాగుతుంటాయి. అయినా ఎక్క‌డా బోర్ కొట్ట‌దు. వెన్నెల‌కిషోర్‌, తాగుబోతు ర‌మేష్‌, ర‌ఘుబాబు, శ‌ర‌ణ్య త‌దిత‌రులు క్లాస్‌మేట్స్‌గా చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌థ‌మార్థంలో చాలా స‌న్నివేశాల్లో వినోదం పంచారు. చిన్న‌ప్ప‌టి రామ్, జానులుగా క‌నిపించిన సాయికుమార్‌, గౌరిల అభిన‌యం కూడా మెప్పిస్తుంది. అమాయ‌కంగా క‌నిపిస్తూ స‌న్నివేశాల్ని పండించారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. గోవింద్ వ‌సంత సంగీతం, మ‌హేంద్ర‌న్ జైరాజ్ కెమెరా ప‌నిత‌నం, మిర్చికిర‌ణ్ మాట‌లు మెప్పిస్తాయి. `నిన్నెక్క‌డ వ‌దిలేశానో అక్క‌డే ఉన్నా`, `సార్ మంచివార‌నే విష‌యం తెలుసు, కానీ బాగా చూసుకోవ‌డం ఎలా అనేదే తెలియాలి` త‌ర‌హా సంభాష‌ణ‌లు ఆలోచింప‌జేస్తాయి. క‌థ‌లో గాఢ‌త‌ని తెలియ‌జేస్తాయి. ప్రేమ్‌కుమార్ భావోద్వేగాల‌పై ప‌ట్టు కోల్పోకుండా క‌థ‌ని న‌డిపించిన విధానం మెప్పిస్తుంది. దిల్‌రాజు చేసిన తొలి రీమేక్ సినిమా ఇది. ఆయ‌న సంస్థ స్థాయికి త‌గ్గ‌ట్టుగా నిర్మాణ విలువ‌లు ఉన్నాయి.


@ చివ‌రిగా: స‌్వ‌చ్ఛ‌మైన క‌థ‌తో, స‌హ‌జంగా తెర‌కెక్కిన రీమేక్ చిత్ర‌మిది. మేజిక్‌ని పునః సృష్టించ‌డంలో చిత్ర‌బృందం విజ‌య‌వంత‌మైంది. గ‌తంలోకి తీసుకెళ్లి మ‌రోసారి గ‌డిచిపోయిన జీవితాన్ని గుర్తు చేసే హృద్య‌మైన చిత్ర‌మిది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.