రివ్యూ : జెస్సీ
సినిమా: జెస్సీ
నటీనటులు: ఆషిమా, శ్రీత చందన, అతుల్‌ కులకర్ణి, కబీర్‌ సింగ్‌ తదితరులు
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
కూర్పు: గ్యారీ
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశ్వినీ కుమార్‌
విడుదల తేదీ: 15-03-2019


హార‌ర్ సినిమాలు చూసి బోర్ కొట్టేసింది. ఒక ఇల్లు.. అందులో దెయ్యం, అక్క‌డికి వెళ్లిన‌వాళ్లంద‌రినీ ఓ ఆట ఆడుకోవ‌డం.. ఇదే హార‌ర్ సినిమాల ఫార్ములాగా మారిపోయింది. అందులోనే వైవిధ్యం చూపించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు త‌ప్ప‌, ఆ గిరి దాటి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. అప్పుడ‌ప్పుడూ కొన్ని సినిమాలు అలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. హార‌ర్‌కి స‌స్పెన్స్ జోడించి.. ఓ థ్రిల్ల‌ర్‌గా మ‌లిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడొచ్చిన ‘జెస్సీ’లో కూడా ఆ ల‌క్ష‌ణాలు క‌నిపించాయి.

క‌థేంటంటే: జెస్సీ (ఆషిమా) అమీ (శ్రీ‌త చంద‌న‌) అక్కాచెల్లెళ్లు. అమీ ఓ మాన‌సిక స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటుంది. త‌న వ‌య‌సు పెర‌గాల్సింది పోయి... త‌గ్గుతూ ఉంటుంది. మ‌తిమ‌రుపు, కోపం ఆమె స‌హ‌జ ల‌క్ష‌ణాలు. అప్పుడ‌ప్పుడూ దెయ్యం ప‌ట్టిన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తుంటుంది. అమీ ప్ర‌వ‌ర్త‌న చూసి జెస్సీ భయపడుతుంది. మాన‌సిక వైద్యురాలి స‌హాయం తీసుకున్నా లాభం ఉండదు. దాంతో భూత‌వైద్యుడ్ని సంప్ర‌దిస్తుంది. జెస్సీలో ఓ అత్మ ఉంద‌న్న విష‌యం తెలుస్తుంది. మ‌రి ఆ ఆత్మ ఎవ‌రిది? ఆ త‌ర‌వాత ఏం జ‌రిగింది? అనేదే క‌థ‌.

ఎలా ఉందంటే:
అన్ని సినిమాల్లానే ‘జెస్సీ’ కూడా ఓ మామూలు హార‌ర్ సినిమాలా మొద‌ల‌వుతుంది. ఓ బంగ్లాలోకి గోస్ట్ హంట‌ర్స్‌ అంటూ కొంత‌మంది అడుగుపెట్ట‌డం, అక్క‌డ దెయ్యం ఉందో లేదో నిర్దారించుకోవ‌డం... తొలి స‌న్నివేశాలుగా క‌నిపిస్తాయి. ఒక్క‌సారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిన త‌ర‌వాత‌.. అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. విరామం వ‌ర‌కూ ఈ క‌థ ఒక‌లా అనిపిస్తే.. విశ్రాంతి త‌ర‌వాత ఈ క‌థ స్వ‌రూప‌మే మారిపోతుంది. ఆ ట్విస్టు త‌ప్ప‌కుండా అంద‌రినీ థ్రిల్‌కి గురి చేస్తుంది. కానీ అప్ప‌టికే చాలా చిక్కుముడులు పేరుకుపోతుంటాయి. పోలీస్ ఆఫీస‌ర్ (అతుల్ కుల‌క‌ర్ణి) పాత్ర‌ని ప్ర‌వేశ పెట్టి, కొన్ని చిక్కుముడుల‌కు స‌మాధానాలు చెప్పిస్తారు. ఫ్లాష్ బ్యాక్ వ‌ర‌కూ.. ఈ క‌థ కొత్త‌గా అనిపిస్తుంది. కానీ... చివ‌ర్లో ఈ క‌థ‌ని ఎలా ముగించాలో ద‌ర్శ‌కుడికి అర్థం రాలేదు. అప్ప‌టి వ‌ర‌కూ కొత్త‌గా ఆలోచించి... ప‌తాక స‌న్నివేశాల్ని మాత్రం ఓ మామూలు హార‌ర్ సినిమాలా మ‌లిచాడు. దెయ్యాన్ని చూపించి భ‌య‌పెట్ట‌డం కంటే... శ‌బ్దాల‌తో, అరుపుల‌తో వ‌ణుకు తెప్పించాడు. దెయ్యం కథ‌ల్లో అస‌లైన క‌మ‌ర్షియ‌ల్ వ‌స్తువు భ‌య‌మే. ఇప్పుడు దెయ్యాన్ని చూస్తామా? ఎటు నుంచి వ‌స్తుందో ఏమో.. అనే భ‌య‌మే క‌థ‌ని న‌డిపిస్తుంది. మంచం కింద దెయ్యాన్ని చూపించిన సీన్‌... నిజంగా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. అలాంటి స‌న్నివేశాలు మ‌రికొన్ని ఉంటే.. ఈ సినిమాకి న్యాయం జ‌రిగేది. ప‌తాక సన్నివేశాల్లో ఆ టెంపోని కొన‌సాగించ‌క‌పోవ‌డం మ‌రో ప్ర‌తికూలాంశం.


ఎవ‌రెలా చేశారంటే:
అర్చ‌న, అతుల్ కుల‌క‌ర్ణి, క‌బీర్ సింగ్ మిన‌హా అంతా కొత్త‌వాళ్లే. అర్చ‌న పాత్ర ప‌రిధి కూడా చిన్న‌దే. క‌బీర్ సింగ్ భూత వైద్యుడిగా క‌నిపిస్తాడు. భూత‌వైద్యుడు అన‌గానే ఒళ్లంతా తాయత్తులు, రుద్రాక్ష‌లు, పెద్ద పెద్ద బొట్లు లాంటివి లేకుండా.. ఫార్మ‌ల్ దుస్తుల్లో చూపించ‌డం బాగుంది. పోలీస్ అధికారిగా అతుల్ త‌న అనుభ‌వాన్ని రంగ‌రించాడు. జెస్సీ, అమీల న‌ట‌న కూడా బాగుంది.

సాంకేతికంగా చూస్తే... సంగీత ద‌ర్శ‌కుడు త‌న బ్యాక్‌గ్రౌండ్‌ సౌండ్స్‌తో భ‌య‌పెట్టాడు. ఉన్న‌ది ఒకే ఒక్క పాట‌. అది కూడా అన‌వ‌స‌ర‌మే. ఛాయాగ్ర‌హ‌ణం హార‌ర్ సినిమాల కొల‌త‌ల‌కు స‌రిప‌డా ఉంది. ద‌ర్శ‌కుడు ద్వితీయార్ధంలో ఇచ్చిన ట్విస్టు బాగుంది. కానీ.. అదె టెంపో సినిమా అంతా చూపించ‌లేక‌పోయాడు. అక్క‌డ‌క్క‌డ భ‌య‌పెట్టిన ఈ సినిమా చాలా చోట్ల నిదానంగా సాగుతుంది.

బ‌లాలు

+ ద్వితీయార్ధంలో వ‌చ్చే ట్విస్టు
+ నేప‌థ్య సంగీతం

బ‌ల‌హీన‌త‌లు
- ప‌తాక సన్నివేశాలు
చివ‌రిగా: ‘జెస్సీ’ సౌండ్స్‌తో భ‌య‌పెట్టింది..!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.