రివ్యూ:పొన్‌మగళ్‌ వందాళ్‌

చిత్రం: పొన్‌మగళ్‌ వందాళ్‌

నటీనటులు: జ్యోతిక, పార్తిబన్‌, కె.భాగ్యరాజ్‌, త్యాగరాజన్‌, పాండియరాజన్‌, ప్రతాప్‌ పోతన్‌ తదితరులు

సంగీతం: గోవింద వసంతన్‌

ఎడిటింగ్‌: రుబెన్‌

సినిమాటోగ్రఫీ: రాంజీ

నిర్మాత: సూర్య

కథ, దర్శకత్వం: జె.జె.ఫెడ్రిక్‌

బ్యానర్‌: 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌

విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌


లాక్‌డౌన్‌ తర్వాత దేశవ్యాప్తంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. దీంతో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వేసవిలో విడుదల చేద్దామనుకున్న సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎలాగైనా సినిమా విడుదల చేయాలని భావించిన దర్శక-నిర్మాతలకు కనిపించిన వేదిక ఓటీటీ. అలా జ్యోతిక కీలక పాత్రలో నటించిన ‘పొన్‌మగళ్‌ వందాళ్‌’ కూడా ఓటీటీలో విడుదల చేస్తామని ప్రకటించగానే కోలీవుడ్‌లో దుమారం రేగింది. అయినా, సరే దర్శక-నిర్మాతలు అటువైపే మొగ్గు చూపారు. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైన తొలి తమిళ సినిమాగా వార్తల్లో నిలిచింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? జ్యోతిక నటన ఏ మేరకు ఆకట్టుకుంది?కథేంటంటే:

2004లో ఊటీలో వరుసగా ఐదుగురు బాలికలు హత్యకు గురవుతారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన జ్యోతి అనే మహిళ ఆ ఐదు హత్యలు చేసిందంటూ ఆమెను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో చంపేస్తారు. 15 ఏళ్ల తర్వాత వెన్బా (జ్యోతిక) ఆ కేసును రీఓపెన్‌ చేయిస్తుంది. పోలీసులు, కొందరు వ్యక్తులు కలిసి సైకో జ్యోతి కేసును తప్పుదోవ పట్టించారని కోర్టులో వాదిస్తుంది. దీంతో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా రాజారత్నం (పార్తిబన్‌) రంగంలోకి దిగుతాడు. సైకో జ్యోతికి వ్యతిరేకంగా పోలీసుల తరఫున తన వాదనలు వినిపిస్తాడు. అసలు ఒక సైకో జ్యోతి తరఫున వెన్బా ఎందుకు వాదించింది? అసలు సైకో జ్యోతి ఎవరు? ఆమే ఆ హత్యలు చేసిందా? సైకో జ్యోతికి వ్యతిరేకంగా రాజారత్నాన్ని కోర్టులో వాదించాలని చెప్పిందెవరు? అతనికీ ఆ కేసుకి ఉన్న సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


ఎలా ఉందంటే:

ఇదొక లీగల్‌ డ్రామా. ఒక హత్య జరగడం.. అది కోర్టులో విచారణకు రావడం. వాదోపవాదాలు, సాక్ష్యాలు, వాయిదాలు ఇలా కోర్టులో జరిగే ప్రతి అంకాన్ని మనం చాలా సినిమాల్లో చూశాం. కాకపోతే ఆ సన్నివేశాలు తెరపై కనిపించేది కొద్ది సేపు మాత్రమే. అయితే, హిందీలో వచ్చిన ‘జాలీ ఎల్‌ఎల్‌బి’, ‘జాలీ ఎల్‌ఎల్‌బి2’తో పాటు ‘పింక్‌’ చిత్రాలు అన్ని కోర్టు నేపథ్యంలో సాగే లీగల్‌ డ్రామాలే. అదే కోవలోకి వస్తుంది ‘పొన్‌మగళ్‌ వందాళ్‌’. ఐదుగురు బాలికల హత్యోదంతంతో సినిమా ప్రారంభించిన దర్శకుడు దాని చుట్టూ కథ నడుస్తుందని ప్రేక్షకుడికి ఓ క్లారిటీ ఇచ్చేశాడు. అయితే, సైకో జ్యోతి కేసును వెన్బా (జ్యోతిక) టేకప్‌ చేయడంతోనే కథలో ఆసక్తి మొదలవుతుంది. ఒక సైకో మహిళ కేసును వెన్బా ఎందుకు వాదిస్తోంది? అందుకు కారణాలు ఏమై ఉంటాయన్న ఉత్సుకత ప్రేక్షకుడిలో కలుగుతుంది. ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను, ఆధారాలను కోర్టులో సమర్పించడం, సాక్షులను విచారించడం తదితర సన్నివేశాలో ప్రథమార్ధం సాగుతుంది. విరామ సన్నివేశాలకు వచ్చేసరికి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అయిన రాజారత్నం (పార్తిబన్‌) ఈ కేసులో పై చేయి సాధించినట్లు కనిపిస్తాడు. అయితే, అవి హత్యలు కావని, అత్యాచారం చేసి బాలికలను చంపేశారంటూ వెన్బా ట్విస్ట్‌ ఇవ్వడంతో కథ కీలక మలుపు తీసుకుంటుంది. ఆ ట్విస్ట్‌తో సినిమా చూసే ప్రేక్షకుడికి తర్వాత ఏం జరుగుతుందనే స్పష్టత వచ్చేస్తుంది.


దీంతో ద్వితీయార్ధంలో మరింత నాటకీయత, ఉత్కంఠ ఉంటుందని ఆశించిన ప్రేక్షకుడికి ఆ ఉత్సుకత కాస్త తగ్గిపోతుంది. కథాగమనం కూడా నెమ్మదిస్తుంది. అయితే, ఆ హత్యలు ఎవరు చేశారన్న ఒక్క పాయింట్‌ మాత్రమే ప్రేక్షకుడిని సినిమా చూసేలా చేస్తుంది తప్ప.. మిగిలిన సన్నివేశాలు సాదాసీదాగా ఉంటాయి. హత్యలకు సంబంధించి ఆధారాలు వెతకడం, వాటిని కనిపెట్టడం, తెలివితో లాజిక్‌లను పరిష్కరించడం వంటి సన్నివేశాలు చూస్తుంటే ప్రేక్షకుడికి కలిగే మజానే వేరు. అయితే, దర్శకుడు అలాంటి సన్నివేశాల జోలికి పోలేదు. కేవలం కోర్టులో వాదోపవాదాలతో సరిపెట్టాడు. బాలికల అత్యాచారం, హత్యకు సంబంధించిన జరిగే వాదోపవాదాల సందర్భంగా వచ్చే భావోద్వేగ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుడిని కంటతడి పెట్టిస్తాయి. హత్యలు ఎవరు చేశారో తెలిసిపోయాక, సినిమా అయిపోయిందనుకున్న ప్రేక్షకుడికి ఊహించని క్లైమాక్స్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు దర్శకుడు.


ఎవరెలా చేశారంటే:

ఈ సినిమాను చాలా తక్కువమంది ఆర్టిస్టులతో తెరకెక్కించారు. లాయర్‌ వెన్బాగా జ్యోతిక నటన మెప్పిస్తుంది. ముఖ్యంగా కోర్టు సన్నివేశాల్లో ఆమె వాదించే తీరు ఆకట్టుకుంటుంది. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై సంభాషణలు పలికే సమయంలో జ్యోతిక హావభావాలు సగటు ప్రేక్షకుడినీ కంటతడి పెట్టిస్తాయి. జ్యోతికకు పోటీగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజారత్నం పాత్రలో పార్తిబన్‌ నటనా మెప్పిస్తుంది. భాగ్యరాజా పాత్ర పర్వాలేదు. ఒకట్రెండు సన్నివేశాల్లో హాస్యం పండించారు. మిగిలిన వారు తమ పరిధిమేరకు నటించారు.కోర్టు సన్నివేశాల్లో నేపథ్య సంగీతమే బలం. అది లోపించింది. రెండు పాటలున్నాయి. అవి కథా నేపథ్యంలో వినిపిస్తాయి. దర్శకుడు జె.జె.ఫెడ్రిక్‌ ఎంచుకున్న పాయింట్‌ కొత్తదేమీ కాదు. మహిళలపై జరిగే అత్యాచారాలు, హత్యలపై చాలా సినిమాలు వచ్చాయి. ఇందులో మాత్రం బాలికలపై జరిగే అత్యాచారాలు, హత్యలను ప్రస్తావించాడు. అదే సమయంలో అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న బాలికలు ధైర్యంగా ముందుకొచ్చి చెప్పడం ద్వారా నిందితులకు శిక్ష పడేలా చేయొచ్చన్న పాయింట్‌ను ప్రధానంగా చర్చించాడు. అయితే, ప్రథమార్ధంలో ఉన్న ఉత్కంఠ ద్వితీయార్ధానికి సడలిపోయింది. ప్రీ క్లైమాక్స్‌ వరకూ కథనాన్ని ఉత్కంఠతో నడిపి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. సందేశంతో కూడిన ఇలాంటి సినిమాల్లో కమర్షియల్‌ హంగులను ఆశించలేం. సినిమా మొత్తం కోర్టు నేపథ్యంలోనే సాగుతుంది. బడ్జెట్‌పరంగా చిన్న సినిమా. అందుకే నిర్మాతలు ఓటీటీ వైపు మొగ్గు చూపారు.బలాలు 

+ జ్యోతిక 

+ కోర్టు సన్నివేశాలు 

+ విరామం, క్లైమాక్స్‌ ట్విస్ట్‌


బలహీనతలు

- తెలిసిన పాయింట్‌ కావడం

నెమ్మదించిన ద్వితీయార్ధం


చివరిగా: ‘పొన్‌మగళ్‌ వందాళ్‌’ ఒక సందేశాత్మక చిత్రం.


గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.