సామి: రివ్యూ
న‌టీన‌టులు: విక్రమ్, కీర్తి సురేష్, ఐశ్వర్య రాజేష్, బాబీ సింహ, సూరి తదితరులు
స‌ంగీతం: దేవిశ్రీప్రసాద్
ఛాయాగ్ర‌హ‌ణం: వెంకటేష్ అంగురాజ్
కూర్పు: వి. టి. విజయన్, టి.ఎస్. జయ్
నిర్మాతలు: బెల్లం రామకృష్ణ రెడ్డి, కావ్య వేణు గోపాల్
ద‌ర్శ‌క‌త్వం: హరి
సంస్థ‌: పుష్యమి ఫిలిం మేకర్స్, ఎమ్.జి. ఔరా సినిమాస్ ప్రై.లిమిటెడ్
విడుద‌ల‌ తేదీ: 21-09-2018

విక్ర‌మ్‌కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అది ‘అప‌రిచితుడు’ నుంచి అది మ‌రో స్థాయికి వెళ్లింది. అప్ప‌ట్నుంచి దాదాపుగా ఆయ‌న న‌టించిన సినిమాలన్నీ తెలుగులోనూ విడుద‌ల‌వుతుంటాయి. ద‌ర్శ‌కుడు హ‌రి తీసే సినిమాలు కూడా తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చుతుంటాయి. యాక్ష‌న్ ప్ర‌ధానంగా సాగే ఆయ‌న సినిమాల్లో డ్రామా తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచికి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. అందుకే ‘సింగ‌మ్‌’ సిరీస్‌లో వ‌చ్చిన సినిమాల‌తో పాటు, అంత‌కుముందు విక్ర‌మ్‌తో త‌మిళంలో తీసిన ‘సామి’ చిత్రం తెలుగులో ‘ల‌క్ష్మీ న‌ర‌సింహ‌’గా రీమేకై మంచి విజ‌యాన్ని అందుకుంది. ఆ ‘సామి’కి సీక్వెల్‌గానే ‘సామి స్క్వేర్‌’ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అదే తెలుగులో ‘సామి’గా విడుద‌లైంది. మ‌రి ఈ పోలీస్ ‘సామి’ కథ ఏంటి? విక్రమ్‌కు మరో విజయం దక్కిందా? హరి ఈ సారి పోలీస్‌ కథను ఎలా మలిచాడు?


* క‌థేంటంటే..
పరుశురాం సామి(విక్రమ్), భువన (ఐశ్వర్య రాజేష్) భార్య భర్తలు. వాళ్లిద్ద‌రికీ జ‌న్మించిన అబ్బాయే రామ‌సామి (విక్ర‌మ్‌). క‌లెక్ట‌ర్ అవుదామ‌నుకున్న రామ‌సామి, పోలీసు ఆఫీస‌ర్ అవుతాడు. ఐపీఎస్‌గా విజ‌య‌వాడ‌లో బాధ్య‌త‌లు చేప‌డ‌తాడు. అదే న‌గ‌రాన్ని తన రౌడీయిజంతో రావణ భిక్షు(బాబీ సింహ) గడగడలాడిస్తుంటాడు. తిరుగులేని ఆధిప‌త్యం చెలాయిస్తూ, అక్ర‌మాల‌కి పాల్ప‌డుతున్న భిక్షుపైనా, అత‌ని ఇద్ద‌రు సోద‌రుల‌పైనా క‌న్నేసి వాళ్ల‌ని దెబ్బ‌తీస్తాడు సామి. ఈ పోరు ఎక్క‌డి వ‌ర‌కు సాగింది? భిక్షు, అత‌ని సోద‌రుల కోస‌మే విజ‌య‌వాడ‌లోకి అడుగుపెట్టిన సామి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? మినిస్ట‌ర్ కూతురు దియా (కీర్తిసురేష్‌)కీ, సామికీ మ‌ధ్య సంబంధేమిటి? అనేదే కథ.


* ఎలా ఉందంటే..
మాస్ ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యే విష‌యంలో పోలీసు క‌థ‌ల‌కి తిరుగులేదు. వాటిలో కావ‌ల్సినంత హీరోయిజంతో పాటు, డ్రామా కూడా పండుతుంది. అందుకే ఎన్ని పోలీస్ క‌థ‌లు తెర‌కెక్కినా, మ‌రో క‌థ సిద్ధం అవుతూనే ఉంటుంది. హీరోలు కూడా ఎన్నిసార్లైనా ఖాకీ చొక్కా ధ‌రించ‌డానికి సిద్ధమ‌వుతారంటే కార‌ణం అదే. పోలీసు క‌థ‌ల్ని వండి వార్చ‌డంలో సిద్ధ‌హ‌స్తుడైన హ‌రి మ‌రోసారి ఓ ప్ర‌తీకార క‌థ‌ని ఎంచుకొని చిత్రాన్ని తీర్చిదిద్దాడు. క‌థ తెలిసిందే అయినా... మాస్‌కి న‌చ్చే అంశాల్ని జోడించిన విధానం బాగుంది. క‌ళ్లు చెదిరే యాక్ష‌న్ ఘ‌ట్టాల‌తోపాటు, కావ‌ల్సినంత హీరోయిజాన్ని, కామెడీని మేళ‌వించాడు. దాంతో సినిమా మాస్ ప్రేక్ష‌కుల్ని మెప్పించేలా ముస్తాబైంది.
ఇది పోలీస్ క‌థే అయినప్ప‌టకీ తొలి సగ‌భాగం సినిమా అంతా ప్రేమ‌క‌థ‌లా స‌ర‌దాగా సాగుతుంది. క‌థానాయ‌కుడు ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతూ, ఐపీఎస్ ఎలా అయ్యాడు? అస‌లు ఇందులో క‌థానాయ‌కులు ఇద్ద‌రా? ఒక్క‌రా? అనే ఆస‌క్తిని రేకెత్తిస్తూ విరామం స‌న్నివేశాలు వ‌స్తాయి. ద్వితీయార్ధంలో అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. ప్ర‌తినాయ‌కుడిపై ప‌గ తీర్చుకోవ‌డం మొద‌లుపెడ‌తాడు రామ‌స్వామి. పోలీసు క‌థ‌ల‌తో డ్రామా పండించ‌డంలో తిరుగులేని ద‌ర్శ‌కుడైన హ‌రి నువ్వా నేనా అన్న‌ట్టుగా ద్వితీయార్ధం స‌న్నివేశాల్ని తీర్చిదిద్దాడు. ‘సింగం’ సినిమాల్లోని వేగం ఈ సినిమాలోనూ కనిపిస్తుంది. అయితే అస‌లు క‌థలో బ‌లం లేక‌పోవ‌డం సినిమాకి కాస్త ప్రతికూలతగా మారింది. మాస్, యాక్ష‌న్ క‌థ‌ల్ని ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల‌కి మాత్రం బాగా నచ్చు‌తుంది.


* ఎవ‌రెలా చేశారంటే..
విక్ర‌మ్‌కి అల‌వాటైన పాత్రే ఇది. ఆయ‌న చాలా హుషారుగా న‌టించాడు. రెండు పాత్ర‌ల మ‌ధ్య వైవిధ్యం చూపించే ప్ర‌య‌త్నం చేశారు. కీర్తి సురేష్‌, ఐశ్వ‌ర్య‌రాజేష్ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు చ‌క్క‌గా న‌టించారు. నిజానికి వీళ్ల పాత్ర‌ల‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేక‌పోయిన‌ప్ప‌టికీ, ఉన్నంత‌లో ఆక‌ట్టుకొనేలా న‌టించారు. బాబీ సింహా విల‌నిజ‌మే సినిమాకి ప్ర‌ధాన బ‌లం. హీరోయిజాన్ని కూడా అదే హైలైట్ చేసింది. సూరి, కీర్తి సురేష్ క‌లిసి చేసిన హంగామా న‌వ్వుల్ని పంచుతుంది.


* సాంకేతికంగా..
సినిమా ఉన్న‌తంగా ఉంది. ముఖ్యంగా పోరాట ఘ‌ట్టాల్ని తీర్చిదిద్దిన విధానం, ఛాయాగ్ర‌హ‌ణం, సంగీతం ఆక‌ట్టుకుంటాయి. ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా చిత్రాన్ని తీర్చిదిద్దారు. రాసుకొన్న క‌థ‌లో కొత్త‌ద‌నం కరవైనా యాక్ష‌న్ ప్ర‌ధాన‌మైన ఈ సినిమాని హ‌రి తీర్చిదిద్దిన విధానం, ఆయ‌న శైలి ఆకట్టు‌కుంటాయి.

బ‌లాలు
+ విక్ర‌మ్ న‌ట‌న
+ యాక్ష‌న్‌.. కామెడీ
+ బాబీ సింహా విల‌నిజం

బ‌ల‌హీన‌త‌లు
- కథ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం

* చివ‌రిగా..
మాస్‌ మెచ్చే ‘సామి’


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.