రివ్యూ: శ్రీ‌నివాస క‌ల్యాణం
రివ్యూ: శ్రీ‌నివాస క‌ల్యాణం
నటీనటులు: నితిన్‌, రాశీఖన్నా, నందితా శ్వేత,
ప్రకాష్‌రాజ్‌, జయసుధ, రాజేంద్రప్రసాద్‌, నరేష్‌, సత్యం
రాజేష్‌, ప్రవీణ్‌ తదితరులు
స‌ంగీతం: మిక్కీ జే మేయర్‌
ఛాయాగ్ర‌హ‌ణం: సమీర్‌రెడ్డి
కూర్పు: మధు
నిర్మాత: దిల్‌రాజు‌, శిరీష్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: సతీష్‌ వేగేశ్న
సంస్థ‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
విడుద‌ల‌: 09-08-2018

లై, ఛ‌ల్ మోహ‌న్ రంగ చిత్రాల‌తో నిరాశ ప‌రిచాడు నితిన్‌. మాస్‌, యూత్ ప్రేక్ష‌కుల్ని టార్గెట్ చేసే నితిన్ ఈసారి కుటుంబ ప్రేక్ష‌కుల్ని మెప్పించాల‌న్న తాప‌త్ర‌యంతో ఎంచుకున్న క‌థ `శ్రీ‌నివాస క‌ల్యాణం`. ఈ జోన‌ర్‌లో `శ‌త‌మానం భ‌వ‌తి` తీసి విజ‌యం సాధించిన స‌తీష్ వేగ్నేశ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఎప్పుడూ ఫ్యామిలీ మార్కు సినిమాల్ని తీయ‌డంలో ముందుండే దిల్‌రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌డంతో.... `శ్రీ‌నివాస క‌ల్యాణం`పై ఫోక‌స్ పెరిగింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? అంచ‌నాల్ని అందుకోగ‌లిగిందా? `శ‌త‌మానం భ‌వ‌తి`లా ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేయ‌గ‌లిగిందా??* కథ ఎలా ఉందంటే..?
శ్రీనివాస్‌(నితిన్‌) కి త‌న కుటుంబం అంటే ప్రాణం. సంప్ర‌దాయాల్నీ అలానే గౌర‌విస్తాడు. శ్రీ (రాశీఖ‌న్నా)ని ఇష్ట‌ప‌డ‌తాడు. శ్రీ తండ్రి.. ఆర్ కే.. ఓ బిజినెస్ మేన్‌. త‌ను మాత్రం సంప్రదాయాలకన్నా బిజినెస్‌కే ఎక్కువ విలువ ఇస్తాడు. త‌న కూతురి పెళ్లిని కూడా ఓ బిజినెస్ డీల్‌గానే భావిస్తాడు. ముంద‌స్తు ఎగ్రిమెంట్ కి ఒప్పుకుంటేనే ఈ పెళ్లికి అంగీక‌రిస్తాన‌ని ష‌ర‌తు విధిస్తాడు. మ‌రి ఆ ఎగ్రిమెంట్‌లో ఏముంది? శ్రీ‌తో పెళ్లి కోసం శ్రీ‌నివాస్ ఏం చేశాడు? ఈ పెళ్లితో రెండు కుటుంబాల మ‌ధ్య వాతావ‌ర‌ణం ఎలా మారింది? ఈ విష‌యాలు తెలియ‌లంటే `శ్రీ‌నివాస క‌ల్యాణం` చూడాల్సిందే.

* తెరపై ఎలా సాగిందంటే..?
దర్శ‌కుడు ఎంచుకున్న క‌థ‌లో కొత్త‌ద‌నం లేదు. కాక‌పోతే.... ఇది మ‌న‌దైన క‌థ. పెళ్లిపై ఎవ‌రి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? అనే విష‌యాన్ని చూచాయిగా చెబుతూ, పెళ్లి విశిష్ట‌త‌నీ, వైభ‌వాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు ఆవిష్క‌రించిన‌క‌థ‌. టైటిల్ చూస్తే.. ఇది పెళ్లికి సంబంధించిన సినిమా అని అర్థ‌మ‌వుతుంది. తెర‌పైనా అదే క‌నిపిస్తుంది. ప్ర‌తీ రెండు మాట‌ల్లో ఒక‌టి పెళ్లి గురించే ఉంటుంది. పెళ్లంటే ఏమిటి? భార్యా భ‌ర్త‌లు ఎలా ఉండాలి? పెళ్లిలో చ‌దివే మంత్రాల‌కు అర్థం ఏమిటి? ఇలా ప్ర‌తీ విష‌యంలోనూ ఓ చిన్న సైజు క్లాసు తీసుకునే ప్ర‌య‌త్నం చేశారిందులో.


ఈరోజుల్లో పెళ్లి అంటే కేవలం ఒక కార్యక్రమంలా మారిపోయింది. అది కార్యక్రమం కాదు.. జీవితంలో వచ్చే ఒక మధురమైన జ్ఞాపకం అని చెప్పే ప్రయత్నం చేశాడు. అటు ఆర్కే, ఇటు శ్రీనివాస్‌‌ పాత్రల చిత్రీకరణ రెండింటినీ సమాంతరంగా చూపిస్తూ, వాళ్ల అభిరుచులకు, అభిప్రాయాలకు, పెళ్లికి వాళ్లు ఇచ్చే విలువలకు, కథను ముడిపెట్టిన ఫీల్‌ నచ్చుతుంది. పెళ్లికి ముందే విడాకుల అగ్రిమెంట్‌పై సంతకం చేయించుకోవడం ఒక కొత్త రకమైన ఆలోచన అనుకోవచ్చు. తొలి భాగంలో కథానాయకుడి పాత్రను చూపిస్తూ, సరదా సన్నివేశాలను రాసుకొంటూ కథానాయికతో ప్రేమ వ్యవహారాన్ని ముడిపెడుతూ సాగిపోయింది. అయితే నితిన్‌, రాశీఖ‌న్నాల మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాల‌కు అంత‌గా ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. వాళ్లిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ కూడా స‌రిగా కుద‌ర‌లేదు. ఇక ద్వితీయార్ధం పూర్తిగా పల్లెటూరికి వెళ్లిపోతుంది. పెళ్లి ఇంట జరిగే రకరకాల తంతును కథానుగుణంగా పూసగుచ్చినట్టు చెప్పారు. దాంతో ప్రేక్షకుడికి ఒక పెళ్లింట్లో కూర్చొన్న అనుభూతి కలుగుతుంది. పతాక సన్నివేశాల్లో ఏం జరగబోతోందో ప్రేక్షకుడు ముందే ఊహిస్తాడు. క్లైమాక్స్‌లో త‌న ఇంటి స‌భ్యుల ముందు నిల‌బ‌డి.. కన్నీరు పెడుతూ నితిన్ చెప్పే డైలాగులు బాగున్నా.. ఆ సంద‌ర్భంలో అది అవ‌స‌ర‌మా? అనిపిస్తుంది. అయితే అక్కడ కూడా ఎమోషన్స్‌కు పెద్ద పీట వేయడంతో కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా సినిమా నిలుస్తుంది. చాలా సన్నివేశాల్ని కేవ‌లం డైలాగుల కోస‌మే రాసుకున్నారేమో అనిపిస్తే అది ప్రేక్ష‌కుడి త‌ప్పు కాదు.

* ఎవరెలా చేశారంటే..?
నితిన్‌కు అండర్‌ప్లే చేసే పాత్ర దొరకడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. రాముడు మంచి బాలుడు తరహాగా కనిపిస్తాడు. దాంతో అతనిలో ఉన్న సహజసిద్ధమైన ఎనర్జీ మిస్‌ అయినట్లు అనిపిస్తుంది. ఈ కథలో ఎక్కడా నితిన్‌ను ఒక హీరోగా చూడలేం. కేవలం ఒక పాత్రగా పరిగణిస్తాం. ఇలాంటి పాత్ర ఒప్పుకోవడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. రాశీఖన్నాది ముఖ్యమైన పాత్ర అయినప్పటికీ తనని సరిగా ఉపయోగించుకోలేదేమోననిపిస్తుంది. చాలా సన్నివేశాల్లో ఆశ్చర్యపోయినట్లు కనిపిస్తుంది. ప్రకాష్‌రాజ్‌ మరోసారి కీలకమైన పాత్ర పోషించాడు. ఆ పాత్ర ప్రవర్తించే తీరు, వినోదాన్ని పంచితే, అందులో పరివర్తన ఈ కథకు ఎమోషన్‌ జోడించింది. జయసుధ, రాజేంద్రప్రసాద్‌, నరేష్‌, సత్యం రాజేష్‌, ప్రవీణ్‌ వీళ్లందరివీ కేవలం సహాయ పాత్రలే.

మిక్కీ జే మేయర్‌ పాటలు వింటుంటే పాతట్యూన్లు గుర్తొస్తాయి. ‘కల్యాణం.. వైభోగం..’ పాట మాత్రం ఆకట్టుకుంది. పల్లెటూరి నేపథ్యంలో తీసిన సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తాయి. దాంతో వెండితెర ఆహ్లాదంగా మారుతుంది. సతీశ్‌ వేగేశ్న చెప్పాలనుకున్న విషయం చాలా మంచిది. ఈతరం తెలుసుకోవాల్సింది. అయితే, దాన్ని కథలో అంతర్లీనంగా కాకుండా కాస్త బలవంతంగా రుద్ది చెప్పే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. సీరియల్‌ తరహాలో సాగే కొన్ని సన్నివేశాలు, ఈ కథలోని వేగాన్ని అందుకోలేపోయాయి. సంభాషణల్లో బలం ఉన్నప్పటికీ సన్నివేశాలు తేలిపోవడంతో వాటిలో ఉన్న పదును పూర్తిగా బయటకు రాలేదు.

బలాలు
+ క‌థా నేప‌థ్యం
+ పెళ్లి గురించి చెప్పే స‌న్నివేశాలు
+ నటీనటుల ప్ర‌తిభ‌

బలహీనతలు
- సీరియ‌ల్‌ని త‌ల‌పించే చిత్రీక‌ర‌ణ‌
- బ‌ల‌వంత‌పు భావోద్వేగాలు

* చివ‌రిగా..
పెళ్లి క్యాసెట్ లాంటి సినిమా


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.