రివ్యూ:బందోబస్త్‌
చిత్రం: బందోబస్త్‌
నటీనటులు: సూర్య, మోహన్‌లాల్‌, ఆర్య, సాయేషా సైగల్‌, బొమన్‌ ఇరానీ, చిరాగ్‌ జైన్‌, పూర్ణ, సముద్రఖని, ప్రేమ్‌ తదితరులు
సంగీతం: హ్యారిస్‌ జైరాజ్‌
సినిమాటోగ్రఫీ: ఎం.ఎస్‌ ప్రభు
ఎడిటింగ్‌: ఆంటోనీ
నిర్మాత: అల్లిరాజా సుభాష్‌ కరణ్‌
దర్శకత్వం: కె.వి.ఆనంద్‌
బ్యానర్‌: లైకా ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ: 20-09-2019

సూర్య ఎప్పుడో తెలుగు కథానాయకుడు అయిపోయాడు. తన సినిమాలు కొన్ని తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ వసూళ్లు సాధించాయి. సూర్య కూడా కథలు ఎంచుకునేటప్పుడు ‘తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినదేనా’ అని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటున్నాడు. ఈ లెక్కలు చాలాసార్లు మంచి ఫలితాల్ని ఇచ్చాయి. కొన్నిసార్లు తప్పాయి కూడా. అయినా సరే సూర్య నుంచి సినిమా వస్తోందంటే తెలుగు ప్రేక్షకుల్లో మొదలయ్యే ఆసక్తి తగ్గలేదు. ఈసారి ‘బందోబస్త్‌’ కూడా అలానే ఆకర్షించింది. ‘రంగం’లాంటి మంచి చిత్రాన్ని అందించిన కె.వి ఆనంద్‌ దర్శకుడు కావడం, మోహన్‌లాల్‌, ఆర్యలాంటి కథానాయకులు ఈ చిత్రంలో నటించడం వల్ల మరింత ఫోకస్‌ తెచ్చుకుంది. మరి ఇంత బందోబస్త్‌తో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాల్ని అందుకుందా?

కథేంటంటే..: భారత ప్రధాని చంద్రకాంత్‌ వర్మ (మోహన్‌లాల్‌) ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. చంద్రకాంత్‌ని అంతమొందించడానికి తీవ్రవాదులు ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రమాదం నుంచి చంద్రకాంత్‌ తృటిలో తప్పించుకుంటుంటాడు. ప్రధానిని రక్షించే ప్రత్యేకమైన టీమ్‌లో రవికిషోర్‌ (సూర్య) ఒకడు. ప్రధానితో అనుక్షణం వెన్నంటి ఉంటాడు. అయినా సరే.. చంద్రకాంత్‌ వర్మని ఓ బాంబ్‌ బ్లాస్ట్‌లో చంపేస్తారు. ఇంతకీ ఈ హత్య ఎవరు చేశారు? దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అనేదే ‘బందోబస్త్‌’ కథ.

ఎలా ఉందంటే: ప్రధానిని రక్షించడానికి ఓ టీమ్‌ చేసే సాహసాలు, దాని చుట్టూ నడిచే యాక్షన్‌, కథలోని మలుపులు... ఇవన్నీ ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌కి పనికొచ్చే అంశాలు. కె.వి. ఆనంద్‌ కథలో మలుపులు బాగుంటాయి. కథని కొత్తగా చెప్పే నేర్పు ఆయన సొంతం. ‘బందోబస్త్‌’ కథనీ ఆయన ఆసక్తిగానే మొదలెట్టారు. ప్రధానిపై ఎటాక్‌ జరిగే సన్నివేశాల్ని ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దారు. తొలి సన్నివేశం నుంచే కథ పరుగులు పెడుతుంటుంది. సూర్య పాత్రని పరిచయం చేసే విధానం కూడా ఆసక్తిగానే ఉంది. ప్రతినాయకుడు వేసే ఎత్తులు, దాన్ని తిప్పికొట్టే విధానం ఇవన్నీ కథని రక్తి కట్టిస్తాయి. విశ్రాంతి ముందు వచ్చే సన్నివేశం కూడా ఉత్కంఠ కలిగిస్తుంది.

అయితే ద్వితీయార్థంలో కథ, కథనం పూర్తిగా పట్టు తప్పాయి. ప్రధాని హత్య కేసు మర్చిపోయి.. రైతులు, వాళ్ల సమస్యలు, మైనింగ్‌... వీటి చుట్టూ ‘బందోబస్త్‌’ చక్కర్లు కొట్టడం మొదలుపెడుతుంది. తండ్రి మరణానంతరం గద్దెనెక్కిన ఆర్య చేసే పనులు మరీ పిల్ల చేష్టలుగా కనిపిస్తాయి. ఓ దేశ ప్రధాని ఇలా ప్రవర్తిస్తాడా? అనిపించేలా ఆ సన్నివేశాల్ని తీశారు. చాలా చోట్ల లాజిక్‌ మర్చిపోయారు. ప్రధాని రక్షణ వలయం మరీ ఇంత అజాగ్రత్తగా ఉంటుందా? ఒకే ఒక్క వ్యక్తి... దేశ ప్రధానిని చంపడానికి ఇంట్లో కూర్చుని స్కెచ్‌లు వేస్తే పట్టించుకునే వ్యవస్థ లేదా? అనే అనుమానాల్ని రేకెత్తిస్తుందీ చిత్రం. ఆయా సన్నివేశాలు పెద్దగా పండలేదు. పతాక సన్నివేశాలు పేలవంగా సాగాయి. కథ ఎంత పకడ్బందీగా మొదలెట్టారో, అంత పేలవంగా ముగించారు. వినోదానికి ఏమాత్రం ఆస్కారం లేని కథ ఇది. అందుకోసం తొలి సన్నివేశాల్లో ద్వందార్థాల్ని ఆశ్రయించారు రచయితలు. యాక్షన్‌ ప్రియుల్ని ఆకట్టుకునే అంశాలూ కనిపించవు. మొత్తానికి సూర్య ఎంచుకున్న మరో బలహీనమైన కథగా ‘బందోబస్త్‌’ మిగిలిపోతుంది.

ఎవరెలా చేశారంటే..: సూర్య ఏ పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోతాడు. మరోసారి తన హుషారుని చూపించాడు. తనకు గెటప్పులు వేయాలంటే మహా సరదా. అదీ ఈ సినిమాతో తీరింది. కాకపోతే... తన కెరీర్‌కి ఇలాంటి సినిమాలు ఉపయోగపడవు. మోహన్‌లాల్‌ హుందాగా నటించారు. ఆ పాత్ర నిష్క్రమణతోనే కథ బలహీన పడిపోతుంది. ఆర్యకు చేసేందుకు ఏమీలేదు. సాయేషా సైగల్‌ ఓకే అనిపిస్తుంది. సముద్రఖని మరోసారి మంచి పాత్ర దక్కించుకున్నాడు. సాంకేతికంగా చూస్తే... ఈ సినిమా కోసం బాగా ఖర్చు పెట్టారు. ప్రతీ సన్నివేశంలోనూ రిచ్‌నెస్‌ కనిపిస్తుంది. పాటలు స్పీడు బ్రేకర్లుగా మారాయి. లాజిక్‌ లేని కథ, కథనాలతో కెవి.ఆనంద్‌ బాగా విసిగించాడు.


బలాలు
+ తారాగణం
+ ప్రారంభ సన్నివేశాలు

బలహీనతలు
- కథనం
- లాజిక్‌ లేని సన్నివేశాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.