రివ్యూ: గ్యాంగ్‌లీడర్‌
చిత్రం: గ్యాంగ్‌లీడర్‌
నటీనటులు: నాని, ప్రియాంక అరుళ్‌ మోహన్‌, లక్ష్మి, శరణ్య, సత్య, ప్రియదర్శి తదితరులు
దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌
సంగీతం: అనిరుధ్‌ రవిచంద్రన్‌
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్‌
విడుదల తేదీ:
13-09-2019

కెరీర్‌ తొలినాళ్ల నుంచీ వైవిధ్యభరిత కథలతోనే ప్రయాణం చేస్తున్నారు నాని. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే అందులో కచ్చితంగా ఏదో కొత్తదనం ఉండితీరుతుందని నమ్ముతుంటారు ప్రేక్షకులు. ఇటీవలే ఆయన అర్జున్‌ అనే క్రికెటర్‌గా ‘జెర్సీ’తో ఓ భావోద్వేగాల ప్రయాణాన్ని సినీప్రియులకు రుచి చూపించారు. ఇప్పుడు పెన్సిల్‌ పార్థసారథి అనే రివేంజర్‌ రైటర్‌గా ‘గ్యాంగ్‌లీడర్‌’తో సందడి చేసేందుకు వచ్చేశారు. ‘మనం’, ‘24’, ‘హలో’ వంటి వైవిధ్యభరిత చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా? తెలుసుకుందాం పదండి..

* క‌థేంటంటే?
పెన్సిల్ పార్థ‌సార‌థి (నాని) రివెంజ్ రైట‌ర్‌. హాలీవుడ్ సినిమాల్ని చూసి వాటి ద్వారా న‌వ‌ల‌లు రాసుకుంటూ ఫేమ‌స్ రైట‌ర్‌గా చ‌లామ‌ణీ అవుతుంటాడు. ఇత‌ని ప్ర‌తీకార ర‌చ‌నా ప్ర‌తిభ గురించి తెలుసుకొని, చాలా తెలివైన‌వాడ‌ని భావించి ఒక ఐదుగురు ఆడ‌వాళ్లు సంప్ర‌దిస్తారు. ఒక‌రిపై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని ఉంద‌ని, అందుకు స‌హ‌కారం అందించాల‌ని కోరతారు. ఆ ప్ర‌తీకారం త‌న రైటింగ్ కెరీర్‌కి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావించి ఓకే చెబుతాడు. రోజు వారీగా జ‌రిగే సంఘ‌ట‌ల‌న్నింటినీ రాసి మ‌రో బుక్‌గా త‌యారు చేయొచ్చ‌నేది పెన్సిల్ ఆలోచ‌న‌. రూ: 300 కోట్ల‌తో ముడిప‌డిన ఆ ప్ర‌తీకారం వెన‌క అస‌లు క‌థేమిటి? ఆ క‌థ‌కీ వివిధ వ‌య‌సుల్లో ఉన్న ఆ ఐదుగురు ఆడ‌వాళ్ల‌కీ మ‌ధ్య సంబంధ‌మేమిటి? పెన్సిల్‌తో క‌లిసి ఆ న‌లుగురు ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నారు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


* ఎలా ఉందంటే?
ప్ర‌తీకార క‌థల్లో ఒక స‌రికొత్త కోణాన్ని ఆవిష్క‌రించిన చిత్ర‌మిది. ఐదుగురు ఆడ‌వాళ్లు ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం... ఒక‌రికొక‌రు సంబంధం లేని వాళ్లు ఒక జ‌ట్టుగా ఏర్ప‌డి ప్ర‌ణాళిక ర‌చించ‌డం, అందుకు ఒక ర‌చ‌యిత స‌హ‌కారం తీసుకోవ‌డం క‌థకి కొత్త‌ద‌నాన్ని తెచ్చిపెట్టింది. నేర ప‌రిశోధ‌న త‌ర‌హాలో సాగే ఈ క‌థ‌కి భావోద్వేగాలు, కామెడీని మేళ‌వించిన విధానం కూడా ఆక‌ట్టుకుంటుంది. మానవ సంబంధాల్ని స్పృశించిన తీరు మెప్పిస్తుంది. క‌థా నేప‌థ్యానికి త‌గ్గ‌ట్టుగా సినిమాని కూడా ఆస‌క్తిక‌రంగా ఆరంభించాడు ద‌ర్శ‌కుడు. బ్యాంకు దోపిడిని చాలా స్టైలిష్‌గా తీర్చిదిద్ది, ప్రేక్ష‌కుడిని వేగంగా క‌థ‌లో లీనం చేశారు. పెన్సిల్ పార్థ‌సార‌థి పాత్ర ప‌రిచ‌యం ద‌గ్గ‌ర్నుంచి క‌థ‌లో కామెడీ పెరుగుతుంది. కాపీ రైట‌ర్ అని తెలిసిపోయే క్ర‌మం, రివేంజ్‌లో భాగంగానే సీసీ టీవీ ఫుటేజ్ కోసం చేసే ప్ర‌య‌త్నం, అక్క‌డ త‌న గ్యాంగ్‌తోపాటు, శెన‌క్కాయ‌ల సంతూర్ పాత్ర‌లో వెన్నెల కిషోర్‌తో క‌లిసి నాని చేసే హంగామా బాగా న‌వ్విస్తుంది. ప్ర‌థ‌మార్థంలో కామెడీనే హైలెట్ అయ్యింది. అయితే క‌థ ప్రేక్ష‌కుల ఊహ‌కు త‌గ్గ‌ట్టుగా సాగుతున్న అనుభూతి క‌లుగుతుంది. ద్వితీయార్థంలో స‌న్నివేశాలు మాత్రం ఉత్కంఠ‌ని రేకెత్తిస్తాయి. క‌థానాయ‌కుడు, ప్ర‌తినాయ‌కుడి మ‌ధ్య నువ్వా నేనా అన్న‌ట్టుగా సాగే స‌న్నివేశాలు చిత్రానికి ప్ర‌ధాన బ‌లంగా మారాయి. భావోద్వేగాలు కూడా హృద‌యాల్ని మెలిపెడ‌తాయి. షెర్లాక్ హోమ్స్ త‌ర‌హాలో క‌థానాయ‌కుడిని చూపించాల‌నుకున్నాడు ద‌ర్శ‌కుడు. ఒక‌ట్రెండు సంద‌ర్భాల్లో క‌థానాయ‌కుడు ఆ పేరును కూడా ప్ర‌స్తావిస్తాడు. అయితే నేర ప‌రిశోధ‌న‌లో క్లూస్‌ని బ‌య‌ట‌పెట్టే విధానంలోనూ క‌థానాయ‌కుడు చేసే ప్ర‌య‌త్నాలు ప్రేక్ష‌కుడిని పెద్ద‌గా థ్రిల్ చేయ‌డక‌పోవ‌డం సినిమాకి కాస్త మైన‌స్‌గా మారింది. ఆ నేప‌థ్యంలో స‌న్నివేశాలు మ‌రింత ఇంటెలిజెన్స్‌తో సాగుంటే సినిమా మ‌రింత బిగితో క‌నిపించేది. ప‌తాక స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. క‌థానాయ‌కుడు త‌న కుటుంబాన్ని వెదుక్కునే విధానం, ప్రేమ‌క‌థ కూడా మెప్పిస్తుంది.


* ఎవ‌రెలా చేశారంటే?

పెన్సిల్ పార్థ‌సార‌థిగా నాని అల‌వోకగా న‌టించేశారు. అందులో ఆయ‌న ఒదిగిపోయిన విధానం, కామెడీ, భావోద్వేగాలు పండించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. ఆయ‌న క‌నిపించిన విధానం కూడా ఇందులో కొత్త‌గా ఉంది. ల‌క్ష్మి, శ‌ర‌ణ్య‌, ప్రియాంక త‌దిత‌రుల‌తో కూడిన గ్యాంగ్ కూడా స‌హ‌జంగా న‌టించింది. ప్ర‌తినాయ‌కుడిగా కార్తికేయ చాలా బాగా న‌టించాడు. రేస‌ర్‌గా ఆయ‌న క‌నిపించిన తీరు, ఆయ‌న స్టైల్ మెప్పిస్తుంది. వెన్నెల‌కిషోర్, ప్రియ‌ద‌ర్శి, స‌త్య త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. అనిరుధ్ నేప‌థ్య సంగీతంతో పాటు, రారా జ‌గ‌తిని జ‌యించుదాం, హొయ్‌నా హోయ్‌నా పాట‌లు ఆక‌ట్టుకుంటాయి. కూబా ఛాయాగ్ర‌హ‌ణం ప‌ర్వాలేద‌నిపిస్తుంది. మైత్రీ సంస్థ నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ ఎంతో స్ప‌ష్ట‌త‌తో చిత్రాన్ని తెర‌పైకి తీసుకొచ్చాడు. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌కి మంచి మార్కులే ప‌డినా... ర‌చ‌న ప‌రంగా మ‌రిన్ని క‌స‌రత్తులు చేయాల్సింది.

 
బ‌లాలు
క‌థ‌, క‌థానేప‌థ్యం
భావోద్వేగాలు... సున్నిత‌మైన వినోదం
ద్వితీయార్థంలో మ‌లుపులు
న‌టీన‌టులు

 బ‌ల‌హీన‌త‌లు
ఊహ‌కు త‌గ్గ‌ట్టుగా సాగే తొలి స‌గ‌భాగం

* చివ‌రిగా..
గ‌్యాంగ్ హంగామా మెప్పిస్తుంది


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.