రివ్యూ: శైలజారెడ్డి అల్లుడు
రివ్యూ: శైలజారెడ్డి అల్లుడు
సినిమా పేరు: శైల‌జారెడ్డి అల్లుడు
న‌టీనటులు: అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్‌, న‌రేష్‌, ముర‌ళీశ‌ర్మ‌, ర‌ఘుబాబు, పృథ్వీరాజ్‌, శ‌ర‌ణ్య ప్ర‌దీప్ త‌దిత‌రులు
ఛాయాగ్ర‌హ‌ణం: నిజార్ ష‌ఫీ
సంగీతం: గోపీసుంద‌ర్‌
స‌మ‌ర్ప‌ణ‌: ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు)
నిర్మాత‌లు: నాగ‌వంశీ.ఎస్‌, పీడీవీ ప్ర‌సాద్‌
ద‌ర్శ‌క‌త్వం: మారుతి
సంస్థ‌: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుద‌ల‌: 13 సెప్టెంబ‌రు 2018
                                                                    

ఎక్కువగా ప్రేమ‌క‌థ‌ల‌పైనే మొగ్గుచూపిన నాగ‌చైత‌న్య కొంత‌కాలంగా కుటుంబ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. `రారండోయ్ వేడుక చూద్దాం`తో ఆ దిశ‌గా తొలి అడుగు వేసిన ఆయ‌న, `శైల‌జారెడ్డి అల్లుడు`తో మ‌లి అడుగు వేశాడు. `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌`, `మహానుభావుడు` వంటి చిత్రాల‌తో మారుతి కూడా ఇంటిల్లిపాదినీ మెప్పించే చిత్రాలు తీసే ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నాగ‌చైత‌న్య - మారుతి క‌ల‌యిక‌లో సినిమా... దాని పేరు `శైల‌జారెడ్డి అల్లుడు` అని తెలియ‌గానే ఈ కాంబినేష‌న్‌పైనా, ఈ జోన‌ర్ క‌థ‌పైనా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి ఈ న‌యా అల్లుడు ఎలా ఉన్నాడు? ఆయ‌న క‌థేమిటో తెలుసుకుందాం ప‌దండి...

 క‌థ:

రావు (ముర‌ళీశ‌ర్మ‌) ఓ వ్యాపార‌వేత్త‌. అహం చాలా ఎక్కువ‌. ఆయ‌న కొడుకు చైతన్య (నాగ‌చైత‌న్య‌) మాత్రం సానుకూల ధోర‌ణిలో ఆలోచించే ఓ స‌ర‌దా కుర్రాడు. త‌న తండ్రి మ‌న‌సుని అర్థం చేసుకుంటూ గ‌డిపే అత‌నికి అను (అను ఇమ్మాన్యుయేల్‌) అనే ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిని తార‌స‌ప‌డుతుంది. తొలి చూపులోనే ఆమెని ప్రేమిస్తాడు. తీరా ఆమెకి త‌న తండ్రి కంటే ఎక్కువ అహం అని తెలుస్తుంది. కానీ ఎలాగోలా ఆమెని దారిలోకి తెచ్చుకుని మ‌న‌సు దోచుకుంటాడు. అనుతో ప్రేమ‌ని చైతూ ఇంట్లోవాళ్లు కూడా ఒప్పుకుంటారు. ఇంత‌లోనే అను... వ‌రంగ‌ల్‌కి చెందిన శైలజారెడ్డి (ర‌మ్య‌కృష్ణ) కూతురు అని, ఆమెకి అహం ఇంకా ఎక్కువ‌ని తెలుస్తుంది. ఆ అహం వ‌ల్లే త‌ల్లీకూతుళ్లు కూడా ఐదేళ్లుగా ఎడ‌మొహం పెడ‌మొహంగా ఉంటారు. వాళ్ల మ‌ధ్య‌లో చిక్కిన కాబోయే అల్లుడు చైత‌న్య ఎలా న‌లిగిపోయాడు? త‌ల్లీకూతుళ్ల‌ని క‌లిపాడా? త‌న చుట్టూ ఉన్న వ్య‌క్తుల్లోని అహాన్ని ఎలా పోగొట్టాడు? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: 

మ‌తిమ‌రుపు, అతిశుభ్ర‌త అనే బ‌ల‌హీన‌త‌ల్ని ఆస‌రాగా చేసుకొని భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు చిత్రాల్ని తీసిన మారుతి ఈసారి అహం అనే అంశం ఆధారంగా క‌థ‌ని అల్లుకున్నాడు. అయితే ఇదివ‌ర‌క‌టి సినిమాల్లో క‌థానాయ‌కులే స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌య్యేవారు. ఇందులో మాత్రం క‌థానాయ‌కుడి చుట్టూ ఉన్న‌వాళ్లని అహంతో కూడిన వ్య‌క్తులుగా చూపించి డ్రామాని పండించే ప్ర‌య‌త్నం చేశాడు. మారుతి క‌థాలోచ‌న‌, పాత్రీక‌ర‌ణ‌లు బాగానే ఉన్నాయి కానీ... వాటిని ఆస‌క్తిక‌రంగా, మ‌రింత సంక్లిష్ట‌త‌తో తీర్చిదిద్దే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. దాంతో రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములా సినిమానే అయ్యింది. కొత్త పాత్ర‌లు, కొత్త ఆలోచ‌న స‌రైన ట్రీట్‌మెంట్ కొర‌వ‌డి వృథా అయిపోయాయి. తొలి స‌గ‌భాగం క‌థంతా కూడా అహం ఎక్కువ‌గా ఉన్న అనుని ప్రేమ‌లోకి దించే ప్ర‌య‌త్నాల‌తోనే సాగుతుంది. ద్వితీయార్థంలోనే అత్త పాత్ర ప్ర‌వేశిస్తుంది. అత్త అల్లుడి హంగామా ద్వితీయార్థంలోనే. త‌న ప్రేమ గెల‌వాలంటే అహంతో స‌త‌మత‌మ‌య్యే త‌ల్లీకూతుళ్ల మ‌ధ్య స‌యోధ్య కుద‌రాల్సిందే అని అర్థం చేసుకొన్న క‌థానాయ‌కుడు... అందుకోసం చేసే ప్ర‌య‌త్నాలు, వాళ్ల మ‌ధ్య తాను, త‌న అసిస్టెంట్ చారి (వెన్నెల‌కిషోర్‌) నలిగిపోయిన వైనం ఆక‌ట్టుకుంటుంది. అయితే ద్వితీయార్థంలో అహం డోసు మ‌రీ ఎక్కువైన‌ట్టు అనిపిస్తుంది. దానికితోడు క‌థ కూడా అంచ‌నాల‌కి త‌గ్గ‌ట్టుగానే సాగుతుంది. ఎక్క‌డా ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు లేక‌పోవ‌డం, హాస్యం కూడా ఆశించిన స్థాయిలో పండ‌క‌పోవ‌డంసినిమాకి మైన‌స్‌గా మారింది. ప‌తాక స‌న్నివేశాలు కూడా ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్ద‌లేక‌పోయారు. అహంతో బాధ‌ప‌డే త‌న తండ్రి, త‌నకి కాబోయే అత్త‌ల మ‌న‌సు మార్చిన విధానం అంత‌గా అత‌క‌లేదు. ఎక్క‌డెక్క‌డైతే ఫీల్ పండాలో అక్క‌డ పండ‌లేదు. ఏదో స్క్రిప్టులో రాసుకున్నారు కాబ‌ట్టి, ఈ పాత్ర‌లు ఎలా సాగాలి, క‌థ‌ని ఇలా ముగించాలి అన్న‌ట్టుగా సాగుతుంటాయి స‌న్నివేశాలు. ద్వితీయార్థంలో వెన్నెల కిషోర్‌, పృథ్వీ చేసే కామెడీనే ప్రేక్ష‌కుల‌కు కాసింత కాల‌క్షేపాన్నిస్తుంది.

 న‌టీన‌టులు సాంకేతిక‌త‌:

నాగ‌చైత‌న్య హుషారైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఆయ‌న స్క్రీన్‌పై క‌నిపించిన విధానం కూడా చాలా బాగుంది. భావోద్వేగాల‌తో కూడిన స‌న్నివేశాల్లోనూ చ‌క్క‌గా న‌టించాడు. అయితే సంభాష‌ణ‌లు చెప్పే విధానంలోనే ఆయ‌న మ‌రికాస్త ప‌రిణ‌తి అవ‌స‌రమ‌నిపిస్తుంది. అను ఇమ్మాన్యుయేల్ అందంతో ఆక‌ట్టుకుంది. దాదాపు ప్ర‌తి స‌న్నివేశంలోనూ క‌నిపించే ఆమెకి ఈ సినిమాలో ప్రాధాన్య‌మున్న పాత్రే ద‌క్కింది. ఆ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేసింది. ర‌మ్య‌కృష్ణ పాత్ర సినిమాకి హైలెట్‌. అయితే ఆమెని తెర‌పై చూపించినంత‌గా పాత్ర‌లో బ‌లం క‌నిపించ‌దు. శైల‌జారెడ్డికీ, మాణిక్యంకీ మ‌ధ్య సంభాష‌ణ‌లు సాగే విష‌యంలో సినిమాటిక్ లిబ‌ర్టీస్ ఎక్కువ‌గా తీసుకున్నారు. కామెడీ కోస‌మే ఆ ప్ర‌య‌త్నం అనుకున్నాఅది కూడా పండ‌లేదు. తీరాదానివ‌ల్ల శైలజారెడ్డి పాత్ర ఔచిత్యం దెబ్బ‌తిన్న‌ట్ట‌యింది. న‌రేష్‌, ముర‌ళీశ‌ర్మ,ర‌ఘుబాబు త‌దిత‌రుల పాత్ర‌లకి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. వెన్నెల‌కిషోర్‌, పృథ్వీ ద్వితీయార్థంలో న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. నిజార్ ష‌ఫీ ఛాయాగ్ర‌హ‌ణం, గోపీసుంద‌ర్ సంగీతం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. సినిమాలోని ఓ ఫైట్‌కి ప్రియ‌రాగాలే పాట సంగీతాన్ని బ్యాక్‌గ్రౌండ్‌గా వాడ‌టం అభిమానుల్ని అల‌రించే విష‌యం. మారుతి మాట‌ల ప‌రంగా, పాత్రీక‌ర‌ణల ప‌రంగా ఆక‌ట్టుకున్నప్ప‌టికీ... క‌థ‌, క‌థ‌నాల విష‌యంలో మరిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం అవ‌స‌రమ‌ని ఈ సినిమా స్ప‌ష్టం చేస్తుంది. నిర్మాణ విలువ‌లు సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ స్థాయికి ఏమాత్రం త‌గ్గలేదు.


చివ‌రిగా:
కొత్తద‌నం లేని క‌థ‌, క‌థ‌నాల‌తో సాగే ఫ‌క్తు వాణిజ్య ప్ర‌ధాన‌మైన చిత్ర‌మిది. హాస్యం విష‌యంలోనే ద‌ర్శ‌కుడు మారుతి ప్ర‌త్యేక‌త క‌నిపిస్తుంటుంది. ఈ సినిమాలో మాత్రం ఆ విష‌యంలోనే లోటు జ‌రిగింది. అక్క‌డ‌క్క‌డా కాసిన్ని స‌న్నివేశాల్లో మిన‌హా పెద్ద‌గా హాస్యం పండ‌లేదు. భావోద్వేగాలపై కూడా దృష్టిపెట్ట‌లేదు. అయితే కొన్ని పాత్ర‌లు, అక్క‌డ‌క్క‌డ పండిన హాస్యం కాల‌క్షేపం చేయిస్తాయి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.