రివ్యూ: ‘సరిలేరు నీకెవ్వరు’
చిత్రం: సరిలేరు నీకెవ్వరు
నటీనటులు:
మహేశ్‌బాబు, రష్మిక, విజయశాంతి, ప్రకాష్‌రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్‌, సత్యదేవ్‌, అజయ్‌, సుబ్బరాజు, నరేశ్‌, రఘుబాబు, బండ్ల గణేశ్‌, సంగీత, హరితేజ, రోహిణి, సూర్య, తమన్నా (ప్రత్యేకగీతం)
సంగీతం:
దేవిశ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ:
ఆర్‌. రత్నవేలు
ఎడిటింగ్‌:
తమ్మిరాజు
నిర్మాత:
అనిల్‌ సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబు
రచన, దర్శకత్వం:
అనిల్‌ రావిపూడి
బ్యానర్‌:
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్ లిమిటెడ్‌
విడుదల తేదీ:
11-01-2020


అభిమానుల్ని మెప్పించే సినిమా చేయాల‌నేది మ‌హేష్ ఆలోచ‌న‌.  ‘శ్రీమంతుడు’, ‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’... ఇలా ఇటీవల వ‌రుస‌గా  సామాజిక సందేశాత్మక సినిమాలు చేస్తూ వ‌చ్చారాయ‌న‌.  ఈసారి మార్పుని కోరుకుంటూ అనిల్ రావిపూడితో సినిమా చేశారు. అదే... `స‌రిలేరు నీకెవ్వ‌రు`.  మాస్ అంశాల్ని మేళ‌వించ‌డంలో అనిల్‌ రావిపూడి దిట్ట‌. అందుకే మ‌హేష్ - అనిల్ క‌ల‌యిక విడుద‌ల‌కి ముందే ఆస‌క్తిని రేకెత్తిచ్చింది.  దానికితోడు 13 ఏళ్ల తర్వాత విజయశాంతి ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.  ఈ క‌ల‌యిక‌, పండ‌గ సందర్భంగా విడుద‌ల అవుతుండ‌డంతో అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. మ‌రి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు కథేంటో తెలుసుకుందాం...అభిమానుల్ని మెప్పించే సినిమా చేయాల‌నేది మ‌హేష్ ఆలోచ‌న‌.  ‘శ్రీమంతుడు’, ‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’... ఇలా ఇటీవల వ‌రుస‌గా  సామాజిక సందేశాత్మక సినిమాలు చేస్తూ వ‌చ్చారాయ‌న‌.  ఈసారి మార్పుని కోరుకుంటూ అనిల్ రావిపూడితో సినిమా చేశారు. అదే... `స‌రిలేరు నీకెవ్వ‌రు`.  మాస్ అంశాల్ని మేళ‌వించ‌డంలో అనిల్‌ రావిపూడి దిట్ట‌. అందుకే మ‌హేష్ - అనిల్ క‌ల‌యిక విడుద‌ల‌కి ముందే ఆస‌క్తిని రేకెత్తిచ్చింది.  దానికితోడు 13 ఏళ్ల తర్వాత విజయశాంతి ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.  ఈ క‌ల‌యిక‌, పండ‌గ సందర్భంగా విడుద‌ల అవుతుండ‌డంతో అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. మ‌రి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు కథేంటో తెలుసుకుందాం...

* క‌థ..
అజ‌య్ కృష్ణ (మ‌హేష్‌బాబు)  ఆర్మీ మేజ‌ర్‌. క‌శ్మీర్ స‌రిహ‌ద్దుల్లో విధులు నిర్వ‌ర్తిస్తుంటాడు.  ఉగ్ర‌వాదులు కొద్దిమంది చిన్నారుల్ని కిడ్నాప్ చేయ‌డంతో ఒక రెస్క్యూ ఆప‌రేష‌న్ చేయాల్సి వ‌స్తుంది. అందులో జ‌రిగిన ఒక సంఘ‌ట‌న‌తో అజ‌య్ క‌ర్నూలు వెళ్లాల్సివ‌స్తుంది. అక్క‌డ ప్రొఫెస‌ర్ భార‌తి (విజ‌య‌శాంతి) కుటుంబం కోసం వెళితే ఆమె ప్ర‌మాదంలో ఉన్న‌ట్టు అర్థ‌మ‌వుతుంది. స్థానిక మంత్రి నాగేంద్ర (ప్ర‌కాష్‌రాజ్‌) నుంచి ఆమెకి, ఆమె కుటుంబానికి ముప్పు పొంచి ఉంటుంది. అందుకు కార‌ణ‌మేమిటి?  భార‌తి కోసం అజ‌య్ ఏం చేశాడు?  వారిద్ద‌రికీ సంబంధ‌మేమిటి? అజ‌య్ జీవితంలోకి సంస్కృతి (ర‌ష్మిక మంద‌న్న) ఎలా వ‌స్తుంది? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.విశ్లేష‌ణ‌..
మ‌హేష్‌లాంటి స్టార్ హీరోని తెర‌పై ఎలా చూపించాలి? ఆయ‌న్నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో ప‌క్కాగా కొల‌త‌లేసుకుని చేసిన సినిమా ఇది. కొత్త క‌థ కాదు కానీ, ఇలాంటి ఒక మాస్ క‌థ‌లో దేశ‌భ‌క్తిని మేళ‌వించిన విధానం మాత్రం మెప్పిస్తుంది. ఆ విష‌యంలోనే నెవర్ బిఫోర్ అనిపించాడు అనిల్ రావిపూడి. ఈ క‌థ క‌ర్నూలులో ప్రొఫెస‌ర్ భార‌తి జీవితం, అక్క‌డి రౌడీయిజంతో మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత క‌శ్మీర్‌కి వెళుతుంది. అక్క‌డ రెస్క్యూ ఆప‌రేష‌న్ త‌ర్వాత మళ్లీ క‌ర్నూలుకి చేరుతుంది. మ‌హేష్ క‌ర్నూలుకి రాక‌తోనే క‌థ‌లో వేగం పుంజుకున్న‌ట్ట‌వుతుంది. మ‌ధ్య‌లో రైలు ప్ర‌యాణంలో కామెడీ ట్రాక్‌ని జోడించారు. అక్క‌డ ర‌ష్మిక‌, రావు ర‌మేష్‌, సంగీత, బండ్ల‌గ‌ణేష్ త‌దిత‌రులు చేసే హంగామా న‌వ్విస్తుంది. అయితే అనిల్ రావిపూడి ఇదివ‌ర‌క‌టి సినిమాల స్థాయిలో క‌డుపుబ్బా న‌వ్వించలేక‌పోయినా ఫ‌న్ అయితే పుట్టించారు.  `నెవ్వ‌ర్ బిఫోర్ ఎవ్వ‌ర్ ఆఫ్ట‌ర్‌, మ్యావ్ మ్యావ్ పిల్లి, మిల్కిబాయ్‌తో పెళ్లి` అంటూ  అనిల్ మార్క్ మేన‌రిజ‌మ్స్‌ని కూడా జోడించారు కానీ అవి స‌న్నివేశాల‌కి అత‌క‌లేదు. కానీ ర‌ష్మిక మీకు అర్థ‌మ‌వుతోందా అని చెప్పే మేనరిజ‌మ్ మాత్రం క్యూట్‌గా అనిపిస్తుంది.  కొండారెడ్డి బురుజు ద‌గ్గ‌ర మహేష్ చేసే పోరాటంతో విరామ స‌న్నివేశాలు వ‌స్తాయి. నిజానికి అస‌లు క‌థ ద్వితీయార్థంలోనే ఉంటుంది.  భార‌తిని నాగేంద్ర ఎందుకు అంతం చేయాల‌నుకుంటాడ‌నే విష‌యం కోసం క‌థానాయ‌కుడు స్వ‌యంగా ప‌రిశోధ‌న‌కి దిగుతాడు. అక్క‌డ తెలిసే నిజాలు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. అయితే అక్క‌డ కూడా కామెడీని పండించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు.  క‌థ సీరియ‌స్‌గా న‌డ‌వాల్సిన చోట కూడా కామెడీ పండించ‌డం కోసం ద‌ర్శ‌కుడు ప్ర‌య‌త్నించ‌డం క‌థ‌లో ఫీల్‌ని మిస్స‌య్యేలా చేసింది.  అయితే మ‌ళ్లీ న‌ల్ల‌మ‌ల‌లో ఫైటు ద‌గ్గ‌ర్నుంచి మ‌ళ్లీ క‌థ‌లో హుషారు తెప్పించారు. అభిమానుల్ని మెప్పిస్తూనే, మా ఆధార్ కార్డుల్ని లింక్ చేసిన‌ట్టుగానే...  ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి ఓ అకౌంట్ పెట్టండి, వాటిని మాకు లింక్ చేయండంటూ రాజ‌కీయ నాయ‌కుల్ని ఉద్దేశించి మాట్లాడ‌టం మెప్పిస్తుంది. ఆర్మీ గొప్ప‌త‌నం గురించి విజ‌య‌శాంతి చెప్పే సంభాష‌ణ‌లు కూడా మెప్పిస్తాయి.  క‌థానాయ‌కుడు పాత్ర ఔన్న‌త్యం మేర‌కు  ప‌తాక స‌న్నివేశాల్ని హింస‌కి దూరంగా తీర్చిదిద్ద‌డం మెప్పిస్తుంది.  అక్ర‌మార్కుల్లో మార్పు రావాలంటే వాళ్ల‌ని జైలుకు పంప‌కుండా ఏం చేయాలో ప‌తాక స‌న్నివేశాల్లో చెప్పిన తీరు కూడా ఆక‌ట్టుకుంటుంది. 13 ఏళ్ల త‌ర్వాత కెమెరా ముందుకొచ్చిన  విజ‌య‌శాంతి హుందానంతో కూడిన మంచి పాత్ర‌లో  క‌నిపిస్తుంది. మ‌హేష్‌బాబు అభిమానుల్లో జోష్ నింపేలా డ్యాన్సులు, ఫైట్లు చాలా బాగా చేశాడు. ముఖ్యంగా  మైండ్ బ్లాక్ పాట‌లో ఆయ‌న చేసిన డ్యాన్సులు ఆక‌ట్టుకుంటాయి. కృష్ణ‌ని తెర‌పై చూపించిన విధానం కూడా అభిమానుల్ని సంతోష‌పెడుతుంది.


న‌టీన‌టులు.. సాంకేతిక‌త‌
మ‌హేష్ న‌ట‌నే ఈ సినిమాకి హైలెట్‌. త‌న శైలి  సంభాష‌ణ‌ల‌తో న‌వ్వించ‌డంతో పాటు, ఆర్మీ మేజ‌ర్‌గా స్ఫూర్తిని నింపేలా మంచి భావోద్వేగాల్ని పండించారు. డ్యాన్సుల ప‌రంగా మ‌రోసారి త‌న అభిమానుల్ని ఖుషీ చేశాడు. ర‌ష్మిక చిలిపి అమ్మాయిగా క‌నిపించి ఆక‌ట్టుకుంది. కామెడీ పండించడంలోనూ ఆమె భేష్ అనిపించుకుంది. విజ‌య‌శాంతి శ‌క్తివంత‌మైన పాత్రలో క‌నిపించింది. ఒక మంచి పాత్ర‌తోనే రీ ఎంట్రీ ఇచ్చార‌నిపిస్తుంది. ముఖ్యంగా ఆర్మీ గొప్ప‌త‌నం గురించి ఆమె పండించిన భావోద్వేగాలు సినిమాకి ప్ర‌ధాన‌బ‌లంగా నిలిచాయి.  ప్ర‌కాష్‌రాజ్ మంత్రి నాగేంద్ర పాత్ర‌లో ఒదిగిపోయాడు. ర‌ఘుబాబుతో క‌లిసి ఆయ‌న ప్ర‌థ‌మార్థంలో న‌వ్వించారు కూడా. పతాక స‌న్నివేశాల‌కొచ్చేస‌రికి ఆయ‌న పాత్ర పూర్తి భిన్నంగా క‌నిపించాల్సి వ‌స్తుంది. అక్క‌డ ఈ పాత్ర‌కి ప్ర‌కాష్‌రాజే క‌రెక్ట్ అనిపించారు. రావుర‌మేష్‌, సంగీత‌, పోసాని, త‌నికెళ్ల భ‌ర‌ణి, అజ‌య్‌, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ర‌త్న‌వేలు కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. దేవిశ్రీప్ర‌సాద్ పాట‌లు బ‌య‌ట కంటే థియేట‌ర్‌లో ఇంకా  మెప్పిస్తాయి. ఆయ‌న‌నేప‌థ్య సంగీతం  సినిమాపై మ‌రింత ప్ర‌భావం చూపించింది. అనిల్ రావిపూడి సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటాయి. కొత్త అంశాన్ని స్పృశించారు కానీ, క‌థ‌నం ప‌రంగా మాత్రం ఆయ‌న  పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయారు. నిర్మాణ విలువలు ఉన్న‌తంగా ఉన్నాయి.


చివ‌రిగా:
మ‌హేష్ అభిమానుల్ని మెప్పించాల‌నే ఒక బ‌ల‌మైన సంక‌ల్పంతోనే ఈ సినిమా చేసినా... స‌గ‌టు ప్రేక్ష‌కుడిని మెప్పించే అంశాలు కూడా ఉన్నాయి. ఇక అభిమానుల‌కైతే ఈ సినిమా పండ‌గే.


                              

సంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.