రివ్యూ: సెవెన్‌
రివ్యూ: సెవెన్‌
నటీనటులు: హవీష్, రెజీనా, నందితా శ్వేత, అనీషా అంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజిత పొన్నాడ, రెహమాన్, సత్య తదితరులు
కూర్పు: ప్రవీణ్‌ కెఎల్‌
సాహిత్యం: శ్రీమణి, పులగం చిన్నారాయణ, శుభం విశ్వనాథ్
సంగీతం: చైతన్ భరద్వాజ్
కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత: రమేష్ వర్మ
ఛాయాగ్రహ‌ణం, దర్శకత్వం: నిజార్ ష‌ఫీ
నిర్మాణ సంస్థ: రమేష్ వర్మ ప్రొడక్షన్
విడుదల: 06-06-2019


థ్రిల్లర్ చిత్రాలకు పెట్టింది పేరు తెలుగు చిత్రసీమ. థ్రిల్లర్ కథలకు కొంత‌మంది వినోదాన్ని జోడిస్తే, మరికొందరు హారర్ అంశాలు మేళవిస్తారు. ఉత్కంఠభరిత కథనానికి స‌రైన మోతాదులో వినోదం లేక హారర్ సన్నివేశాలు తోడైన చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందుతుంటాయి. ఇటీవ‌ల కాలంలో తెలుగులో హారర్ కామెడీ, కామెడీ థ్రిల్లర్ చిత్రాలు త‌ర‌చూ రూపుదిద్దుకుంటున్నాయి. వాటికి భిన్నంగా ఒక రొమాంటిక్ థ్రిల్లర్ క‌థ‌తో ‘సెవెన్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘నువ్విలా’తో ప‌రిచ‌య‌మైన హవీష్ ఇందులో క‌థానాయ‌కుడు కాగా, ఛాయాగ్రాహ‌కుడు నిజార్ షఫీ ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. రమేష్ వర్మ క‌థ‌ని స‌మ‌కూర్చడంతో పాటు, నిర్మాణ బాధ్యత‌లు చేప‌ట్టారు. విడుద‌ల‌కి ముందే ‘సెవెన్’ ప్రచార చిత్రాలు, పాటలు ఆస‌క్తిని రేకెత్తించాయి. మరి అందుకు తగ్గట్టుగానే సినిమా ఉందా?

* కథేంటంటే..
కార్తిక్ (హవీష్) ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. తన ఆఫీసులో ఉద్యోగం చేసే రమ్య (నందితా శ్వేత)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. జీవితం సంతోషంగా సాగుతున్న సమయంలో ఆఫీసులో సమస్యల వల్ల భార్యాభర్తల మధ్య గొడవ తలెత్తుతుంది. కార్తిక్ ఇంటి నుంచి వెళ్లిపోతాడు. రెండు రోజులు ఎదురు చూసిన తర్వాత రమ్య తన భర్త కనిపించడం లేదని పోలీసుల‌కి ఫిర్యాదు చేస్తుంది. అసలేం జరిగిందని పోలీస్ అధికారి (రెహమాన్) అడగటంతో తమ కథను చెప్పడం మొదలు పెడుతుంది. మధ్యలో ఆపిన పోలీస్, మిగతా కథను చెబుతాడు. మా కథ మీకెలా తెలుసని రమ్య ప్రశ్నిస్తే... ఆరు నెలల క్రితం జెన్నీ (అనీషా అంబ్రోస్) తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చి ఇదే క‌థ చెప్పిందంటాడు. జెన్నీనే కాదు... చెన్నైలో మరో యువతి అదే కథ చెప్పి తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తుంది. అప్పుడు కార్తిక్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి ఫొటోలు విడుదల చేస్తారు. అయితే, ఓ మానసిక రోగి వచ్చి ఫొటోలో ఉన్నది కార్తిక్ కాదని, కృష్ణమూర్తి అని, కొన్నేళ్ల క్రితమే అత‌ను చనిపోయాడని చెబుతాడు. కొన్నేళ్ల క్రితం కృష్ణమూర్తి చనిపోతే, అచ్చం అదే రూపంలో ఉన్న కార్తిక్ ఎవరు? ముగ్గురు అమ్మాయిలను కార్తిక్ నిజంగా మోసం చేశాడా? లేదా ముగ్గురు ఫిర్యాదు చేయడం వెనుక మరో కథ ఉందా? తదితర ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


* ఎలా ఉందంటే..
థ్రిల్లర్‌ చిత్రాలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాలి. అప్పుడే ప్రేక్షకుడు థ్రిల్‌కి గుర‌వుతాడు. ప్రథ‌మార్ధం అంతా సాదాసీదాగా సాగే ఈ సినిమా, ద్వితీయార్ధంలో కొన్ని మ‌లుపుల‌తో ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ప‌తాక స‌న్నివేశాలు మాత్రం కామెడీగా మారిపోయాయి. క‌థ‌, క‌థ‌నాల్లో కొత్తద‌నం ఉన్నప్పటికీ... వాటికి స‌రైన డ్రామాని జోడించ‌డంలో చిత్రబృందం విఫ‌ల‌మైంది. దాంతో కొన్ని స‌న్నివేశాలు మాత్రమే మెప్పిస్తాయి. ప్రేమించినవాడు దక్కలేదనే పగతో రగిలిపోయిన ఓ అమ్మాయి క‌థే ఈ చిత్రం. ఆమె ఎవ‌రెవ‌రి జీవితాల్ని ఎలా మ‌లుపు తిప్పింద‌న్నది ఆస‌క్తిక‌రం. పేరుకు రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమైనా... ఆరుగురు క‌థానాయిక‌లున్నా... ప్రథ‌మార్ధంలో పాట‌ల్లో మాత్రమే రొమాన్స్ పండింది. ద్వితీయార్ధంలో మ‌లుపులు థ్రిల్‌ని పంచుతాయి. రెజీనా నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు చిత్రానికే హైలెట్‌గా నిలిచాయి. రమేష్ వర్మ ర‌చ‌నా ప్రతిభ ఆ స‌న్నివేశాల్లో క‌నిపిస్తుంది. పతాక సన్నివేశాల వరకూ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తూ సమయం తెలియకుండా చేస్తుంది చిత్రం. సీరియ‌స్‌గా సాగాల్సిన ప‌తాక స‌న్నివేశాలు కాస్త కామెడీగా అనిపించ‌డం ఈ సినిమాకి మైన‌స్‌. ప్రేక్షకుల్లో గుర్తింపు ఉన్న నటి లేకపోవడం వల్ల ఆ స‌న్నివేశాలు తేలిపోయాయి.


* ఎవరెలా చేశారంటే..
అందం, అభినయానికి ఆస్కారమున్న పాత్రలో రెజీనా నటించింది. ప్రేమ కోసం పరితపించే పాత్రలో ఆమె పలికించిన భావోద్వేగాలు ద్వితీయార్ధాన్ని నిలబెట్టాయి. హవీష్ క‌నిపించిన విధానం కూడా బాగుంది. గత చిత్రాలతో పోలిస్తే నటనలో కాస్త మెరుగయ్యారు. నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్‌ల‌కు మంచి పాత్రలు లభించాయి. ఆహార్యం పరంగా నేటి తరం అమ్మాయిలు ఎలా ఉంటారో అలా కనిపించారు. పాటల్లో కెమిస్ట్రీ బాగా పండించారు. కానీ, పాటలకు ముందు వెనుక వచ్చే సన్నివేశాల్లో బలం లేకపోవడం వల్ల ఆ పాత్రలు తేలిపోయాయి. పోలీస్ అధికారిగా రెహమాన్ ఉన్నంతలో చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. త్రిధా చౌదరి పాత్ర నిడివి తక్కువే. కానీ, ఆమె రాకతో కథ కొత్త మలుపు తీసుకుంటుంది. అదితి ఆర్య అతిథి పాత్రలో కనిపించింది. ‘స్వామి రారా’ సత్య పాత్రతో వినోదం పండలేదు. సాంకేతికంగా చూస్తే నిజార్ షఫీ ఛాయాగ్రహణం ఉన్నత స్థాయిలో ఉంది. చైతన్ భరద్వాజ్ స్వరాలు, నేపథ్య సంగీతం చిత్రానికి బలంగా నిలిచాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. మాటలు ఆకట్టుకునేలా లేవు. ప్రేమకథలోని మాటల్లో వినోదం తోడయ్యుంటే బాగుండేది. ఛాయాగ్రాహకుడిగా ఆకట్టుకున్న నిజార్ షఫీ, ప్రథమార్ధంలో కథను ఆసక్తికరంగా చెప్పడంలో విఫలమయ్యారు. ద్వితీయార్ధంలో రెజీనా వంటి నటి దొరకడంతో ఆయన పని కాస్త సులభమైంది. ర‌మేష్ వ‌ర్మ క‌థ రాసిన విధానం బాగుంది. ప్రధమార్ధాన్ని మ‌రింత ఆస‌క్తక‌రంగా రాసుంటే ఈ సినిమా ఫ‌లితం మ‌రోలా ఉండేది.


బ‌లాలు

+ కథలో మలుపులు
+ ఛాయాగ్రహణం
+ పాటలు
+ రెజీనా

బలహీనతలు
- ప్రథమార్ధం
- ప్రేమ సన్నివేశాలు

* చివ‌రిగా:
‘సెవెన్’... కొంచెం థ్రిల్ కోసం


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.