రివ్యూ: సూర్యకాంతం
రివ్యూ: సూర్యకాంతం
సినిమా: సూర్యకాంతం
నటీనటులు: నిహారిక కొణిదెల, రాహుల్‌ విజయ్‌, పెర్లిన్‌ బెసానియా, సుహాసిని, శివాజీ రాజా
సంగీతం: మార్క్‌ కె రాబిన్‌
దర్శకత్వం: ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి
నిర్మాతలు: వై. సందీప్‌, వై. సృజన, రామ్‌ నరేష్‌
సమర్పణ: వరుణ్‌తేజ్‌
విడుదల తేదీ: 29-03-2019నిహారిక ప్ర‌తిభేంటో ఆమె చేసిన `ఒక మ‌న‌సు`, `హ్యాపీవెడ్డింగ్‌` చిత్రాలే చెబుతాయి. మెగా కుటుంబం నుంచి క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన నిహారిక‌కి కావ‌ల్సింది విజ‌య‌మే. మ‌రోసారి ఆమె త‌నకు త‌గ్గ పాత్ర‌తో `సూర్య‌కాంతం` చేసింది. మ‌రి ఈ చిత్రంతో నిహారిక‌కి విజ‌యం ల‌భించిన‌ట్టేనా? సూర్య‌కాంతంగా నిహారిక ఎలా న‌టించింది? తెలుసుకుందాం పదండి...

* క‌థ‌
సూర్య‌కాంతం (నిహారిక‌) నిత్యం ప్ర‌యాణాల‌తోనే గ‌డుపుతుంటుంది. ఒక‌రు త‌న‌కి ద‌గ్గ‌ర‌వుతున్న‌ట్టు అనిపించినా వెంట‌నే వాళ్ల నుంచి దూరంగా వెళ్లిపోతుంటుంది. అలా వ్య‌వ‌హ‌రించ‌డానికి కార‌ణం ఆమె చిన్న‌ప్ప‌ట్నుంచీ ఎదురైన అనుభ‌వాలే. ఎవ్వ‌రి కోసం నేను మార‌ను, నా కోసం ఎవ్వ‌రూ మారాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పే ఆమెకి అభి (రాహుల్ విజ‌య్‌) ద‌గ్గ‌ర‌వుతాడు. వెంట తిరుగుతాడు. ప్రేమ విష‌యం చెప్పే లోపే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోతుంది. యేడాదిపాటు ఎదురు చూసినా తిరిగి రాదు. దాంతో ఇంట్లో పెద్ద‌లు పూజ (పెర్లిన్‌)తో పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యిస్తారు. పూజ‌, అభి అభిప్రాయాలు కూడా క‌లుస్తాయి. ఇంత‌లోనే సూర్య‌కాంతం తిరిగొస్తుంది. ఈసారి ఆమే త‌న ప్రేమ‌ని అభి ముందు వ్య‌క్తం చేస్తుంది. మ‌రి ఇద్ద‌ర‌మ్మాయిల ప్రేమ‌లో అభి ఎలా న‌లిగిపోయాడు? ఆ ఇద్ద‌రిలో ఎవ‌రిని త‌న జీవిత భాగస్వామిగా ఎంచుకున్నాడు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


* విశ్లేష‌ణ‌
తెలుగు సినిమాల్లో ఇదివ‌ర‌కు చూసిన క‌థే ఇది. బద్రి, మిస్స‌మ్మ త‌దిత‌ర సినిమాలు ఇంచుమించు ఇదే కాన్సెప్టుతో తెర‌కెక్కిన‌వే. కానీ దానికి క‌మిట్‌మెంట్ ఫోబియా అనీ కొత్త క‌ల‌రింగ్ ఇస్తూ కొత్త‌గా చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. క‌లిసుండ‌డ‌మే కాదు... అవ‌స‌ర‌మైన‌ప్పుడు విడిపోవ‌డం కూడా ప్రేమే అనేది ఇందులో కీల‌కాంశం. ఇద్ద‌ర‌మ్మాయిలు, ఒక అబ్బాయి మ‌ధ్య ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ‌గా సాగుతుంది. ఒక అబ్బాయి జీవితంలో ఇద్ద‌రమ్మాయిలొస్తే? పైగా వాళ్లిద్ద‌రిలో ఏ ఒక్క‌రినీ దూరం చేసుకోలేని ప‌రిస్థితులు తలెత్తితే ఎలా ఉంటుంద‌నే అంశాలే ఇందులో కీల‌కం. తొలి స‌గ‌భాగం సినిమాలో అక్క‌డ‌క్కడా సున్నిత‌మైన హాస్యం... పాత్ర‌ల ప‌రిచ‌యానికే ప‌రిమిత‌మైంది త‌ప్ప పెద్ద‌గా క‌థేమీ లేదు. ద్వితీయార్థంలో అస‌లు క‌థ ఉన్న‌ప్ప‌టికీ... అక్క‌డ కూడా చాలా స‌న్నివేశాలు సాగ‌దీత‌గా అనిపిస్తాయి. తొలి స‌గ‌భాగం సినిమాలో నిహారిక పాత్ర చేసే హంగామా హాస్యాన్ని పండిస్తుంది. కొన్నిచోట్ల మాత్రం ఆ పాత్ర వ్య‌వ‌హ‌రించే తీరు అతిగా అనిపిస్తుంది. విరామం స‌న్నివేశాలు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. ఆ త‌ర్వాత క‌థంతా ఊహ‌కు త‌గ్గ‌ట్టుగానే సాగినా... నాయ‌కానాయిక‌ల పాత్ర‌ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ మాత్రం ఆక‌ట్టుకుంటుంది. అయితే ప‌తాక స‌న్నివేశాల వ‌ర‌కు కూడా సూర్య‌కాంతం యేడాదిపాటు ఎక్క‌డికి వెళ్లింద‌నే విష‌యం బ‌య‌ట ప‌డ‌దు. దాన్ని చివ‌ర్లో క‌మిట్‌మెంట్ ఫోబియాతో ఇంటి నుంచి వెళ్లిపోయింద‌నే ఓ చిన్న మాట‌తో తేల్చేయ‌డం ఏమంత మెప్పించ‌దు. క‌మిట్‌మెంట్ ఫొబియా నేప‌థ్యంలో స‌న్నివేశాల్ని బ‌లంగా చెప్పుంటే ఈ సినిమాకి ప‌రిపూర్ణ‌త ల‌భించేది. ప‌తాక స‌న్నివేశాలు రొటీన్‌గా, ఇదివ‌ర‌క‌టి తెలుగు సినిమాల్లో కాకుండా... కొత్త‌గా తీర్చిదిద్దిన విదానం మెప్పిస్తుంది.

* న‌టీన‌టులు...సాంకేతిక‌త
రాహుల్ విజ‌య్‌, నిహారిక‌, పెర్లిన్... ఈ ముగ్గురు పోషించిన పాత్ర‌లే కీల‌కం. ముగ్గురికీ మంచి అభిన‌యం ప్ర‌దర్శించే అవ‌కాశం ల‌భించింది. . పూజ పాత్ర‌లో చాలా స్ప‌ష్ట‌త క‌నిపిస్తుంటుంది. ఆ పాత్ర‌లో పెర్లిన్ చాలా బాగా న‌టించింది. ఇద్ద‌ర‌మ్మాయిల మ‌ధ్య న‌లిగిపోతూ భావోద్వేగాలు పండించే అభి పాత్ర‌తో రాహుల్ మెప్పిస్తాడు. నిహారిక తొలి భాగంలో కొంటెపిల్ల‌గా క‌నిపించిన విధానం... ద్వితీయార్థంలో ప్రేమ‌ని దిగ‌మింగుకుంటూ వెళ్లిపోయే స‌న్నివేశాల్లో న‌ట‌నతో మెప్పించింది. సూర్య‌కాంతం త‌ల్లిగా ఆ పాత్ర ప‌రిధి మేర‌కు సుహాసిని చ‌క్క‌గా న‌టించారు. క‌థానాయ‌కుడి త‌ల్లిదండ్రులుగా శివాజీరాజా, మ‌ధుమ‌ణి క‌నిపిస్తారు. స‌త్య అక్క‌డ‌క్క‌డా న‌వ్వించారు. మిగిలిన పాత్ర‌ల‌కి అంత‌గా ప్రాధాన్యం లేదు. సాంకేతికంగా సినిమా బాగుంది. మార్క్ కె.రాబిన్ మంచి పాట‌ల‌తో పాటు... నేప‌థ్య సంగీతం అందించారు. హ‌రి జాస్తి కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. ద‌ర్శ‌కుడు ప్ర‌ణీత్ రాసుకున్న క‌థ‌, మాట‌లు బాగున్నాయి కానీ.. వాటిని సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా మ‌ల‌చ‌లేక‌పోయారు. ఆయ‌నపై వెబ్ సిరీస్‌ల ప్ర‌భావం బ‌లంగా ఉన్న‌ట్టుంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే స‌న్నివేశాలు నిదానంగా సాగుతాయి. నిర్వాణ సినిమాస్ నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.


* చివ‌రిగా...
ఇంట్లో కూర్చుని చూసే వెబ్ సిరీస్‌ల‌కీ... టికెట్టు కొని చూసే సినిమాల‌కీ చాలా తేడా ఉంటుంది. సినిమా క‌థ‌ల్లో వినోదం, వేగం మోతాదు ఎక్కువగా ఉండాలి. అప్పుడే ప్రేక్ష‌కుడు ఆ క‌థ‌ల్లో లీన‌మ‌వుతాడు. కానీ సినిమా స్థాయికి త‌గ్గ క‌థ, మాట‌లు రాసుకున్న‌ప్ప‌టికీ దాన్నొక వెబ్ సిరీస్ ఎపిసోడ్ త‌ర‌హాలో `సూర్య‌కాంతం`ని తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు. లాజిక‌ల్‌గా, ట్రెండీగా సాగే మాట‌లు... సున్నిత‌మైన వినోదంతో కూడిన ఈ సినిమా మ‌ల్టీప్లెక్స్ ప్రేక్ష‌కుల‌కు కాల‌క్షేపాన్నిస్తుంది కానీ... అంద‌రినీ మాత్రం మెప్పించ‌లేదు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.