రివ్యూ: సైరా నరసింహారెడ్డి

చిత్రం: సైరా నరసింహారెడ్డి
నటీనటులు: చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, జగపతిబాబు, తమన్నా, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, అనుష్క, రవికిషన్‌, నిహారిక, బ్రహ్మానందం, రఘుబాబు, బ్రహ్మాజీ తదితరులు
సంగీతం: అమిత్‌ త్రివేది, జూలియస్‌ ఫాఖియం(నేపథ్య సంగీతం)
సినిమాటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు
ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌
డైలాగ్స్‌: బుర్రా సాయిమాధవ్‌
కథ: పరుచూరి బ్రదర్స్‌
ప్రొడక్షన్‌ డిజైన్‌: రాజీవన్‌
నిర్మాత: రామ్‌చరణ్‌
దర్శకత్వం: సురేందర్‌రెడ్డి
బ్యానర్‌: కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ
విడుదల తేదీ: 02-10-2019


ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌ని పాలెగాళ్ల‌ని ఏకం చేశాడు.
తొమ్మిది వేల‌మంది ప్ర‌జ‌లు త‌న వెంట న‌డిచేలా స్ఫూర్తిని నింపాడు.
ఆంగ్లేయుల ఫిరంగుల‌కి త‌న గుండెల్ని ఎదురొడ్డి ధీర‌త్వం ప్ర‌ద‌ర్శించాడు.
సీమ పౌరుష‌మే ఆయుధంగా భావించి క‌ద‌న‌రంగంలో క‌త్తి దూశాడు.
ఆయ‌నే... ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి. చ‌రిత్ర పుటల్లో క‌నుమ‌రుగైన వీరుడాయ‌న‌. ఆంగ్లేయుల‌పై తొలిసారి యుద్ధ భేరి మోగించిన రేనాటి సూర్యుడు. ఆ వీరత్వం గురించి క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకుంటుంటారు సీమ ప్ర‌జ‌లు. ఆ చ‌రిత్ర న‌చ్చే ప‌న్నెండేళ్ల కింద‌టే ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిగా న‌టించాల‌ని నిర్ణ‌యించుకొన్నారు చిరంజీవి. అది ఆయ‌న 151వ చిత్రంగా కుదిరింది. తండ్రికి ఒక కానుకగా  అందించాల‌ని చిరు త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌డం... యువ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం... మ‌న యోధుడి క‌థ కావ‌డం...  `బాహుబ‌లి` త‌ర్వాత మ‌ళ్లీ ఆ స్థాయి హంగులతో పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకోవ‌డం.... ఇలా ఈ సినిమా ఆరంభం నుంచే ప‌లు కోణాల్లో అంచ‌నాల్ని పెంచేసుకొంది.  ప్ర‌చార చిత్రాల త‌ర్వాత అవి మ‌రింత‌గా పెరిగాయి. మ‌రి రేనాటి సూర్యుడిగా చిరంజీవి ఆక‌ట్టుకున్నాడా లేదా?  `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రం ఎలా ఉంది? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.


కథ: 
1847 నాటి కాలం అది. బ్రిటిష్ ఏలుబడిలో రేనాటి ప్రాంతం తీవ్ర క‌ర‌వు కాట‌కాల‌కి లోన‌వుతుంది. అయినా ప్ర‌జ‌లు య‌థావిధిగా  ప‌న్నులు క‌ట్టాల్సిందేన‌ని బ్రిటిష్ పాల‌కులు హింసిస్తుంటారు. దత్త మండలాల‌కి సంస్థానాధీశులుగా కొన‌సాగుతున్న పాలెగాళ్ల‌కి ప్ర‌జ‌ల క‌ష్ట‌న‌ష్టాలు తెలిసినా... బ్రిటిష్ పాల‌కుల‌ని ఎదిరించ‌లేని ప‌రిస్థితి. పైగా పాలెగాళ్ల‌లో ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌దు. దాంతో బ్రిటిష్ పాల‌కుల ఆగ‌డాలు మ‌రింత‌గా పెరుగుతాయి. కానీ 61 మంది పాలెగాళ్ల‌లో ఒక‌రైన మ‌జ్జారి న‌ర‌సింహారెడ్డి (చిరంజీవి) మాత్రం ప‌న్నులు ఎందుకు క‌ట్టాల‌ని ప్ర‌శ్నిస్తాడు. అది మింగుడుప‌డ‌ని ఆంగ్లేయులు అత్యంత క్రూరుడైన జాక్స‌న్ అనే అధికారిని అక్క‌డికి పంపుతుంది. అక్క‌డ్నుంచి పోరాటం మొద‌ల‌వుతుంది. ఇందులో ఎవ‌రు గెలిచారు? న‌ర‌సింహారెడ్డికి తోటి పాలెగాళ్లైన అవుకు రాజు (సుదీప్‌), వీరారెడ్డి (జ‌గ‌ప‌తిబాబు), రాజా పాండే (విజ‌య్ సేతుప‌తి), బసిరెడ్డి (రవికిష‌న్‌)కి స‌హాయం అందించారా లేక వెన్నుపోటు పొడిచారా?  న‌ర‌సింహారెడ్డి జీవితంలోకి వ‌చ్చిన ల‌క్ష్మీ (త‌మ‌న్నా), సిద్ధ‌మ్మ (న‌య‌న‌తార‌)ల  క‌థేమిటి? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

                         

విశ్లేషణ:

వీర‌నారి ఝాన్సీల‌క్ష్మీబాయి (అనుష్క‌) కోణంలో ఈ క‌థ మొద‌ల‌వుతుంది. సిపాయి పోరాటం కంటే ప‌దేళ్ల ముందే రేనాటి వీరుడు బ్రిటిష్ పాల‌కుల‌పై యుద్ధ భేరి మోగించార‌ని చెబుతూ ఆమె తోటి సైన్యంలో స్ఫూర్తిని నింపే ప్ర‌య‌త్నం చేస్తుంది. నొస్సం కోట చ‌రిత్రనీ, ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి బాల్యాన్ని చూపించ‌డం కోసం కొన్ని స‌న్నివేశాల్ని వాడుకొన్నాడు ద‌ర్శ‌కుడు. అవన్నీ కూడా పాత్ర‌ల్ని ప‌రిచ‌యం చేయ‌డానికి, క‌థ‌కి బ‌ల‌మైన పునాది వేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డ్డాయి. బ్రిటిష్ పాల‌కుల చేతుల్లోకి ద‌త్త మండలాలు వెళ్ల‌డం, వాళ్లు ప‌న్నులు క‌ట్టాల‌ని ప్ర‌జ‌ల్ని వేధింపుల‌కి గురి చేయ‌డం ద‌గ్గ‌ర్నుంచి అస‌లు క‌థ ఊపందుకుంటుంది. బ్రిటిష్ పాల‌కుల ఆకృత్యాల్ని క‌ళ్ల‌కిక‌ట్టేలా చూపించారు. ఆ స‌న్నివేశాలు కాస్త నిదానంగా... సుదీర్ఘంగా అనిపించినా అవి క‌థ‌లో భావోద్వేగాల్ని ర‌గించ‌డానికి కీల‌కంగా మారాయి. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జాత‌ర జ‌రిపించ‌డం... అక్క‌డ ఎద్దుల విన్యాసాల నేప‌థ్యంలో స‌న్నివేశాలు భారీ హంగుల‌తో సాగుతాయి.  విరామానికి ముందు వ‌చ్చే పోరాట ఘ‌ట్టాలు సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి.  ద్వితీయార్థం నుంచి భావోద్వేగాల‌పై మ‌రింత పట్టు ప్ర‌ద‌ర్శించాడు ద‌ర్శ‌కుడు. ఒక ప‌క్క స్వాతంత్ర్య స్ఫూర్తిని ర‌గిలిస్తూనే...  మ‌రోప‌క్క చిరంజీవి ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టుగా కుటుంబ అనుబంధాలు, క‌ద‌న‌రంగంలో ఎత్తులు పైఎత్తుల రూపంలో మాస్ ఎలిమెంట్స్‌ని జోడించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు.  అభిమానుల కోస‌మ‌ని, చిరు ఇమేజ్ కోస‌మ‌ని ప్ర‌త్యేకంగా ఏమీ చేయ‌కుండా... క‌థ‌లో నుంచే అన్ని అంశాల్ని రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేయ‌డం సినిమాకి క‌లిసొచ్చిన‌ట్టైంది. ద్వితీయార్థంలో యుద్ధ స‌న్నివేశాలే కీల‌కం. కానీ వేలాది మందితో యుద్ధ స‌న్నివేశాలు,  ప‌తాక స‌న్నివేశాల్లో హీరోయిజంవంటి అంశాలు సినిమా ప‌ర‌మైన స్వేచ్ఛ‌ని మ‌రీ ఎక్కువ‌గా వాడుకొన్నట్టు అనిపిస్తుంది.  చిరంజీవి - త‌మ‌న్నా, న‌య‌న‌తార - త‌మ‌న్నాల మ‌ధ్య స‌న్నివేశాలు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. స్వాతంత్ర్యోద్య‌మ వ్యాప్తి కోసం పాటుప‌డే న‌ర్తకి పాత్ర‌లో త‌మ‌న్నా క‌నిపించిన తీరు, ఆమె పాత్ర ముగింపు క‌దిలించేలా ఉంటాయి. తెలిసిన క‌థ కావ‌డంతో.. క‌థ‌నం ప‌రంగా  చాలా జాగ్ర‌త్త‌లే తీసుకొన్నారు. భావోద్వేగాల ప‌రంగా మ‌రిన్ని క‌స‌ర‌త్తులు అవ‌స‌ర‌మేమో అనిపిస్తుంది.న‌టీన‌టులు... సాంకేతిక‌త‌
చిరంజీవి ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పాత్ర‌లో ఒదిగిపోయే ప్ర‌య‌త్నం చేశాడు. పోరాట ఘ‌ట్టాల్లోనూ, సంభాష‌ణ‌లు ప‌ల‌క‌డంలోనూ ఆయ‌న అనుభ‌వం చాలా బాగా ప‌నికొచ్చింది. కానీ ఆహార్యం విష‌యంలోనే మ‌రికొన్నిజాగ్ర‌త్తలు తీసుకొనుంటే బాగుండేదనిపిస్తుంది. కానీ ఆ పాత్ర‌పై ఎన‌లేని ప్రేమ‌ని పెంచుకున్న చిరంజీవి ఆద్యంతం ఆత్మవిశ్వాసంతో క‌నిపించ‌డం సినిమాకి క‌లిసొచ్చింది. గురువు గోసాయి వెంక‌న్న పాత్ర‌లో అమితాబ్ హుందాగా క‌నిపించారు. సుదీప్‌, జ‌గ‌ప‌తిబాబు, విజ‌య్ సేతుప‌తి, ర‌వికిష‌న్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు చాలా బాగా న‌టించారు. న‌య‌న‌తార‌, త‌మ‌న్నా పాత్ర‌లు కుటుంబ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తాయి. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది.  ప్ర‌ధానంగా నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయిని పెంచేశాయి. రామ్‌చ‌ర‌ణ్ చెప్పిన‌ట్టుగానే ఈ సినిమా బ‌డ్జెట్ ప‌రంగా ప‌రిమితులు పెట్టుకోకుండా తీశార‌నిపిస్తుంది. ర‌త్న‌వేలు కెమెరా ప‌నిత‌నం, పోరాట ఘ‌ట్టాలు, విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఆక‌ట్టుకుంటాయి. సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు మెప్పిస్తాయి. రాజీవ‌న్ క‌ళా ప్ర‌తిభ అడుగ‌డుగునా క‌నిపిస్తుంది. మాస్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే తీసిన ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి తొలిసారి చారిత్రాత్మ‌క చిత్రాన్ని తీసినా ఆయ‌న ఎంతో ప‌రిణ‌తిని ప్ర‌ద‌ర్శించాడు. ఎక్క‌డా త‌డ‌బాటు లేకుండా ఆయ‌న క‌థ‌ని అనుకొన్న‌ట్టుగా తెర‌పైకి తీసుకొచ్చాడు.


 చివ‌రిగా...
కొన్ని క‌ల్పితాల‌తో చెప్పిన రేనాటి సూర్యుడి చ‌రిత్ర ఈ సినిమా. తెలిసిన క‌థే అయిన‌ప్ప‌టికీ... ఆద్యంతం వినోదాన్ని పంచి ఒక మంచి అనుభూతికి గురిచేస్తుంది `సైరా న‌ర‌సింహారెడ్డి`. స్వాతంత్రం, న‌ర‌సింహారెడ్డి వీర‌త్వం, రాయ‌ల‌సీమ పౌరుషం... త‌దిత‌ర అంశాల‌తో కూడిన క‌థ అందుబాటులో ఉన్నప్పుడు  ప్రేక్ష‌కుడిలో మ‌రిన్ని భావోద్వేగాలు రేకెత్తించాలి. కానీ ఇక్క‌డ సాంకేతిక హంగుల స్థాయిలో క‌థ‌, క‌థ‌నాల‌పై దృష్టి పెట్ట‌లేక‌పోవ‌డంతో ప్రేక్ష‌కుల్లోఆశించినంతగా భావోద్వేగాల్ని రేకెత్తించ‌లేక‌పోయారు.  
                   


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.