రివ్యూ: తిప్ప‌రామీసం
న‌టీన‌టులు: శ్రీ విష్ణు, నిక్కీ తంబోలీ, రోహిణి, బెన‌ర్జీ, శ్రీకాంత్ అయ్య‌ర్ త‌దిత‌రులు
సాంకేతిక బృందం:
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఛాయాగ్ర‌హ‌ణం: సిధ్
కూర్పు: ధర్మేంద్ర కాకరాల
క‌ళ‌: షర్మిల యెలిశెట్టి
పాట‌లు: పూర్ణాచారి, అల రాజా
నిర్మాత‌: రిజ్వాన్‌
దర్శకుడు: కృష్ణ విజయ్ L,
బ్యానర్స్: రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్, కృష్ణ విజయ్ L ప్రొడక్షన్స్, శ్రీ ఓం సినిమా
విడుద‌ల‌: 8 నవంబ‌రు 2019


విభిన్న‌మైన క‌థ‌ల‌కి కేరాఫ్ శ్రీవిష్ణు. ఆయ‌నది మొద‌ట్నుంచీ అదే దారి. ఇటీవ‌ల `బ్రోచేవారెవరురా`తో విజ‌యాన్ని అందుకున్న శ్రీవిష్ణు త‌న సినిమాల్ని మ‌రింత మందికి చేరువ చేసే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. అందుకే మాస్ అంశాల‌తో కూడిన క‌థ‌ల్ని ఎంపిక చేసుకుంటున్నారు. అందులో భాగంగా చేసిన చిత్ర‌మే `తిప్ప‌రామీసం`. మ‌రి ఈ చిత్రం ఆయ‌న‌కి విజ‌యాల ప‌రంప‌ర‌ని కొన‌సాగించిందో లేదో తెలుసుకునే ముందు క‌థేంటో చూద్దాం...

క‌థ
మ‌ణిశంక‌ర్ (శ్రీవిష్ణు) ఒక డీజే. రాత్రిళ్ల‌పూట క్ల‌బ్‌లో ప‌నిచేస్తుంటాడు. మ‌ద్యం, మ‌త్తుమందు, జూదం... ఇలా ఎన్నో దుర‌ల‌వాట్ల‌కి లోన‌వుతాడు. చిన్న‌ప్ప‌ట్నుంచే త‌న త‌ల్లికి దూరంగా గ‌డుపుతుంటాడు. డ‌బ్బు అవ‌స‌ర‌మైతే మాత్రం ఇంటికి వెళుతుంటాడు. జూదం వ‌ల్ల రూ: 30 ల‌క్ష‌లు అప్పు ప‌డ‌తాడు. దాంతో త‌ల్లి ద‌గ్గ‌రికి వెళ‌తాడు. త‌న ద‌గ్గ‌ర అంత లేవ‌ని ఆమె రూ: 5 ల‌క్ష‌లే ఇస్తుంది. త‌ల్లి ఇచ్చిన చెక్‌ని ఫోర్జ‌రీ చేసి, బౌన్స్ కేసు వేస్తాడు. క‌న్న‌త‌ల్లినే కోర్టుకి లాగిన మ‌ణిశంక‌ర్‌లో ఎప్పుడు మార్పు వ‌చ్చింది? త‌న కొడుకుని ప్ర‌యోజ‌కుడిగా చూడాల‌నుకొన్న త‌ల్లి కోరిక ఎప్పుడు ఎలా నెర‌వేరింది? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేష‌ణ‌
యువ‌త‌రం ద‌ర్శ‌కుల సినిమాల్లో క‌థ కంటే కూడా క‌థ‌నమే కీల‌కం. ఇందులో కూడా క‌థ చిన్న‌దే. కానీ అందులో ఒక ఆర్ధ్ర‌త క‌నిపిస్తుంది. త‌ల్లికొడుకుల బంధం నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో స‌రైన రీతిలో భావోద్వేగాలు పండుంటే ఫ‌లితం మ‌రో ర‌కంగా ఉండేది. క‌థ ప‌రంగా ఆక‌ట్టుకునేది. కానీ భావోద్వేగాలు పండ‌క... క‌థ‌, స‌న్నివేశాలతో ఆస‌క్తిని రేకెత్తించ‌లేక క‌థ‌నం నీరుగారిపోయాయి. దాంతో సినిమా ఏ ద‌శ‌లోనూ ఆక‌ట్టుకోదు. ద‌ర్శ‌కుడు కేవ‌లం హీరో పాత్ర‌పైనే దృష్టిపెట్టాడు. అత‌న్నిఎంత మాస్‌గా చూపిస్తే అంత, ఎంత ర‌ఫ్‌గా చూపిస్తే అంతగా ప్రేక్ష‌కుల‌కు చేరువ‌వువుతంద‌ని న‌మ్మిన‌ట్టున్నాడు. కానీ అవ‌న్నీ కూడా క‌థ బ‌లంగా ఉంటేనే అతుకుతాయ‌ని గుర్తించన‌ట్టున్నారు. దాంతో ప్ర‌థ‌మార్థంతా కూడా హీరో పాత్ర చేసే విన్యాసాల‌తోనే సాగుతుంది. అత‌ని డీజే జీవితం, అత‌ను అల‌వాట్లు, జూదాలు... వీటిపైనే స‌న్నివేశాలు సాగుతుంటాయి. డ‌బ్బు కావ‌ల్సి వ‌చ్చిన‌ప్పుడు ఇంటికెళ్లి త‌ల్లిని ఇబ్బందిపెడుతుంటాడు. ఇది త‌ప్ప మ‌రో స‌న్నివేశం ఉండ‌దు. దాంతో క‌థ ఎంత‌కీ క‌ద‌ల‌దు. ఇక విరామ స‌న్నివేశాల‌కి ముందు వ‌చ్చే ఎపిసోడ్‌లో అయితే క‌థానాయ‌కుడు దుస్తులు విప్పేసుకొని రోడ్ల‌పై ప‌రిగెడుతుంటాడు. ద్వితీయార్థంలోనైనా క‌థ చెప్పాడా అంటే అది కూడా లేదు. ఒక హ‌త్య కేసుని హీరో మెడ‌కి చుట్టూ క‌థ‌నం వండే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ అది ఏమంత అత‌క‌లేదు. ప‌తాక స‌న్నివేశాల్లో ప్రేక్ష‌కుల్ని థ్రిల్ చేయాల‌నుకొన్నాడేమో అక్క‌డ ఒక మ‌లుపుని తీసుకొచ్చి క‌థ‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే అప్ప‌టికే సినిమాకి జ‌ర‌గాల్సిన న‌ష్ట‌మంతా జ‌రిగిపోయింది.


న‌టీన‌టులు.. సాంకేతిక‌త‌
శ్రీవిష్ణు న‌ట‌న బాగుంది. వ్య‌తిరేక ఛాయ‌ల‌తో కూడిన పాత్ర‌లో ఆయ‌న సంద‌డి చేస్తారు. కానీ ఆ పాత్ర తీర్చిదిద్దిన విధానంలోనే చాలా లోపాలు క‌నిపిస్తాయి. శ్రీవిష్ణు త‌ల్లి పాత్ర‌లో రోహిణి చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. క‌థానాయిక నిక్కీ తంబోలీ చిన్న పాత్ర‌లో క‌నిపిస్తుందంతే. బెన‌ర్జీ, శ్రీకాంత్ అయ్య‌ర్ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా ప‌ర్వాలేద‌నిపిస్తుంది. సురేష్ బొబ్బిలి సంగీతం బాగుంది. సిధ్ కెమెరా రాత్రివేళ్ల‌ల్లో సాగే స‌న్నివేశాల్ని చ‌క్క‌గా కేప్చ‌ర్ చేసింది. సినిమాలో వేగం త‌గ్గింది. ద‌ర్శ‌కుడు కృష్ణ‌విజ‌య్ ప‌నిత‌నం తేలిపోయింది. ఆయ‌న పాత్ర‌ల్ని డిజైన్ చేసుకున్న విధానం కూడా ఏమంత మెప్పించ‌దు.


చివ‌రిగా...:
సినిమాకి కొత్త‌గా ఏం జోడించాల‌నుకొన్నా అవి క‌థ‌, క‌థ‌నాల‌తో పాటుగా ఉండాలి. అంతే కానీ... వాటిని ప‌క్క‌న‌పెడతామంటే ఫ‌లితాలు తారుమారువుతాయి. ఆ విష‌యాన్ని మ‌రోమారు నిరూపించే చిత్ర‌మిది. `బ్రోచేవారెవ‌రురా`తో త‌న ఎంపిక‌పై మ‌రిన్ని అంచ‌నాలు పెంచారు. ఆ అంచ‌నాల్ని ఏమాత్రం అందుకోలేక‌పోయింది `తిప్ప‌రామీసం`.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.