రివ్యూ: యు ట‌ర్న్‌
చిత్రం: యుటర్న్‌
నటీనటులు: సమంత, భూమిక, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్‌, న‌రేన్ త‌దిత‌రులు
సంగీతం: పూర్ణచంద్ర
ఛాయాగ్ర‌హ‌ణం: నికెత్ బొమ్మి రెడ్డి
కూర్పు: సురేష్ ఆరుముగమ్
నిర్మాతలు: శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు
దర్శకత్వం: పవన్ కుమార్
విడుద‌ల‌: 13-09-2018

ఈ యేడాది ఇప్ప‌టికే ‘రంగ‌స్థ‌లం’, ‘మ‌హాన‌టి’, ‘అభిమ‌న్యుడు’ చిత్రాల‌తో విజ‌యాల్ని సొంతం చేసుకొని త‌న జోరును కొన‌సాగిస్తోంది స‌మంత‌. విజ‌యాలు అందుకోవ‌డం ఒకెత్తైతే, వాటిలో స‌మంత అభిన‌యం మ‌రో ఎత్తు. పెళ్లి త‌ర్వాత మ‌రింత బ‌ల‌మైన పాత్ర‌ల్ని ఎంచుకొంటూ అభిన‌యం ప‌రంగా కూడా త‌న ప్ర‌తిభ‌ని చాటి చెబుతోంది. ఇటీవ‌ల మ‌రో అడుగు ముందుకేసి క‌థానాయిక ప్రాధాన్య‌మున్న క‌థ‌లో న‌టించింది. అదే... ‘యు ట‌ర్న్’. క‌న్న‌డ‌లో విజ‌య‌వంత‌మైన ఈ చిత్రం స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ధారిగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రీమేక్ అయ్యింది. ఎంతో ఇష్టప‌డి ఈ చిత్రం చేశారు స‌మంత. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? క‌థానాయిక ప్రాధాన్యంతో కూడిన ఈ చిత్రంపై స‌మంత త‌న న‌ట‌న‌తో ఎలాంటి ముద్ర వేసింది?


క‌థేంటంటే:

రచన (స‌మంత) వృత్తిరీత్యా ఓ పాత్రికేయురాలు. శిక్ష‌ణ‌లో భాగంగా ఒక సంస్థలో ప్ర‌యాణం మొద‌లుపెడుతుంది. అక్క‌డే ఉద్యోగం సాధించ‌డం కోసం ఆస‌క్తిక‌ర‌మైన ఓ మాన‌వీయ క‌థనాన్ని రాయాల‌ని నిర్ణ‌యిస్తుంది. అందుకోసం ఆర్కే పురం ఫ్లై ఓవ‌ర్ యూ ట‌ర్న్ తీసుకొనే వాహ‌న‌దారుల్ని ఎంచుకుంటుంది. వాళ్ల వాహ‌నాల నంబ‌ర్ల ఆధారంగా చిరునామా, ఫోన్ నెంబ‌ర్లు తెలుసుకొనే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. అందులో సుంద‌రం నెంబ‌రు చిరునామా ఒక‌టి. అత‌న్ని ఇంటర్వ్యూ చేయ‌డం కోస‌మ‌ని ఇంటికి వెళుతుంది? తీరా ర‌చ‌న ఆయ‌న ఇంటికి వెళ్లేస‌రికి సుంద‌రం నిర్జీవంగా క‌నిపిస్తాడు. దాంతో పోలీసులు ర‌చ‌ననే అనుమానిస్తూ విచార‌ణ‌కి పిలుస్తారు. ఆ క్ర‌మంలో ఒక డైరీ దొరుకుతుంది పోలీసులకి. సుంద‌రం మాత్ర‌మే కాకుండా... ఆ ఫ్లై ఓవ‌ర్‌పై యూట‌ర్న్ తీసుకున్న‌వాళ్లంతా ప్రాణాలు కోల్పోతారు. అస‌లు వాళ్లు చ‌నిపోవాడానికీ, ర‌చ‌న‌కీ సంబంధం ఏమైనా ఉందా? సుంద‌రం మ‌ర‌ణం విష‌యంలో ర‌చ‌న‌ని విచారించిన పోలీసుల‌కి ఎలాంటి విష‌యాలు తెలిశాయి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
                                                  

ఎలా ఉందంటే:

తెలుగు తెర‌కు థ్రిల్ల‌ర్ క‌థ‌లు కొత్తేమీ కాదు. కానీ, వాట‌న్నింటినీ భిన్నంగా, ఓ కొత్త కోణాన్ని ఆవిష్క‌రిస్తూ సాగే చిత్ర‌మిది. సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. ఓ చిన్న అంశాన్ని ఆధారంగా చేసుకొని ద‌ర్శ‌కుడు చిత్రాన్ని మ‌లిచిన విధానం, క‌థ‌లో భాగంగానే సందేశాన్ని చెప్పిన వైనం ఆక‌ట్టుకుంటుంది. సినిమా ఆరంభం న‌త్త న‌డ‌క‌గా అనిపించినా... క‌థ‌లోకి వెళ్లేకొద్దీ సినిమా ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ఎప్పుడూ క‌థానాయ‌కుల‌తో క‌లిసి న‌టించిన స‌మంత.. ఈ సినిమాకి మాత్రం అన్నీ తానే అన్న విష‌యాన్ని గుర్తు పెట్టుకొని అందుకు త‌గ్గ‌ట్టుగానే పాత్ర‌లో ఒదిగిపోయారు.


యు ట‌ర్న్ చుట్టూ ఆమె చేసే ప‌రిశోధ‌న‌, తాను సేక‌రించిన చిరునామాలోని వ్య‌క్తులే ఎందుకు చ‌నిపోతున్నారో తెలియ‌క తిక‌మ‌క పడుతూ క‌థలో ఆస‌క్తిని రేకెత్తించిన విధానం... వాళ్లంతా ఎందుకు చ‌నిపోయారో తెలిశాక‌, మిగిలిన ‌వాళ్ల‌ని ర‌క్షించేందుకు చేసే ప్ర‌య‌త్నం... ఇలా అన్నీ కూడా ఆక‌ట్టుకుంటాయి. ఎక్క‌డ హాస్యం పండించాలో ఎక్క‌డ ఉత్కంఠ రేకెత్తించాలనే విష‌యంలో ద‌ర్శ‌కుడు తెలివిగా వ్య‌వ‌హ‌రించాడు. చివ‌రి అర‌గంట సినిమాకి కీల‌కం. ముఖ్యంగా ప‌తాక స‌న్నివేశాల‌కి ముందు భూమిక పాత్ర‌, ఆమె అభిన‌యం, సందేశం ఆక‌ట్టుకుంటుంది. అయితే ఎంతో వాస్తవిక‌త‌తో సాగే ఈ త‌ర‌హా సినిమాలో క‌ల్పితాల్ని జోడిస్తున్న‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. క‌ల్పిత‌మైన విష‌యాలు కూడా న‌మ్మ‌ద‌గిన‌ట్టుగా ఉండాలి. ఆ విష‌యంలో ద‌ర్శ‌కుడు చాలా జాగ్ర‌త్త‌లే తీసుకున్న‌ప్ప‌టికీ కొన్ని విష‌యాలు న‌మ్మ‌లేని విధంగా అనిపిస్తాయి. అలాగే కొన్ని స‌న్నివేశాలు ప్రేక్షకుడి ఊహ‌కు అందేలా సాగుతాయి.

ఎవ‌రెలా చేశారంటే:

స‌మంత అభిన‌యం ఈ చిత్రానికి ప్ర‌ధాన బ‌లం. క‌థ‌నంతా త‌న భుజాల‌పైనే మోసింది. అన్ని ర‌కాల భావోద్వేగాల్ని ప్ర‌ద‌ర్శించింది. ఆమె న‌ట‌న‌లో ప‌రిణ‌తికి అద్దం ప‌ట్టే విష‌య‌మిది. అయితే డ‌బ్బింగ్ ప‌రంగా ఆమె మ‌రికాస్త శ్ర‌ద్ధ పెట్టాల్సింది. ఆది పినిశెట్టి పోలీసాఫీస‌ర్ నాయ‌క్‌గా చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌దర్శించాడు. ఆయ‌న హావ‌భావాలు, పాత్ర‌లో ఒదిగిపోయిన విధానం ఆక‌ట్టుకుంటుంది. రాహుల్ ర‌వీంద్ర‌న్ స‌మంత‌కి స్నేహితుడిగా, ఓ క్రైమ్ రిపోర్ట‌ర్‌గా క‌నిపిస్తాడు. భూమిక పాత్ర హృద‌యాల్ని హ‌త్తుకుంటుంది.

సాంకేతికంగా..

సినిమా ఉన్న‌తంగా ఉంది. ద‌ర్శ‌కుడు ప‌వ‌న్‌కుమార్ క‌థ‌ని న‌డిపిన విధానం ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా ఆయ‌న‌కి ఇలాంటి క‌థనాలోచ‌న రావ‌డ‌మే గొప్ప విష‌యం. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి ఏమాత్రం త‌గ్గ‌లేదు. పూర్ణ‌చంద్ర తేజ‌స్వి సంగీతం, నికేత్ బొమ్మిరెడ్డి కెమెరా నైపుణ్యం క‌థలో ఫీల్‌ని మ‌రింత ఎఫెక్టివ్‌గా పండించేందుకు దోహ‌దం చేశాయి.

బ‌లాలు
+ స‌మంత అభిన‌యం
+ క‌థ, క‌థ‌నం
+ సందేశం
+ సాంకేతిక‌త‌

బ‌ల‌హీన‌త‌లు
- అక్క‌డ‌క్క‌డా వేగం త‌గ్గ‌డం
- ప్రేక్ష‌కుడి ఊహకు అందే క‌థ‌నం

చివ‌రిగా..: ‘యు ట‌ర్న్‌’లో థ్రిల్ ఉంది, సందేశం ఉంది!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.