రివ్యూ: డియ‌ర్ కామ్రేడ్‌
న‌టీన‌టులు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌నా, రావు ర‌మేష్‌, శ్రుతి రామ‌చంద్రన్‌, జ‌య‌ప్రకాష్‌, బ్రహ్మాజీ, సుక‌న్య‌, ర‌ఘుబాబు, అనీష్ కురువిల్లా త‌దిత‌రులు
సంగీతం: జ‌స్టిన్ ప్రభాక‌ర‌న్‌
ఛాయాగ్రహ‌ణం: సుజిత్ సారంగ్
కూర్పు: శ్రీజిత్ సారంగ్‌
క‌ళ‌: రామాంజ‌నేయులు
సాహిత్యం: చైత‌న్య ప్రసాద్‌, రెహ‌మాన్‌, కృష్ణకాంత్‌
సంస్థ‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్‌
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని
క‌థ‌, స్క్రీన్‌ప్లే, దర్శక‌త్వం: భ‌ర‌త్ కమ్మ
విడుద‌ల‌: 26 -07- 2019


విజ‌య్ దేవ‌ర‌కొండకి `అర్జున్‌రెడ్డి`తో పొరుగు భాష‌ల్లోనూ మంచి గుర్తింపొచ్చింది. దాంతో ఆయ‌న మార్కెట్‌ని మ‌రింత విస్తృతం చేసుకొనే ప‌నిలో ఉన్నారు.  అందులో భాగంగానే `డియ‌ర్ కామ్రేడ్‌` చిత్రాన్ని నాలుగు భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. `గీత గోవిందం` త‌ర్వాత  విజ‌య్ దేవ‌ర‌కొండ - ర‌ష్మిక క‌లిసి న‌టించిన చిత్ర‌మిది.  కొబ్బ‌రికాయ కొట్టిన‌ప్ప‌ట్నుంచే ఈ సినిమా గురించి చ‌ర్చ మొద‌లైంది. ప్ర‌చార చిత్రాలు కూడా ఆక‌ట్టుకోవ‌డంతో అంచ‌నాలు పెరిగాయి. మ‌రి అందుకు త‌గ్గ‌ట్టుగా సినిమా ఉందా?  కామ్రేడ్‌గా విజ‌య్  ఏ మేర‌కు మెప్పించాడు?  తెలుసుకుందాం ప‌దండి..


* క‌థేంటంటే..
చైత‌న్య అలియాస్ బాబీ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) విప్ల‌వ భావాలున్న యువ‌కుడు. ఆవేశం ఎక్కువ‌. త‌న తాత‌లాగా ఎవ‌రికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా పోరాటం చేయ‌డానికి రంగంలోకి దిగుతుంటాడు. హైద‌రాబాద్ నుంచి ప‌క్కింటికి వ‌చ్చిన అప‌ర్ణాదేవి అలియాస్ లిల్లీ (ర‌ష్మిక మంద‌న్న‌)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఇద్ద‌రు దారులు వేరని చెప్పిన లిల్లీ ఆ త‌ర్వాత ఆమె కూడా బాబీ ప్రేమ‌లో ప‌డుతుంది.  క్రికెట‌ర్ అయిన లిల్లీ జాతీయ జ‌ట్టులో చోటు సంపాదించ‌డ‌మే ల‌క్ష్యంగా ఆడుతుంటుంది. ఇంత‌లో బాబీ ఆవేశం వ‌ల్ల ఇద్ద‌రూ విడిపోతారు. ఆ ప్రేమ బాధ‌లోనే మూడేళ్లు ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. తిరిగి వ‌చ్చాక లిల్లీ ఆస్ప‌త్రిలో ఉన్న‌ట్టు తెలుస్తుంది. మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న లిల్లీకి బాబీ అండ‌గా నిలుస్తాడు. దాంతో ఆమె కోలుకుంటుంది. కానీ క్రికెట్‌ని వదిలేస్తుంది. లిల్లీ క్రికెట్‌కి దూరం కావ‌డం ఇష్టం లేని బాబీ కార‌ణాల్ని అన్వేషిస్తాడు. అప్పుడు అస‌లు విష‌యం తెలుస్తుంది. ఇంత‌కీ లిల్లీ క్రికెట్‌ని ఎందుకు వ‌ద‌లుకోవాల‌నుకుంది? ఆమెకి బాబీ పోరాటం ఎలా నేర్పించాడు? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.


*ఎలా ఉందంటే..
క‌థ కంటే కూడా క‌థ‌నమే కీల‌కంగా భావిస్తున్న త‌రుణ‌మిది. న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు ఆ విష‌యంలో  మ‌రో అడుగు ముందున్నారు. ఒక మామూలు క‌థ‌ని కూడా దానికి స్క్రీన్‌ప్లే హంగులు జోడించ‌డం, కొత్తగా గ‌మ్మ‌త్తుగా చెబుతుంటారు. ప్రేక్ష‌కుడికీ అదే ఇష్టం.  భ‌ర‌త్ క‌మ్మ కూడా కొత్త ద‌ర్శ‌కుడు కావ‌డం, విజ‌య్ దేవ‌ర‌కొండ అభిరుచి కూడా ప్ర‌త్యేకంగా ఉంటుంది కాబ‌ట్టి `డియ‌ర్ కామ్రేడ్‌` నుంచి అదే ఆశించారు ప్రేక్ష‌కులు. కానీ ద‌ర్శ‌కుడు క‌థ‌పైన దృష్టిపెట్టాడు కానీ, క‌థ‌నం గురించి ప‌ట్టించుకోలేదు. దాంతో సినిమాలో ఆస‌క్తి కొర‌వ‌డింది.  క‌థ‌, పాత్ర‌లు, సందేశం..  ఇలా న‌చ్చుతాయి కానీ, స‌న్నివేశాల‌న్నీ చ‌ప్ప‌గా సాగుతుంటాయి.  ఇష్ట‌మైన‌దానికోసం ఎంతైనా పోరాటం చేయాల‌ని భావించే ఓ యువ‌కుడు... అలాంటి గొడ‌వ‌లేమీ లేకుండా జీవితాన్ని గ‌డపాల‌నుకొనే సున్నిత మ‌న‌స్కురాలైన ఒక అమ్మాయి మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థ ఇది.  భిన్న దారుల్లో వెళుతున్న ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డితే ఎలా ఉంటుంది?  ఆ ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు దూర‌మ‌య్యాక సంఘ‌ర్ష‌ణ ఎలా ఉంటుందనేది తొలి స‌గ‌భాగంలో చూపించారు.  ద్వితీయార్థంలో ఓ సామాజిక స‌మ‌స్య‌ని ప్ర‌స్తావించారు. అది వ‌ర్త‌మాన స‌మాజాన్ని ప్ర‌తిబింబించే స‌మ‌స్య‌. దాన్ని ఈ ప్రేమ‌క‌థ‌కి ముడిపెట్టిన తీరు ఆక‌ట్టుకుంటుంది.  స‌మ‌స్యంతా క‌థ‌నం ద‌గ్గ‌రే వ‌చ్చింది. క‌థ ఎలా మొద‌లైందో, ఎలా ముగుస్తుందో ప్రేక్ష‌కుడు ముందే అంచ‌నాకి వ‌స్తే ఇక అందులో కిక్కేం ఉంటుంది? ఈ సినిమా చూస్తున్నంత‌సేపూ ప్రేక్ష‌కుడు త‌ర్వాత ఏం జ‌రుగుతుందో ముందే ఓ అంచ‌నాకొస్తుంటాడు. దాంతో స‌న్నివేశాల్లో ఆస‌క్తి కొర‌వ‌డి.. సాగ‌దీత వ్య‌వ‌హారంలా మారిపోయింది. ప‌తాక స‌న్నివేశాల్ని తీర్చిదిద్దిన విధానం మాత్రం మెప్పిస్తుంది. 


* ఎవ‌రెలా చేశారంటే..
విజ‌య్ దేవ‌ర‌కొండ బాబీ పాత్ర‌లో మంచి అభిన‌యం ప్ర‌ద‌ర్శించాడు. విద్యార్థి నాయ‌కుడిగా, ప్రేమికుడిగా ఆయ‌న పండించిన భావోద్వేగాలు ఆక‌ట్టుకుంటాయి. అయితే బాబీ పాత్ర‌పై అర్జున్‌రెడ్డి ప్ర‌భావం చాలానే క‌నిపిస్తుంది. దాదాపు స‌న్నివేశాల్లో  సిగ‌రెట్టు కాలుస్తూ క‌నిపించ‌డం, అవ‌స‌రం లేని చోట కూడా చొక్కా విప్ప‌డం అర్జున్‌రెడ్డి పాత్ర‌ని గుర్తు చేయ‌డ‌మే. లిల్లీగా ర‌ష్మిక అభిన‌యం ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌థ‌మార్థం వ‌ర‌కు ప‌క్కింటి అమ్మాయిలా సంద‌డి చేసింది. ద్వితీయార్థంలోనే ఆమె న‌ట‌న‌కి ప‌రీక్ష ఎదురైంది.  భావోద్వేగాలు పండించ‌డంలోనూ, స‌హ‌జంగా క‌నిపించ‌డంలోనూ ఆమె చ‌క్క‌టి ప్ర‌తిభ ప్ర‌ద‌ర్శించింది. విజ‌య్‌, ర‌ష్మిక‌ల మ‌ధ్య కెమిస్ట్రీ మ‌రోసారి హైలెట్‌గా నిలిచింది. ర‌ష్మిక‌కి అక్క‌గా శ్రుతి రామ‌చంద్ర‌న్ న‌టించింది. ఆమె అందంతో  ఆక‌ట్టుకుంది. సంజ‌య్ స్వ‌రూప్‌, శ్రీకాంత్ అయ్య‌ర్‌, ఆనంద్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. సంగీతం, ఛాయాగ్ర‌హ‌ణం, నిర్మాణ విలువ‌లు సినిమాకి మ‌రింత బ‌లాన్నిచ్చాయి.  కొత్త ద‌ర్శకుడు భ‌రత్ క‌మ్మ ఎంచుకొన్న క‌థాంశంలోనూ, ఆయ‌న ఆలోచ‌న‌ల్లోనూ న‌వ్య‌త ఉన్న‌ప్ప‌టికీ...  అంద‌రికీ సంతృప్తినిచ్చేలా క‌థ‌ని   చెప్ప‌డంలో విజ‌య‌వంతం కాలేక‌పోయారు. బ‌లాలు 

+ క‌థా నేప‌థ్యం
+ విజ‌య్‌, ర‌ష్మిక‌ల న‌ట‌న‌
+ సంగీతం, ఛాయాగ్రహ‌ణం

బ‌ల‌హీన‌త‌లు
- క‌థ‌నం
- అక్కడక్కడా సాగ‌దీత‌గా సాగే స‌న్నివేశాలు

చివ‌రిగా: ఏం చెప్పామ‌న్న‌ది కాదు, ఎలా చెప్పామ‌న్న‌దే ముఖ్యమ‌ని సినీ పండితులు చెబుతుంటారు.  ఈ సినిమాలో చాలా చెప్పారు కానీ, చెప్పిన విధాన‌మే కుద‌ర‌లేదు. ఇందులో సందేశం మాత్రం అంద‌రికీ న‌చ్చుతుంది. విజయ్, ర‌ష్మిక‌ల అభిన‌యం, పాట‌లు, సందేశం కోసమైతే ఈ సినిమాని చూడొచ్చు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.