రివ్యూ: విశ్వాసం
చిత్రం: విశ్వాసం
నటీనటులు : అజిత్ కుమార్, నయనతార, జగపతిబాబు, అనిక తదితరులు
సంగీతం: డి.ఇమ్మాన్‌
సినిమాటోగ్రఫీ: వెట్రి
ఎడిటింగ్‌: రుబెన్‌
నిర్మాత: టీజీ త్యాగరాజన్‌, సెంథిల్ త్యాగరాజన్
దర్శకత్వం : శివ
బ్యానర్‌: సత్య జ్యోతి ఫిల్మ్స్‌
విడుదల: 01-03-2019


తమిళంతోపాటు, తెలుగులోనూ గుర్తింపు ఉన్న కథానాయకుడు అజిత్‌. అడపాదడపా ఆయన చిత్రాలు తెలుగులో విడుదలవుతూనే ఉన్నాయి. శివ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘విశ్వాసం’. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరమ్‌’, ‘వేదాళం’, ‘వివేగం’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తమిళంలో ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘విశ్వాసం’ మంచి టాక్‌ను అందుకుంది. ఇప్పుడు అదే పేరుతో తెలుగులో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? అజిత్‌-శివ మరోసారి మెప్పించారా?

* కథేంటంటే..
రావులపాలెం దాని చుట్టు పక్కల గ్రామాల్లో వీర్రాజు (అజిత్)ను అందరూ గౌరవిస్తారు. దాదాపు పదేళ్ల తర్వాత ఆ ఊరిలో జాతర చేయడానికి ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే వీర్రాజును వ్యతిరేకించే కొందరు ఈ జాతర చేయడానికి ఒప్పుకోరు. అయినా పట్టుబట్టి వీర్రాజు జాతర చేయిస్తాడు. ఊరి జనాలంతా ఆ జాతరలో తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతుంటుంటే వీర్రాజు మాత్రం తన భార్య నిరంజన (నయనతార) తన దగ్గర లేదని బాధపడుతుంటాడు. అది గమనించిన అతని బంధువులు ముంబయిలో ఉన్న భార్య నిరంజన, కూతురు శ్వేతలను ఊరికి తీసుకొస్తారు. ఆ తర్వాత వీర్రాజు కూతురిని గుర్తు తెలియని వ్యక్తులు చంపటానికి ప్రయత్నిస్తారు. అసలు వాళ్లు ఎవరు? వీర్రాజు కూతురుని ఎందుకు హత్య చేయాలనుకుంటున్నారు? అసలు వీర్రాజు భార్య అతని వదిలేసి వెళ్లడానికి కారణం ఏంటి?


* ఎలా ఉందంటే.
.
అజిత్‌-శివ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘వీరమ్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది (తెలుగులో పవన్‌కల్యాణ్‌ ‘కాటమరాయుడు’గా వచ్చింది). ఒక రకంగా ఆ చిత్రానికి ‘విశ్వాసం’ కొనసాగింపు అని చెప్పవచ్చు. ఇందులో బలమైన కథ ఏమీ లేదు. అందరికీ తెలిసిన కథే ఇది. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం కథానాయకుడు ఏం చేశాడన్నదే సినిమా ప్రధానాంశం. ఈ విషయం చుట్టూ సన్నివేశాలను అల్లుకుంటూ వెళ్లాడు దర్శకుడు. కేవలం అజిత్‌ అభిమానులు, సాధారణ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని ఆయా సన్నివేశాలను రాసుకున్నాడు. మొదటి నుంచి చివరి వరకూ కథ మొత్తం అజిత్‌ చుట్టూనే తిరుగుతుంది. అజిత్‌ హీరోయిజాన్ని ఎలివేట్‌ చేస్తూ తెరకెక్కించిన సన్నివేశాలు అభిమానులను అలరిస్తాయి. ఆసక్తి కలిగించే మలుపులు, థ్రిల్లింగ్‌ అంశాల జోలికి దర్శకుడు పోలేదు. ఫక్తు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో సినిమాను తీశాడు. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్, అలాగే తండ్రి కూతుళ్ల మధ్య వచ్చే కొన్ని మంచి ఎమోషనల్ సన్నివేశాలు అలరిస్తాయి. అయితే, స్క్రీన్‌ప్లే కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది.


* ఎవరెలా చేశారంటే..
వీర్రాజుగా అజిత్‌ తనదైన నటతో మెప్పించాడు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండే. చుట్టు పక్కల గ్రామాలకు పెద్దగా, తన కుటుంబాన్ని కాపాడుకునే వ్యక్తిగా అజిత్‌ నటన ఆకట్టుకుంటుంది. ఇక ఈ కథ మరో బలం నయనతార, బేబి అనిక. ఆ పాత్రల్లో వీరిద్దరూ ఒదిగిపోయారు. ముఖ్యంగా ఎమోషనల్‌ సన్నివేశాల్లో వీరి నటన మెప్పిస్తుంది. ఇక ప్రతినాయకుడిగా జగపతిబాబు ఎప్పటిలాగే మెప్పించారు. అయితే, ఆయన పాత్రను ఇంకాస్త బలంగా చూపించాల్సింది. తంబి రామయ్య, రోబో శంకర్‌ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. దర్శకుడు శివ తన గత చిత్రాల్లోని సన్నివేశాలనే స్ఫూర్తిగా తీసుకొని కాస్త కొత్తగా చూపిస్తూ, సేఫ్ ‌గేమ్‌ ఆడాడు. అజిత్‌ నుంచి అభిమానులు ఏం ఆశిస్తారో అందుకు తగిన విధంగా సన్నివేశాలను రాసుకున్నాడు. వెట్రి కెమెరా పనితనం బాగుంది. స్వతహాగా కెమెరామెన్‌ అయిన శివ తనకు కావాల్సిన సన్నివేశాలను మరింత అందంగా చూపించగలిగాడు. డి.ఇమ్మాన్‌ నేపథ్య సంగీతం బాగుంది.

బలాలు
+ అజిత్‌
+ మాస్‌ ఎలిమెంట్స్‌
+ తండ్రీ కూతుళ్ల మధ్య ఎమోషనల్‌ సీన్లు

బలహీనతలు
- తెలిసిన కథే కావడం
- అక్కడక్కడా సన్నివేశాల్లో సాగదీత

* చివరిగా..
మాస్‌ను మెప్పించే ‘విశ్వాసం’
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.