రివ్యూ: ఓటర్‌
చిత్రం: ఓటర్‌
నటీనటులు: మంచు విష్ణు, సురభి, సంపత్‌రాజ్‌, పోసాని కృష్ణమురళి, నాజర్‌, ఎల్బీ శ్రీరామ్‌, జయప్రకాష్‌ తదితరులు
సంగీతం: తమన్‌
ఎడిటింగ్‌: కె.ఎల్‌.ప్రవీణ్‌
సినిమాటోగ్రఫీ: రాజేశ్‌యాదవ్‌
నిర్మాత: జాన్‌ సుధీర్‌ పూదోట
రచన, దర్శకత్వం: కార్తీక్‌రెడ్డి
బ్యానర్‌: రామా రీల్స్‌
విడుదల తేదీ: 21-06-2019


ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు ఓటు. అలాంటి ఓటు హక్కు విలువ గురించీ, దానికున్న శక్తి గురించీ ఎంత చెప్పినా తక్కువే. ఓటుని అమ్ముకోవడం మానేసి, నమ్ముకుంటేనే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ప్రజల ఓటుతో గద్దెనెక్కిన ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవకులుగా ఉండాలి. ఓటరే.. ప్రజాస్వామ్యానికి నిజమైన ఓనర్‌. అలాంటి ఓటరు శక్తి గురించి చెప్పే ప్రయత్నం ‘ఓటర్‌’లో కనిపించింది. మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అనేక వివాదాల నడుమ.. విడుదల అవుతుందా? లేదా? అనే సందిగ్థంలో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ‘ఓటర్‌’ ఎలా ఉన్నాడు? అతడు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? ఓటర్‌ విలువ ఎంత బాగా చెప్పింది?

* కథేంటంటే..
గౌతమ్‌ (మంచు విష్ణు) అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. దేశం అంటే ప్రేమ. కేవలం ఓటు వేయడానికి అమెరికా నుంచి ఇండియా వస్తాడు. ఇక్కడ భావన (సురభి)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ‘నేను కూడా నిన్ను ప్రేమించాలంటే ఎమ్మెల్యే (పోసాని కృష్ణమురళీ) చేసిన వాగ్దానాలన్నీ నెర వేరేటట్టు చూడాలి’ అని షరతు విధిస్తుంది. ఆ ఎమ్మెల్యేకు ఓ వీడియో చూపించి బ్లాక్‌ మెయిల్‌ చేసి మరీ ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చేటట్టు చేస్తాడు గౌతమ్‌. అయితే ఓ వ్యవహారంలో ఎంపీ శంకర్‌ ప్రసాద్‌ (సంపత్‌రాజ్‌)కి ఎదురెళ్లాల్సి వస్తుంది. ఓటరు పవరెంతో చూపిస్తానని శంకర్‌ ప్రసాద్‌తో సవాల్‌ విసురుతాడు గౌతమ్‌. మరి శంకర్‌ ప్రసాద్‌తో చేసిన పోరాటంలో గౌతమ్‌ ఎలా విజయం సాధించాడు? అసలు వీరిద్దరికీ మధ్య వచ్చిన సమస్యేంటి? అనేదే ‘ఓటర్‌’ కథ.


* ఎలా ఉందంటే..
ఓటరు విలువ చెప్పాలన్నది దర్శకుడి ప్రయత్నం. తొలి సగంలో ప్రజా ప్రతినిధి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి కథానాయకుడు చేసే అల్లరితో సాగిపోతే, రెండో సగంలో ‘రీకాల్‌’ తెరపైకి వస్తుంది. రెండూ రాజకీయ నేపథ్యం ఉన్న అంశాలే. కాబట్టి దీనిని ఓ పొలిటికల్‌ డ్రామాగా అభివర్ణించొచ్చు. మధ్యలో పాటలు, పోరాటాలు కలగలిపి... కమర్షియల్‌ హంగులు ఇచ్చారు. ఓటు కోసం రాజకీయ నాయకులు ఎన్నికలలో వాగ్దానాలు ఇవ్వడం, ఆ తర్వాత వాటిని అటకెక్కించడం మామూలే. రీకాల్‌ గురించి ఎప్పటి నుంచో చర్చ సాగుతోంది. ప్రేక్షకులకు పరిచయమున్న అంశాలే కథాంశంగా ఎంచుకున్నారు కాబట్టి కథలో లీనమవ్వడానికి పెద్దగా సమయం పట్టదు. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్‌ కూడా మంచిదే. కాకపోతే.. పాయింట్‌లో ఉన్న సీరియెస్‌నెస్‌.. దాన్ని చెప్పడంలో కనిపించలేదు. పోసాని చుట్టూ సాగే సన్నివేశాలు కేవలం కామెడీ కోసం రాసుకున్నవిగా అనిపిస్తాయి. అయితే వాటిలో ఉన్న వినోదం కూడా అంతంత మాత్రమే.

ఇక ద్వితీయార్ధంలో ఎక్కడా లాజిక్‌ ఉండదు. ఒకే పాయింట్‌ పట్టుకుని, తిప్పి తిప్పి అదే చెప్పి, రొటీన్‌ ప్రసంగాలతో సాగిపోతుంది. దేశంలో అవినీతి ఎక్కువైపోయింది, ప్రజాస్వామ్యం అసహాస్యమైపోతోంది, ప్రజలకు బాధ్యత లేకుండా పోతోందంటూ.. ఫేస్‌బుక్‌లో తరచూ కనిపించే కొటేషన్లనే సన్నివేశాలుగా మలిచారు. ఇలాంటి కథలు తెరకెక్కించేటప్పుడు సరైన గ్రౌండ్‌ వర్క్‌ చేయాలి. ఇంకాస్త బలంగా నాటుకుపోయేలా చెప్పగలగాలి. ఆ శక్తి సన్నివేశాలకు సరిపోలేదు.


* ఎవరెలా చేశారంటే..
మంచు విష్ణు ఈ సినిమాతో కొత్తగా చేసింది, నేర్చుకున్నదీ ఏమీ లేదు. మిగిలిన సినిమాలతో పోలిస్తే కొన్ని డైలాగులు ఎక్కువ చెప్పాడేమో అంతే. సురభి పాత్రకు కూడా పెద్దగా పనిలేదు. పోసాని నవ్వించే ప్రయత్నం చేశాడు. ప్రతినాయకుడిగా సంపత్‌ కూడా ఎప్పటిలా రొటీన్‌గా అరచుకుంటూ వెళ్లిపోయాడు. నాజర్‌ లాంటి నటుడికి ఉన్నవి రెండు సీన్లే.

దర్శకుడి ఉద్దేశం మంచిదే. రీకాల్‌ అనే కాన్సెప్ట్‌తో ఇప్పటి వరకూ సినిమా రాలేదు. కాకపోతే.. ప్రేక్షకులు కూడా ‘ఈ పద్ధతేదో బాగుందే’ అనిపించేలా సన్నివేశాలుంటే బాగుండేది. ఉన్న సన్నివేశాల్లో ఆ బలం కనిపించలేదు. దాంతో అవన్నీ తేలిపోయాయి. పాటలు కథా వేగానికి అడ్డుకట్ట వేస్తాయి. సంభాషణల్లో ఫేస్‌బుక్‌ కొటేషన్లు ఎక్కువగా వినిపించాయి.

బలాలు
+ కథా నేపథ్యం

బలహీనతలు
- సన్నివేశాల రూపకల్పన

* చివరిగా..
సరైన సన్నివేశాలకు ‘ఓటు’ వేసి ఉంటే ‘ఓటర్‌’ గెలిచేవాడుCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.