రివ్యూ: వేర్ ఈజ్ ద వెంక‌ట‌ల‌క్ష్మి
న‌టీన‌టులు: ల‌క్ష్మీరాయ్‌, రామ్‌కార్తీక్‌, పూజిత పొన్నాడ‌, మ‌ధునంద‌న్‌, ప్ర‌వీణ్, అన్న‌పూర్ణ‌, పంక‌జ్ కేస‌రి, జ‌బ‌ర్ద‌స్త్ మ‌హేష్, జెమినీ సురేష్ త‌దిత‌రులు.
సాంకేతిక‌వ‌ర్గం: క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు: త‌ట‌వ‌ర్తి కిర‌ణ్‌, సంగీతం: హ‌రి గౌర‌, ఛాయాగ్ర‌హ‌ణం: వెంక‌ట్ ఆర్‌.శాఖ‌మూరి, క‌ళ‌: బ‌్ర‌హ్మ క‌డ‌లి, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌, నిర్మాత‌లు: ఆనంద్‌రెడ్డి, శ్రీధ‌ర్‌రెడ్డి, ద‌ర్శ‌క‌త్వం: కిషోర్ కుమార్‌.
సంస్థ‌: ఏబీటీ క్రియేష‌న్స్‌
విడుద‌ల‌: 15 మార్చి 2019.


తెలుగులో ప్ర‌త్యేక గీతాల‌తోనే ఎక్కువ‌గా సంద‌డి చేసిన ల‌క్ష్మీరాయ్... చాలా రోజుల త‌ర్వాత చేసిన చిత్రం `వేర్ ఈజ్ ది వెంక‌ట‌ల‌క్ష్మి`. కామెడీ హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన చిత్ర‌మిది. ఇలాంటి చిత్రాల్లో న‌టించ‌డం ల‌క్ష్మీరాయ్‌కి అల‌వాటే. త‌మిళంలో ఆమె చేసిన హారర్ సినిమాలు, తెలుగులోనూ విడుద‌లై విజ‌య‌వంత‌మ‌య్యాయి. మ‌రోసారి ఆమె భ‌య‌పెట్ట‌డం కోసం చేసిన ఈ ప్ర‌య‌త్నం ఎంత‌వ‌ర‌కు ఫ‌లించింది? ప‌్ర‌చార చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న ఈ చిత్రం ఎలా ఉంది?  తెలుసుకుందాం పదండి...  

* క‌థ‌
శేఖ‌ర్ (రామ్‌కార్తీక్‌), చంటి (ప్ర‌వీణ్‌), పండు (మ‌ధునంద‌న్‌) స్నేహితులు. గౌరి (పూజిత పొన్నాడ‌)ని శేఖ‌ర్ ప్రేమిస్తుంటాడు. ఆ ఇద్ద‌రి ప్రేమ కోసం పండు, చంటి కూడా సాయం చేస్తారు. ఇంత‌లో ఊళ్లోకి వెంక‌ట‌ల‌క్ష్మి (ల‌క్ష్మీరాయ్‌) అనే స్కూల్ టీచ‌ర్ వ‌స్తుంది. ఆమె అందాన్ని చూసి చంటి (ప్ర‌వీణ్‌), పండు (మ‌ధునంద‌న్) మ‌న‌సు పారేసుకుంటారు. అల్ల‌రి ప‌నులు చేస్తూ తిరిగే చంటి, పండుల‌ని ఓ ప‌ని కోసం వాడుకోవాల‌నుకుంటుంది వెంక‌ట‌ల‌క్ష్మి. ఈ క్ర‌మంలోనే వెంక‌ట‌ల‌క్ష్మి ఓ దెయ్యం అనే విష‌యం తెలుస్తుంది. వెంక‌ట‌ల‌క్ష్మి చెప్పిన ప‌నిని చేయ‌క‌పోతే దెయ్యం వ‌దిలిపెట్ట‌ద‌ని భావించిన ఆ ఇద్ద‌రూ శేఖ‌ర్, గౌరిల సాయం తీసుకుంటారు. ప‌నిని పూర్తి చేస్తారు. ఇంత‌కీ ఆ ప‌ని ఏమిటి? ప‌ండు, చంటిల‌తోనే ఆ ప‌నిని ఎందుకు చేయించిందనే విష‌యాల్ని తెర‌పైనే చూడాలి. 


* విశ్లేష‌ణ‌
`దెయ్యం... ప‌గ‌.. ప్ర‌తీకారం` అనే ముడిస‌రుకుతో తెర‌కెక్కే సినిమాల‌కి ద‌గ్గ‌ర‌గా ఉంటుందీ చిత్రం. కాక‌పోతే ఇక్క‌డ వెంక‌ట‌ల‌క్ష్మి దెయ్యమా కాదా అనేదే కీల‌కం. ఊళ్లో అంద‌రితోనూ చీవాట్లు తినే ఇద్ద‌రు కుర్రాళ్లు... ఊరంత‌టికీ ఉప‌యోగ‌ప‌డే ఓ మంచి ప‌ని చేయ‌డ‌మ‌నే అంశం చుట్టూ క‌థ‌ని తీర్చిదిద్దారు. ఆ మంచి ప‌నిని ఎవ‌రు ఎలా చేయించార‌న్న‌దే ఆస‌క్తిక‌రం. కొత్తదేం కాపోయినా...  కామెడీ, హార‌ర్‌, థ్రిల్లింగ్ అంశాల్ని బ‌లంగా చూపించే ఆస్కార‌మున్న క‌థే ఇది. కానీ ద‌ర్శ‌కుడు ఆ విష‌యాల‌పై క‌నీసం పెద్ద‌గా దృష్టిపెట్ట‌లేదు. కామెడీ కోసం చాలా ప్ర‌య‌త్నాలు చేశారు కానీ... అది కూడా పండ‌లేదు.  ఇలాంటి చిత్రాల్లో డ్రామా పండిందంటే లాజిక్‌ల గురించి ఆలోచించ‌డం మానేస్తారు ప్రేక్ష‌కులు. కానీ ఏ ద‌శ‌లోనూ డ్రామా పండ‌దు. దాంతో  అడుగ‌డుగునా ఈ సినిమాలో లోపాలు క‌నిపిస్తుంటాయి. ఏ పాత్ర ఎప్పుడు ఎలా ఎందుకు ప్ర‌వ‌ర్తిస్తుందో  అర్థం కాదు. పాత్ర‌లు తీర్చిదిద్దుకున్న విధానంలోనే లోపాలు క‌నిపిస్తాయి. పండు, చంటి, వెంక‌ట‌ల‌క్ష్మిల క‌థ‌లోకి అన‌వ‌స‌రంగా నాయ‌కానాయిక‌ల పాత్ర‌ల్ని ఇరికించిన‌ట్టు అనిపిస్తుంది. చంటి, పండు చేసే అల్ల‌రి ప‌నులు చిరాకు పెట్టించేలా ఉంటాయి త‌ప్ప‌, న‌వ్వులు పండించ‌వు. దుర్మార్గుడైన వీరారెడ్డి (పంక‌జ్ కేస‌రి) ఆకృత్యాల‌తో క‌థ మొద‌ల‌వుతుంది. అది చూసి ఇందులో బ‌ల‌మైన విల‌న్ ఉన్నాడ‌నిపిస్తుంది. కానీ ఆ విల‌న్‌ని పోనూ పోనూ ఓ జోక‌ర్‌లా, బ‌క‌రాలా మారిపోతాడు. త‌న చెల్లి ఇంట్లోకి ఇద్ద‌రు కుర్రాళ్ల‌ని తీసుకొచ్చి వీళ్ల‌ని ప‌నిలో పెట్టుకోవాల‌ని కోరుతుంది. వాళ్లు ఎవ‌ర‌ని ఆరా తీయ‌కుండా ప‌నిలోకి తీసుకుంటాడు. చెల్లెలు పెళ్లి కాకుండానే గ‌ర్భ‌వ‌తి అయ్యింద‌న్న  విష‌యం తెలిశాక... అస‌లేమాత్రం కంగారుప‌డ‌కుండా నువ్వు త‌ప్పు చేయ‌వ‌ని నాకుతెలుస‌మ్మా అని క‌న్నీళ్లు పెట్టుకుంటాడు త‌ప్ప  ఎవ‌రు కార‌ణమ‌ని మాత్రం ఆరా తీయ‌డు.  ఇలా లాజిక్ లేని విష‌యాలు సినిమా నిండా క‌నిపిస్తాయి. ఇంత‌కీ  వెంక‌ట‌ల‌క్ష్మి ఎవ‌రు?  ఆమె తీసుకుర‌మ్మ‌ని చెప్పిన పెట్టెలో ఏముంద‌నే విష‌యాల కోసం ప‌తాక స‌న్నివేశాల వర‌కూ ఎదురు చూడాల్సి వ‌చ్చింది. దాంతో సినిమా అంతా సాగ‌దీత‌లా అనిపిస్తుంది. అప్ప‌టివ‌ర‌కు హాస్యం, థ్రిల్లింగ్ వంటి విష‌యాలైనా పండాయా అంటే అది కూడా లేదు. ప‌తాక స‌న్నివేశాలు కూడా కృత‌కంగా, మెలోడ్రామాగా సాగుతాయి అప్ప అందులో కూడా కొత్త‌ద‌నం లేదు.* న‌టీన‌టులు... సాంకేతిక‌త‌ 
ల‌క్ష్మీరాయ్ చేసిన వెంక‌ట‌ల‌క్ష్మి పాత్ర సినిమాకి కీల‌కం. కానీ దాన్ని తీర్చిదిద్దిన విధానం సాదాసీదాగా అనిపిస్తుంది. దాంతో ల‌క్ష్మీరాయ్‌కి న‌టించేందుకు కూడా పెద్ద‌గా ఆస్కారం ల‌భించ‌లేదు.   ప్ర‌వీణ్‌, మ‌దునంద‌న్‌లు చేసి చంటి, పండు పాత్ర‌లు కూడా ప్రాధాన్య‌మైన‌వే. కానీ  వాళ్లు న‌వ్వించ‌డానికి చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు.  రామ్‌కార్తీక్‌, పూజిత పొన్నాడ అప్పుడ‌ప్పుడు అతిథి పాత్ర‌ల్లా క‌నిపిస్తారంతే. ఒక పాట‌లో ఘాటైన స‌న్నివేశాల్లో క‌నిపిస్తారు.  వీరారెడ్డిగా పంక‌జ్ కేస‌రి విల‌నిజం అక్క‌డ‌క్క‌డా మెప్పిస్తుంది. ద్వితీయార్థంలో మాత్రం ఆయ‌న పాత్ర బ‌క‌రాలా మారిపోయింది.  సాంకేతికంగా సినిమా ప‌ర్వాలేద‌నిపిస్తుంది. ద‌ర్శ‌కుడు కిషోర్ కుమార్ క‌థ‌, క‌థ‌నాల‌పై ఏమాత్రం ప‌ట్టు ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయారు. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టే ఉన్నాయి. 

* చివ‌రిగా...
 హార‌ర్‌తో కూడిన  కామెడీ థ్రిల్ల‌ర్ సినిమాలు రూపొందించి, విజ‌యాలు అందుకోవ‌డంలో తెలుగు ప‌రిశ్ర‌మ‌కి  మంచి రికార్డే ఉంది. ప‌రిమిత వ్య‌యంతో తెర‌కెక్కే ఈ చిత్రాలు ప్ర‌తి యేడాదీ మంచి విజ‌యాల్నే సాధిస్తుంటాయి. ఒక కామెడీ థ్రిల్ల‌ర్‌ని ఎలా తీయ‌కూడ‌దో `వేర్ ఈజ్ ది  వెంక‌ట‌ల‌క్ష్మి` ఒక ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది.  


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.