రివ్యూ: విజిల్‌
చిత్రం: విజిల్‌
న‌టీనటులు: విజ‌య్‌, న‌య‌న‌తార‌, జాకీష్రాఫ్‌, వివేక్‌, క‌దిర్‌, యోగిబాబు, దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు
ద‌ర్శక‌త్వం: అట్లీ
నిర్మాత‌లు: క‌ల్పాతి ఎస్‌.అఘోరాం, కల్పాతి ఎస్‌.గ‌ణేశ్‌, క‌ల్పాతి ఎస్‌.సురేశ్
స్క్రీన్ ప్లే: అట్లీ, ర‌మ‌ణ గిరివాస‌న్‌
సంగీతం: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌
ఛాయాగ్రహ‌ణం: జి.కె.విష్ణు
మాట‌లు: శ్రీరామ‌కృష్ణ 
సంస్థ‌: ఏజీఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్షన్స్ 


తమిళ కథానాయకుడు విజయ్‌కు అటు కోలీవుడ్‌తోపాటు ఇటు టాలీవుడ్‌లో కూడా అభిమానులు ఉన్నారు. విజయ్‌ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘బిగిల్‌’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘విజిల్‌’ పేరుతో తెరకెక్కించారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పోలీస్‌’ (తమిళంలో ‘తెరి’), ‘అదిరింది’(మెర్సల్‌) చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. దాంతో ‘విజిల్‌’ చిత్రం మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతవరకూ చేరువయ్యింది? వీరిద్దరూ  ప్రేక్షకులతో థియేటర్లలో విజిల్‌ వేయించగలిగారా?

క‌థేంటంటే

మైఖేల్ అలియాస్ బిగిల్(విజ‌య్‌).. మురికివాడ‌లో పుట్టి పెరిగిన కుర్రాడు. తండ్రి రాజ‌ప్ప(విజ‌య్) త‌న వాడ జనానికి అండ‌గా నిలుస్తూ ముఠా నాయ‌కుడిగా కొన‌సాగుతుంటాడు. త‌న కొడుకులాగే స్థానిక కుర్రాళ్లంతా మైదానంలో దిగి ఫుట్‌బాల్ ఆడ‌టం చూసి సంతోషిస్తుంటాడు రాజ‌ప్ప‌. త‌న జీవితం ప్రభావం మైఖేల్‌పై ప‌డ‌కూడ‌ద‌ని, త‌ను మంచి ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా జాతీయ స్థాయిలో ఆడాల‌ని ప్రోత్సహిస్తాడు. జాతీయ స్థాయిలో మైఖేల్ క‌ప్పు కొట్టాల‌నేది రాజప్ప క‌ల‌. కానీ ఫుట్‌బాల్ ఫెడ‌రేష‌న్ రాజ‌కీయాల‌కు బ‌లై త‌న క్రీడా జీవితానికి స్వస్తి ప‌ల‌కాల్సి వ‌స్తుంది మైఖేల్‌. అలాంటి మైఖేల్‌కి ఆంధ్రప్రదేశ్ మ‌హిళ‌ల ఫుట్‌బాల్ జ‌ట్టుకి కోచ్‌గా వ్యవ‌హరించే అవ‌కాశం ఎలా వ‌చ్చింది?  నిరాశ‌లో ఉన్న మ‌హిళా ఫుట్‌బాల్ జ‌ట్టుని ఎలా ముందుకు న‌డిపించాడు? జాతీయ స్థాయిలో క‌ప్పు కొట్టాల‌న్న త‌న తండ్రి క‌ల‌ని కోచ్‌గా ఎలా నిజం చేశాడు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


ఎలా ఉందంటే

ఆట అంటేనే ఒక భావోద్వేగం. త‌ల‌ప‌డుతున్న రెండు జ‌ట్లలో ఒక‌రిది గెలుపు, మ‌రొక‌రిది ఓటమి అనేది ముందే తెలుసు. కానీ, ఫ‌లితాన్ని మించిన ఆ ప్రయాణం ప్రేక్షకుడిని ఎంతో ఉత్కంఠకి గురిచేస్తుంటుంది. మైదానంలోని ప్రతి మ‌లుపూ, ప్రతి క్షణం భావోద్వేగాల్ని రేకెత్తిస్తుంది. అందుకే క్రీడా నేప‌థ్యంలో సాగే సినిమాలు చాలా వ‌ర‌కు ర‌క్తిక‌ట్టిస్తుంటాయి. అట్లీ ఆట‌లోని భావోద్వేగాల‌కి తోడుగా.. మ‌హిళ‌ల‌కి సంబంధించిన మ‌రిన్ని సామాజికాంశాల్ని జోడించాడు. దాంతో రెండింతల భావోద్వేగాల‌తో ‘విజిల్‌’ ప్రేక్షకుల్ని క‌ట్టిప‌డేస్తుంది. కాక‌పోతే ద్వితీయార్ధం వ‌ర‌కు విజ‌య్ మాస్ మ‌సాలా హంగామాని ఓపిక‌గా చూడాల్సి ఉంటుంది. విజ‌య్‌కు త‌మిళ‌నాట మాస్ అభిమానులు ఎక్కువ‌. వారిని దృష్టిలో ఉంచుకొనే తొలి భాగం స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. అస‌లు క‌థ మైఖేల్ కోచ్ అవ‌తారం ఎత్తడంతోనే మొద‌ల‌వుతుంది. అప్పటివ‌ర‌కు సాగిన క‌థ‌లో కొత్తద‌న‌మేమీ క‌నిపించ‌దు. క‌మ‌ర్షియ‌ల్‌ కొల‌త‌ల‌తోనే స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. ఫుట్‌బాల్ ఫెడ‌రేష‌న్‌లో రాజ‌కీయాలు బ‌య‌టికి రావ‌డం, అదే స‌మ‌యంలో.. ఆట‌కి దూర‌మైన ధోని, కోహ్లిలాంటి ఇద్దరు మెరుపు క్రీడాకారిణుల్ని తిరిగి తీసుకొచ్చే ప్రయ‌త్నం.. ఆ నేప‌థ్యంలో పండే డ్రామా ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ఒక కోచ్‌గా జ‌ట్టుని ముందుకు న‌డిపించేందుకు విజ‌య్ చేసే ప్రయ‌త్నాలు, వాళ్లలో ఆవేశం, స్ఫూర్తి ర‌గిలించేందుకు తీసుకొనే నిర్ణయాలు ఆక‌ట్టుకుంటాయి. ప‌తాక స‌న్నివేశాలు గెలుపు నీదా నాదా అన్నట్టుగా ఉత్కంఠ భ‌రితంగా సాగే మ్యాచ్‌ని చూసిన‌ట్టే అనిపిస్తాయి. సామాజికాంశాల‌తో  కూడుకొన్న అంశాన్ని,  ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాగా తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది.


ఎవ‌రెలా చేశారంటే
:
విజ‌య్ న‌ట‌నే చిత్రానికి ప్రధాన ఆక‌ర్షణ‌. ఆయ‌న తండ్రీ కొడుకులుగా మెప్పించారు. ఆ రెండు కోణాలు కూడా మాస్‌ని అల‌రించేవే. అభిమానులు త‌న సినిమాల నుంచి ఏం కోరుకుంటారో అవ‌న్నీ ఇందులో ఉండేలా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఆయ‌న చేసిన డ్యాన్సులు, ఫైట్లు, సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటాయి. మూడు కోణాల్లో ఆయ‌న పాత్ర తెర‌పై సంద‌డి చేస్తుంది. ఆ మూడు కోణాల్ని ప‌రిచ‌యం చేసిన విధానం అభిమానుల‌తో విజిల్స్ వేయిస్తుంది. న‌య‌న‌తార (ఏంజెల్ ఆశీర్వాదం) పాత్రకి ప్రథ‌మార్ధంలో పెద్దగా ప్రాధాన్యం లేదు. ద్వితీయార్ధంలో మాత్రం ఆమె పాత్ర‌, న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ఫుట్‌బాల్ స‌మాఖ్య ప్రెసిడెంట్ శ‌ర్మగా జాకీష్రాఫ్ మెప్పిస్తారు. ఆయ‌న పాత్ర నేప‌థ్యంలో వ‌చ్చే మ‌లుపులు చిత్రానికి ప్రధాన‌బ‌లం. అయితే ఆ పాత్రని మ‌రింత శ‌క్తిమంతంగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. విజ‌య్ స్నేహితుడిగా క‌దిర్‌, ఫుట్‌బాల్ క్రీడాకారిణులంతా స‌హ‌జంగా క‌నిపించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. రెహ‌మాన్ సంగీతం, విష్ణు కెమెరా ప‌నిత‌నం సినిమాకి త‌గ్గ ప్రమాణాల‌తో ఉన్నాయి. సుదీర్ఘంగా సాగే ఈ సినిమా అక్కడ‌క్కడా సాగ‌దీసిన అభిప్రాయాన్ని క‌ల‌గజేస్తుంది. అట్లీ సామాజిక సందేశాన్ని జోడించిన తీరు, విజ‌య్‌లాంటి క‌థానాయ‌కుడిని దృష్టిలో ఉంచుకొని సినిమాని మ‌లిచిన విధానం ఆక‌ట్టుకుంటుంది. అనువాదం విష‌యంలో మ‌రిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. క‌థ‌లో న‌వ్యాంధ్రప్రదేశ్  జ‌ట్టు అని సంబోధిస్తుంటారు. స్కోరు బోర్డుపై మాత్రం త‌మిళ‌నాడు జ‌ట్టు అని క‌నిపిస్తుంటుంది. 


బ‌లాలు బ‌ల‌హీన‌త‌లు: 
విజ‌య్ న‌ట‌న- ప్రథ‌మార్ధం+ స్పోర్ట్స్ నేప‌థ్యం- సినిమా నిడివి+ భావోద్వేగాలు + మ‌హిళా నేప‌థ్యంలో సందేశం 


చివ‌రిగా
ద్వితీయార్థంలో `విజిల్` కొట్టాల్సిందే


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.