వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌
చిత్రం: వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌
న‌టీన‌టులు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాశీఖ‌న్నా, ఐశ్వర్య రాజేష్‌, ఇజాబెల్లె, కేథ‌రిన్, ప్రియ‌ద‌ర్శి, జ‌య‌ప్రకాష్‌, శ‌త్రు, విష్ణు త‌దిత‌రులు
స‌ంగీతం: గోపీసుంద‌ర్‌
ఛాయాగ్రహ‌ణం: జ‌య‌కృష్ణ గుమ్మడి
నిర్మాత‌: కె.ఎ.వ‌ల్లభ‌
స‌మ‌ర్పణ: కె.ఎస్‌.రామారావు
ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం: క్రాంతిమాధ‌వ్
విడుద‌ల‌: 14 ఫిబ్రవ‌రి 2020


అదే జంట‌. అవే మ‌న‌సులు, అదే ప్రేమ‌. 
ఇందులో కొత్త ఏముందంటారా?   ప్రేమ‌న్న‌దే కొత్త‌. ఎన్న‌టికీ పాత‌బ‌డిపోని అనుభూతులు అందులో ఉన్నాయి. అందుకే ఎన్ని ప్రేమ‌క‌థ‌లు తెర‌కెక్కినా మ‌రో క‌థ‌కి చోటుంటుంది. ప్రేమ‌లో మ‌రో కొత్త కోణాన్ని ఆవిష్క‌రిస్తూనే ఉంటుంది. ఈసారి ప్రేమ‌లో దైవ‌త్వం ఉంది, అందులో త్యాగాలు ఉన్నాయనే విషయాల్ని చెప్పాల‌నుకున్నాడు క్రాంతిమాధ‌వ్.  ఆ ప్ర‌య‌త్న‌మే `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌`తో చేశాడు.  సున్నిత‌మైన క‌థ‌ల‌తో సినిమాలు తీసే ద‌ర్శ‌కుడిగా పేరున్న క్రాంతిమాధ‌వ్ ఈ చిత్రం కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిశాడు. ఈ క‌ల‌యికే ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తిని రేకెత్తించింది. ఈ చిత్రంతో మూడు ప్రేమ‌క‌థ‌ల్లో క‌నిపించే అవ‌కాశం విజ‌య్‌కి ద‌క్కింది. మ‌రి  ఆ క‌థ‌ల్లో విజ‌య్   ఎలా ఒదిగిపోయాడు? క‌్రాంతిమాధ‌వ్ చెప్పిన ప్రేమ‌క‌థ ఎలా ఉంది?  తెలుసుకుందాం ప‌దండి...

* క‌థ‌:
గౌత‌మ్ (విజ‌య్ దేవ‌ర‌కొండ), యామిని (రాశిఖ‌న్నా) ప్రేమించుకుంటారు. స‌హ‌జీవ‌నం చేస్తారు. గౌత‌మ్ ఉద్యోగాన్ని వ‌దిలిపెట్టి ర‌చ‌యిత‌గా ఎదిగే ప్ర‌య‌త్నంలో ఉంటాడు. యేడాదిన్న‌ర‌యినా త‌న ర‌చ‌నా వ్యాసంగంలో ఎదుగూ బొదుగూ ఉండ‌దు.  త‌న ప‌క్క‌న ఒక‌రున్నార‌నే విష‌యాన్ని కూడా మ‌రిచిపోయి త‌న‌దైన ప్ర‌పంచంలోనే బ‌తుకుతుంటాడు. దాంతో విసుగు చెందిన యామిని అత‌న్నుంచి విడిపోవాల‌ని నిర్ణ‌యించుకుంటుంది. గౌత‌మ్ ఆ బాధ‌లోనే క‌థ‌లు రాయ‌డం మొద‌లుపెడ‌తాడు. ప్రేమ‌లో దైవ‌త్వం ఉంది, ప్రేమ‌లో త్యాగం ఉంద‌ని చెప్పే యామిని అభిప్రాయాలు గౌత‌మ్ క‌థ‌ల్లో ఎలా ప్ర‌స్ఫుటించాయి? మ‌ళ్లీ ఆ ఇద్ద‌రూ క‌లిశారా లేదా?  గౌత‌మ్ జైలుకి ఎందుకు వెళ్లాల్సొచ్చింది? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా  చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌
ద‌ర్శ‌కుడు మూడు క‌థ‌ల్ని క‌లిపి చెప్పాల‌నుకున్న విధానం ఆక‌ట్టుకుంటుంది. ఆ మేళ‌వింపు ఓ కొత్త ప్ర‌య‌త్నమే.  అయితే అస‌లు క‌థ‌ల్లోకి వెళితే వాటిలో  కొత్త‌ద‌నం కానీ, ఆత్మ కానీ క‌నిపించ‌దు.  సినిమాకి ప్ర‌ధాన‌మైన గౌత‌మ్‌, యామినిల ప్రేమ‌క‌థకి కావాల్సిన అనుభూతులు, భావోద్వేగాలు  మిగిలిన రెండు క‌థ‌ల్లో నుంచి రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేశాడు. యామిని చెప్పినట్టుగా ప్రేమ‌లో త్యాగం ఉంటుంది, ప్రేమ‌లో రాజీ ఉంటుందనే విష‌యాల్ని శీన‌య్య - సువ‌ర్ణ, గౌత‌మ్ - ఈజాల క‌థ‌ల‌తో  చెప్పాల‌నుకున్నాడు. కానీ ఆ క‌థ‌లు వేటిక‌వే ప్ర‌త్యేకంగా అనిపిస్తాయి. క‌థానాయ‌కుడు చివ‌ర్లో చెబితే త‌ప్ప ఆ క‌థ‌ల వెన‌క  అంత‌రార్థం ఏమిటో అర్థం కాని ప‌రిస్థితి. అలా క‌థ‌ల్ని న‌డిపిన విధానంలోనే స‌మ‌స్య‌లొచ్చాయి. గౌత‌మ్‌, యామినిల ప్రేమ‌క‌థ‌తోనే సినిమా మొద‌ల‌వుతుంది. వాళ్లిద్ద‌రూ విడిపోయాక శీన‌య్య‌, సువ‌ర్ణ‌ల క‌థ మొద‌ల‌వుతుంది.  ఇల్లెందు నేప‌థ్యంలో సాగే ఈ క‌థే సినిమాకి హైలెట్‌.  కొత్త క‌థేం కాదు కానీ...  ఆ నేప‌థ్యం, యాస స‌హ‌జత్వాన్ని తీసుకొచ్చింది. హాస్యం కూడా పండింది. ఇక గౌత‌మ్ - ఈజాల క‌థ‌లో చాలా లోపాలు క‌నిపిస్తాయి. ఈజాకి క‌ళ్లు పోవ‌డం, గౌత‌మ్ బ‌తికుండ‌గానే త‌న క‌ళ్ల‌ని దానం చేయ‌డం వంటి స‌న్నివేశాలు మ‌రీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. అందులో త్యాగం అనేది అస్స‌లు క‌నిపించ‌దు. ఇక సినిమాకి మూల‌మైన గౌత‌మ్‌, యామినిల ప్రేమ‌క‌థ చివ‌రి వ‌ర‌కు ముక్క‌లు ముక్క‌లుగా సాగుతూనే ఉంటుంది. అందులో `అర్జున్‌రెడ్డి` ఛాయ‌లే ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి.  భావోద్వేగాలే ప్ర‌ధానంగా ప్రేమ‌క‌థ‌ని న‌డపాల‌నుకున్న‌ప్పుడు ఆ దిశ‌గా ద‌ర్శ‌కుడు మ‌రిన్ని క‌స‌ర‌త్తులు చేయాలి. కానీ ఆయ‌న క‌థ‌ల్ని మేళ‌వించే ప్ర‌య‌త్నంలో భావోద్వేగాల విష‌యాన్ని మ‌రిచిపోయిన‌ట్టు అనిపిస్తుంది.  శీన‌య్య‌, సువ‌ర్ణ‌ల క‌థ వ‌ల్ల ప్ర‌థ‌మార్థం వ‌ర‌కు ఆక‌ట్టుకున్నా... ద్వితీయార్థంలో సినిమా గాడి త‌ప్పిన‌ట్టు అనిపిస్తుంది.  ప‌తాక స‌న్నివేశాలు కూడా సాదాసీదాగా అనిపిస్తాయి.  క్రాంతిమాధ‌వ్ ర‌చ‌యిత‌గా మంచి ప‌నితీరునే క‌న‌బ‌రిచాడు కానీ... ద‌ర్శ‌కుడిగా మాత్రం ప్ర‌భావం చూపించ‌లేక‌పోయారు. మూడు క‌థ‌లు చెప్పినా  ప్రేక్ష‌కుడిని దేనికీ బ‌లంగా  క‌నెక్ట్ చేయించ‌లేక‌పోయారు.
న‌టీన‌టులు.. సాంకేతిక‌త
విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రోసారి త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఆయ‌న పాత్ర మూడు కోణాల్లో సాగుతుంది. ప్ర‌తి పాత్రపైనా త‌న‌దైన ముద్ర వేశాడు. మిగ‌తా రెండు పాత్ర‌లు గ‌త సినిమాల‌కి ద‌గ్గ‌ర‌గా అనిపించినా... శీన‌య్య‌గా ఆయ‌న న‌ట‌న  మాత్రం ఆక‌ట్టుకుంటుంది. యామిని పాత్ర‌లో రాశిఖ‌న్నా చ‌క్క‌టి భావోద్వేగాలు పండించింది.  ఘాటైన స‌న్నివేశాల్లోనూ క‌నిపించింది. ఐశ్వ‌ర్య రాజేష్ సువ‌ర్ణ పాత్ర‌లో ఒదిగిపోయింది. ఆమె త‌ప్ప మ‌రొక‌ర్ని ఊహించుకోలేని విధంగా ఆమె పాత్ర‌ని పండించింది. ఈజా, కేథ‌రిన్‌లు చిన్న పాత్ర‌ల్లోనే క‌నిపించారు.  శ‌త్రు, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా కొన్ని విభాగాలు మాత్ర‌మే ప్ర‌భావం చూపించాయి. ముఖ్యంగా సంగీతం సినిమాకి మైన‌స్‌గా మారింది. ప్రేమ‌క‌థ‌ల‌కి సంగీత‌మే బ‌లం. ఇందులో ఒక్క పాట కూడా గుర్తుండిపోయేలా లేదు. నేప‌థ్య సంగీతం మాత్రం మెప్పిస్తుంది. జ‌య‌కృష్ణ గుమ్మ‌డి కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది.  ర‌చ‌యిత‌గా క్రాంతిమాధ‌వ్ అడుగ‌డుగునా త‌న ప్ర‌భావం చూపించారు.  మాట‌లు ఆక‌ట్టుకుంటాయి.  ద‌ర్శ‌కుడిగా మాత్రం ఆయ‌న రాసుకున్న క‌థ, మాట‌ల స్థాయిలో  భావోద్వేగాల్ని పంచ‌లేక‌పోయారు. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ సంస్థ స్థాయిలో నిర్మాణ హంగులు క‌నిపిస్తాయి.చివ‌రిగా:  కొత్త ఆలోచ‌నే. మూడు క‌థ‌ల్ని క‌లిపి ఒక సినిమా తీయ‌డం వ‌ర‌కు బాగుంది.  క‌థ‌ల్నిక‌ల‌ప‌డం వ‌ర‌కు బాగా  క‌స‌ర‌త్తులు చేసిన ద‌ర్శ‌కుడు, ఆ క‌థల్లోకి కూడా వెళ్లి అదే స్థాయిలో క‌స‌ర‌త్తులు చేసుంటే ఈ సినిమా ఫ‌లితం మ‌రోలా ఉండేది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.