రివ్యూ: యాత్ర‌
రివ్యూ: యాత్ర‌
న‌టీన‌టులు: మ‌మ్ముట్టి, అశ్రిత‌, జ‌గ‌ప‌తిబాబు, సుహాసిని, రావు ర‌మేష్‌, అన‌సూయ‌, స‌చిన్ ఖేడేక‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు.
సాంకేతిక‌వ‌ర్గం: ఛాయాగ్ర‌హ‌ణం: స‌త్య‌న్ సూర్య‌న్‌, సంగీతం: కె, కూర్పు: శ్రీక‌ర్‌ప్ర‌సాద్‌, పాట‌లు: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, స‌మ‌ర్ప‌ణ‌: శివ మేక‌, నిర్మాణం: శ‌శిదేవిరెడ్డి, విజ‌య్ చిల్లా, ద‌ర్శ‌క‌త్వం: మ‌హి వి.రాఘ‌వ్.
విడుద‌ల‌: 8 ఫిబ్ర‌వ‌రి 2019
సంస్థ‌: 70 ఎమ్‌.ఎమ్‌. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌


  తెలుగు రాజ‌కీయాల‌పై త‌న‌దైన ముద్ర వేసిన నాయ‌కుడు వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. కాంగ్రెస్ పార్టీని మ‌ళ్లీ అధికారంలోకి తీసుకురావ‌డంలోనూ... ర‌క‌ర‌కాల పత‌కాల్ని ప్ర‌వేశపెట్టి ప్ర‌జ‌ల‌కి ల‌బ్ది చేకూర్చ‌డంలోనూ వై.ఎస్ చేసిన కృషి గురించి ఇప్ప‌టికీ మాట్లాడుకుంటుంటారు. 2004 ఎన్నిక‌ల‌కి ముందు వై.ఎస్ ప్ర‌జాప్ర‌స్థానం పేరుతో చేసిన పాద‌యాత్ర చారిత్రాత్మ‌కం. వ్య‌క్తిగ‌తంగానూ ఆ న‌డ‌క నా న‌డ‌త మార్చింద‌ని చెప్పేవారు వై.ఎస్. అలాంటి కీల‌క ఘ‌ట్టం నేప‌థ్యంలోనే `యాత్ర‌` తెర‌కెక్కింది. ఈవెంట్ బేస్డ్ బ‌యోపిక్‌గా రూపొందిన ఈ చిత్రంలో వై.ఎస్‌గా మ‌మ్ముట్టి న‌టించ‌డం మ‌రో ప్ర‌త్యేకం. బ‌యోపిక్‌ల ట్రెండ్ కొన‌సాగుతున్న స‌మ‌యంలో వై.ఎస్ జీవితంపై `యాత్ర` తెర‌కెక్క‌డం, ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకోవ‌డంతో చిత్రంపై అంచ‌నాలు పెరిగాయి. మ‌రి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం ప‌దండి... 


క‌థ 
2003లో మొద‌ల‌య్యే క‌థ ఇది. అప్ప‌ట్లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కి రంగం సిద్ధ‌మ‌వుతుంది. ప్ర‌తిప‌క్షనాయ‌కుడిగా ఉన్న వై.ఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి (మ‌మ్ముట్టి)కి ఆ ఎన్నిక‌లు ఒక స‌వాల్‌గా మార‌తాయి. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీతో పోరాటం చేయ‌గ‌ల‌మా లేదా అనే భ‌యం ఒక ప‌క్క‌... తాను ప్ర‌జానాయ‌కుడిగా ఎద‌గాల‌న్న త‌న తండ్రి క‌ల ఓ ప‌క్క‌. ఆ ప‌రిస్థితుల్లో పోరాటం చేయ‌డానికే న‌డుం బిగిస్తాడు వై.ఎస్‌. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని తెలుసుకోవ‌డానికి ప్ర‌జాప్ర‌స్థానం పేరుతో పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుడ‌తాడు. ఆ యాత్ర ఎలా మొద‌లైంది? దాంతో ఆయ‌న వ్య‌క్తిగ‌తంగా ఎలా మారారు? చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వ‌ర‌కు సాగిన ఆ ప్ర‌యాణంలో ప్ర‌జ‌ల క‌ష్టాల్ని ఎలా విన్నారు? వాళ్ల‌కి ఎలాంటి భ‌రోసాని ఇచ్చారు? అధికారంలో బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని ఎలా అధికారంలోకి తీసుకొచ్చారు? ఆయ‌న ప్ర‌వేశ‌పెట్టిన పత‌కాల‌కి ఆ యాత్ర ఎలా కార‌ణ‌మైంద‌న్న‌దే ఈ చిత్ర క‌థ‌.


 విశ్లేష‌ణ‌
ఒక నాయ‌కుడిగా వై.ఎస్‌.వ్య‌క్తిత్వాన్ని... రాజ‌కీయ ప్ర‌యాణంలో ఆయ‌న‌కి ఎదురైన స‌వాళ్లని, వాటిని ఎదుర్కొన్న విధానాన్ని చూపించే ప్ర‌య‌త్న‌మే ఈచిత్రం. వై.ఎస్‌.రాజ‌కీయ జీవితంలో కీల‌క‌మైన పాద‌యాత్ర చుట్టూనే ఈ చిత్రం సాగుతుంది. మొద‌ట వై.ఎస్‌.వ్య‌క్తిత్వాన్ని చూపించిన ద‌ర్శ‌కుడు, ఆ త‌ర్వాత ఆయ‌న ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మైన విధానాన్ని, వాళ్ల క‌ష్టాల్ని చూసి ప‌త‌కాల్ని ప్ర‌వేశ‌పెట్టిన వైనాన్ని చూపించారు. బ‌యోపిక్ అంటే జీవితాల్లోని పుట్టు పూర్వోత్త‌రాల్ని, వాళ్ల ప్ర‌యాణంలో మంచితో పాటు చెడుని కూడా ఆవిష్కరిస్తుంటాయి. కానీ ఈమ‌ధ్య బ‌యోపిక్‌లన్నీ కేవ‌లం మంచిని చూపెట్ట‌డానికే ప‌రిమిత‌వుతున్నాయి. ఇది కూడా ఆ కోవ‌కి చెందిన‌దే. న‌మ్మి త‌న ద‌గ్గ‌రికి వ‌చ్చిన‌వాళ్ల‌కి వై.ఎస్‌. అండ‌గా నిల‌వ‌డం మొద‌లుకొని... ఆయ‌న ఒకసారి మాట ఇచ్చాక, ముందుకు వెళ్లాల్సిందే అనే తత్వాన్ని చూపిస్తూ, ఒక నాయ‌కుడిగా ప్ర‌జ‌లతో ఎలా మ‌మేక‌మ‌య్యారు? త‌న‌యుడు ప‌్ర‌జానాయ‌కుడు కావాల‌ని త‌న తండ్రి క‌న్న క‌ల‌ని ఎలా నెరవేర్చాడనే విష‌యాల్ని హైలెట్ చేస్తూ ఈ సినిమాని తీర్చిదిద్దారు ద‌ర్శ‌కుడు. కానీ వై.ఎస్‌ని, ఆయ‌న వ్య‌క్తిత్వాన్ని గొప్ప‌గా చూపించే ప్ర‌య‌త్నంలో చాలా విష‌యాల్ని వాస్త‌వానికి విరుద్ధంగా చూపించ‌డ‌మే ప్రేక్ష‌కుల‌కు మింగుడుప‌డ‌దు. వై.ఎస్ రాజ‌కీయ ఎదుగుద‌లకి కార‌ణ‌మైన, ఆయ‌న చివ‌రి వ‌ర‌కు ఎంతో విధేయ‌త ప్ర‌ద‌ర్శించిన కాంగ్రెస్‌పార్టీని ఈ సినిమాలో విల‌న్‌గా చూపించ‌డం, వై.ఎస్‌.ప్ర‌స్థానం గురించి తెలిసిన‌వాళ్లెవ్వ‌రికీ రుచించ‌దు. డ్రామా కోసం క‌ల్పితపాత్ర‌లు, క‌ల్పిత సంఘ‌ట‌న‌లు త‌ప్ప‌వు కానీ... అవి వాస్త‌వానికి దూరంగా ఉండ‌టం ఇబ్బందికలిగిస్తుంది. వై.ఎస్ ప్ర‌వేశ‌పెట్టిన ప‌త‌కాలు... ఆయ‌న చేసిన పాద‌యాత్రతో ముడిపెట్టి తీర్చిదిద్దిన విధానం బాగుంది. వాటితోనే భావోద్వేగాలు పండించే ప్ర‌య‌త్నం చేశారు. స్నేహానికి, మాటకి, న‌మ్ముకొన్న అనుచ‌రుల‌కి వై.ఎస్ ఇచ్చే ప్రాధాన్యం ఎలాంటిదో ఈ చిత్రంలో కేవీపీ, సుచ‌రిత త‌దిత‌ర పాత్ర‌ల ద్వారా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. చంద్ర‌బాబు పాత్ర‌ని చూపించ‌క‌పోయినా... ఆయ‌న సంభాష‌ణ‌ల్ని ఇందులో వాడుకొన్నారు. ఎన్నిక‌ల సంద‌డి, చేవెళ్ల నుంచి పాద‌యాత్ర ఆరంభించ‌డంతో మొద‌లయ్యే ఈ సినిమా ముఖ్య‌మంత్రిగా వై.ఎస్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌డంతో ముగుస్తుంది. ప‌తాక స‌న్నివేశాల్లో వై.ఎస్ అంతిమయాత్రని స‌హ‌జ స‌న్నివేశాల‌తో చూపించారు. అవ‌న్నీ కూడా ప్రేక్ష‌కుల్ని కంట‌తడి పెట్టిస్తాయి. ప‌తాక స‌న్నివేశాల్లో వై.ఎస్.జ‌గ‌న్ ప్ర‌సంగం కూడా వినిపిస్తుంది. రాజ‌కీయ చిత్రం కాద‌ని చిత్ర‌బృందం చెప్పినా, ఇందులో స్పృశించిన విష‌యాలు, వై.ఎస్‌ని ఆవిష్క‌రించిన విధానం చూస్తే ఆ విష‌యంపై అనుమానం రాక‌మాన‌దు. వై.ఎస్ అభిమానుల‌కి న‌చ్చే విష‌యాల‌పైనే దృష్టిపెట్టి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు ద‌ర్శ‌కుడు.


* న‌టీన‌టులు... సాంకేతిక‌త‌

మ‌మ్ముట్టి వై.ఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో ఒదిగిపోయారు. వై.ఎస్‌లా క‌నిపించ‌క‌పోయినా, ఆయ‌న హావ‌భావాల్ని అనుక‌రించ‌క‌పోయినా ఆ పాత్ర ఆత్మ‌ని అర్థం చేసుకొని న‌టించారు. ఆయ‌న సొంతంగా తెలుగులో సంభాష‌ణ‌లు చెప్పిన విధానం కూడా ఆక‌ట్టుకుంటుంది. సినిమాలో సెంటిమెంట్‌, భావోద్వేగాలు పండ‌టంలో మ‌మ్ముట్టి ప‌నితీరు ముఖ్య‌భూమిక పోషించింది. తెర‌పై ఎన్ని పాత్ర‌లు క‌నిపించినా... వై.ఎస్‌గా మ‌మ్ముట్టినే ప్ర‌ధానంగా క‌నిపిస్తుంటారు. ఆత్మీయుడైన కేవీపీ రామ‌చంద్ర‌రావు పాత్ర‌లో రావు ర‌మేష్, వై.ఎస్‌.విజ‌య‌మ్మ పాత్ర‌లో ఆశ్రిత వేముగంటి చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. వై.ఎస్‌.రాజారెడ్డి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు క‌నిపిస్తారు. ద‌ర్శ‌కుడు మ‌హి వి.రాఘ‌వ్ పాద‌యాత్ర చుట్టూనే క‌థ‌ని తిప్పిన విధానం, వై.ఎస్‌పాత్ర‌ని ఆవిష్క‌రించిన తీరు మెప్పిస్తుంది. సంభాష‌ణ‌లు కూడా ఆక‌ట్టుకుంటాయి. నిర్మాణ విలువ‌లు ఉన్నంతా ఉన్నాయి. సూర్య‌న్ కెమెరా ప‌నిత‌నం, కె సంగీతం బాగుంది. ప‌ల్లెల్లో క‌ళ ఉంది పాట‌, చిత్రీక‌ర‌ణ విధానం ఆక‌ట్టుకుంటుంది.

* చివ‌రిగా
వై.ఎస్ కోసం, ఆయ‌న్ని అభిమానుల్ని మెప్పించ‌డం కోస‌మే అన్న‌ట్టుగా సాగే చిత్ర‌మిది. ఒక సామాన్య ప్రేక్ష‌కుడిగా చూస్తే మాత్రం ఈ చిత్రం ఆశించిన మేర వినోదాన్ని పంచ‌దు. అక్క‌డ‌క్క‌డా భావోద్వేగాలు ఆక‌ట్టుకుంటాయి. ప్ర‌థ‌మార్థం స్థాయిలో ద్వితీయార్థం లేక‌పోవ‌డం కూడా ప్రేక్ష‌కుడికి నిరాశ క‌లిగిస్తుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.