మార్చి 7 (సినీ చరిత్రలో ఈరోజు)...

* అంతర్జాతీయ నటుడు!

(అనుపమ్‌ ఖేర్‌ పుట్టినరోజు-1955)


రెండు జాతీయ అవార్డులు... ఎనిమిది ఫిలింఫేర్‌ అవార్డులు... పలు భాషల్లో 500 సినిమాలు... అంతర్జాతీయ సినిమాల్లో విలక్షణ పాత్రలు... నాటక రంగంలో తనదైన ముద్ర... భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్‌ పురస్కారాలు... నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా గుర్తింపు... ఇవన్నీ నటుడు అనుపమ్‌ ఖేర్‌ వైవిధ్యానికి కొలమానాలు. ‘సర్ఫరోష్‌’, ‘రామ్‌లఖన్‌’, ‘లంహే’, ‘డర్‌’, ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ లాంటి ఎన్నో బాలీవుడ్‌ సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న అనుపమ్‌ఖేర్, ‘బెండ్‌ ఇట్‌ లైక్‌ బెక్‌హామ్‌’, ‘లస్ట్‌ కాషన్‌’, ‘సిల్వర్‌ లైనింగ్స్‌ ప్లేబుక్‌’ లాంటి అంతర్జాతీయ సినిమాల్లో కూడా నటించి ప్రపంచ ప్రేక్షకులను మెప్పించాడు. సిమ్లాలో 1955 మార్చి 7న కాశ్మీరీ పండిట్ల కుటుంబంలో పుట్టిన ఇతగాడు, సినిమాలపై మోజుతో ముంబై చేరుకున్నాడు. నటుడిగా తొలి రోజుల్లో రైల్వే ప్లాట్‌ఫారంపై పడుకున్న రోజులున్నాయి. ముప్ఫై ఏళ్ల వయసులో ‘సారాంస్‌’ సినిమాలో చిన్న పాత్రతో మొదలైన సినీ ప్రస్థానం టీవీలు, నాటక రంగాలలో సాగుతూ ‘కర్మ’ (1986) సినిమాతో మంచి గుర్తింపుతో ముందుకు సాగింది. ఆపై అవకాశాలే ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. పాత్రలే ఆయన్ను తీర్చిదిద్దాయి.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* గొప్ప నటిగా గుర్తింపు 


త్తమ నటనకు అవార్డులు రావడం ఒక ఎత్తు. సాటి సినీ ప్రముఖులంతా ఏక కంఠంతో పొగడడం మరో ఎత్తు. ఇలా అవార్డులతో పాటు, సమకాలీకుల ప్రశంసలు, ప్రేక్షకాదరణ పొందిన నటి అన్నా మగ్నాని. ‘ద రోజ్‌ టాటూ’ సినిమాలో ఆమె కనబరిచిన నటనకు ఆస్కార్‌తో పాటు ప్రతిష్ఠాత్మకమైన నాలుగు అంతర్జాతీయ పురస్కారాలు కూడా అందుకున్న అరుదైన ఘనత ఈమెది. రోమ్‌లో 1908 మార్చి 7న పుట్టిన ఈమె, అటు నాటక రంగంలోనూ ఇటు సినీ రంగంలోనూ అద్వితీయ నటనతో మెప్పించింది. ‘అగ్ని పర్వతం నుంచి లావా ఎంత శక్తిమంతంగా ఉబుకుతుందో, అంత ప్రస్ఫుటంగా ఆమె భావాలను పలికించగలదు’ అంటూ అంతర్జాతీయ పత్రికలు, దర్శకులు, నటులు, విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఆమెను దృష్టిలో పెట్టుకునే అప్పట్లో రచయితలు, దర్శకులు నాటకాలు, సినిమా కథలు రాసేవారట. ఆమె ఆస్కార్‌ గెల్చుకున్న ‘ద రోజ్‌ టాటూ’ కూడా ఆమె కోసం రాసినదే కావడం విశేషం. ఆమె నటించిన ‘రోమ్, ఓపెన్‌ సిటీ’, ‘లామోర్‌’, ‘బెల్లిస్సిమా’, ‘ద ఫ్యుజిటివ్‌ కైండ్‌’, ‘మమ్మా రోమా’ సినిమాలను సినీ ఔత్సాహికులు ఇప్పటికీ ఓ పాఠ్యాంశంగా చూస్తారు. ఈ విలక్షణ నటి 1973 సెప్టెంబర్‌ 26న రోమ్‌లో తన 65వ ఏట మరణించింది.

* మమ్మీ సినిమాల ముద్దుగుమ్మ'

ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించిన ‘ద మమ్మీ’, ‘ద మమ్మీ రిటర్న్స్‌’ సినిమాలు చూసుంటే, వాటిలో హీరోయిన్‌గా నటించిన రాచల్‌ హన్నా వీజ్‌ తప్పకుండా గుర్తుంటుంది. అందంతో, సాహసంతో ఆ సినిమాల్లో ఆమె అంతగా ఆకట్టుకుంది. ఉత్తమ నటిగా ఆస్కార్‌ అవార్డుతో పాటు రెండు బాఫ్టా అవార్డులు, గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డు, స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ అవార్డులు ఆమె సొంతం. లండన్‌లో 1970లో పుట్టిన ఈమె ఇరవై ఏళ్లకే టీవీ సీరియల్స్‌ ద్వారా మెప్పించి, ఆపై వెండితెరపై అలరించింది. ‘ఎనిమీ ఎట్‌ ద గేట్స్‌’, ‘ఎబౌట్‌ ఎ బాయ్‌’, ‘కాన్‌స్టాన్‌టైన్‌’, ‘ద ఫౌంటేన్‌’, ‘ద లవ్లీ బోన్స్‌’, ‘ద కాన్‌స్టాంట్‌ గార్డెనర్‌’, ‘ఓజెడ్‌ ద గ్రేట్‌ అండ్‌ పవర్‌ఫుల్‌’, ‘డిజ్‌ ఒబీడియన్స్‌’లాంటి సినిమాల ద్వారా ఆకట్టుకుంది.

* హాలీవుడ్‌ దర్శక దిగ్గజం


‘‘ప్రపంచ సినిమాకు అపురూపమైన చిత్రాలను అందించిన గొప్ప దర్శకుడాయన. ఆయన సినిమాకు మాకెప్పుడూ స్ఫూర్తిని ఇస్తుంటాయి. ఆయనంత గొప్పగా మరెవ్వరూ సినిమాలను తీయలేరు’’...ఈ మాటలు ఏవో ముఖస్తుతికి ఎవరో అన్నవి కావు. స్టీవెన్‌ స్పీల్‌బెర్గ్, జార్జి లూకాస్, జేమ్స్‌ కామెరాన్, రిడ్లీ స్కాట్, టెర్రీ గిల్లమ్, క్రిస్టోఫర్‌ నోలన్‌ లాంటి మేటి హాలీవుడ్‌ దర్శకులు అన్నవే. ఇంతలా ప్రపంచ సినిమాపై ప్రభావం చూపించిన ఆ దర్శకుడే స్టాన్లీ క్యుబ్రిక్‌. దేశదేశాల్లో సినీ ప్రేక్షకులను అలరించిన ‘స్పార్టకస్‌’ (1960), ‘వన్‌ ఐడ్‌ జాక్స్‌’ (1961), ‘లొలితా’ (1962), ‘డాక్టర్‌ స్ట్రేంజ్‌లవ్‌’ (1964), ‘2001: ఎ స్పేస్‌ ఒడిస్సీ’ (1968), ‘ద షైనింగ్‌’ (1980)లాంటి ఎన్నో మేటి సినిమాలను రూపొందించారు. ఆయన తన 70వ ఏట మరణానికి కొద్ది రోజుల ముందు కూడా ‘ఐస్‌ వైడ్‌ షట్‌’ (1999) సినిమాను రూపొందించడం విశేషం. ప్రతిష్ఠాత్మకమైన ఎన్నో అవార్డులు, పురస్కారాలు ఆయన సొంతం. న్యూయార్క్‌లో 1928 జులై 26న పుట్టిన క్యుబ్రిక్, ఇంగ్లండ్‌లో 1999 మార్చి 7న మరణించారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.