ఏప్రిల్‌ 14.. (సినీ చరిత్రలో ఈరోజు)

* కళారత్న... గొల్లపూడి మారుతీరావు
(పుట్టిన రోజు-1939)


ప్రేక్షకులకు నటుడిగానే సుపరిచిమైనా... గొల్లపూడి మారుతీరావు ఒక సుప్రసిద్ధ రచయిత. సంపాదకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన మాటల రచయితగా సినీ రంగంపైనా... వ్యాఖ్యాతగా బుల్లితెరరపైనా తనదైన ముద్రవేశారు. వక్తగా, కాలమిస్టుగా కూడా ఆయన ఎంతో పేరు సంపాదించారు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్‌లోని పలు విశ్వ విద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్‌ 14న విజయనగరంలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావులకి ఐదో అబ్బాయిగా మారుతీరావు జన్మించారు. విశాఖపట్నంలోని సీబీఎం ఉన్నత పాఠశాల, ఎ.వి.ఎన్‌.కళాశాలతోపాటు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మారుతీరావు విద్యాభ్యాసం సాగింది. బీఎస్సీ (ఆనర్స్‌) పూర్తి చేసిన ఆయన 1959లో ఆంధ్రప్రభ ఉప సంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత రేడియోలో ట్రాన్స్‌మిషన్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికయ్యారు. హైదరాబాదు, విజయవాడల్లో పనిచేశారు. ఆ తర్వాత కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పొందారు. సంబల్‌పూర్, చెన్నై, కడప కేంద్రాల్లో పనిచేశారు. 1981లో ఆకాశవాణి కడప కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన ఆయన రెండు దశాబ్దాలు పనిచేశారు. అసిస్టెంట్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ హోదాలో పదవీ విరమణ చేశారు. చిరంజీవి కథానాయకుడిగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రానికి మాటల రచయితగా కూడా పనిచేశారు. చిన్న వయసులోనే రాఘవ కళానికేతన్‌ పేరున నాటక బృందాన్ని నడిపారు గొల్లపూడి. ఆడది, కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం, రిహార్సల్స్, వాపస్, మహానుభావాలు, నాటకాలకి నిర్మాణం, దర్శకత్వం వహించడంతో పాటు.. ప్రధాన పాత్రధారిగా కూడా నటించారు. విద్యార్థి దశలో ఉండగానే స్నానాలగది, మనస్తత్వాలు నాటకంలోనూ అభినయించారు. అప్పట్లో చైనా ఆక్రమణపై తెలుగులో మొట్టమొదటి నాటకం వందేమాతరంని రచించి చిత్తూరు, మదనపల్లె, నగరిలలో ప్రదర్శించగా, వచ్చిన రూ: 50 వేలు నిధుల్ని ప్రధాన మంత్రి రక్షణ నిధికి అందజేశారు. ఆ నాటకాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార శాఖ ప్రచురించింది. అప్పటి విదేశీ వ్యవహారాల శాకమంత్రి పి.వి.నరసింహారావు దానికి ఉపోద్ఘాతం రాశారు. 1959 డిసెంబరు 16న రాగరాగిణి అనే నాటకం అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఎదుట ప్రదర్శించారు. ఆ తర్వాత పథర్‌ కే అన్సూ అనే పేరుతో హిందీలోకి అనువదించారు. 1963లో ‘డాక్టర్‌ చక్రవర్తి’ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు గొల్లపూడి. ఆయనకి అదే మొదటి సినిమా. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథా రచయితగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డుని అందుకున్నారు. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ తర్వాత నటుడిగా కూడా బిజీ అయిపోయారు. 250 చిత్రాలకిపైగా సహ నటుడిగా, హాస్య నటుడిగా మెరిశారు. ‘సంసారం ఒక చదరంగం’, ‘స్వాతిముత్యం’, ‘తరంగిణి’, ‘త్రిశూలం’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘ముద్దుల ప్రియుడు’, ‘ఆదిత్య 369’ తదితర చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ నిర్వహించిన పోటీలకి సంబంధించిన జ్యూరీ సభ్యుల్లో ఒకరిగా వ్యవహరించారు. జాతీయ చలన చిత్ర అభివృద్ధి మండలి స్క్రిప్ట్‌ పరిశీలన విభాగంలో పనిచేశారు. మారుతీరావు వివాహం 1961 నవంబరు 11న శివకామసుందరితో హనుమకొండలో జరిగింది. ఈ దంపతులకి ముగ్గురు మగసంతానం. పెద్ద కుమారులు సుబ్బారావు, రామకృష్ణ మారుతీ ఎయిర్‌ లింక్స్‌ అనే ట్రావెల్‌ ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. చిన్న కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్‌ 1992 ఆగస్టు 12న మరణించారు. తన తొలి ప్రయత్నంగా ‘ప్రేమ పుస్తకం’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ, చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో మరణించారు. మారుతిరావు తన కుమారుడి జ్ఞాపకంగా గొల్లపూడి శ్రీనివాస్‌ జాతీయ అవార్డుని నెలకొల్పారు. ఉత్తమ నూతన దర్శకుడికి రూ: 1.50 లక్షలు నగదు బహుమతినీ, ప్రముఖ చిత్ర కారుడు బాపు రూపొందించిన బంగారపు జ్ఞాపికనూ ప్రదానం చేస్తున్నారు. సినిమాకు సంబంధించి విశేష ఉపన్యాసం చేసిన ప్రముఖునికి గౌరవ సూచకంగా రూ: 15 వేలు గొల్లపూడి మెమోరియల్‌ లెక్చర్‌ పేరిట బహుమానం అందిస్తున్నారు. సునీల్‌దత్, నసీరుద్దీన్‌ షా, మృణాల్‌ సేన్, శ్యాంబెనగల్, జావెద్‌ అక్తర్, అనుపమ్‌ ఖేర్‌ తదితరులు ఇందులో ప్రసంగించిన ప్రముఖుల్లో ఉన్నారు. సినీ రచయితగా నాలుగు నంది పురస్కారాలు సొంతం చేసుకున్న గొల్లపూడి మారుతీరావుకి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి కళారత్నతో పాటు... మరెన్నో విశిష్ట పురస్కారాలు లభించాయి. ఈటీవీ ప్రతిధ్వని కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన గొల్లపూడి మారుతీరావు పలువురు ప్రముఖల్ని ఇంటర్య్వూ చేశారు. మనసున మనసై, ప్రజావేదిక, వేదిక, సినీ సౌరభాలు తదితర కార్యక్రమాలకి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇంటింటి రామాయణం, గణపతి, ఎవరి గోల వారిదే, ప్రేమలు పెళ్ళిళ్ళు, భార్యారూపవతీ శత్రు, ఏది నిజం? తదితర ధారావాహికల్లో నటుడిగా కూడా మెప్పించారు. ఈరోజు గొల్లపూడి మారుతీరావు పుట్టినరోజు.

* ప్రతినాయకుడిగా ‘స్పాట్‌’ పెట్టారు
(రామిరెడ్డి వర్థంతి-2011)


తెలుగు తెర ఎంతోమంది ప్రతినాయక పాత్రధారుల్ని చూసింది. అందులో రామిరెడ్డి ప్రత్యేకం. ఆయన నటనలో ఎక్కువ హడావుడి కనిపంచదు. గట్టిగా అరవడం.. భయపెట్టేలా చూడటం కూడా ఉండదు. గడ్డాన్ని అలా నిమురుకుంటూ... స్పాట్‌ పెడతా అని చిన్నగా మాట్లాడినా చాలు చూసే ప్రేక్షకుడిలోనే వణుకి మొదలవుతుంది. ‘అంకుశం’లో ఆయన నటన అలాగే ఉంటుంది. ఆ చిత్రంతోనే పేరు తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకున్నారు. ‘అభిమన్యు’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘ప్రతిబంధ్‌’, ‘క్షణ క్షణం’, ‘420’, ‘పెద్దరికం’, ‘అమ్మోరు’, ‘గాయం’, ‘అనగనగా ఒక రోజు’, ‘ఒసేయ్‌ రాములమ్మా’... ఇలా దాదాపు 250కి పైగా చిత్రాలు చేశారు. తెలుగుతో పాటు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం, భోజ్‌పురి భాషల్లో కూడా ఆయన నటించి పేరు తెచ్చుకున్నారు. రామిరెడ్డి పూర్తి పూరి గంగసాని రామరెడ్డి. చిత్తూరు జిల్లా, వాయల్పాడులో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీసీజే పూర్తి చేసిన ఆయన నటుడు కాకముందు పాత్రికేయుడిగా పనిచేశారు. 2011 వరకు నటించిన ఆయన కొంతకాలం పాటు మూత్రపిండాల వ్యాధితో ఇబ్బంది పడ్డారు. 2011 ఏప్రిల్‌ 14న లివర్‌ సమస్యలతో హైదరాబాద్‌లోని కిమ్స్‌ వైద్యశాలలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకి ఇద్దరబ్బాయి, ఒక అమ్మాయి సంతానం. విలనిజానికి కొత్త అర్థం చెప్పిన రామిరెడ్డి వర్ధంతి ఈ రోజు.

* వేగంగా... కాసుల వర్షం!


‘ద ఫాస్ట్‌ అండ్‌ ద ఫ్యూరియస్‌’... ఈ పేరు చెబితే చాలు ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు మురిసిపోతారు. అంతలా ఈ సినిమాల పరంపర యువతరాన్ని ఉర్రూతలూగించింది. వాహనాల రేసులు, మోసాలు, దొంగతనాలు, ఛేజింగ్‌లతో కూడిన ఈ సినిమాల సందడి 2001లో తొలి సినిమాతో మొదలైంది. అది విజయవంతమవడంతో దానికి ఏకంగా ఏడు సీక్వెల్స్‌ వచ్చాయి. ఈ సినిమాలన్నీ కలిసి ప్రపంచ వ్యాప్తంగా 5 బిలియన్‌ డాలర్లను వసూలు చేశాయి. ఈ సినిమాల్లో ఎనిమిదవది ‘ద ఫేట్‌ ఆఫ్‌ ద ఫ్యూరియస్‌’ 2017లో విడుదలై కాసుల వర్షం కురిపించింది. ఇందులో ప్రముఖ నటులు విన్‌ డీసిల్, డానే జాన్సన్, జేసన్‌ స్టథమ్, అందాల తార మిచెల్లీ రోడ్రిగ్వెజ్‌ తదితరులు నటించారు. త్రీడీ, ఐమాక్స్‌ త్రీడీ, ఫోర్‌డీ ఎక్స్‌ లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విడుదలైన ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలు విపరీతంగా ఆకర్షించాయి. ఇది 1.2 బిలియన్‌ డాలర్లను ఆర్జించింది.

* ఆమె ప్రతిభకు అవార్డులే గీటురాళ్లు


ఆస్కార్‌... గోల్డెన్‌గ్లోబ్‌... బాఫ్టా... స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌... ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డులన్నీ ఆమెను వరించి వచ్చాయి. ఆమె నటించిన ఆరు సినిమాలు ‘100 మేటి బ్రిటిష్‌ సినిమాలు’ జాబితాలో స్థానం సంపాదించాయి. ఆమే జూలీ క్రిస్టీ. ‘బిల్లీ లయర్‌’ (1963) సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన క్రిస్టీ, ‘డార్లింగ్‌’ (1965) సినిమాకి ఆస్కార్‌ అవార్డు సాధించింది. ‘డాక్టర్‌ జివాగో’, ‘ఫారెన్‌హీట్‌ 451‘, ‘ద మేడింగ్‌ క్రౌడ్‌’, ‘పెటుల్లా’, ‘ద గో బిట్వీన్‌’, ‘మెకాబే అండ్‌ మిసెస్‌ మిల్లర్‌’, ‘డోన్ట్‌ లుక్‌ నౌ’, ‘షాంపూ’, ‘హెహెన్‌ కెన్‌ వెయిట్‌’లాంటి సినిమాల ద్వారా మంచి నటిగా నిరూపించుకుంది. ప్రపంచ సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ‘ట్రాయ్‌’, ‘హ్యారీపాటర్‌ అండ్‌ ద ప్రిజనర్‌ ఆఫ్‌ అజ్‌బెకన్‌’ సినిమాలతో మరింత ప్రాచుర్యం పొందిన ఈమె పుట్టింది భారతదేశంలో కావడం విశేషం. బ్రిటిష్‌ పాలన కొనసాగుతున్న రోజుల్లో అస్సాంలో 1940 ఏప్రిల్‌ 14న పుట్టిన క్రిస్టీ, తండ్రి నిర్వహించే తేయాకు తోటల్లో పెరిగింది. అమ్మానాన్నా విడిపోయాక తల్లి దగ్గర వేల్స్‌లో పెరిగిన ఈమె నాటకాల ద్వారా నటనా ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగింది.

* నాలుగేళ్ల వయసు నుంచే...


కొందరంతే. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు... బొమ్మలతో ఆడుకునేంత చిన్నతనంలోనే సెలబ్రిటీలుగా మారిపోతారు. ఆపై అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఆకాశానికి ఎదిగిపోతారు. అలాంటిదే సారా మిచెల్లీ గెల్లార్‌. నాలుగేళ్లకే టీవీలో నటించింది. ఆపై బుల్లితెర సీరియల్స్‌లో అవార్డులు అందుకునేంతగా మెప్పించింది. అమెరికా టీవీలో గొప్ప నటిగా పేరు తెచ్చుకుంది. ఆపై వెండితెరపై వెలుగులీని నటిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా ప్రాచుర్యం పొందింది. సినిమాలకి వస్తే, ‘ఐ నో వాట్‌ యు డిడ్‌ లాస్ట్‌ సమ్మర్‌’, ‘స్క్రీమ్‌’, ‘క్రూయల్‌ ఇంటెన్షన్స్‌’, ‘స్కూబీడూ’, ‘ద గ్రడ్జ్‌’, ‘హార్వర్డ్‌ మేన్‌’, ‘సౌత్‌ల్యాండ్‌ టేల్స్‌’, ‘ద ఎయిర్‌ ఐ బ్రీత్‌’ లాంటి సినిమాలతో అందంతో, అభినయంతో అలరించింది. న్యూయార్క్‌లో 1977 ఏప్రిల్‌ 14న పుట్టిన సారా, ఆహార వ్యాపారంతో అమెరికన్లను ఆకట్టుకుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.