ఏప్రిల్‌ 8.. (సినీ చరిత్రలో ఈరోజు)

* స్టైలిష్‌ స్టార్‌ (అల్లు అర్జున్‌ పుట్టిన రోజు-1983)


దక్షిణాదిలో బలమైన అభిమాన గణం ఉన్న కథానాయకుల జాబితాని తీస్తే అందులో మొదటి వరసలో ఉంటారు అల్లు అర్జున్‌. స్టైలిష్‌ స్టార్‌గా పేరు తెచ్చుకొన్న ఆయన యువతరానికి ఓ ఐకాన్‌గా కొనసాగుతున్నారు. తెరపైనే కాదు... బయట కూడా స్టైల్‌గా కనిపిస్తుంటారాయన. ఆయన డ్రెస్‌ సెన్స్, లుక్‌... ఎప్పుడూ ప్రత్యేకమే. తెలుగు కథానాయకుడైనా... మలయళంలో కూడా అక్కడి స్టార్‌ కథానాయకులకి సమానంగా అభిమానులున్నారు. అల్లు అర్జున్‌ని మలయాళం అభిమానులు మల్లు అర్జున్‌ అని పిలుచుకొంటుంటారు. కథానాయకుడిగా పదహారేళ్ల ప్రయాణం ఆయనది. చేసింది కూడా 18 సినిమాలే. కానీ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ సీనియర్‌ కథానాయకులకి దీటుగా ఉంటుంది. ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య మనవడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ తనయుడైన అల్లు అర్జున్‌ 1983 ఏప్రిల్‌ 8న చెన్నైలో జన్మించారు. అక్కడే పద్మ శేషాద్రి పాఠశాలలో చదువుకున్నాడు. పద్దెనిమిదేళ్ల వరకు చెన్నైలోనే పెరిగిన అల్లు అర్జున్‌కి చిన్నప్పట్నుంచే డ్యాన్స్‌పై మక్కువ ఏర్పడింది. జిమ్నాస్టిక్‌ కూడా నేర్చుకున్నారు. ఎనిమిదో తరగతిలో ఉండగా పియానోపై కూడా పట్టు పెంచుకున్నారు. ప్రముఖ కథానాయకుడు చిరంజీవికి అల్లుడైన అల్లు అర్జున్‌ని, మెగా కథానాయకుల్లో ఒకరిగానే పరిగణిస్తుంటారు. చిరు నటించిన ‘విజేత’ సినిమా చిత్రీకరణని చూడటం కోసం సెట్‌కి వెళ్లిన అల్లు అర్జున్‌ అందులో ఓ చిన్న పిల్లవాడి పాత్ర కోసం తొలిసారి కెమెరా ముందుకెళ్లాడు. ఆ తర్వాత ‘స్వాతిముత్యం’లో కమల్‌హాసన్‌ మనవడిగా కూడా కనిపిస్తారు. ‘డాడీ’లో డ్యాన్సర్‌గా ఓ అతిథి పాత్రలో తళుక్కున మెరిసిన అల్లు అర్జున్‌ 2004లో ‘గంగోత్రి’ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకొంది. ఆ తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో ‘ఆర్య’ చేశాడు. ఆ చిత్రంతో ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, ఉత్తమ నటుడిగా నంది స్పెషల్‌ జ్యూరీ పురస్కారం అందుకొన్నారు. ‘బన్ని’, ‘హ్యాపీ’, ‘దేశముదురు’, ‘పరుగు’ తదితర చిత్రాలతో మాస్‌ కథానాయకుడిగా ఎదిగారు అల్లు అర్జున్‌. ‘ఆర్య2’, ‘వరుడు’, ‘వేదంత’ చిత్రాలతో నటుడిగా తానేంటో నిరూపించుకొన్న ఆయన, ‘జులాయి’తో ఘన విజయాన్ని సొంతం చేసుకొన్నాడు. ‘ఇద్దరమ్మాయిలతో’, ‘రేసుగుర్రం’, ‘ఎవడు’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘సరైనోడు’ చిత్రాలతో ఆయన స్థాయి మరింత పెరుగుతూ వచ్చింది. ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డిగా నటించి మెప్పించారు. ‘దువ్వాడ జగన్నాథం’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రాలతో ఆయన అభిమానుల్ని మెప్పించారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌తో సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. తన 20వ చిత్రాన్ని సుకుమార్‌ దర్శకత్వంలో చేయడానికి ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారు. అల్లు అర్జున్‌ హైదరాబాద్‌కి చెందిన స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. వీరికి అబ్బాయి అయాన్‌తో పాటు, అమ్మాయి అర్హ ఉన్నారు. ఈరోజు అల్లు అర్జున్‌ పుట్టినరోజు.

* అలా మొదలు పెట్టింది

(నిత్యమేనన్‌ పుట్టిన రోజు-1988)

కథానాయికలంతా అందంగానే ఉంటారు. కానీ... అభినయంలోనూ పట్టున్న భామలు మాత్రం అరుదుగా కనిపిస్తుంటారు. కేరళ కుట్టి నిత్యమేనన్‌.. అటు అందంలోనూ, ఇటు అభినయంలోనూ తనకి తానే సాటి అని నిరూపించుకొంది. అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతూ తన ప్రత్యేకమైన ప్రతిభని బయట పెడుతూ ఉంటుంది నిత్య. మలయాళ కుటుంబానికి చెందిన నిత్య బెంగుళూరులో 1988, ఏప్రిల్‌ 8న జన్మించింది. మణిపాల్‌ విద్యాసంస్థల్లో పాత్రికేయ విద్యని అభ్యసించింది. నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదట ఆమె. అందుకే జర్నలిజంలో చేరింది. కానీ ఆ తర్వాత మనసు మార్చుకొని తనకి ఇష్టమైన ఫొటోగ్రఫీవైపు వెళ్లాలనుకొంది. ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టిఐఐ)లో సినిమాటోగ్రఫీ కోర్సు చేయాలనుకొంటున్న కమ్రంలోనే దర్శకురాలు నందిని రెడ్డి పరిచయమైయ్యారు. ఆమె ప్రోద్బలంతోనే కథానాయికగా ‘అలా మొదలైంది’తో తెలుగు తెరకు పరిచయమయ్యారు నిత్య. అంతకుముందు కొన్ని కన్నడం, మలయాళం చిత్రాల్లో బాలనటిగానూ, కీలక పాత్రల్లోనే నటించిన అనుభవం ఉంది నిత్యకి. అయితే పూర్తిస్థాయిలో చేసిన తొలి చిత్రం మాత్రం ‘అలా మొదలైంది’. అది ఘన విజయం సాధించడంతో నిత్య పేరు మార్మోగిపోయింది. అందులో నటించడంతోపాటు, రెండు పాటలు కూడా పాడారు నిత్య. అప్పట్నుంచి ఒక భాషతో సంబంధం లేకుండా దక్షిణాదిలోని నాలుగు భాషల్లో నటిస్తూ వచ్చారు నిత్య. తెలుగులో ‘ఇష్క్‌’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘రుద్రమదేవి’ తదితర చిత్రాల్లో నటించి విజయాలు అందుకున్నారు నిత్య. ‘24’, ‘జనతా గ్యారేజ్‌’, ‘అ’, ‘గీత గోవిందం’లో పాత్రలు కూడా నిత్యకి మంచి పేరు తీసుకొచ్చాయి. ‘ప్రాణ’తో హిందీలోకి అడుగుపెట్టిన ఆమె, అక్కడే ప్రస్తుతం ‘మిషన్‌ మంగళ్‌’ అనే చిత్రం చేస్తోంది. ఈరోజు నిత్య పుట్టినరోజు.

* ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే

(అనంత శ్రీరామ్‌ పుట్టిన రోజు-1984)


‘ఓ పడుచు బంగారమా... పలకవే సరిగమ, చిలిపి శృంగారమ... చిలకవే మధురిమ’ అంటూ సాగే ‘అందరివాడు’ చిత్రంలోని పాట అనంతశ్రీరామ్‌ని ప్రత్యేకంగా పరిచయం చేసింది. కుర్రాడు భలే రాశాడని అప్పట్లో అప్పట్లో ఆయనకి ప్రశంసలు వెల్లువెత్తాయి. అది మొదలు ఆయన కలం మెరుపులు మెరిపిస్తూనే ఉంది. ‘అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి..’, ‘నిజంగా నేనేనా... ఇలా నీ జతలో ఉన్నా...’, ‘పరారె పరారె...’, ‘నమ్మవేమో కానీ... ’ ఇలా అనంతశ్రీరామ్‌ నుంచి వచ్చిన ప్రతి పాటనీ శ్రోతలు ప్రత్యేకంగా పాడుకొన్నారు. పాలకొల్లు సమీపంలోని దొడ్డిపట్ల అనే గ్రామంలో సీవీవీ సత్యనారాయణ, ఉమారాణి దంపతులకి 1984 ఏప్రిల్‌ 8న జన్మించారు అనంతశ్రీరామ్‌. 12 యేళ్ల వయసులోనే పాటలు రాయడం ప్రారంభించిన అనంతశ్రీరామ్‌ తొలుత ‘ఔననిలే’ చిత్రంతో పరిశ్రమకి పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘ఒక ఊరిలో’, ‘ఏవండోయ్‌ శ్రీవారు’ చిత్రాలకి రాశారు. ‘అందరివాడు’లో పాటే ఆయనకి మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. ఆ తర్వాత చిరంజీవి పిలిచి మరీ ‘స్టాలిన్‌’లో గీతాల్ని రాయించారంటే అనంతశ్రీరామ్‌ కలం బలం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కవితలు రాసే అలవాటున్న అనంతశ్రీరామ్‌కి సాహిత్యంవైపు దృష్టి మళ్లడానికి ఆయన తండ్రి రసధుని అనే సంస్థకి గౌరవాధ్యక్షుడిగా ఉంటూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఓ కారణమట. బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాలలో చేరిన ఆయన మూడో యేడాదిలోనే మానేసి, పాటలవైపు పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. ‘స్టాలిన్‌’, ‘పరుగు’, ‘ఆకాశమంత’, ‘మున్నా’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’, ‘బృందావనం’, ‘చందమామ’, ‘కొత్తబంగారులోకం’, ‘సత్యమేవ జయతే’, ‘అరుంధతి’, ‘ఏమాయ చేసావె’... ఇలా వరుసగా గీతాలు రాస్తూ విజయాల్ని సొంతం చేసుకొన్నారు. ఇటీవల ఆయన రాసిన పాటలు సంచలనాల్ని సృష్టించాయి. ‘బాహుబలి ది బిగినింగ్‌’లో ‘పచ్చబొట్టేసినా పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా..’, ‘గీత గోవిందం’లో ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..’ పాట విశేష ప్రాచుర్యం పొందాయి. అనంతశ్రీరామ్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొనేలా చేశాయి. చక్కటి భాష, భావుకత, శబ్ద సౌందర్యం మేళవింపుతో పాటలు రాస్తుంటారు అనంతశ్రీరామ్‌. ఎ.ఆర్‌.రెహమాన్, ఇళయరాజా, ఎమ్‌.ఎమ్‌.కీరవాణి వంటి అగ్ర సంగీత దర్శకుల చిత్రాలకి తరచుగా పాటలు రాస్తుంటారు అనంతశ్రీరామ్‌. పద్నాలుగేళ్ల సినీ ప్రయాణంలో ఆయన దాదాపుగా 850 పైచిలుకు గీతాల్ని రాశారు. ‘సాక్ష్యం’ చిత్రంలో ఓ కీలక పాత్రలో కూడా మెరిశారు. రాజకీయ నాయకులు చేగొండి హరిరామజోగయ్య అనంతశ్రీరామ్‌కి పెదనాన్న అవుతారు. ఈ రోజు అనంతశ్రీరామ్‌ పుట్టినరోజు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* ఉంగరాల జుట్టమ్మాయి

ఆమెను అందరూ ‘గర్ల్‌ విత్‌ కర్ల్స్‌’ అని పిలిచేవారు. అంత అందంగా, ఉంగరాలు తిరిగిన శిరోజాలు ఆమెవి. ఆమెకు మరో పేరు ఉంది, ‘క్వీన్‌ ఆఫ్‌ మూవీస్‌’ అని. అంతగా నటిగా ఆమె ఆకట్టుకుంది. ఈ రెండే కాదు... ఆమెకు మరో ముద్దు పేరు ఉంది. అది... ‘అమెరికాస్‌ స్వీట్‌ హార్ట్‌’. అంతగా ఆమె తన అందంతో సినీ ప్రేక్షకులను సమ్మోహితులను చేసింది. ఆమే మేరీ పిక్‌ఫోర్డ్‌. అసలు పేరు గ్లాడీస్‌ లూయిస్‌ స్మిత్‌. నటిగా, నిర్మాతా 50 ఏళ్ల ప్రస్థానం ఈమెది. పిక్‌ఫోర్డ్‌ ఫెయిర్‌బ్యాంక్స్‌ స్టూడియో, యునైటెడ్‌ ఆర్టిస్ట్స్‌ (చార్లీ చాప్లిన్‌) స్టూడియోల్లో భాగస్వామి. అంతేకాదు, ఆస్కార్‌ అవార్డులను ఏటా అందించే ‘అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌’ వ్యవస్థాపకుల్లో ఒకరు కూడా. ఆస్కార్‌ అవార్డుల చరిత్రలో ఉత్తమ నటిగా రెండో ఆస్కార్‌ను ఆమె, ‘కొకెట్టే’ (1929) సినిమాకు అందుకుంది. అలాగే ఆస్కార్‌ సంస్థ నుంచి గౌరవ పురస్కారాన్ని కూడా 1976లో అందుకున్న తార. హాలీవుడ్‌ సినీ చరిత్రలో గొప్ప తారల్లో 24వ స్థానాన్ని పొందిన ఆమె, కెనడాలో 1892 ఏప్రిల్‌ 8న పుట్టి, చిన్నతనంలోనే నాటకాల ద్వారా నటనా ప్రస్థానానికి నాంది పలికింది. ఆపై సినీ రంగంలోకి వచ్చి 52 సినిమాల్లో నటించి అంచెలంచెలుగా ఎదిగిన ఈమె, కాలిఫోర్నియాలో 1979 మే 29న, తన 87 ఏళ్ల వయసులో మరణించింది.

* బుల్లితెర అందం... వెండితెర చందం

టీవీల ద్వారా ఆమె అమెరికా అంతా తెలుసు... సినిమాల ద్వారా ఆమె ప్రపంచమంతా తెలుసు... అందచందాలతో, అభినయంతో ఇంటాబయటా మెప్పించిన ఆమె రాబిన్‌ రైట్‌. టీవీల్లో ఆమె నటనకు ఏడు ప్రైమ్‌టైమ్‌ ఎమ్మీ నామినేషన్లు, గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డు, శాటిలైట్‌ అవార్డ్‌లు గీటురాళ్లు. ‘శాంటాబార్బారా’, ‘హౌస్‌ ఆఫ్‌ కార్డ్స్‌’ టీవీ కార్యక్రమాలతో మురిపించిన ఆమెకు వెండితెర స్వాగతం పలికింది. ‘ద ప్రిన్సెస్‌ బ్రైడ్‌’ (1987)తో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న రాబిన్‌ రైట్, ఆ తర్వాత ‘ఫారెస్ట్‌ గంప్‌’, ‘మెస్సేజ్‌ ఇన్‌ ఎ బాటిల్‌’, ‘అన్‌బ్రేకబుల్‌’, ‘ద కాన్పిరేటర్‌’, ‘మనీబాల్‌’, ‘ద గర్ల్‌ విత్‌ ద డ్రాగన్‌ టాటూ’, ‘ఎవరెస్ట్‌’, ‘వండర్‌ ఉమన్‌’, ‘ద బ్లేడ్‌ రన్నర్‌ 2049’ లాంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. టెక్సాస్‌లో 1966 ఏప్రిల్‌ 8న పుట్టిన రాబిన్‌ రైట్, పద్నాలుగేళ్లకే మోడల్‌ రంగంలో ప్రవేశించి, పద్దెనిమిదేళ్లకల్లా బుల్లి తెరపై సందడి చేసింది. ఆపై వెండితెరపై వెలుగులీనింది.

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.