ఆగస్టు 23.. (సినీ చరిత్ర ఈరోజు)
* ఐటెం పాటలకు చిరునామా..ఈ ‘కెవ్వు కేక’ భామ! (మలైకా అరోరా పుట్టినరోజు-1973)


‘‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు..’’ అని ఓ వాణిజ్య ప్రకటనలో అన్నట్లు.. చిత్రసీమలో పేరు, ప్రఖ్యాతులు కూడా అంత సులభంగా ఏం దక్కవు. ఎంతటి ప్రతిభ ఉన్నా.. దాన్ని చూపించ దగ్గ పాత్ర, సరైన సమయం రాకపోతే.. ఎన్నేళ్లయినా చిత్రసీమలో మరుగున పడిపోయి ఉండాల్సిందే. బాలీవుడ్‌ నటి మలైకా అరోరా కూడా ఇలాంటి కోవకు చెందినదే. 1973 ఆగస్టు 23న మహారాష్ట్రలోని థానేలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. 1998లో షారుఖ్‌ కథానాయకుడిగా నటించిన ‘దిల్‌ సే’ సినిమాతో వెండితెరపై తళుక్కున మెరిసింది. ఇందులో ‘‘చల్‌ ఛయ్య ఛయ్య ఛయ్యా ఛయ్యా’’ గీతానికి కింగ్‌ ఖాన్‌తో స్టెప్పులేసిన ఈ భామ.. తొలి ఐటెం గీతంతోనే కుర్రకారుకు కిరాకునెక్కించే కిక్కు అందించింది. ఏఆర్‌ రహమాన్‌ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ ప్రత్యేక గీతంతో అలైకా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకుంది. ‘దిల్‌సే’ విజయంలో ఎంతో కీలకంగా నిలిచిన ఈ పాట.. తర్వాతి కాలంలో మలైకాను ఐటెం గీతాల మహరాణిగా మార్చివేసింది.


ఈ జోరులోనే ‘‘గురు నాలా ఇష్క్‌ మిఠా’’, ‘‘మాహీ వే..’’, ‘‘కాల్‌ ధమాల్‌..’’ వంటి ప్రత్యేక గీతాలతో బాలీవుడ్‌ సినీ ప్రియులను ఒక ఊపు ఊపేసింది. మత్తెక్కించే చూపులు, చూపు తిప్పుకోనివ్వని స్టెప్పులతో వెండితెరపై మలైకా చేసే మాయాజాలం సినీ ప్రియులపై ఓ సమ్మోహన అస్త్రంలా పనిచేసేది. ప్రతి చిత్రంలో మలైకా తెరపై కనిపించేది కొద్ది నిమిషాల పాటలోనే అయినా.. ఆ తక్కువ సమయంలోనే తన అందం, అభినయం, అద్భుతమైన హావభావాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేది. ఇక 2000 సంవత్సరం తర్వాత వచ్చిన ‘మా తుఝే సలామ్‌’, ‘ఓమ్‌ శాంతి ఓమ్‌’, ‘ఈఎంఐ’, ‘హెలో ఇండియా’, ‘హౌస్‌ ఫుల్‌’ చిత్రాల్లో చిన్నా చితకా పాత్రల్లో మెరిసినా అవి మలైకా కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇలాంటి సమయంలో తన భర్త అర్బాజ్‌ ఖాన్‌తో కలిసి నిర్మించిన ‘దబాంగ్‌’ చిత్రంతో మరోసారి దేశం మొత్తాన్ని తనవైపు చూసేలా చేసింది. సల్మాన్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ‘‘మున్నీ బదనాం హూయి’’ ఐటెం సాంగ్‌తో సినీ ప్రియులను మరోసారి ఉర్రూతలూగించింది. ఈపాట అప్పట్లో యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ దక్కించుకున్న తొలి భారతీయ పాటగానూ అరుదైన రికార్డును దక్కించుకోవడం విశేషం. ఈ సినిమాకు గానూ ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ఫిలింఫేర్‌ అవార్డును అందుకుంది మలైకా. ఈ సినిమాను తెలుగులో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా ‘గబ్బర్‌ సింగ్‌’ పేరుతో తెరకెక్కించగా.. ఇందులో ‘‘కెవ్వు కేక’’ గీతంతో పవన్‌ సరసన స్టెప్పులు వేసి తెలుగు ప్రేక్షకుల చేత కేకలు పెట్టించింది. ‘దబాంగ్‌2’, ‘డాలి కి డోలి’ చిత్రాల తర్వాత పూర్తిగా వెండితెరకు దూరమైన ఈ ప్రత్యేక సుందరి.. ప్రస్తుతం బుల్లితెరపై పలు డ్యాన్స్‌ కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా చేస్తోంది.* సంచలనాల పెళ్లి!
వాళ్లిద్దరూ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. కలిసి తిరిగినా, కలిసిమెలిసి సహజీవనం చేసినా... దేశదేశాల్లో వార్తే. అలాంటిది ఆరేళ్ల అనుబంధం తర్వాత పెళ్లి చేసుకున్నారంటే ఎంత సంచలనం! అలా ఒకటైన జంటే ఏంజెలినా జోలీ, బ్రాడ్‌పిట్‌. వీళ్లిద్దరి వివాహం 2014 ఆగస్టు 23న ఫ్రాన్స్‌లో జరిగింది. అప్పటికి జోలీకి 39, బ్రాడ్‌పిట్‌కి 50 ఏళ్లు. వాళ్లిద్దరి పెళ్లికి వాళ్ల పిల్లలు ఆరుగురు ముఖ్య అతిథులు. ఇద్దరు పిల్లల చేయి పట్టుకుని జోలీ ముసిముసి నవ్వులతో వస్తుంటే, మరో ఇద్దరు పిల్లలు పువ్వులు జల్లారు. ఇంకో ఇద్దరు పిల్లలు పెళ్లి ఉంగరాన్ని తీసుకువచ్చారు. పిట్‌కిది రెండో వివాహం. మొదటి భార్య జెన్నిఫర్‌ అనిస్టన్‌ను 2000లో పెళ్లి చేసుకుని 2005లో వదిలేశాడు. జోలీ అంతకు ముందు బ్రిటిష్‌ నటుడు జోనీ లీమిల్లర్, బిల్లీ బాబ్‌ థోర్న్‌టన్‌లతో చెరో మూడేళ్లు వివాహబంధంలో ఉండి విడాకులిచ్చేసింది. జోలీ, పిట్‌లిదదరూ 2005లో ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ స్మిత్‌’ సినిమా షూటింగ్‌లో ప్రేమలో పడ్డారు. జోలీ ఉత్తమ సహాయ నటిగా ‘గర్ల్‌ ఇంటరప్టెడ్‌’ (1999) సినిమాకు ఆస్కార్‌ అందుకోగా, పిట్‌ ఉత్తమ నిర్మాతగా ‘12 ఇయర్స్‌ ఎ స్లేవ్‌’ (2014) సినిమాకు ఆస్కార్‌ అందుకున్నాడు. ఈ ఇద్దరు ఆస్కార్‌ సెలబ్రిటీల అనుబంధం విడిపోవడాలు, కలవడాలతో ఇప్పటికీ వార్తల్లో ఉండడం విశేషం.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.