ఆగస్టు 29.. (సినీ చరిత్రలో ఈరోజు)
* పిల్లల కోరికపై తండ్రి తీసిన సినిమా!
‘నాన్నా! ఈ కథలు చాలా బాగున్నాయి. వీటిని సినిమాగా తీయవా?’ అని అడిగారు ఆ పిల్లలు.
‘ఓ తప్పకుండా తీసేద్దాం...’ అన్నాడా తండ్రి.
కథలు చదివే పిల్లలెవరూ అడగని కోరిక అదయితే, ఆ కోరికను తీర్చిన ఆప్యాయత ఆ తండ్రిది.
ఇంతకీ ఆ తండ్రి ఎవరో తెలుసా?


ప్రపంచ వ్యాపంగా వినోద రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన వాల్ట్‌డిస్నీ. యానిమేషన్‌ పాత్రలు, సినిమాలు, వినోదాల డిస్నీలాండ్‌ పార్కుల రూపకర్తగా పేరొందిన వాల్ట్‌డిస్నీ, తన పిల్లల కోరికపై తీసిన ఆ సినిమా ‘మేరీ పాపిన్స్‌’. పి.ఎల్‌. ట్రావెర్స్‌ అనే ఓ బ్రిటిష్‌ రచయిత్రి ‘మేరీ పాపిన్స్‌’ పేరుతో 1934 నుంచి 1988 వరకు ఎనిమిది పుస్తకాలను పిల్లల కోసం రాశారు. కథలు, పాటలు, విచిత్రమైన పాత్రలతో ఉండే ఆ బొమ్మల పుస్తకాలు దేశదేశాల పిల్లల్ని విపరీతంగా ఆకర్షించాయి. వాటిని ఎంతో ఇష్టంగా చదివే వారు వాల్ట్‌డిస్నీ ఇద్దరు కూతుళ్లు. వాళ్లు అడిగిన కోరిక విచిత్రమైనదే అయినా డిస్నీ దాన్ని నెరవేర్చడానికి 23 ఏళ్లు పట్టింది. ఆ పుస్తకాల హక్కులు కొనడానికి చేసిన ప్రయత్నాలు అప్పటికి కానీ నెరవేరలేదు. విచిత్రమైన పాత్రలు, అతీత శక్తులు, సాహసాలతో కూడిన ఆ సినిమాను డిస్నీ ‘లైవ్‌ యాక్షన్‌ అండ్‌ యానిమేషన్‌’ కలయికలతో తీశాడు. అందులో మేరీ పాపిన్స్‌ పిల్లల్ని ప్రేమతో పెంచే ఆయా (నానీ)లాంటి పాత్ర. లండన్‌లో నిర్లక్ష్యానికి గురయ్యే పిల్లల కుటుంబాల దగ్గరకి ఆమె వెళ్లి, పిల్లల ఆయాగా కుదిరి, వారి సమస్యలను మహిమలతో పరిష్కరించే పాత్ర. పాటలు, పద్యాలు, ఆటలు, అల్లరితో కూడి ఉండే ఈ సినిమా 1964 ఆగస్టు 27న విడుదలై సంచలనం సృష్టించింది. 13 ఆస్కార్‌ నామినేషన్లు పొంది, అయిదు అవార్డులను అందుకుంది. దాదాపు 6 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 102 మిలియన్‌ డాలర్లకు పైగా ఆర్జించింది. దీనికి కొనసాగింపుగా ‘మేరీ పాపిన్స్‌ రిటర్న్స్‌’ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌ 19న విడుదల కానుంది.

* మ మ మ మాస్‌ (నాగార్జున పుట్టిన రోజు-1959)
మాస్‌ కథానాయకుడు అనే మాటకి అసలు సిసలు నిర్వచనం నాగార్జున. ‘శివ’ అంటూ సైకిల్‌ చైన్‌ పట్టి యువతరాన్ని అలరించిన ఆయనే... ‘అల్లరి అల్లుడు’గా కుటుంబ కథల్లోనూ ఒదిగిపోయారు. ‘మన్మథుడు’గా మగువల మనసునూ దోచారు. ఆ తర్వాత ‘అన్నమయ్య’ అంటూ భక్తిభావాన్నీ పండించారు. నటుడిగా ఎన్ని ప్రయోగాలు చేయొచ్చో నాగార్జున కెరీర్‌ని చూస్తే బాగా అర్థమవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ కొత్త ప్రయత్నం, ఓ సాహసోపేతమైన ప్రయత్నం అంటే అది నాగార్జున నుంచే వస్తుందన్నంతగా ఆయన కథల్ని ఎంపిక చేసుకొన్నారు. త్వరలోనే నటుడిగా వంద సినిమాల మైలురాయిని అందుకోబోతున్నారు నాగ్‌. కథానాయకుడిగానే కాకుండా.. ఉత్తమ అభిరుచిగల నిర్మాతగా కూడా పేరు తెచ్చుకున్నారు.


ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు నాగార్జున. 1959 ఆగస్టు 29న మద్రాసులో జన్మించిన ఈయన హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్యను, లిటిల్‌ ప్లవర్‌ స్కూల్‌లో ఇంటెర్మీడియట్‌ విద్యను అభ్యసించారు. తరువాత మద్రాస్‌లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివారు. ఆ తర్వాత సినీరంగ ప్రవేశంచేశారు. నాగార్జున మొదటి చిత్రం ‘విక్రమ్‌’ 1986 మే 23లో విడుదల అయింది. ఈ చిత్రం హిందీ చిత్రం ‘హీరో’కి రీమేక్‌గా తెరకెక్కింది. తరువాత నాలుగు చిత్రాలలో నటించాక ‘మజ్ను’ చేశారు. కథానాయకుడిగా విషాదాన్ని పండించారు. ఆ తరహా పాత్రలు పోషించటంలో నాగార్జున తండ్రి, నాగేశ్వరరావు సుప్రసిద్ధులు. ఆరంభంలో విజయం కోసం చెమటోడ్చాల్సి వచ్చింది నాగార్జునకి. ఎట్టకేలకి శ్రీదేవితో కలిసి నటించిన ‘ఆఖరి పోరాటం’తో తొలి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం ‘గీతాంజలి’లో నటించారు. అదొక ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. అద్భుతమైన సంగీతం, మంచి కథతో వచ్చిన ఈ చిత్రం నాగార్జునను ప్రేమ కథా చిత్రాల నాయకుడిగా నిలబెట్టింది. మణిరత్నం నేరుగా తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం ఇదే. ఆ తర్వాత రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన యాక్షన్‌ చిత్రం ‘శివ’లో కథానాయకుడిగా నటించారు నాగ్‌.ఈ రెండు చిత్రాలు పెద్ద విజయం సాధించి నాగ్‌ని విజయవంతమైన తెలుగు కథానాయకుల సరసన నిలబెట్టాయి. నాగార్జున కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడంలో ముందుంటారు. ఆ విషయం ‘శివ’ నుంచే స్పష్టమవుతూ వస్తోంది. తన కెరీర్‌లో ఎంతోమంది కొత్త దర్శకులకి అవకాశాలు ఇచ్చారు. అదే స్థాయిలో విజయాల్ని అందుకొన్నారు. ‘ప్రెసిడెంట్‌ గారి పెళ్లాం’, ‘హలో బ్రదర్‌’ వంటి చిత్రాలు ఈయనకు మాస్‌ హీరో అన్న పేరును తెచిపెట్టాయి. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ‘నిన్నే పెళ్లాడుతా’ ఘన విజయాన్ని అందుకుంది. ఆ చిత్రంతో అమ్మాయిల కలల రాకుమారుడనే ఇమేజ్‌ని సొంతం చేసుకొన్న నాగ్, ఆ వెంటనే అందరినీ విస్మయానికి గురిచేస్తూ వాగ్గేయకారుడు అన్నమయ్యగా నటించడానికి పూనుకున్నారు. నాగార్జున ఏంటి? అన్నమయ్యగా నటించడమేంటి? అని ఆ ప్రయత్నంపై మొదట్లో చాలామంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా... నాగ్‌ మాత్రం సాహసమే ఊపిరి అన్నట్టుగా ముందడుగు వేశారు. సవాల్‌గా స్వీకరించి అన్నమయ్య పాత్రలో ఒదిగిపోయారు. మొదట సినిమాకి మిశ్రమస్పందన లభించినా... మౌత్‌ టాక్‌ పెరిగేకొద్దీ ఆ సినిమాకి విశేష ఆదరణ లభించింది. బండ్లు కట్టుకొని మరీ థియేటర్లకి వెళ్లారు ప్రేక్షకులు. ఈ చిత్రానికి గాను నాగార్జున రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా నాగ్‌ నటనకి ప్రశంసలు లభించాయి. ‘అన్నమయ్య’ చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నారు. ‘సంతోషం’, ‘మన్మథుడు’, ‘మాస్‌’, ‘డాన్‌’, ‘కింగ్‌’ తదితర చిత్రాలతో విజయాల్ని అందుకున్నారు నాగార్జున. 2006లో నాగార్జున మరోసారి ‘శ్రీ రామదాసు’లో ముఖ్య పాత్రైన రామదాసుగా నటించి విమర్శకుల ప్రశంశలందుకున్నారు. ఈ చిత్రంలో నటనకు కూడా నాగార్జున రాష్ట్ర ప్రభుత్వం నుండి మరోసారి ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. గత ఎనిమిదేళ్లుగా నాగ్‌ ప్రయాణం మరింత వైవిధ్యంగా సాగుతోంది. మంచి కథల్ని ఎంపిక చేసుకొంటూ, నటుడిగా తన అనుభవాన్ని ప్రదర్శిస్తూ సినిమాలు చేస్తున్నారు. ‘రగడ’, ‘గగనం’, ‘రాజన్న’, ‘గ్రీకువీరుడు’, ‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘ఊపిరి’, ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రాలతో నాగార్జున సత్తా చాటారు. నటనలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూనే విజయాల్ని అందుకున్నారు. ప్రస్తుతం నానితో కలిసి మల్టీస్టారర్‌ చిత్రం ‘దేవదాస్‌’లో నటిస్తున్నారు. దేవ అనే డాన్‌ పాత్రని పోషిస్తున్నారు నాగ్‌. తెలుగులోనే కాకుండా.. హిందీలోనూ నాగ్‌కి మంచి గుర్తింపు ఉంది. అక్కడ ‘శివ’ రీమేక్‌తో తొలిసారి పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘ఖుదాగవా’ చేశారు. ఈమధ్యే మళ్లీ హిందీలో కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’లో నటించేందుకు ఒప్పకున్నారు. తమిళంలోనూ ధనుష్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్‌ బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే నటుడిగా, నిర్మాతగా విజయాల్ని అందుకొంటున్నారు నాగ్‌. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల హయాం చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలు తెలుగు చిత్ర పరిశ్రమకి నాలుగు మూలస్థంభాలుగా నిలిచారు. నాగార్జున కుటుంబమంతా చిత్ర పరిశ్రమలోనే ఉంది. ఆయన భార్య అమల ఒకప్పుడు కథానాయికగా నటించారు. ప్రస్తుతం కీలకమైన పాత్రల్ని ఎంపిక చేసుకొంటూ పలు భాషల్లో సినిమాలు చేస్తున్నారు. నాగార్జునకి కుమారులు నాగచైతన్య, అఖిల్‌ కథానాయకులుగా రాణిస్తున్నారు. కోడలు సమంత కథానాయిక. మేనల్లుళ్లు సుమంత్, సుశాంత్‌లు కూడా కథానాయకులే. ఈ రోజు నాగ్‌ పుట్టినరోజు.

* పందెంకోడి (విశాల్‌ పుట్టిన రోజు-1977)
తెలుగు... తమిళ భాషల్లో సమానంగా క్రేజ్‌నీ మార్కెట్‌ని సంపాదించుకున్న కథానాయకుల్లో విశాల్‌ ఒకరు. స్వతహాగా తెలుగువారైన ఆయన తమిళ చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డారు. కానీ ఆయన నటించే ప్రతి సినిమా తెలుగులో అనువాదమవుతూ ఉంటుంది. దాంతో తెలుగులోనూ ఆయనకి అభిమానులున్నారు. ప్రముఖ నిర్మాత జి.కె.రెడ్డి, జానకీదేవి దంపతులకి 29 ఆగస్టు 1977న చెన్నైలో జన్మించారు విశాల్‌. చెన్నైలోని లయోలా కాలేజీలో విజువల్‌ కమ్యూనికేషన్‌ చదువుకున్నారు. ప్రముఖ నటుడు, దర్శకుడైన అర్జున్‌ వద్ద సహాయ దర్శకునిగా సినీ ప్రయాణాన్ని ఆరంభించారు విశాల్‌. 2004లో ‘చెల్లమే’ అనే సినిమాతో కథానాయకుడిగా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత సందకోళి, తిమిరు సినిమాలతో విజయం అందుకున్నారు. సందకోళి తెలుగులో పందెంకోడిగా విడుదలై ఘన విజయం సాధించింది. ఆ పేరుకు తగ్గట్టుగానే ఆయన ఆ సినిమాలో కనిపించారు. స్వతహాగా ఆయన వ్యక్తిత్వం కూడా అలాగే ఉంటుంది. తప్పు అనిపిస్తే ఎదుటివ్యక్తి ఎవరని కూడా చూడకుండా తన గళాన్ని గట్టిగా వినిపించడం విశాల్‌ శైలి. నటుడిగానే కాకుండా, తన వ్యక్తిత్వంతోనూ అభిమానుల్ని సంపాదించుకున్నారాయన. విశాల్‌ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పేరుతో నిర్మాణ సంస్థని ఆరంభించి అందులో వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. విశాల్‌ సోదరుడు విక్రమ్‌ కృస్ణ కూడా నిర్మాతే. ప్రస్తుతం విశాల్‌ తమిళ నటీనటుల సంఘమైన నడిగర్‌ సంఘానికి ప్రధానకార్యదర్శిగా కొనసాగుతున్నారు. సంఘంలో అవినీతి జరుగుతోందని గట్టిగా తన వాదనని వినిపిస్తూ, కొత్త కార్యవర్గం కోసం పట్టుబట్టారు. ఎన్నికల్లో తన ప్యానెల్‌ని గెలిపించుకొని సంచలనం సృష్టించారు. నడిగర్‌ సంఘంలో పలు సంస్కరణలకి కారణమయ్యారు. సామాజిక స్పృహ, సేవాభావం మెండుగా ఉన్న విశాల్‌ తాను కథానాయకుడిగా నటించే సినిమాలకి వచ్చే డబ్బులో కొంతభాగం రైతుల కోసం కేటాయిస్తుంటారు. ఒకొక్క టికెట్టుపై ఒక్కో రూపాయి రైతులకి చెందాలనేది ఆయన అభిమతం. ‘అభిమన్యుడు’ సినిమాకి వచ్చిన ఆదాయంలో అలా ఒక్కో టికెట్టుపై ఒక్కో రూపాయి లెక్కగడుతూ రైతులకి అందజేశారు. త్వరలోనే ‘పందెంకోడి2’తో సందడి చేయబోతున్నారు విశాల్‌.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.