ఫిబ్రవరి 13 (సినీ చరిత్రలో ఈరోజు)...

కళాత్మక దర్శకుడు.. బాలు మహేంద్ర (వర్థంతి)


సంత కోకిల... నిరీక్షణ... సంధ్యారాగం, చక్రవ్యూహం, సతీలీలావతి తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన దర్శకుడు బాలుమహేంద్ర. ‘తరం మారింది’, ‘సొమ్మొకడిది సోకొకడిది’, ‘లంబాడోళ్ళ రామదాసు’, ‘మనవూరి పాండవులు’, ‘శంకరాభరణం’, ‘సీతాకోక చిలుక’, ‘పల్లవి అనుపల్లవి’ తదితర చిత్రాలకి ఛాయాగ్రాహకుడిగా పనిచేసి, తన కెమెరా మాయాజాలంలో అద్భుతమైన సన్నివేశాల్ని తెరపై ఆవిష్కరించిన ఘనత ఆయనది. ఛాయాగ్రాహకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన సినీ రంగంలో కొనసాగారు. దక్షిణాదిలోని నాలుగు భాషలతో పాటు... హిందీ పరిశ్రమలోనూ ఆయన పనిచేసి అభిమానుల్ని సంపాదించుకొన్నారు. బాలుమహేంద్ర సినిమాల్ని స్ఫూర్తిగా తీసుకొని చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన వాళ్లు ఎంతోమంది. కళాత్మక దర్శకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. వివిధ విభాగాల్లో ఐదు జాతీయ పురస్కారాల్ని సొంతం చేసుకొన్నారు. 1939 మే 20న శ్రీలంకలో స్థిరపడిన తమిళ కుటుంబంలో జన్మించారు బాలుమహేంద్ర. ఆయన అసలు పేరు బాలనాథన్‌ బెంజిమన్‌ మహేంద్రన్‌. శ్రీలంకలోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసిన ఆయన, 13 యేళ్ల వయసులో డేవిడ్‌ లీన్‌ దర్శకత్వం వహించిన ‘ది బ్రిడ్జ్‌ ఆన్‌ ది రివర్‌ క్వాయ్‌’ చిత్రం చూసి సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. లండన్‌ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసిన అనంతరం శ్రీలంక ప్రభుత్వంలో డ్రాఫ్ట్స్‌మన్‌గా ఉద్యోగం సంపాదించారు. కొన్నాళ్ల తర్వాత పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో అడ్మిషన్‌ పొందారు. అక్కడ ఫొటోగ్రఫీలో డిప్లొమా పూర్తి చేశారు. ఆ తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 20 సినిమాలకి ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన అనంతరం ఆయన కన్నడలో ‘కోకిల’ అనే చిత్రంతో దర్శకుడిగా మారారు. 36 యేళ్ల కాలంలో 20 సినిమాలకి దర్శకత్వం వహించారు. పి.భారతీరాజా, మహేంద్రన్‌లతో పాటుగా తమిళ చిత్ర పరిశ్రమలో ఓ ట్రెండ్‌సెట్టర్‌గా పేరు తెచ్చుకొన్నారు. మంచి కథకుడిగా, ఎడిటర్‌గా కూడా ఆయనకి పేరుంది. తన కెరీర్‌ చివరలో ఆయన ఫిల్మ్‌ స్కూల్‌ని కూడా ఏర్పాటు చేసి దర్శకత్వం, నటన, ఛాయాగ్రహణం విభాగాల్లో ఎంతోమంది తీర్చిదిద్దారు. 2014 ఫిబ్రవరి 13న తన 74 యేళ్ల వయసులో గుండెపోటుతో మృతిచెందారు.

* అవార్డుల క్యాబరే  


-ఎనిమిది ఆస్కార్‌ అవార్డులు...

-ఏడు బ్రిటిష్‌ అకాడమీ అవార్డులు...

-గోల్డెన్‌గ్లోబ్‌ పురస్కారం...

-గ్రాండ్‌ పిక్స్‌ అవార్డు...

ఇన్ని అవార్డులు గెలుచుకున్న సినిమా ‘క్యాబరే’ (1972). దీనికి ఓ లోటు కూడా ఉంది. అది ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ రాకపోవడమే. ఉత్తమ చిత్రం మినహా అత్యధిక అవార్డులు అందుకున్న సినిమాగా గుర్తింపు పొందింది. వంద మేటి సినిమాల జాబితాలో 18వ స్థానంలో నిలిచిందిది. ‘క్యాబరే’ అనే పేరుకు తగినట్టుగానే ఇది సంగీత, నృత్య భరితమైన కథాంశంతో తెరకెక్కింది. అందాల తార, గాయని లిజా మిన్నెల్లి నటించిన ఈ సినిమా 2.3 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి 42.8 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ఓ క్యాబరే క్లబ్‌లో పాడుతూ, ఆడుతూ ఆకట్టుకునే అమ్మాయి చుట్టూ తిరుగుతుందీ సినిమా. ఆమె ఇద్దరితో సాగించిన ప్రేమాయణం, ఆ కుర్రాళ్ల ప్రయత్నాలు... ఇలా యువతరాన్ని ఆకట్టుకునేలా సాగే ఈ సినిమా, రచయిత క్రిస్టోఫర్‌ ఇషర్‌వుడ్‌ రాసిన ‘ద బెర్లిన్‌ స్టోరీస్‌’ అనే నవల ఆధారంగా రూపొందింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.