డిసెంబర్‌ 31.. (సినీ చరిత్రలో ఈరోజు)

* మన ‘గాంధీ’ నటుడి కథ!


హాత్మా గాంధీ పాత్రలో ఒదిగిపోయిన నటుడిగా బెన్‌ కింగ్స్‌లేను ఎవరూ మర్చిపోలేరు. రిచర్డ్‌ అటెన్‌బరో దర్శకత్వంతో రూపొందిన ‘గాంధీ’ చిత్రంలో ఆయన మన జాతిపితను కళ్లకు కట్టారు. ఆ చిత్రంతో అంతర్జాతీయ ప్రాచుర్యాన్ని సంపాదించిన బెన్‌ కింగ్స్‌లే అసలు పేరు కృష్ణ పండిట్‌ భాంజీ. నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానంలో ఆస్కార్, గ్రామీ, బాఫ్తా, రెండు గోల్డెన్‌గ్లోబ్, స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌లాంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అతడి సొంతం. బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి ‘నైట్‌ బ్యాచిలర్‌’ అవార్డు, ‘సర్‌’ బిరుదు పొందిన విలక్షణ నటుడితడు. ‘షిండ్లర్స్‌ లిస్ట్‌’, ‘ట్వెల్త్‌ నైట్‌’, ‘సెక్సీ బీస్ట్‌’, ‘హౌస్‌ ఆఫ్‌ శాండ్‌ అండ్‌ ఫాగ్‌’, ‘లక్కీ నెంబర్‌ స్లెవిన్‌’, ‘షట్టర్‌ ఐలాండ్‌’, ‘ప్రిన్స్‌ ఆఫ్‌ పెర్షియా’, ‘ద శాండ్స్‌ ఆఫ్‌ టైమ్‌’, ‘హెగో’, ‘ఐరన్‌మ్యాన్‌3’, ‘ద బాక్స్‌ట్రోల్స్‌’, ‘ద జంగిల్‌బుక్‌’ సినిమాలు నటుడిగా అతడి ప్రతిభకు గీటురాళ్లు. ఇంగ్లండ్‌లో 1943 డిసెంబర్‌ 31న పుట్టిన ఇతడి తల్లి అన్నాలినా మేరీ ఇంగ్లిష్‌ నటి. తండ్రి రహింతుల్లా హర్జీ భాంజీ వైద్యుడు, గుజరాత్‌ మూలాలున్నవాడు. బెన్‌కింగ్స్‌లే తాత ఇండియాలో వ్యాపారిగా ఉంటూ మొదట టాంజానియాకి, ఆ తర్వాత బ్రిటన్‌కి వలస వెళ్లారు. బెన్‌ యుక్త వయసులోనే నాటక రంగంపై మంచి పేరు సంపాదించాడు. ఆ సమయంలోనే విదేశీ పేరు వల్ల అవకాశాలు దెబ్బతింటాయోమోననే బెన్‌కింగ్స్‌లేగా పేరు మార్చుకున్నాడు. నాటకాలు, టీవీల్లో నటుడిగా పేరు తెచ్చుకుంటూనే తొలిసారిగా ‘ఫియర్‌ ఈజ్‌ ద కీ’ (1972)తో వెండితెరకు పరిచయమైన పేరు ‘గాంధీ’ (1983)తో ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది.

* కంచుకంఠం నటుడు!

(జగ్గయ్య జయంతి-1926)


అతడు ‘కంచుకంఠం జగ్గయ్య’గా పేరు పొందాడు. కథానాయకుడిగా, సహాయ నటుడిగా, సాహితీవేత్తగా, జర్నలిస్ట్‌గా, గేయకారుడిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, రాజకీయ నేతగా మరచిపోలేని ముద్ర వేశాడు. పద్మభూషణ్‌ అవార్డు అందుకున్నాడు. తెనాలి దగ్గరి మోరంపూడిలో 1926 డిసెంబర్‌ 31న పుట్టిన జగ్గయ్య పదకొండేళ్లకే నాటకాలలో వేషాలు వేశాడు. ప్రముఖ సాహితీ వేత్త అడవి బాపిరాజు దగ్గర చిత్రకళ అభ్యసించాడు. డిగ్రీ చదివే రోజుల్లో నటుడు ఎన్టీఆర్‌తో కలిసి నాటకాలు వేశారు. ‘ప్రియురాలు’ (1952) చిత్రంతో వెండితెరకు పరిచయమై హీరోగా, సహాయనటుడిగా వందలాది చిత్రాల్లో అలరించాడు. విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ రాసిన ‘గీతాంజలి’ని తెలుగు పద్యాల రూపంలో అందించాడు. టాగూర్‌ రాసిన ‘శాక్రిఫైజ్‌’ నాటకాన్ని తెలుగులో ‘బలిదానం’ పేరిట అనువదించాడు.

* వెండితెర ఎర్ర‌న్న‌

ప్ర‌జాస‌మ‌స్య‌ల్నే క‌థా వ‌స్తువులుగా ఎంచుకొని వెండితెర‌పై ఎర్ర జెండా ఎగ‌రేస్తున్న సినీ ప్ర‌ముఖుడు ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి. ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా, న‌టుడిగా, సంగీత ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌ది విజ‌య‌వంత‌మైన ప్ర‌యాణం. ద‌శ‌బ్దాలుగా న‌మ్మిన సిద్ధాంతాల‌కి క‌ట్టుబ‌డి సినిమాలు తీస్తున్న అరుదైన ద‌ర్శ‌క‌నిర్మాత ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి. ఆయ‌న పేరు వినిపించ‌గానే అర్ధరాత్రి స్వతంత్రం మొద‌లుకొని... భూపోరాటం, అడవి దీవిటీలు, స్వతంత్ర భారతం, లాల్‌సలాం, దండోరా, ఎర్రసైన్యం, చీమలదండు, దళం, చీకటి సూర్యులు, రైతురాజ్యం, ఛలో అసెంబ్లీ, ఊరు మనదిరా, ఎర్ర స‌ముద్రం, ఒరేయ్ రిక్షా, సింగ‌న్న త‌దిత‌ర చిత్రాలు గుర్తుకొస్తాయి. ఆర్‌.నారాయణమూర్తి అస‌లు పేరు రెడ్డి నారాయ‌ణ‌మూర్తి. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలంలోని మల్లంపేట గ్రామంలో రెడ్డి చిట్టెమ్మ‌, రెడ్డి చిన్న‌య్య నాయుడు దంప‌తుల‌కి జన్మించారు. వీరిది సాధారణ రైతు కుటుంబం. రౌతులపూడిలో 5వ తరగతి వరకు చదివిన ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి ఆ ఊళ్లోని థియేట‌ర్‌లో చిన్నతనం నుంచే ఎన్టీఆర్, నాగేశ్వరరావుల సినిమాలు చూస్తూ వారిని అనుకరించేవాడు. అక్కడే ఆయ‌న నటనా జీవితానికి పునాది పడింది. శంఖవరంలో ఉన్నత పాఠశాలలో చేరిన ఆయ‌న సామాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను గమనించి, విప్లవ ఉద్యమాలవైపు ఆకర్షితుడయ్యాడు.


పెద్దాపురంలో బి.ఏ చదవడానికని కాలేజీలో చేరిన ఆయ‌న అక్కడ రాజకీయాలతో ప్రభావితుడ‌య్యారు. సామాజిక సేవ‌ని కూడా అల‌వ‌ర్చుకున్నారు. కళాశాల విద్యార్థిసంఘానికి అధ్యక్షుడిగానే కాకుండా కళాశాల లలిత కళల విభాగానికి కార్యదర్శిగా కూడా ప‌నిచేశారు. ప్రభుత్వ హాస్టలు విద్యార్థి అధ్యక్షునిగానూ, పేద విద్యార్థుల నిధి సంఘానికి కార్యదర్శిగానూ పనిచేశారు. స్థానిక రిక్షా కార్మికులు ఈయనను మద్దతుకోసం సంప్రతించేవారు. నారాయణమూర్తి పట్టణ రిక్షాసంఘం అధ్యక్షుడుగా కూడా ప‌నిచేశారు. ఎమర్జెన్సీ కాలంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నార‌ని పోలీసులు ప్ర‌శ్నించారు. నారాయణమూర్తి సినిమా నటి మంజులతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయించి నూతన కళాశాల నిర్మాణానికి నిధుల సేకరణ ప్రారంభించారు. అప్పట్లో బీహార్లో వరదసహాయానికి తగిన విధంగా తోడ్పాడ్డాడు. సహవిద్యార్థులు నారాయణమూర్తిని కాలేజీ అన్నగా పిలుచుకునేవారు. నారాయణమూర్తికి సినిమాల్లో హీరో కావాలనే కోరిక ఉండేద‌ట‌. ఇంట‌ర్ పూర్త‌వ్వ‌గానే మ‌ద్రాసు వెళ్లిన ఆయ‌న దాసరి నారాయ‌ణ‌రావు పరిచయంతో కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టించిన `నేరము-శిక్ష`లో ఈయనకు ఒక చిన్నపాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఒక పాట చిత్రీకరణలో 170 మంది జూనియర్ ఆర్టిస్టులలో ఈయన ఒక‌రు. చిన్నవేషంతో నిరుత్సాహపడిన ఆయ‌న‌కి డిగ్రీ పూర్తి చేసుకొని తిరిగి రమ్మని దాసరి సలహా ఇచ్చార‌ట‌. సినిమా టైటిల్లలో ఎన్.టి.రామారావు బి.ఏ అని చూసి తాను కూడా బి.ఏ చెయ్యాలనే కోరిక ఉండేదట‌. బి.ఎ పూర్తి కాగానే మద్రాసు ప్రయాణం కట్టారు. అవ‌కాశాల కోసం మ‌ళ్లీ రోజూ స్టూడియోల చుట్టూ తిరిగి జూనియర్ ఆర్టిస్టు అవకాశాలు సంపాదించుకొన్నారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ దాసరి నారాయణరావు త‌న `నీడ` చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌ని అప్ప‌జెప్పారు. సినిమా విజ‌య‌వంతం కావ‌డం... దాసరి, రామానాయుడు, జ్యోతి శేఖరబాబు వంటి దర్శకుల ప్రోత్సాహంతో అనేక సినిమాలలో సహాయపాత్రల్లో న‌టించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలోనే నారాయణమూర్తి క‌థానాయ‌కుడిగా `సంగీత` అనే చిత్రం తెర‌కెక్కింది. కానీ ఆ త‌ర్వాత అవ‌కాశాలు రాలేదు. దాంతో తానే ద‌ర్శ‌కుడు కావాల‌ని నిర్ణ‌యించుకొన్నారు. కొంతమంది స్నేహితుల‌తో క‌లిసి స్నేహ చిత్ర అనే సంస్థ‌ని ఏర్పాటు చేసుకొని సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. నారాయణమూర్తి స్వీయ ద‌ర్శ‌క‌నిర్మాణంలో `అర్ధరాత్రి స్వతంత్రం` తీశారు. సెన్సారు స‌మ‌స్య‌లు ఎదురైనా వాటిని అధిగ‌మించి 1986, నవంబరు 6, టి.కృష్ణ వర్ధంతి రోజున విడుదల చేశాడు. ఆ సినిమాలోనారాయణమూర్తి ఒక నక్సలైటు పాత్రను పోషించాడు. ఆ చిత్రం ఘ‌న విజ‌యం సాధించ‌డంతో ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి పేరు మార్మోగిపోయింది. సమకాలీన సామాజిక సమస్య‌లే ఇతివృత్తాలుగా ఈయన వ‌రుస‌గా సినిమాలు తీశారు. `దండోరా`, `ఎర్ర‌సైన్యం`, `లాల్ సలాం` త‌దిత‌ర చిత్రాలు సంచ‌ల‌న విజ‌యాల్ని సొంతం చేసుకొన్నాయి. ఎర్రసైన్యం ఒక ట్రెండును సృష్టించింది. నారాయణమూర్తి సాధారణ జీవితం గడపటానికి ఇష్టపడతాడు. అవివాహితుడైన ఆయ‌న‌కి ఇత‌ర క‌థానాయ‌కుల చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టించే అవ‌కాశం వ‌చ్చినా, కోట్లకుకోట్లు పారితోషికం ఇస్తామ‌న్నా ఆయ‌న తాను న‌మ్మిన సిద్ధాంతాల్ని వ‌దిలిపెట్ట‌లేదు. త‌న సినిమాల‌కి కోట్లకొద్దీ లాభాలు వ‌చ్చినా ఆయ‌న విలాస వంత‌మైన జీవితానికి అల‌వాటు ప‌డ‌లేదు. ఇప్ప‌టికీ ఎక్క‌డికి వెళ్లినా ఆటోల్లోనే వెళుతుంటారు. రాజ‌కీయ పార్టీల అధినేత‌లు ఆయ‌న‌కి ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం ఇస్తామ‌ని చెప్పినా, కార్లు కొనిపెడ‌తామ‌ని చెప్పినా ఆయ‌న మాత్రం వాటిని సున్నితంగా తిర‌స్క‌రిస్తూ సాధార‌ణ‌మైన జీవితాన్నే గ‌డుపుతున్నారు. ఈరోజు ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి పుట్టిన‌రోజు.

సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.