ఫిబ్రవరి 12 (సినీ చరిత్రలో ఈరోజు)

* ప్రఖ్యాత దర్శకుడి తొలి సినిమా


హాలీవుడ్‌ అభిమానులకు సెసిల్‌ బి.డెమిల్లే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అద్భుతమైన సినిమాలను అందించిన దర్శక నిర్మాతగా ఆయన పేరు చిరపరిచితం. మూకీల నుంచి టాకీల దాకా ఆయన తీసిన 70 సినిమాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘టెన్‌ కమాండ్‌మెంట్స్‌’, ‘ద కింగ్‌ ఆఫ్‌ కింగ్స్‌’, ‘ద సైన్‌ ఆఫ్‌ క్రాస్‌’, ‘క్లియోపాత్రా’, ‘శామ్‌సన్‌ అండ్‌ డిలైలా’లాంటి మేటి సినిమాలున్నాయి. ఎంతటి ప్రయాణమైనా తొలి అడుగుతోనే ప్రారంభమవుతుందన్నట్లు, డెమిల్లీ దర్శకుడిగా తీసిన తొలి సినిమా ‘ద స్క్వా మ్యాన్‌’ (1914). దీనికి ఆయన సహనిర్మాత కూడా. మరో దర్శకుడు ఆస్కార్‌ అప్‌ఫెల్‌తో కలిసి తీసిన ఈ సినిమా మూకీల కాలంలోనే విజయవంతమైంది. ఇప్పుడీ దర్శకుడి పేరు మీద ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలను అందిస్తున్నారు.
 

* ప‌డి లేచిన కెర‌టం జ‌గ‌ప‌తిబాబు (పుట్టినరోజు)


క‌ప్పుడు కుటుంబ క‌థ‌ల‌న‌గానే శోభ‌న్‌బాబు గుర్తుకొచ్చేవారు. ఆయ‌న సినిమాల‌కి దూర‌మ‌య్యాక ఆ స్థానాన్ని భ‌ర్తీ చేసిన న‌టుడు జ‌గ‌ప‌తిబాబు. ఇద్ద‌రమ్మాయిల మ‌ధ్య న‌లిగిపోయే కుటుంబ క‌థానాయ‌కుడిగా ఆయ‌న ఎన్నో చిత్రాల్లో ఒదిగిపోయారు. కుటుంబ ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యారు.  అలాగ‌ని వాటికే ప‌రిమితం కాలేదు జ‌గ‌ప‌తిబాబు. అంత‌కుముందు ఆయ‌న మాస్ క‌థానాయ‌కుడిగా సినిమాలు చేసి మెప్పించిన‌న‌వారే.  `శుభ‌ల‌గ్నం` నుంచి ఆయ‌న దారి కుటుంబ క‌థ‌ల‌వైపు మ‌ళ్లింది. కొన్నాళ్ల‌పాటు కుటుంబ క‌థానాయ‌కుడిగా మెరిసిన ఆయ‌న ఆ త‌ర్వాత మ‌ళ్లీ మాస్ క‌థ‌ల‌వైపు దృష్టిపెట్టారు. వంద‌కిపైగా సినిమాలు చేసిన త‌ర్వాత వ‌రుస ప‌రాజ‌యాల్ని ఆయ‌న్ని ఇబ్బందిపెట్టాయి. అదే స‌మ‌యంలోనే ఆయ‌న కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంటూ విల‌న్ పాత్ర‌లవైపు దృష్టిపెట్టారు. `లెజెండ్` ఆయ‌న ప్ర‌తినాయ‌కుడిగా న‌టించిన తొలి చిత్రం. అప్ప‌ట్నుంచి ఆయ‌న స్టైలిష్ విల‌న్ పాత్ర‌లకి కేరాప్‌గా నిలిచారు. ప‌రాజ‌యాల‌తోనే మొద‌లైన జ‌గ‌ప‌తిబాబు ప్ర‌యాణం... ఆద్యంతం ఒడుదొడుకుల‌తో సాగింది. కానీ ఆయ‌న మాత్రం కెర‌ట‌మే స్ఫూర్తిగా ప‌డినా మ‌ళ్లీ లేచి నిల‌బ‌డ్డారు. ఇప్పుడు తెలుగుతో పాటు, ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌న్నింటిలోనూ  సినిమాలు చేస్తూ బిజీ బిజీగా కొన‌సాగుతున్నారు. జగపతిబాబు అస‌లు పేరు వీరమాచనేని జగపతి చౌదరి.  ప్రముఖ దర్శక నిర్మాత, జ‌గ‌ప‌తి ఆర్ట్స్ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారుడైన ఆయ‌న ఫిబ్రవరి 12, 1962న మచిలీపట్నంలో జన్మించారు.  మ‌ద్రాస్‌లో పెరిగారు. అక్క‌డే చదువు పూర్తిచేసిన జగపతిబాబు అనుకోకుండానే సినిమాల్లోకి అడుగుపెట్టారు. చదువుకునే రోజుల్లో రోజుకు మూడు నాలుగు సినిమాలు చూసిన జగపతిబాబుకి న‌టుడు కావాల‌నే ఆశ మాత్రం ఉండేది కాద‌ట‌.  చదువయ్యాక కొన్నిరోజులు విశాఖ‌ప‌ట్నంలో వ్యాపారం చేశారు. రాత్రికి రాత్రే అనుకోకుండా న‌టుడు కావాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.  నాన్న పెద్ద నిర్మాత అయినా ఆయన ప్రమేయం లేకుండానే ప్రయత్నాలు చేశారు. ఆ విషయం తెల్సుకున్న వి.బి.రాజేంద్రప్రసాద్ 1989 లో తానే `సింహస్వప్నం` సినిమా నిర్మించి  జ‌గ‌ప‌తిబాబుని తెలుగు తెరకు పరిచయం చేసారు. అందులో ద్విపాత్రాభిన‌యం చేశారు జ‌గ‌ప‌తిబాబు.  తొలి సినిమాలోనే డబుల్ రోల్ చేసిన మొదటి నటుడు జగపతిబాబే.  కానీ తొలి  సినిమానే పరాజయం పాలైంది. ఆ తరువాత చేసిన చాలా చిత్రాలు  అదే ర‌క‌మైన ఫ‌లితాన్ని తీసుకొచ్చాయి. కానీ పట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా జగపతిబాబు వ‌రుస‌గా సినిమాలు చేశారు.  ఎట్ట‌కేల‌కి జగన్నాటకం, పెద్దరికం వంటి చిత్రాలతో విజ‌యాల్ని అందుకొన్నారు.  మొద‌ట్లో ఆయ‌న గొంతు బాగోలేద‌ని, అప్పటివరకు అన్ని సినిమాలకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించారు. అయితే రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `గాయం`  కోసం సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకొన్నారు. వ‌ర్మ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఆయ‌న‌తో డ‌బ్బింగ్ చెప్పించారు. చిత్రంగా ఆ సినిమా నుంచే జ‌గ‌ప‌తిబాబు వాయిస్‌కి అభిమానులు ఏర్ప‌డ్డారు. ఆయ‌న వాయిస్ ఓవ‌ర్‌తో మొల‌దైన సినిమాలు ఎన్నో. జ‌గ‌ప‌తిబాబు త‌న సినీ ప్ర‌యాణంలో ఎన్నో ప్ర‌యోగాల‌కి పూనుకున్నారు. `సముద్రం`, `మ‌నోహ‌రం`, `అంతఃపురం` వంటి చిత్రాల్లో ఆయ‌న చేసిన పాత్ర‌ల గురించి ఇప్ప‌టికీ మాట్లాడుకుంటుంటారు. అప్ప‌టిదాకా సాగిన ప్ర‌యాణం ఒకెత్తు, `లెజెండ్‌` త‌ర్వాత ప్ర‌యాణం మ‌రో ఎత్తు. జ‌గ‌ప‌తిబాబు విల‌నీకి కూడా అభిమానులు ఏర్ప‌డ్డారు. జ‌గ‌ప‌తిబాబుని ఆయ‌న అభిమానులు ముద్దుగా జ‌గ్గూభాయ్ అని పిలుచుకుంటుంటారు. ఈరోజు జ‌గ్గూభాయ్ పుట్టిన‌రోజు. 

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.