మే 17 (సినీ చరిత్రలో ఈరోజు)...

*ఛార్మిం‘గ్  హీరోయిన్‌ (పుట్టినరోజు-1987)
 
             


యేటా వందల సంఖ్యలో కథానాయికలు తెలుగు తెరపై సందడి చేస్తుంటారు. అందులో స్థిరమైన స్థానం సంపాదించుకొని, స్టార్‌లుగా మెరిసే ముద్దుగుమ్మలు కొద్దిమందే. అందులోనూ నాయికా ప్రాధాన్యంతో కూడిన కథలకి కేరాఫ్‌గా నిలుస్తూ, నటనపరంగానూ శభాష్‌ అనిపించుకొనేవాళ్లు ఇంకా తక్కువమంది కనిపిస్తుంటారు. కమర్షియల్‌ కథానాయికగానే కాకుండా... నటిగా కూడా గుర్తింపు తెచ్చుకొన్న అతి తక్కువమంది కథానాయికల్లో ఛార్మి ఒకరు. ‘మంత్ర’, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘మనోరమ’, ‘మంగళ’, ‘సై ఆట’, ‘కావ్యాస్‌ డైరీ’, ‘మంత్ర2’, ‘నగరం నిద్రపోతున్నవేళ’, ‘ప్రతిఘటన’, ‘జ్యోతిలక్ష్మి’... ఇలా నాయికా ప్రాధాన్యంతో కూడిన చిత్రాలు ఆమె కెరీర్‌లో చాలానే ఉన్నాయి. కమర్షియల్‌ చిత్రాల్లోనూ ఆమె బలమైన పాత్రలే చేసింది. కథానాయికగానే కాకుండా, నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేసింది. ముంబైలో పుట్టి పెరిగిన పంజాబీ పడుచు ఛార్మి. మే 17, 1987న సిక్కు కుటుంబంలో ఆమె జన్మించింది. కార్మెలైట్‌ కాన్వెంట్‌ హైస్కూల్‌లో చదువుకొంది. పాఠశాల విద్య చదువుతున్న సమయంలోనే సినిమా అవకాశాలు అందుకొంది ఛార్మి. తెలుగు తెరపై తొలినాళ్లల్లో పాల బుగ్గలతో, కాస్త బొద్దైన ఆకారంతో దర్శనమిచ్చిందీ ముద్దుగుమ్మ. ‘నీతోడు కావాలి’ ఛార్మి తొలి చిత్రం. ఆ తర్వాత తమిళం, మలయాళం నుంచి అవకాశాలు అందుకొంది. 2003లో కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘శ్రీ ఆంజనేయం’లో నటించడం ఛార్మి కెరీర్‌కి ఓ పెద్ద మలుపు. ఆ చిత్రం పరాజయాన్ని చవిచూసినా ఛార్మికి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ‘గౌరి’, ‘చంటి’, ‘మాస్‌’, ‘చక్రం’, ‘అనుకోకుండా ఒకరోజు’, ‘పొలికల్‌ రౌడీ’, ‘అల్లరి పిడుగు’, ‘చుక్కల్లో చంద్రుడు’, ‘లక్ష్మి’, ‘స్టైల్‌’, ‘పౌర్ణమి’, ‘చిన్నోడు’, ‘రాఖి’, ‘లవకుశ’, ‘మంత్ర’, ‘సుందరకాండ’, ‘భలే దొంగలు’, ‘మైఖైల్‌ మదనకామరాజు’... ఇలా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసింది. తెలుగులో పలువురు అగ్ర కథానాయకులతో కలిసి ఆడిపాడింది. దక్షిణాదిలోని నాలుగు భాషల్లో నటించి ఛార్మి పేరు తెచ్చుకొంది. హిందీలోనూ ‘బుడ్డా హోగా తేరా బాప్‌’, ‘జిల్లా గజియాబాద్‌’, ‘రాంబో రాజ్‌కుమార్‌’ తదితర చిత్రాలు చేసి మెరిపించింది. ‘మంగళ’ చిత్రంలో నటనకిగానూ ఉత్తమ నటిగా జ్యూరీ, ‘మంత్ర’కిగానూ ఉత్తమ నటిగానూ నంది పురస్కారాలు అందుకొంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘జ్యోతిలక్ష్మి’తో ఆమె నిర్మాతగా మారింది. పూరి కనెక్ట్స్‌ సంస్థ బాధ్యతలు చూసుకుంటూనే, ఇటీవల పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రాలన్నింటికీ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది ఛార్మి. ప్రస్తుతం రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరిస్తోంది ఛార్మి. ఈ రోజు ఆమె పుట్టినరోజు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.