ఆగస్టు 24 (సినీ చరిత్రలో ఈరోజు)

 ‘గాంధీ’ తీసిన దర్శకుడు!


జాతిపిత మహాత్మాగాంధీ జీవిత కథను అత్యద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడిగా రిచర్డ్‌ అటెన్‌బరో భారతీయులకు ఎప్పటికీ గుర్తుండిపోతాడు. దర్శకనిర్మాతగా, నటుడిగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నేతగా పేరొందిన అటెన్‌బరో ముద్ర వెండితెరపై చిరస్మరణీయం. ప్రతిష్టాత్మకమైన బాఫ్తా (బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌), రాడా (రాయల్‌ అకాడమీ ఆఫ్‌ డ్రమెటిక్‌ ఆర్ట్‌)లకు అధ్యక్షుడిగా వ్యవహరించాడు. రెండో ప్రపంచయుద్ధంలో రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఫిల్మ్‌యూనిట్‌లో పాల్గొని ఎన్నో బాంబు దాడులను చిత్రీకరించాడు. దర్శకనిర్మాతగా 1983లో తీసిన ‘గాంధీ’ చిత్రానికి రెండు ఆస్కార్‌ అవార్డులు అందుకున్నాడు. ‘గాంధీ’ చిత్రం 20 శతాబ్దంలోని మేటి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. నటుడిగా నాలుగు బాఫ్తా, నాలుగు గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డులు అందుకున్నాడు. ‘ఇన్‌ బ్రిగ్టన్‌ రాక్‌’, ‘ద గ్రేట్‌ ఎస్కేప్‌’, ‘10 రిల్లింగ్టన్‌ ప్లేస్‌’, ‘ద శాండ్‌ పెబుల్స్‌’, ‘మిరకిల్‌ ఆన్‌ 34 స్ట్రీట్‌’, ‘జురాసిక్‌ పార్క్‌’ చిత్రాల్లో నటుడిగా ఆయన పాత్రలను అభిమానులు మరిచిపోలేరు. కేంబ్రిడ్జ్‌లో 1923 ఆగస్టు 29న పుట్టిన అటెన్‌బరో, తొలుత నాటకాల ద్వారా మంచి నటుడిగా రాణించాడు. సినిమాలకు 1942లో పరిచయమై పలు పాత్రలతో ఆకట్టుకున్నాడు. నిర్మాతగా 1950ల్లో మంచి చిత్రాలు అందించాడు. దర్శకుడిగా ‘ఓహ్‌! వాటె లవ్లీ వార్‌’ (1969) అతడి తొలిచిత్రం. బ్రిటిష్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్, ప్రముఖ హాస్యనటుడు ఛార్లెస్‌ చాప్లిన్‌ బయోపిక్‌లను కూడా రూపొందించాడు. అటెన్‌బరో 2014 ఆగస్టు 24న తన 90 ఏళ్ల వయసులో మరణించాడు.

 అంజమ్మగా పుట్టి... సీతమ్మగా నిలిచి!
(అంజలీదేవి జయంతి-1927)


పౌరాణిక చిత్రం ‘లవకుశ’... జానపద చిత్రం ‘సువర్ణసుందరి’... చారిత్రక చిత్రం ‘అనార్కలి’... ఈ మూడింటిలోనూ నటించి మెప్పించడం తేలిక కాదు. కానీ అంజలీదేవికి అది సునాయాసమే. అందుకే ఇన్నేళ్లయినా ఆమె, సినీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. ఓ సీతగా, ఓ దేవకన్యగా, ఓ అందాల భామగా ఆమె నటన చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో అంజమ్మగా పుట్టి, వెండితెరపై అంజలీదేవిగా మారి ఎన్నెన్నో పాత్రలు ధరించి ఒప్పించినా... ఓ సీతమ్మగా మెప్పించిన ఆమె వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిదే. నాటక రంగం నుంచి సినీరంగానికి వచ్చిన అంజలీదేవి దాదాపు 350 చిత్రాల్లో నటించడంతో పాటు నిర్మాతగా ఆణిముత్యాల లాంటి సినిమాలను అందించారు. సంగీత దర్శకుడు పి.ఆదినారాయణరావును వివాహమాడిన అంజలీదేవికి ఇద్దరు కుమారులు. ప్రతిషాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్న ఆమె, చెన్నైలో తన 86వ ఏట 2014 జనవరి 13న మరణించారు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

 పాటల ఇంజినీర్‌!
(రామజోగయ్య శాస్త్రి పుట్టినరోజు-1970)


ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎమ్‌టెక్‌ చదివి ఇంజనీర్‌గా యంత్రాలతో పనిచేయడం ఎక్కడ! సినిమాల్లో మనసుకు హత్తుకునే సాహిత్యంతో గీతాలు అల్లడం ఎక్కడ!! ఈ రెండిటినీ సాధించిన రామజోగయ్య శాస్త్రిని పాటల ఇంజనీర్‌ అనవచ్చు. ఆయన పాట రాశాడంటే అది యువతరం నాలుకల మీద నాæ్యమాడాల్సిందే. అంతలా ఆకట్టుకునే క్యాచీ పదాలతో లిరిక్కులతో జిమ్మిక్కులు చేసి చమక్కుమనిపించగలరు ఆయన.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* హ్యారీపార్టర్‌ స్నేహితుడి కథ!


హ్యారీపార్ట్‌కి ఇద్దరు స్నేహితులు. ఒకరు రాన్‌ వెస్లే అయితే మరొకరు హెర్మాయిన్‌ గ్రాంగర్‌. వీరు ముగ్గురూ కలిసి హ్యారీపార్టర్‌ సినిమాల్లో చాలా హంగామా చేశారు. వీరిలో రాన్‌ వెస్లే పాత్రలో నటించిన నటుడే రుపర్ట్‌ అలెగ్జాండర్‌ లాయిడ్‌ గ్రింట్‌. 1988 ఆగస్టు 24న ఇంగ్లండ్‌లో పుట్టిన ఇతగాడు చిన్నతనంలోనే నాటకాల్లో నటించి ఆ అనుభవంతో 11 ఏళ్లకే హ్యారీపోర్టర్‌ సినిమాలకు ఎంపికయ్యాడు. ఎనిమిది హ్యారీపార్టర్‌ సినిమాల్లో నటించాడు. ఆ తరువాత ఇప్పుడు యువ నటుడిగా కొనసాగుతున్నాడు. నిర్మాతగా కూడా మారాడు. తన శక్తిమేర విరాళాలు ఇస్తూ సమాజసేవలో పాల్గొంటున్నాడు.

 నిశ్శబ్ద లోకం నుంచి...
వెలుగుల తీరానికి!


నెలల వయసులో జ్వరం బారిన పడింది... ఫలితంగా వినికిడి శక్తిని కోల్పోయింది... లోకమంతా ఆమెకు నిశ్శబ్ద చలన చిత్రమైంది... అలాంటి ఆమె, అందాల తారగా వెండితెరపై వెలుగులీనింది. ఉత్తమ నటిగా ఆస్కార్‌ అందుకుంది. కరతాళ ధ్వనులు ఆమెకు వినిపించకపోయినా, ఆమె విజయాల సందడి అందరినీ ఆకట్టుకుంది. ఆమె మార్లీ మాట్లిన్‌. నటిగా, రచయిత్రిగా, ఉద్యమకారిణిగా హాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసింది. ‘చిల్డ్రన్‌ ఆఫ్‌ ఎ లెస్సర్‌ గాడ్‌’ (1986) చిత్రం ద్వారా ఉత్తమ నటిగా ఆస్కార్‌ అవార్డు అందుకుంది. వెండితెర, బుల్లితెరల ద్వారా ఆకట్టుకుని గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డు సహా ఎన్నో ప్రశంసలు, పురస్కారాలు గెలుచుకుంది. మరో పక్క జాతీయ బధిరుల సంఘం ద్వారా తనలాంటి దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేసింది. అమెరికాలోని ఇల్లినాయిస్‌లో 1965 ఆగస్టు 24న పుట్టిన మార్టిన్, ఏడేళ్ల వయసులోనే నాటక రంగంలోకి ప్రవేశించింది. బాల నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆపై వెండితెరపైకి ‘చిల్డ్రన్‌ ఆఫ్‌ ఎ లెస్సర్‌ గాడ్‌’ సినిమాతో అడుగుపెట్టి తొలి చిత్రంతోనే ఆస్కార్‌ అందుకుంది. ఆమె నటన శైలిని ప్రశంసిస్తూ ఎన్నో పత్రికలు వ్యాసాలు ప్రచురించాయి. ‘వాట్‌ ద బ్లీప్‌ డు ఉయ్‌ నో?’లాంటి సినిమాల్లో మంచి నటిగా మెప్పించింది. ఎన్నో టీవీ ధారావాహికల ద్వారా ఆకట్టుకుంది. రచయిత్రిగా కూడా ముద్రవేసింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.