అక్టోబర్‌ 27 (సినీ చరిత్రలో ఈరోజు)

సినీ మొఘల్‌ పాదుషా...
ప్రదీప్‌ కుమార్‌ (వర్ధంతి-2001)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* దారి తప్పిన యువత కథ! 


ల్లితండ్రుల వ్యవహార శైలి... మధ్య తరగతి యువత అయోమయం... తరాల మధ్య పెరుగుతున్న అంతరాలు... వీటి నేపథ్యంలో కథను అల్లుకుంటే సమాజానికి అద్దం పట్టినట్టే. ‘రెబెల్‌ వితౌట్‌ ఎ కాజ్‌’ అలాంటి సినిమానే. సమాజంలో వస్తున్న మార్పుల్ని నిశితంగా గమనించిన ఓ సైకియాట్రిస్ట్‌ రాబర్ట్‌ ఎమ్‌.లిండ్నర్‌ 1944లో రాసిన ‘రెబల్‌ వితౌట్‌ ఎ కాజ్‌: ద హైపో ఎనాలసిస్‌ ఆఫ్‌ ఎ క్రిమినల్‌ సైకోపాత్‌’ అనే పుస్తకం ఆధారంగా నికోలాస్‌ రే దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా వార్నర్‌ బ్రదర్స్‌ బ్యానర్‌పై 1955 అక్టోబర్‌ 27న విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. అసంతృప్తితో రగిలిపోతున్న యువతరం ప్రతినిధిగా ఇందులో కీలక పాత్రలో నటించిన జేమ్స్‌డీన్‌ను రాత్రికి రాత్రి స్టార్‌ చేసిందీ చిత్రం. ఈ చిత్రాన్ని అమెరికా ప్రభుత్వం భద్రపరిచింది.

* పలు రంగాల్లో ప్రతిభ


ప్ర
పంచవ్యాప్తంగా సినీ అభిమానులను అలరించిన చిత్రాల్లో అతడు నటుడిగా కనిపించి మెప్పించాడు. రెండు జేమ్స్‌బాండ్‌ సినిమాలు, రెండు హ్యారీపాటర్, మూడు ష్రెక్‌ సినిమాలు సహా అనేక సినిమాల్లో అతడి ప్రతిభ ఆకట్టుకుంటుంది. కేవలం నటుడిగానే కాదు, కమేడియన్‌గా, స్క్రీన్‌ రైటర్‌గా, నిర్మాతగా, వాయస్‌ యాక్టర్‌గా కూడా అతడు సుపరిచితుడు. టెలివిజన్‌ రంగంలో అతడిది ఇంటింటి పేరే. వీక్షకులను అలరించిన ఎన్నో కార్యక్రమాల రూపకర్త అతడు. అతడే జాన్‌ క్లీజ్‌. ‘మాంటీ పైథాన్‌ అండ్‌ ద హోలీ గ్రెయిల్‌’, ‘లైఫ్‌ ఆప్‌ బ్రియాన్‌’, ‘ద మీనింగ్‌ ఆఫ్‌ లైఫ్‌’, ‘ఎ ఫిష్‌ కాల్డ్‌ వాండా’, ‘ఫియర్స్‌ క్రియేచర్స్‌’, ‘టైమ్‌ బాండిట్స్‌’, ‘ర్యాట్‌ రేస్‌’, ‘సిల్వరాడో’, ‘మ్యారీ షెల్లీస్‌ ఫ్రాకెన్‌స్టెయిన్‌’లాంటి సినిమాలతో పాటు జేమ్స్‌బాండ్, హ్యారీపాటర్, ష్రెక్‌ సినిమాల్లో కూడా నటించి ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌లో 1939 అక్టోబర్‌ 27న పుట్టిన క్లీజ్, యువకుడిగా ఉన్నప్పుడే అభినయ రంగంవైపు ఆకర్షితుడై అంచెలంచెలుగా ఎదిగాడు.

* ఆస్కార్‌ అందుకున్న
ఇటలీ దర్శకుడు


రా
బర్టో బెనిగ్ని అంటే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు, కానీ ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ దర్శకుడంటే మాత్రం టక్కున జ్ఞప్తికి వచ్చేస్తాడు. ఆ సినిమాతోనే అతడు ఆస్కార్‌ అందుకోవడంతో పాటు అంతర్జాతీయ గుర్తింపును పొందాడు. నటుడిగా, కమేడియన్‌గా, స్క్రీన్‌రైటర్‌గా, దర్శకుడిగా ప్రపంచ ప్రాచుర్యం పొందాడు. ఇటాలియన్‌ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ (1997) సినిమా ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్‌ అందుకుంది. ‘సన్‌ ఆఫ్‌ ద పింక్‌ పాంథర్‌’ సినిమాలో నటుడిగా కూడా మెప్పించాడు. ‘డైన్‌ బై లా’, ‘నైట్‌ ఆన్‌ ఎర్త్‌’, ‘కాఫీ అండ్‌ సిగరెట్స్‌’ లాంటి చిత్రాలను నిర్మాతగా అందించాడు. ఇటలీలో 1952 అక్టోబర్‌ 27న పుట్టిన రాబర్టో, నాటకం, టీవీ రంగాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని వెండితెరపై రాణించాడు. ఎన్నో అవార్డులు అందుకున్నాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.