డిసెంబర్‌ 10.. (సినీ చరిత్రలో ఈరోజు)

* వెండితెరపై సూపర్‌మ్యాన్‌ హంగామా!


అమెరికా కామిక్‌ పుస్తకాల్లో 1938 ఏప్రిల్‌ 18న పుట్టిన సూపర్‌మ్యాన్‌... దినపత్రికలు, టీవీల ద్వారా అలరించి 1978లో పూర్తి స్థాయిలో వెండితెరపైకి దూకేశాడు. ఇక ఆ వెండితెర మీద ఆ మూల నుంచి ఈ మూల వరుకు ఎగురుతూ అతడు చేసిన హంగామా ఇంతా అంతాకాదు. సీక్వెల్‌ సినిమాలుగా వచ్చి కాసుల వర్షం కురింపించాడు. ప్రపంచ వ్యాప్తంగా పిల్లల్ని, సినీ అభిమానుల్ని అలరించాడు. అమెరికా ‘కల్చరల్‌ ఐకన్‌’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎక్కడో అంతరిక్షంలో ఓ నక్షత్రం పేలిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, దాని చుట్టూ తిరుతున్న క్రిప్టన్‌ అనే గ్రహంలోని సైంటిస్ట్‌ తన కొడుకును ఓ అంతరిక్షనౌకలో పెట్టి భూమి దిశగా పంపేస్తాడు. అలా అంతరిక్షం నుంచి అమెరికాలో ఓ మారూమూల పల్లెటూర్లోని పొలంలో పడతాడు సూపర్‌మ్యాన్‌. చిన్నప్పుడే తన శక్తులతో ఆశ్చర్యపరిచిన అతడు పెద్దయ్యాక తానెవరో తెలుసుకుని మరిన్ని అతీత శక్తులు సాధించి మామూలు విలేకరిగా ఓ పత్రికలో ఉద్యోగం చేసుకుంటూ అవసరమైనప్పుడు తన శక్తులను చెడును అంతం చేయడానికి, ప్రజల్ని కాపాడ్డానికి ఉపయోగిస్తుంటాడు. ఈ కథతో క్రిష్టోఫర్‌ రీవ్‌ సూపర్‌మ్యాన్‌గా, రిచర్డ్‌ డోనర్‌ దర్శకత్వంలో 1978లో వచ్చిన ‘సూపర్‌మ్యాన్‌ ద మూవీ’ సినిమా 55 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి, 300 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. విజువల్‌ ఎఫెక్ట్‌కు ఆస్కార్‌ అవార్డు కూడా గెలుచుకుంది. జెర్రీ సీగల్‌ అనే రచయిత, జో షస్టర్‌ అనే చిత్రకారుడు కలిసి యాక్షన్‌ కామిక్స్‌ పుస్తకం ద్వారా సృష్టించిన సూపర్‌మ్యాన్‌ కథ, అంతక్రితమే టీవీల్లోను, యానిమేషన్‌ చిత్రాల్లోను, మూవీ సీరియల్స్‌గాను ఆకట్టుకుంది.
...............................................................................................................................................................

సహజంగా... హుందాగా... 
(
అశోక్‌కుమార్ - వర్ధంతి 2001)(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* యుద్ధం నేపథ్యంలో... 


- ఏడు ఆస్కార్‌ అవార్డులు గెలుచుకున్న చిత్రం...

- గోల్డెన్‌గ్లోబ్, బాఫ్తా అవార్డులు అందుకున్న సినిమా...

- గొప్ప బ్రిటిష్‌ సినిమాగా గుర్తింపు...

- సినిమా చరిత్రలో అత్యధిక ప్రభావం చూపిన చిత్రం...

- వందేళ్లు... వంద సినిమాల జాబితలో స్థానం...

ఇన్ని ఘనతలు సాధించిన చిత్రం ‘లారెన్స్‌ ఆఫ్‌ ఆరేబియా’ (1962). మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్‌ ఆర్మీ అధికారిగా పనిచేసిన థామస్‌ ఎడ్వర్డ్‌ లారెన్స్‌ జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా అప్పటి పరిస్థితులకు, రాజకీయాలకు, తిరుగుబాట్లకు వాస్తవికంగా అద్దం పట్టడంతో పాటు సినీ అభిమానుల ప్రశంసలకు పాత్రం అయింది.

* రెండు నవలలు... రెండు ఆస్కార్లు!


ఓ రచయిత్రి రాసిన నవలల ఆధారంగా రెండు సినిమాలను నిర్మిస్తే అవి రెండూ ఆస్కార్‌ అవార్డులను అందుకోవడం విశేషం. ఆ రచయిత్రి కరేన్‌ బ్లిక్సెన్‌ (కలంపేరు ఇసాక్‌ దినేసెన్‌) అయితే, ఆమె రచనల ఆధారంగా నిర్మించిన సినిమాలు ‘ఔట్‌ ఆఫ్‌ ఆఫ్రికా’ (1985), ‘బాబెటేస్‌ ఫీస్ట్‌’ (1987). వీటిలో ‘జౌట్‌ ఆఫ్‌ ఆఫ్రికా’ ఏడు ఆస్కార్‌ అవార్డులను గెలుచుకుంది. ఇది ఆ రచయిత్రి ఆత్మకథ కావడం మరో విశేషం. భర్త, ప్రియుడుల మధ్య త్రికోణపు ప్రేమలో నలిగిపోయిన ఓ యువతి కథగా ఆకట్టుకున్న ఈ చిత్రం, 28 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి 227 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసింది.

* వింత లోకంలో సాహసాలు


భూమికి మధ్యలో ఉండే ఓ వింతలోకం... అందులో అనేక మహిమలు గల ఓ ఉంగరం... దాన్ని పెట్టుకుంటే చాలు ఎవరైనా మయమైపోతారు... దాని కోసం అనేకమంది ప్రయత్నాలు... సాహసాలు... ఒళ్లు గగుర్పొడిచే పోరాటాలు... ఇవన్నీ వినగానే ‘లార్డ్‌ ఆఫ్‌ రింగ్స్‌’ సినిమా గుర్తొస్తుంది, ప్రపంచ సినీ అభిమానులందరికీ. ఈ పేరుతో వచ్చిన మూడు సినిమాలలో మొదటి సినిమా ‘ద లార్డ్‌ ఆఫ్‌ ద రింగ్స్‌: ద ఫెలోషిప్‌ ఆఫ్‌ ద రింగ్‌’ 2001లో ఇదే రోజు విడుదలైంది. ఇంగ్లిషు రచయిత జె.ఆర్‌.ఆర్‌. టోల్కిన్‌ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా వెండితెరకెక్కి కనువిందు చేసింది. చిత్ర నిర్మాణ శైలిలోనే ఓ వినూత్నమైన నూతన ఒరవడికి ఈ సినిమా నాంది పలికిందనే ప్రశంసలెన్నో దీనికి దక్కాయి.దీన్ని 93 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తెరకెక్కిస్తే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 871.5 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది. పదమూడు ఆస్కార్‌ అవార్డులకు నామినేషన్‌ పొంది నాలుగు గెలుపొందింది. వీటితో పాటు ప్రతిష్ఠాత్మకమైన అనేక అవార్డులను సొంతం చేసుకుంది.

* కష్టాలు దిగమింగాడు...
నటించి నవ్వించాడు...


కమేడియన్‌గా, నటుడిగా, రచయితగా అలరిస్తూ అనేక అవార్డులు అందుకున్న వాడు రిచర్డ్‌ ప్రియర్‌. వేదికలపై ప్రదర్శనలు, టీవీ కార్యక్రమాలు, నాటకాల్లో వేషాలు, సినిమాల్లో పాత్రలతో వేర్వేరు రంగాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇతడి జీవితంపై ‘రిచర్డ్‌ ప్రియర్‌: లైవ్‌ అండ్‌ స్మోకింగ్‌’ అనే సినిమా ప్రత్యేకంగా రావడం విశేషం. ఇతడి హాస్య కార్యక్రమాల కదంబంగా ‘రిచర్డ్‌ ప్రియర్‌: లైవ్‌ ఇన్‌ కాన్సెర్ట్‌’, ‘రిచర్డ్‌ ప్రియర్‌: లైవ్‌ ఆన్‌ ద సన్‌సెట్‌ స్ట్రిప్‌’, ‘రిచర్డ్‌ ప్రియర్‌: హియర్‌ అండ్‌ నౌ’ లాంటి కార్యక్రమాలు, సినిమాలు రూపొందాయి కూడా. వెండితెరపై ‘సిల్వర్‌ స్ట్రీక్‌’, ‘బ్లూ కాలర్‌’, ‘సూపర్‌మ్యాన్‌3’లాంటి సినిమాల ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. ఒక ఎమ్మీ అవార్డు, అయిదు గ్రామీ అవార్డులు, రైటర్స్‌ గిల్డ్‌ అమెరికా అవార్డు, కెనడీ సెంటర్‌ మార్క్‌ ట్రైన్‌ ప్రైజ్‌ ఫర్‌ అమెరికన్‌ హ్యూమర్‌ పురస్కారం అందుకున్నాడు. అమెరికాలో 1940 డిసెంబర్‌ 1న పుట్టిన ఇతడి బాల్యం దుర్భరమైన పరిస్థితుల్లో గడిచింది. అమ్మమ్మ నడిపే వ్యభిచార గృహంలో పెరిగాడు. వ్యభిచారి అయిన తల్లి నిరంతరం తనను తాగుతూ పట్టించుకునేది కాదు. అమ్మమ్మ చీటికీ మాటికీ కొడుతుండేది. ఏడేళ్ల వయసులో లైగింగ వేధింపులకు గురయ్యాడు. పద్నాలుగేళ్లకి స్కూలు నుంచి డిబార్‌ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్మీలో చేరాడు. అక్కడ కూడా వర్ణ వివక్షను ఎదుర్కొన్నాడు. ఇలాంటి కష్టాల్లో అతడు హాస్యాన్ని ఆశ్రయించి ఓదార్పు పొందాడు. ఆ హాస్య చతురతే అతడి జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకు వచ్చింది. ఆర్మీ నుంచి వచ్చాక క్లబ్లో హాస్య కార్యక్రమాలు ప్రదర్శిస్తూ కాస్తో కూస్తో సంపాదించుకునేవాడు. కన్నీళ్లు దాచుకుని నటించి నవ్వించేవాడు. అలా ప్రాచుర్యం పొందడంతో టీవీల్లో అవకాశాలు వచ్చాయి. వాటితో మరింత పేరు పొందాడు. ఆపై సినిమాల ద్వారా ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కష్టాలకు ఓర్చుకుని, నవ్వించడం నేర్చుకుని, జీవితాన్ని తీర్చుకున్న ఇతడు 2005 డిసెంబర్‌ 10న తన 65వ ఏట కన్నుమూశాడు.

* క్యారెక్టర్‌ నటుడిగా మెప్పించి...


ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అందుకున్న క్యారెక్టర్‌ నటుడతడు. పేరు విక్టర్‌ మెక్‌లాగ్లెన్‌. ప్రేక్షకాదరణ పొందిన ఎన్నో సినిమాల్లో ఇతడు కనిపించి మెప్పిస్తాడు. ‘ద ఇన్ఫార్మర్‌’ చిత్రంలో నటనకు ఆస్కార్‌ అందుకున్నాడు. ఇంగ్లండ్‌లో 1886 డిసెంబర్‌ 10న పదిమంది సంతానంలో ఒకడిగా పుట్టిన ఇతడి నలుగురు సోదరులు కూడా నటులు కావడం విశేషం. పద్నాలుగేళ్లకే ఇల్లు వదిలి బ్రిటిష్‌ ఆర్మీలో చేరడానికి వెళ్లిన ఇతడిని వయసు సరిపోదని పంపేశారు. ఆ తర్వాత నాలుగేళ్లు బాక్సర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పోలీస్‌ కానిస్టేబుల్‌గా కూడా పనిచేశాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో కెప్టెన్‌గా సేవలందిస్తూనే బాక్సింగ్‌ను కొనసాగించాడు. ఆ బాక్సింగే అతడికి ‘ద కాల్‌ ఆఫ్‌ ద రోడ్‌’ సినిమాలో బాక్సర్‌ పాత్రకు అవకాశం ఇచ్చింది. ఆపై అతడు నటుడిగా స్థిర పడ్డాడు. ‘కొరింథన్‌ జాక్‌’, ‘ద ప్రే ఆఫ్‌ ద డ్రాగన్‌’, ‘ద స్పోర్ట్‌ ఆఫ్‌ కింగ్స్‌’, ‘ద గ్లోరియస్‌ అడ్వంచర్‌’, ‘ఎ రొమాన్స్‌ ఆఫ్‌ ఓల్డ్‌ బాగ్దాద్‌లాంటి బ్రిటన్‌ సినిమాల్లో నటించాక, హాలీవుడ్‌ అవకాశాలు పొందాడు. ‘ద ఐల్‌ ఆఫ్‌ రెట్రిబ్యూషన్‌’, ‘మెన్‌ ఆఫ్‌ స్టీల్‌’, ‘ద లవ్స్‌ ఆఫ్‌ కార్‌మెన్‌’, ‘ద కాక్‌ ఐడ్‌ వరల్డ్‌’, ‘హ్యాపీడేస్‌’, ‘ద మ్యాగ్నిఫిషెంట్‌ సెవెన్‌’, ‘ద గ్రేట్‌ ఎస్కేప్‌’లాంటి సినిమాల ద్వారా అంతర్జాతీయంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అనేక ప్రశంసలు, పురస్కారాలు అందుకున్న ఇతడు 1959 నవంబర్‌ 7న తన 72వ ఏట మరణించాడు.

* సున్నితమైన పాత్రల సుజాత


ఒద్దికైన పాత్రల్లో ఒదిగిపోయిన నటి సుజాత. త్యాగం, సున్నిత భావాలతో కూడిన పాత్రలకి కూడా ఆమె పెట్టింది పేరు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సుమారు 300 పైచిలుకు చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్‌హాసన్‌ తదితర అగ్ర కథానాయకుల సరసన నటించి పేరు తెచ్చుకొన్నారు. తొలుత కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఆమె ఆ తర్వాత సహాయ పాత్రలతో చక్కటి భావోద్వేగాలు పలికించారు. మాతృభాష మలయాళం అయినా తెలుగులోనే సంభాషణలు చెప్పడం కోసం తెలుగు కూడా నేర్చుకొన్నారు. సుజాత పుట్టింది శ్రీలంకలో అయినా ఆమె సొంతూరు మాత్రం కేరళలో మరదు అనే గ్రామం. తండ్రి ఉద్యోగరీత్యా శ్రీలకంలో స్థిరపడటంతో అక్కడే సుజాత 10-12-1952న జన్మించారు. కుటుంబం కేరళకి తిరిగొచ్చాక సుజాత చదువు కొనసాగించలేకపోయారు. ఒక మలయాళ పత్రికలో ఫొటో ప్రచురితం కావడంతో ఆమెకి నాటకాల్లో అవకాశాలు వరించాయి. ‘పోలీస్‌ స్టేషన్‌’ అనే మలయాళ నాటకంతో పేరు తెచ్చుకొన్న ఆమె 14 యేళ్ల వయసులో ‘తబస్విని’ అనే చిత్రంలో మెరిశారు. ఆ తరువాత ఏడేళ్ల కాలంలో నలభై చిత్రాల్లో నటించి తిరుగులేని కథానాయికగా ఎదిగారు. బాలచందర్‌ దర్శకత్వం వహించిన ‘అవళ్‌ ఒరు తొడర్‌ కథై’ అనే చిత్రంతో నటిగా ఆమెకి మంచి పేరొచ్చింది. అదే చిత్రం తెలుగులో ‘అంతులేని కథ’గా తెరకెక్కింది. సుజాత పెద్దల్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకొన్నారు. ఆ తరువాత అమెరికా వెళ్లినా అక్కడి సంప్రదాయాలు నచ్చకపోవడంతో కాన్పు కోసం ఇండియాకి వచ్చిన ఆమె తిరిగి వెళ్లలేదు. సుజాతని తెలుగులో ‘గోరింటాకు’ చిత్రంతో దాసరి నారాయణరావు పరిచయం చేశారు. ఆ చిత్రం విజయవంతం కావడంతో వరుసగా అగ్ర కథానాయకులతో కలిసి నటించే అవకాశాలు వరించాయి. ‘సూత్రధారులు’, ‘సుజాత’, ‘పసుపు పారాణి’, ‘సంధ్య’, ‘సర్కస్‌ రాముడు’, ‘సూరిగాడు’, ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’, ‘అహంకారి’, ‘జస్టిస్‌ చక్రవర్తి’, ‘ సీతాదేవి’, ‘బహుదూరపు బాటసారి’, ‘వంశగౌరవం’, ‘చంటి’, ‘పెళ్ళి’ తదితర చిత్రాలతో సుజాత తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని స్థానం సంపాదించుకొన్నారు. ఆమె తెలుగులో నటించిన చివరి చిత్రం ‘వెంగమాంబ’. ‘పెళ్ళి’లో నటనకిగానూ ఆమెకి ఉత్తమ సహాయనటిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారం లభించింది. తమిళంలో ప్రతిష్టాత్మక కళైమామణి పురస్కారం అందుకొన్నారు. ఆమెకి సజిత్, దివ్య సంతానం. 58 యేళ్ల వయసులో 2011 ఏప్రిల్‌ 6న ఆమె గుండె సంబంధిత సమస్యలతో చెన్నైలోని సొంత నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ రోజు సుజాత జయంతి.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.