ఫిబ్రవరి 9.. (సినీ చరిత్రలో ఈరోజు)

* తాత చేతుల్లో పెరిగి.. తాత పాత్రలో నటించి!

      (సుమంత్‌ పుట్టిన రోజు-1975)

సుమంత్‌ని చూసిన వెంటనే ఆయన తాత నాగేశ్వరరావు కళ్ల ముందు మెదులుతారు. రూపంలోనూ, హావభావాల్లోనూ, మాట తీరులోనూ... ఇలా చాలా విషయాల్లో అక్కినేని నాగేశ్వరరావుని పోలి ఉంటారు సుమంత్‌. మొన్న ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’లో సుమంత్‌ని చూసిన ¦ళ్లంతా అచ్చం అక్కినేని నాగేశ్వరరావులా ఉన్నారన్నారు. ఏఎన్నార్‌ పెద్ద కూతురు సత్యవతి, సురేంద్ర యార్లగడ్డ దంపతులకి 1975 ఫిబ్రవరి 9న హైదరాబాద్‌లో జన్మించారు సుమంత్‌. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకొన్నారు. సినిమా చిత్రీకరణలతో గడుపుతూ తన పిల్లలతో ఎక్కువగా గడిపే అవకాశం రాలేదని అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా తన చేతులతోనే సుమంత్‌ని పెంచి పెద్ద చేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆయన మిచిగాన్‌లో ఇంజినీరింగ్‌లో చేరారు. రెండేళ్ల తర్వాత అందులో తనకి ఆసక్తి లేదని గ్రహించి చికాగోలోని బి.ఎ ఫిల్మ్‌ స్టడీస్‌లో చేరారు. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ‘ప్రేమకథ’తో కథానాయకుడిగా పరిచయమయ్యారు. 1999 ఏప్రిల్‌ 15న విడుదలైన ఆ చిత్రంతో సుమంత్‌ నటుడిగా మంచి పేరు తెచ్చుకొన్నారు. ఆ తర్వాత ‘యువకుడు’లో నటించారు. మూడో చిత్రంలో తాత ఏఎన్నార్‌తో కలిసి ‘పెళ్లిసంబంధం’, మామ నాగార్జునతో ‘స్నేహమంటే ఇదేరా’లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకొన్నారు. ‘సత్యం’తో ఆయన ఘన విజయాన్ని సొంతం చేసుకొన్నారు. జెనీలియా తెలుగులో చేసిన తొలి చిత్రం అదే. ఆ తర్వాత ‘గౌరి’, ‘మహానంది’, ‘గోదావరి’ తదితర చిత్రాలతో సుమంత్‌ కథానాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ‘చిన్నోడు’, ‘క్లాస్‌మేట్స్‌’, ‘మధుమాసం’, ‘పౌరుడు’, ‘బోణి’ తదితర చిత్రాలు పర్వాలేదనిపించాయి. ‘గోల్కొండ హైస్కూల్‌’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్నారు. మధ్యలో కొన్ని పరాజయాల్ని చవిచూసిన ఆయన ‘మళ్లీరావా’తో మరో విజయాన్ని సొంతం చేసుకొన్నారు. ఇటీవల ఆయన నటించిన ‘సుబ్రమణ్యపురం’ ప్రేక్షకుల్ని మెప్పిస్తే, ‘ఇదం జగత్‌’ పర్వాలేదనిపించింది. ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’లో తాత ఏఎన్నార్‌ పాత్రని పోషించిన సుమంత్‌ ప్రేక్షకుల మెప్పు పొందారు. 2004లో కథానాయిక కీర్తిరెడ్డిని వివాహం చేసుకొన్న ఆయన, 2006లో ఆమెతో విడిపోయారు. ఇద్దరూ పెళ్లి బంధం నుంచి బయటికొచ్చినా స్నేహితులుగా కొనసాగుతున్నారు. సుమంత్‌కి సోదరి సుప్రియ ఉన్నారు. ఆమె కూడా కథానాయికగా పవన్‌కల్యాణ్‌ సరసన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’లో నటించారు. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌కి డైరెక్టర్‌గా కొనసాగుతూ నిర్మాణ వ్యవహారాల్ని చూసుకుంటున్నారు. ఈ రోజు సుమంత్‌ పుట్టినరోజు.

* సుస్వరాల సంగీతకారుడు

(సుసర్ల దక్షిణామూర్తి వర్థంతి-2012)


                           (ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* ఇంజినీర్‌ అవుదామనుకుని...

కేంబ్రిడ్జ్‌లో ఇంజినీరింగ్‌ చదివి ఇంజినీర్‌ అవ్వాలనుకున్న ఓ కుర్రాడి కలలు, తండ్రి మరణంతో ఆవిరయ్యాయి... అయితే వెండితెర అతడికి ఎర్రతివాచీ పరిచి, ఉత్తమ నటుడిగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చింది... రొనాల్డ్‌ కోల్‌మన్‌ అంటే చాలు హాలీవుడ్‌ సినిమా అభిమానులకు మంచి సినిమాలు కళ్ల ముందు మెదులుతాయి. తండ్రి మరణంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయిన అతడికి నాటకం మంచి ఉపాధినిచ్చింది. వేదికలపై నాటకాలు వేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆపై టీవీల్లో మెరిశాడు. తర్వాత నిశ్శబ్ద చిత్రాల నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. మూడు దశాబ్దాల పాటు ‘బుల్‌డాగ్‌ డ్రమ్మండ్‌’ (1929), ‘కండెమ్న్‌డ్‌’, ‘రాండమ్‌ హార్వెస్ట్‌’, ‘ఎ టేల్‌ ఆఫ్‌ టూ సిటీస్‌’, ‘లాస్ట్‌ హారిజన్‌’, ‘ద ప్రిజనర్‌ ఆఫ్‌ జెండా’, ‘కిస్మత్‌’, ‘ఎ డబుల్‌ లైఫ్‌’ లాంటి సినిమాల్లో నటించి అకాడమీ, గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డులు గెల్చుకున్నాడు. యుకెలో 1891 ఫిబ్రవరి 9న పుట్టిన ఇతడు కాలిఫోర్నియాలో 1958 మే 19న తన 67వ ఏట మరణించాడు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.