జులై 10 (సినీ చరిత్రలో ఈరోజు)

తెలుగులో తొలి నవలా చిత్రం

తెలుగు నవల ఆధారంగా నిర్మితమైన తొలి తెలుగు చిత్రంగా ‘డాక్టర్‌ చక్రవర్తి’ పేరొందింది. కోడూరి కౌసల్యాదేవి రాసిన ‘చక్రభ్రమణం’ నవల ఆధారంగా ‘అన్నపూర్ణా’ సంస్థ, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం 1964, జులై 10న విడుదలైంది. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య, షావుకారు జానకి నటించిన ఈ చిత్రం శతదినోత్సవాలు జరుపుకుంది. 1964 సంవత్సరానికి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికవడంతో పాటు, తొలి ‘నంది’ అవార్డుగా బంగారు నందిని అందుకుంది.

(ఈ సినిమాపై ప్రత్యేక వార్తకోసం... క్లిక్‌ చేయండి)

అమెరికా అధ్యక్షుడిని కాపాడిన ఖైదీ


ఉగ్రవాదులు ఓ విమానాన్ని హైజాక్‌ చేశారు. అందులో అమెరికా అధ్యక్షుడు కూడా ఉన్నాడు. ఆ విమానాన్ని న్యూయార్క్‌లో దింపి ఉగ్రవాదులు బేరసారాలు మొదలుపెట్టారు. ఉన్న సమయం కేవలం 24 గంటలు. ఈలోగా అధ్యక్షుడిని ఎలా కాపాడాలి? అప్పుడు మాన్‌హట్టన్‌ జైలులో ఉన్న ఓ ఖైదీ చాలా శక్తివంతుడని తెలుస్తుంది. అతడిని ఈ పనికి వినియోగిస్తారు. అతడు కనుక అధ్యక్షుడిని కాపాడితే అతడిని క్షమాభిక్ష ద్వారా జైలు శిక్ష నుంచి తప్పిస్తామనేది ఒప్పందం. అలాగే ఆ ఖైదీ శరీరంలోకి ఒక మైక్రోచిప్‌ను ప్రవేశపెడతారు. అది 22 గంటల తర్వాత పేలిపోతుంది. ఈలోగా అతడు అనుకున్న పని సాధిస్తే ఆ మైక్రోచిప్‌ పనిచేయకుండా చేస్తారు. ఇక అతడెలా అధ్యక్షుడిని కాపాడాడనేదే సినిమా. అదే ‘ఎస్కేప్‌ ఫ్రమ్‌ న్యూయార్క్‌’ (1981) సినిమా. ఈ కథను దర్శకుడు జాన్‌ కార్పెంటర్‌ 1970లోనే రాసుకున్నాడు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను 6 మిలియన్‌ డాలర్లతో తీస్తే ప్రపంచ వ్యాప్తంగా 25.2 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. దీనికి సీక్వెల్‌గా ‘ఎస్కేప్‌ ఫ్రమ్‌ లాస్‌ఏంజెలిస్‌’ అనే మరో సినిమా 1996లో వచ్చింది.


నటనకి పెట్టని కోట

(కోట శ్రీనివాసరావు పుట్టిన రోజు)

కోట శ్రీనివాసరావు ప్రతినాయకుడిగా నటించాడంటే ప్రేక్షకుడిలోనూ ఆవేశం కట్టలు తెంచుకొంటుంది. ఆయన తండ్రి వేషాల్లో కనిపించాడంటే భావోద్వేగాలు పొంగి ప్రవహిస్తాయి. ఆయన కామెడీ చేశాడంటే ఇక థియేటర్లు నవ్వులతో హోరెత్తాల్సిందే. ఇలా అన్ని రకాల పాత్రల్లో ఒదిగిపోయే అరుదైన నటుడు కోట శ్రీనివాసరావు. నటనలో ఎవరెస్ట్‌ ఆయన. మాకు కోట ఉన్నాడని తెలుగు చిత్ర పరిశ్రమ, ప్రేక్షకులు గర్వంగా చెప్పుకొనే స్థాయి ఆయనది. 1945 జులై 10న కంకిపాడులో జన్మించిన కోట శ్రీనివాసరావు స్టేట్‌బ్యాంక్‌లో ఉద్యోగంతో ప్రస్థానం ప్రారంభించారు. బాల్యం నుంచే నాటకాలపై ఆసక్తి మెండుగా ఉన్న ఆయన ‘ప్రాణం ఖరీదు’తో సినీ రంగ ప్రవేశం చేశారు. దర్శకనిర్మాత క్రాంతి కుమార్‌ ‘ప్రాణం ఖరీదు’ నాటకాన్ని చూసి సినిమాగా తీయాలనుకొన్నారు. ఆ నాటకంలో నటించిన నటుల్నే సినిమా కోసం ఎంపిక చేసుకొన్నారు. అలా ఆ నాటకంలో ఓ కీలక పాత్ర పోషించిన కోట కూడా సినిమాలో నటించారు. అంతే తప్ప ఆయన సినిమాల కోసం ఎప్పుడూ సీరియస్‌గా ప్రయత్నించింది లేదట. ఆ తరువాత వరుసగా ఆయనకి సినిమా అవకాశాలు రావడం, ‘అహనా పెళ్లంట’లో చేసిన పిసినిగొట్టు పాత్రతో విశేషంగా పేరు రావడంతో సినిమాల్లో బిజీ అయిపోయారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, డెక్కనీ భాషల్లో నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్నారు కోట. ‘అహనా పెళ్లంట’తో పాటు, ‘రేపటి పౌరులు’, ‘ప్రతిఘటన’, ‘శివ’, ‘శత్రువు’, ‘మనీ’, ‘గాయం’, ‘గోవిందా గోవిందా’, ‘హలో బ్రదర్‌’, ‘ఆమె’, ‘అనగనగా ఒక రోజు’, ‘గణేశ్‌’, ‘స్టూడెంట్‌ నెంబర్‌ 1’, ‘ఠాగూర్‌’, ‘మల్లీశ్వరి’, ‘అతడు’, ‘పౌర్ణమి’, ‘బొమ్మరిల్లు’, ‘సర్కార్‌’, ‘రెడీ’, ‘లీడర్‌’, ‘ఆడవారి మాటలకి అర్థాలే వేరులే’, ‘అత్తారింటికి దారేది’, ‘దూకుడు’ తదితర చిత్రాల్లో కోట పోషించిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 600 పైచిలుకు చిత్రాల్లో నటించిన ఘనత కోట సొంతం. మెథడ్‌ యాక్టర్‌గా గుర్తింపు పొందిన నటుడాయన. రాజకీయ రంగంలోనూ అడుగుపెట్టిన కోట విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారు. 1968లో రుక్మిణిని వివాహం చేసుకొన్న కోటకి ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి. ఈయన కుమారుడు కోట ప్రసాద్‌ కూడా నటుడే. 2010 జూన్‌ 21న జరిగిన రోడ్డు ప్రమాదంలో కోట ప్రసాద్‌ ప్రాణాలు కోల్పోయారు. కోటకి 2015లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం అందజేసే నంది పురస్కారాలు 9 వరించాయి కోటని. అల్లు రామలింగయ్య పురస్కారంతో పాటు, పలు పురస్కారాలు ఆయన్ని వరించాయి.


(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.