మే 10.. (సినీ చరిత్రలో ఈరోజు)

* అందమైన బొద్దుగుమ్మ

(నమిత పుట్టినరోజు-1981)

మెరుపు తీగలాగా తెరకు పరిచయమైంది. ఆ తర్వాత బొద్దుగుమ్మ అనిపించుకొంది. నాజూగ్గా ఉన్నప్పుడు ప్రేక్షకులకు ఎంతగా నచ్చిందో, బొద్దుగా మారాక అంత కంటే ఎక్కువగా నచ్చింది. నమిత కోసం ఏకంగా తమిళ అభిమానులు గుడులు కట్టారంటే వాళ్లకి ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో నటించి ప్రతి చోటా అభిమానుల్ని సంపాదించుకుంది నమిత. గుజరాత్‌లోని సూరత్‌లో 10 మే, 1981లో జన్మించింది. 2001 మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొని మెరిసిన ఈమె, తెలుగు చిత్రం ‘సొంతం’తో తెరకు పరిచయమైంది. ఆ తర్వాత వెంకటేష్‌తో కలిసి ‘జెమిని’, రవితేజతో కలిసి ‘ఒక రాజు ఒకరాణి’ చిత్రాల్లో మెరిసింది. దాంతో నమితకి మంచి గుర్తింపు లభించింది. అయితే ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయింది. ‘ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి’, ‘ఐతే ఏంటి’, ‘నాయకుడు’ తదితర చిత్రాల్లో మెరిసినా అవి అంతగా విజయవంతం కాలేదు. దాంతో క్రమంగా తమిళం, హిందీ సినిమాలపై దృష్టిపెట్టింది నమిత. బొద్దుగా కనిపించే భామలంటే తమిళ ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. నమిత కొన్నాళ్ల తర్వాత బొద్దుగా మారడంతో... ఆమె అందం తమిళ ప్రేక్షకులకు బాగా నచ్చింది. దాంతో బలమైన అభిమాన గణం ఏర్పడింది. ‘బిల్లా’, ‘సింహా’ తదితర చిత్రాలతో మళ్లీ తెలుగులో సందడి చేసినా... అట్టే అవకాశాలు అందుకోలేకపోయింది. తమిళంలో ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 1లో పాల్గొన్న ఈమె బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పించింది. ఎప్పట్నుంచో సన్నిహితంగా మెలుగుతున్న వీరేంద్ర చౌదరిని తిరుపతిలో నవంబరు 2017న వివాహం చేసుకుంది నమిత. ఈ రోజు నమిత పుట్టినరోజు.

* అభిరుచిగల నిర్మాత

(ఎమ్‌.ఎస్‌.రాజు పుట్టిన రోజు)

    

సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ - ఈ బ్యానర్‌ పేరు పోస్టర్‌పై కనిపించిందంటే చాలు. వినోదం గ్యారెంటీ అనే భరోసా ప్రేక్షకుల్లో కనిపించేది. ‘శత్రువు’, ‘పోలీస్‌ లాకప్‌’ సినిమాలతో మొదలు పెడితే... ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ దాకా ఈ సంస్థ నుంచి వచ్చిన దాదాపు చిత్రాలు గుర్తుండిపోయేవే. ‘దేవి’, ‘దేవీపుత్రుడు’ చిత్రాలు సాంకేతికంగా తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచాయి. ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’ చిత్రాలు ఒక కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టాయి. ఈ విజయవంతమైన చిత్రాల వెనక, వీటిని నిర్మించిన సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ వెనక ఉన్న వ్యక్తి ఎమ్‌.ఎస్‌.రాజు. నిండైన ఆకారంతో కనిపించినట్టుగానే.. ఆయన సినిమాలు కూడా భారీదనం ఉట్టిపడేలా ఉంటాయి. అభిరుచిగల నిర్మాతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఎమ్‌.ఎస్‌.రాజు, వరుస విజయాలతో తెలుగు చిత్రసీమలో ఓ వెలుగు వెలిగారు. నిర్మాతగానే కాకుండా, నటుడిగా కూడా అప్పుడప్పుడు తెరపై మెరిశారు. ‘వాన’, ‘తూనీగ తూనీగ’ చిత్రాలతో దర్శకుడిగా కూడా తన ప్రతిభని చాటే ప్రయత్నం చేశారు. ‘వర్షం’తో ప్రభాస్‌కి స్టార్‌ ఇమేజ్‌ వచ్చిందంటే కారణం ఎమ్‌.ఎస్‌.రాజే. ఆ సమయంలో ప్రభాస్‌ మార్కెట్‌ని పట్టించుకోకుండా, పెద్దయెత్తున ఖర్చు పెట్టి ఆ చిత్రాన్ని తీశారు. నృత్య దర్శకుడిగా, కథానాయకుడిగానే తెలిసిన ప్రభుదేవాని దర్శకుడిగా పరిచయం చేసిన ఘనత కూడా ఎమ్‌.ఎస్‌.రాజుదే. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంతో ప్రభుదేవాకి తొలి అవకాశమిచ్చి విజయాన్ని అందుకొన్నారు. ఎమ్‌.ఎస్‌.రాజు నిర్మించిన ‘ఒక్కడు’ చిత్రంతోనే మహేష్‌బాబులోని అసలు సిసలు స్టార్‌ బయటికొచ్చారు. రాజు నిర్మించింది 14 సినిమాలే అయినా.. వాటిలో పది కాలాల పాటు చెప్పుకొనే సినిమాలు ఉండటం విశేషం. విజయాల బాటలో దూసుకెళుతున్న ఆయన ‘పౌర్ణమి’, ‘ఆట’, ‘వాన’ చిత్రాలతో ఎదురు దెబ్బలు తిన్నారు. ‘వాన’ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. రామ్‌తో ‘మస్కా’ తీశాక ఆయన నిర్మాణానికి దూరమయ్యారు. ‘ఒక్కడు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రాలకిగానూ నిర్మాతగా నంది పురస్కారాలు అందుకొన్నారు. నిర్మాతగా ఆయన వేగం తగ్గాక, తనయుడు సుమంత్‌ అశ్విన్‌ని కథానాయకుడిగా నిలబెట్టే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. సొంతంగా మెగాఫోన్‌ పట్టి సుమంత్‌ అశ్విన్‌ కథానాయకుడిగా ‘తూనీగ తూనీగ’ తెరకెక్కించారు. కానీ ఆ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయింది. ప్రస్తుతం సుమంత్‌ అశ్విన్‌కి కథల విషయంలో సలహాలిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఈ రోజు ఎమ్‌.ఎస్‌.రాజు పుట్టినరోజు.

* మెరుపుల కలం

(చంద్రబోస్‌ పుట్టిన రోజు)

 

నీ నవ్వుల తెల్లదనాన్ని నాగ మల్లి అప్పడిగిందీ... (ఆది), ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాం... (స్టూడెంట్‌ నెంబర్‌ 1), పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మ... (నాని), మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుందీ... (నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమరీస్‌). - ఇలా ఎప్పటికీ గుర్తుండిపోయే ఎన్నో పాటల్ని అందించిన రచయిత చంద్రబోస్‌. మూడు వేలకి పైగా పాటలు రాసిన గీతకారుడాయన. సీనియర్‌ రచయితలకీ, నవతరానికి మధ్య వారధిలా కనిపిస్తుంటారు. సందర్భం ఏదైనా సరే... చంద్రబోస్‌ కలం మెరుపులు మెరిపిస్తుంది. కమర్షియల్‌ చిత్రాల్లో, మాస్‌ కథానాయకులు ఆడిపాడే పాటని కూడా స్ఫూర్తిదాయకమైన విషయాలు చెప్పడానికి వేదికగా చేసుకుంటుంటారు చంద్రబస్‌. ఆయన రాసిన తొలి చిత్రం ‘తాజ్‌మహల్‌’. అందులో డా.సి.నారాయణరెడ్డితో కలిసి పాటలు పంచుకొన్నారు. తొలి చిత్ర క్యాసెట్‌పైనే నా పేరు డా.సి.నారాయణరెడ్డి పేరుతో కలిసి కనిపించడం అప్పటికీ, ఇప్పటికీ గొప్ప అనుభూతిని పంచుతుంటుందని చెబుతుంటారు బోస్‌. రాసిన తొలి పాటని డా.సి.నారాయణరెడ్డి విని ‘నీ పేరు ఏమిటి?’ అని అడిగారట. సుభాష్‌ చంద్రబోస్‌ సర్‌ అని బదులివ్వడంతో... ‘నువ్వు సుభాష్‌ చంద్రబోస్‌ కాదు.. శభాష్‌ చంద్రబోస్‌’ అంటూ మెచ్చుకున్నారట. అలా తొలి చిత్రంతోనే సినారె మెప్పు పొందిన చంద్రబోస్‌ నుంచి ఎప్పుడు పాట వచ్చినా అది శ్రోతల నోళ్లల్లో కొన్నాళ్లపాటు నాని తీరాల్సిందే. అంతగా పాటపై ప్రభావం చూపిస్తుంటారాయన. చంద్రబోస్‌ వరంగల్‌ జిల్లా చల్లగరిగ గ్రామంలో కె.నరసయ్య, మదనమ్మ దంపతులకి జన్మించారు. చిన్నప్పట్నుంచే పాటలు పాడటంపై మక్కువ పెంచుకొన్న ఆయన, చదువుకునే రోజుల్లోనే గాయకుడిగా మారారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత దూరదర్శన్‌లో పాటలు పాడటం కోసం ప్రయత్నించారు. స్వయంగా పాటలు రాసుకొని పాడే అలవాటున్న చంద్రబోస్‌ గీత రచనపై దృష్టిపెట్టారు. స్నేహితుడు శ్రీనాథ్‌... ప్రముఖ దర్శకుడు ముప్పలనేని శివకి పరిచయం చేయడంతో ఆయన ‘తాజ్‌మహల్‌’ చిత్రానికి పనిచేసే అవకాశమిచ్చారు. మంచు కొండల్లోని చంద్రమా... అంటూ మొదలైన ఆయన పాటల ప్రయాణం విజయవంతంగా సాగుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఒక స్టార్‌ రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు బోస్‌. పెళ్లిసందడి, ఆది, నేనున్నాను చిత్రాల్లోని పాటలకిగానూ నంది పురస్కారాన్ని సొంతం చేసుకొన్నారు బోస్‌. అప్పుడప్పుడు కొన్ని చిత్రాల్లో పాటలు కూడా ఆలపిస్తుంటారు. ఆయన నృత్య దర్శకురాలు సుచిత్రని వివాహం చేసుకున్నారు. వారికి అమృతవర్షిణి, నంద వనమాలి అనే ఇద్దరు పిల్లలున్నారు. ఈ రోజు చంద్రబోస్‌ పుట్టినరోజు.

* అక్కినేని, అంజలిల స్వర్ణ సంతకం!

       

* సుడిగాలితో కాసుల వర్షం

సుడిగాలితో సినిమా తీయాలనుకోవడం సులువే. కానీ ‘స్టార్ట్‌ కెమేరా... కమాన్‌ సుడిగాలీ! యాక్షన్‌’ అనడం కుదురుతుందా? అన్నా అది వింటుందా? కానీ ఆ సుడిగాలి స్వయంగా వచ్చి నటించిందా... అనేంత భ్రమ కలిగించే సినిమా ‘ట్విస్టర్‌’ (1996). దీని నిర్మాతల్లో ఒకరు ప్రముఖ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌. అమెరికా ప్రాంతాల్లో బీభత్సం సృష్టించే టోర్నెడోల గురించి ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా తెరకెక్కించిన చిత్రమిది. టోర్నెడోల మీద పరిశోధన చేసే కొందరు శాస్త్రవేత్తలు ఎలాంటి ప్రయత్నాలు చేశారనేదే చిత్ర కథాంశం. సునామీ, భూకంపం, అగ్నిపర్వతాల ప్రజ్వలనం, తుపాన్‌ వంటి ప్రకృతి వైపరీత్యాలపై తీసే సినిమాలను డిజాస్టర్‌ ఫిల్మ్స్‌ అంటారు. ఆ కోవలో ‘స్పీడ్‌’, ‘డైహార్డ్‌’ లాంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాలతో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు జాన్‌డె బాంట్‌ దర్శకత్వంలో 92 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తీసిన ఈ సినిమా, 494.5 మిలియన్‌ డాలర్లను వసూలు చేయడంతో పాటు పలు ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు అందుకుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.