జులై 16.. (సినీ చరిత్రలో ఈరోజు)

* రాకాసి బల్లుల సందడి..


మానవజాతి పుట్టక ముందు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమ్మీద రాకాసి బల్లులు రాజ్యమేలాయని శాస్త్రవేత్తలు ప్రకటించినప్పుడు ప్రపంచం ఉలిక్కిపడింది. తవ్వకాల్లో దొరికిన శిలాజాల ఆధారంగా రాకాసి బల్లుల ఆకారాలను బొమ్మలుగా చిత్రించారు. అలాంటి డైనోసార్లు బతికి వస్తే ఎలా ఉంటుందనే ఊహతో ప్రఖ్యాత దర్శకనిర్మాత ‘జురాసిక్‌ పార్క్‌’ తీశాడు. 1990లో వచ్చిన ఈ సైన్స్‌ఫిక్షన్‌ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన మూడో సినిమా ‘జురాసిక్‌ పార్క్‌ 3’ 2001లో జులై 16న విడుదల అయింది. మొదటి రెండు సినిమాలకు స్పీల్‌బర్గ్‌ దర్శకత్వం వహిస్తే, ఈ మూడోదానికి అతడి మిత్రుడు జాన్‌స్టన్‌ దర్శకత్వం వహించాడు. ఇది కూడా ప్రపంచ సినీ అభిమానులను అలరిస్తూ, 93 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి 368 మిలియన్‌ డాలర్లకు పైగా ఆర్జించింది.

* విజృంభించిన గబ్బిలం వీరుడు..


అమెరికాలో ఎనభై ఎళ్ల క్రితం పిల్లల్ని, పెద్దల్ని విశేషంగా ఆకర్షించిన బొమ్మల పుస్తకాలు కామిక్స్‌. ఎన్నో రకాల కథలతో కూడిన ఆ పుస్తకాలు కోట్లాది కాపీలు అమ్ముడుపోయాయి. రచయితలు, చిత్రకారులు కలిసి వింత వింత పాత్రలను సృష్టించి కథలు అల్లేవారు. సూపర్‌ హీరోలందరూ మొదట్లో అలా సృష్టించబడిన వారే. అలాంటి పుస్తకాల్లో 1939లో పుట్టిన వాడే బ్యాట్‌మేన్‌. ఆ కథల ఆధారంగా బ్యాట్‌మేన్‌ సినిమాలు వెండితెరపై సందడి చేశాయి. వాటిలో ఒకటైన ‘ద డార్క్‌ నైట్‌ రైజెస్‌’ సినిమా 2012లో జులై 16న విడుదలైంది. కామిక్‌ పుస్తకాలు చదివి స్ఫూర్తి పొందిన ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ తీసిన డార్క్‌నైట్‌ ట్రయాలజీ చిత్రాల్లో చివరిదైన ఇది 230 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌కి 100 కోట్ల మిలియన్‌ డాలర్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.


* ఘంటసాలను మరపించిన గాయకుడు!

(రామకృష్ణ విస్సంరాజు వర్థంతి-2015)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...

* అభినయ సీమలో అందాల భామ..


మత్తెక్కించే రూపం, చూడచక్కని ఆహార్యం, సొగసులొలికించే శరీర సౌష్టవం కత్రీనాకైఫ్‌ సొంతం. నటిగా, మోడల్‌గా సుపరిచితురాలు. హిందీ, తెలుగు, మళయాళం భాషల్లో పలు సినిమాల్లో నటించింది. జాతీయ, అంతర్జాతీయ, ఫిలింఫేర్‌ అవార్డులను సాధించిందీ బ్రిటిష్‌ యువతి. పూర్తి పేరు కత్రీనాకైఫ్‌ తుర్కోటి. 14 ఏళ్ల ప్రాయంలోనే హవాయిలో అందాల పోటీల్లో పాల్గొంది. గేమ్‌ షోలతో పాటు సల్మాన్‌ఖాన్‌ నిర్వహించిన ‘బీయింగ్‌ హ్యూమన్‌’ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ‘ప్రపంచ శృంగారవంతమైన వనిత’ (వరల్డ్‌ సెక్సీయస్ట్‌ ఉమన్‌)గా గుర్తింపు తెచ్చుకొంది. హిందీలో ‘బూమ్‌’ ఆమె తొలి బాలీవుడ్‌ చిత్రం. అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించింది. ఆ తరువాత ‘సర్కార్‌’, ‘ధూమ్‌ 3’ చిత్రాల్లో నటించింది. మళయాళంలో ‘బలరామ్‌ వర్సెస్‌ తారాదాస్‌’లో ‘సుప్రియ’ పాత్రలో కనిపించింది. తెలుగులో బాలకృష్ణ, వెంకటేష్‌ల సరసన ‘మల్లీశ్వరి’, అల్లరి పిడుగు’ చిత్రాల్లో నటించింది. ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’, ‘జీరో’లాంటి చిత్రాల్లో సందడి చేసింది. ‘నమస్తే లండన్‌’(2007) చిత్రం కత్రీనా భవిష్యత్తును మలుపు తిప్పింది. హిందీలో విడుదలైన ‘న్యూయార్క్‌’ చిత్రంలో నæనకు గాను ‘ఫిలింఫేô’Â అవార్డుకు నామినేటైంది. ఇంæర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ ‘స్టైల్‌ దివా ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు సహా మొత్తం 35 అవార్డులు ఆమె సొంతం. అత్యధిక పారితోషికాన్ని ఆందుకున్న నటిగా గుర్తింపు పొందింది. 1983 జూన్‌ 16న పుట్టిన క్రతీనాకైఫ్‌ 36వ జన్మదినోత్సవాన్ని జరుపుకొంటోంది.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* ఆటా పాటా ఆమె సొంతం


నటిగా, గాయనిగా, డ్యాన్సర్‌గా కొన్ని దశాబ్దాల పాటు వినోద రంగంలో ఉర్రూతలూగించడమంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే ఆమె అసామాన్యురాలు. పేరు జింజర్‌ రోజెర్స్‌. అలనాటి ప్రేక్షకుల వెండితెర వేలుపు. సంగీతాభిమానుల ఆరాధ్య దేవత. యువతరాన్ని డ్యాన్స్‌లతో ఊపేసిన చలాకీ రాణి. బహిరంగ వేదిక, రేడియో, టీవీ, సినిమా... రంగం ఏదైనా రాణించి 20వ శతాబ్దంలోనే అత్యంత ప్రాచర్యం పొందిన అందాల భామ. మిస్సోరీలో 1911 జులై 16న పుట్టిన ఈమె తొమ్మిదేళ్లకే ఓ డ్యాన్స్‌ పోటీలో గెలిచి ఆపై సొంతంగా ప్రదర్శనలు ఇచ్చేంత పేరు సంపాదించింది. సంగీత రూపకాలు, నాట్య ప్రదర్శనలు, పాటలతో తీరిక లేకుండా ఊర్లు చుట్టబెట్టేసింది. ఇంత హుషారైన అందానికి వెండితెర ఎర్రతివాచీ పరచకుండా ఉంటుందా? ప్యారమౌంట్‌ పిక్చర్స్‌ వాళ్లు భారీ పారితోషికంతో సంతకాలు పెట్టించేసుకున్నారు. అలా ‘ఫార్టీ సెకండ్‌ స్ట్రీట్‌’, ‘స్వింగ్‌ టైమ్‌’, ‘టాప్‌ హ్యాట్‌’, ‘కిట్టీ ఫోలే’, ‘హెలో డాలీ’ లాంటి సినిమాలతో అలరించింది. ఉత్తమ నటిగా ఆస్కార్‌ కూడా అందుకుంది. హాలీవుడ్‌లోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా ఎదిగింది. హాలీవుడ్‌ స్వర్ణయుగానికి చెందిన మేటి తారగా పేరు తెచ్చుకుంది. అమెరికా ఫిలిం ఇనిస్టిట్యూట్‌ రూపొందించిన ‘వందేళ్లు.. వందమంది మేటి తారలు’ జాబితాలో 14వ స్థానం పొందింది. ఈమె తన జీవిత కథ ‘జింజర్‌: మై స్టోరీ’గా వెలువడింది. అనేక పురస్కారాలు పొందిన ఈమె తన 83వ ఏట 1995 ఏప్రిల్‌ 25న మరణించింది.

* భయానక సినిమాల పితామహుడు!


ఆయన సినిమాలు చూసి ప్రేక్షకులు ఝడుసుకున్నారు... ఉలిక్కిపడ్డారు... వణికిపోయారు... అయినా సరే, వాటినే మళ్లీ మళ్లీ చూశారు. ఆఖరికి ఆయనకి ‘ఫాదర్‌ ఆఫ్‌ ద జాంబీ ఫిల్మ్‌’ అనే బిరుదు ఇచ్చేశారు. జాంబీ ఫిల్మ్‌ అంటే చనిపోయిన వాళ్లు తిరిగి రావడం, లేదా బతికున్న వాళ్లపై ఆవహించి హత్యలు చేయించడం, నరమాంస భక్షకుల్లాగా మారడం... ఇలాంటి పాత్రలతో తీసిన సినిమా అన్నమాట. అలా భయానక సినిమాలకి ఆద్యుడుగా పేరు తెచ్చుకున్న వాడే జార్జి ఎ. రోమెరో. నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటర్‌గా, స్క్రీన్‌ రచయితగా ఈయన చేసిన కృషంతా... ‘భయంకరమైనదే’! ఈయన సినిమాల పేర్లన్నీ దాదాపుగా ‘డెడ్‌’ అనే పదంతో ఉంటాయి. అందుకే ఈయనకు ‘గాడ్‌ఫాదర్‌ ఆఫ్‌ ద డెడ్‌’ అనే ప్రాచుర్యం కూడా వచ్చింది. ఇలాంటి సినిమాöకు ప్రపంచ వ్యాప్తంగా నాంది పలికినదిగా ‘నైట్‌ ఆఫ్‌ ద లివిండ్‌ డెడ్‌’ను చెబుతారు. ఇది ఆయన తీసిందే. ఆ తర్వాత ‘డాన్‌ ఆఫ్‌ ద డెడ్‌’, ‘డే ఆఫ్‌ ద డెడ్‌’, ‘ల్యాండ్‌ ఆఫ్‌ ద డెడ్‌’, ‘సిటీ ఆఫ్‌ ద డెడ్‌’, ‘సర్వైవల్‌ ఆఫ్‌ ద డెడ్‌’, ‘ఎంపైర్‌ ఆఫ్‌ ద డెడ్‌’, ‘డైరీ ఆఫ్‌ ద డెడ్‌’, ‘రోడ్‌ ఆఫ్‌ ద డెడ్‌’లాంటి సినిమాలు, టీవీ సీరియల్స్‌ ఎన్నో ఈయన రూపొందించాడు. ఇతరేతర సినిమాలు కూడా తీసినా ఈయన్ని మాత్రం ‘భయంకర’ దర్శకుడుగానే ప్రేక్షకులు గుర్తుంచుకున్నారు. న్యూయార్క్‌లో 1940 ఫిబ్రవరి 4న పుట్టిన ఈయన కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులను భయపెట్టి, 2017 జులై 16న తన 77వ ఏట మరణించారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.