జులై 20 (సినీ చరిత్రలో ఈరోజు)

ఒకే ఒక్కడు... బ్రూస్‌లీ!తడు బతికింది కేవలం 32 సంవత్సరాలు... కానీ సినీ అభిమానులు తరతరాలుగా చెప్పుకునేంత పేరు సంపాదించాడు... వెండితెరపై వెలిగిన కథానాయకుల్లో విలక్షణ చరిత్ర కలిగిన ఒకే ఒక్కడు బ్రూస్‌లీ. కరాటే, కుంగ్‌ఫూ, తైక్వాండోలాంటి పోరాట విద్యలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని తీసుకువచ్చిన బ్రూస్‌లీ వేగానికి ప్రతిరూపం, శక్తికి నిర్వచనం, స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం. నటుడిగా, దర్శకుడిగా, పోరాట వీరుడిగా, వేదాంతిగా ఎదిగిన బ్రూస్‌లీ ముద్ర చెరిగిపోనిది. తండ్రి లీ హోయ్‌ చుయన్‌ నటుడు కావడంతో, 1940 నవంబర్‌ 27న పుట్టిన బ్రూస్‌లీ నెలల వయసులోనే వెండితెరకు పరిచయం అయిపోయాడు. 18 ఏళ్లు వచ్చేసరికల్లా 20 సినిమాల్లో కనిపించాడు. పుట్టింది శాన్‌ ఫ్రాన్సిస్కోలోనే అయినా, హాంగ్‌కాంగ్‌ తల్లిదండ్రుల వ్యాపకాల రీత్యా హాంగ్‌కాంగ్‌లోనే ఎదిగి, 18 ఏళ్ల వయసులో ఉన్నత చదువు కోసం అమెరికా వచ్చాడు. అక్కడ యువకులకే కాదు, ప్రపంచ సినిమాలకే మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్పాడు. ‘ద బిగ్‌బాస్‌’ (1971), ‘ఫిస్ట్‌ ఆఫ్‌ ఫ్యూరీ’ (1972), ‘వే ఆఫ్‌ ద డ్రాగన్‌’ (1972), ‘ఎంటర్‌ ద డ్రాగన్‌’ (1973), ‘గేమ్‌ ఆప్‌ డెత్‌’ (1978) సినిమాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని గడించాడు. అమెరికాలో సహవిద్యార్థిని లిండా ఎమెరీని 1964లో పెళ్లాడి, బ్రాన్‌డన్‌ లీ, షానన్‌ లీలకు జన్మనిచ్చాడు. అనేక అవార్డులను, పురస్కారాలను అంతకు మించి సినీ అభిమానుల ప్రేమాభిమానాలను అందుకున్న బ్రూస్‌లీ 1973 జులై 20 అనూహ్యంగా మరణించాడు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి)

‘ప్రేమిస్తే’ దండపాణి


దండపాణి అంటే తొందరగా గుర్తుకొస్తారో లేదో కానీ... ‘కాదల్‌’ దండపాణి అనగానే వెంటనే గుర్తుకొచ్చే నటుడీయన. ‘కాదల్‌’ తెలుగులో ‘ప్రేమిస్తే’గా విడుదలై ప్రేక్షకులకు చేరువైంది. అందులో కథానాయిక సంధ్య తండ్రిగా కనిపించారు దండపాణి. ఆ చిత్రంతో ఈయనకి చక్కటి గుర్తింపు లభించింది. ఆ తరువాత 200కిపైగా చిత్రాల్లో సహాయ నటుడిగా, ప్రతినాయకుడిగా చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకొన్నారు. తెలుగులో ‘ప్రేమిస్తే’తో పాటు ‘రాజుభాయ్‌’, ‘కృష్ణ’, ‘ఆంజనేయులు’, ‘పోలీస్‌ పోలీస్‌’ తదితర చిత్రాలు ఆయనకి మంచి పేరు తీసుకొచ్చాయి. బ్రిటిష్‌ ఇండియా మద్రాసు ప్రెసిడెన్సీలో ఏప్రిల్‌ 17, 1943లో జన్మించిన దండపాణి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టక ముందు దిండిగల్‌లో మంచి వ్యాపారవేత్తగా పేరు సంపాదించారు. 2004లో బాలాజీ శక్తివేల్‌ తన ‘కాదల్‌’ చిత్రం కోసం దండపాణిని ఎంపిక చేసుకొన్నారు. ఆ చిత్రం విజయవంతం కావడంతో ఆయన నట ప్రయాణం దూసుకెళ్లింది. తన 75 యేళ్ల వయసులో గుండెపోటుతో జులై 20, 2014న కన్నుమూశారు. ఆయనకి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. భార్య అరుణ 2011లో మరణించారు.

 వైవిధ్యం... అతడి సొంతం!వైవిధ్యమైన నటనతో ఎలాంటి పాత్రకైనా వన్నె తీసుకురాగల సత్తా నసీరుద్దీన్‌ షా ప్రత్యేకత. రంగస్థల కళాకారుడిగా, చలనచిత్ర నటుడిగా, దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచితుడు. పద్మశ్రీ, పద్మభూషణ్‌ అవార్డులను అందుకున్నాడు. ఉత్తమ నటుడిగా మూడు జాతీయ అవార్డులు, మూడు ఫిలింఫేర్‌ అవార్డులు, వెనిస్‌ చిత్రోత్సవ పురస్కారం అతడి సొంతం. విలక్షణ నటుడిగా పేరొందిన షా, ‘నిషాంత్‌’, ‘ఆక్రోష్‌’, ‘స్పార్ష్‌’, ‘మిర్చ్‌ మసాలా’, ‘త్రికాల్‌’, ‘జునూన్‌’, ‘అర్థసత్య’, ‘జల్వా’ లాంటి చిత్రాలను అభిమానులు ఎప్పటికీ మరువలేరు. ‘హమ్‌పాంచ్‌’ సినిమాతో బాలీవుడ్‌ చిత్రరంగాన్ని ఆకర్షించిన షా, ‘మాసూమ్‌’, ‘కర్మ’, ‘విశ్వాత్మ’ లాంటి సినిమాల్లో నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. కమల్‌హాసన్‌తో కలిసి ‘హేరామ్‌’ చిత్రంలో గాంధీజీ ప్రాతలో నటించాడు. ‘యే హోతా తో క్యాహోతా’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. బుల్లితెర కార్యక్రమాల్లో, అంతర్జాతీయ చిత్రాల్లో మెప్పించాడు. ఇప్పటికి 140కి పైగా చిత్రాల్లో నటించాడు. నటి రత్నాపాట్నిక్న్‌ను ప్రేమ వివాహం చేసుకొన్నాడు. 1950 జులై 20న ఉత్తప్రదేశ్‌లో జన్మించిన నసీరుద్దీన్‌ షా 69వ జన్మదినం నేడు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి)

హాస్యానికి ‘సిరి’లక్ష్మి!


నేను కవిని కానన్నవాణ్ని కత్తితో పొడుస్తా, నేను రచయిత్రిని కానన్నవాణ్ని రాయెత్తి కొడతా...’ అంటూ గేయం పాడి గాయం చేసి, ‘బాబూ చిట్టీ...’ అంటూ మెలోడ్రామాతో భయపెట్టి, ‘హారతి జై కొనుమా’ అంటూ భర్త మొహాన్ని హారతితో మాడ్చేసి... ఇలా బోలెడన్ని పాత్రలతో కడుపుబ్బా నవ్వించిన నటి మానాపురం శ్రీలక్ష్మి. జంధ్యాల చిత్రాల్లో ఆమె చేసిన పాత్రలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సీనియర్‌ నటుడు, నిర్మాత డా.అమర్‌నాథ్‌ కూతురైన శ్రీలక్ష్మి, తన తండ్రి అనారోగ్యానికి గురవడంతో కుటుంబానికి అండగా నిలిచేందుకు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మొదట చాలా చిన్న పాత్రలు చేసిన ఆమె ఆ తరువాత మంచి హాస్యనటిగా గుర్తింపు తెచ్చుకొంది. జంధ్యాల దర్శకత్వం వహించిన ‘రెండు జెళ్ల సీత’తో ఆమె కెరీర్‌ మలుపు తిరిగింది. కె.విశ్వనాథ్‌ చిత్రాల్లోనూ శ్రీలక్ష్మి గుర్తుండి పోయే పాత్రలు చేశారు. తెలుగు, కన్నడ భాషల్లో ఐదు వందల పైచిలుకు చిత్రాల్లో నటించారు శ్రీలక్ష్మి. ఆ తరువాత టెలివిజన్‌లోనూ పలు ధారావాహికల్లో నటించి పేరు తెచ్చుకొన్నారు. ఈమె తమ్ముడు రాజేష్‌ కూడా పలు చిత్రాల్లో నటించారు. మేనకోడలు ఐశ్వర్య రాజేష్‌ ప్రస్తుతం తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’లో అనే చిత్రంలో నటిస్తుంది. తమిళం, మలయాళం భాషల్లో కథానాయికగా కొనసాగుతున్నారు. 1981 నుంచి చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న శ్రీలక్ష్మి పుట్టినరోజు ఈ రోజు.  


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి)


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.