జూన్‌ 27.. (సినీ చరిత్రలో ఈరోజు)

* సాలీడు లక్షణాల నటుడు...


సూపర్‌హీరో ‘స్పైడర్‌ మ్యాన్‌’ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకున్నాయి. వాటిలో సాలీడు లక్షణాలు పొందిన హీరో పీటర్‌పార్కర్‌ పాత్రలో నటించిన నటుడు టోబీ మెగ్వైర్‌ 1975లో ఇదే రోజు కాలిఫోర్నియాలో పుట్టాడు. నిర్మాతగా కూడా రాణించిన ఇతగాడు మూడు స్పైడర్‌మ్యాన్‌ సినిమాలతో పాటు ‘ప్లెజెంట్‌ విల్లే’, ‘ద సైడర్‌ హౌస్‌ రూల్స్‌’, ‘వండర్‌ బాయ్స్‌’, ‘సీ బిస్కట్‌’, ‘ద గుడ్‌ జర్మన్‌’, ‘బ్రదర్స్‌’, ‘ద గ్రేట్‌ గాట్స్‌బీ’ లాంటి చిత్రాల్లో కూడా ఆకట్టుకున్నాడు. మంచి నటుడిగా ప్రతిష్ఠాత్మకమైన రెండు శాటర్న్, ఎమ్‌టీవీ, ప్రిజమ్, టీన్‌ ఛాయిస్, టొరంటో ఫిలింక్రిటిక్స్‌ అవార్డులు అందుకున్నాడు. అమెరికా చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ బాబీ ఫిశ్చర్‌ బయోపిక్‌ సినిమాగా ‘పాన్‌ శాక్రిఫైస్‌’ను నిర్మించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించి మెప్పించాడు. కాలిఫోర్నియాలో 1975 జూన్‌ 27న పుట్టిన ఇతడు చిన్నప్పుడు చెఫ్‌గా మారాలనుకున్నాడు. అమ్మ బలవంతంపై డ్రామా క్లాస్‌లో చేరాడు. నటనలో ఓనమాలు దిద్దుకుని తొలిసారిగా 1989లో ‘ద విజార్డ్‌’ అనే సినిమాలో కనిపించాడు. ఆపై కొన్ని సినిమాల్లో బాల నటుడిగా నటించాడు. ఓ పక్క టీవీ, యాడ్స్‌లో కూడా మెరిశాడు. స్పైడర్‌మ్యాన్‌ సినిమాలతో అంతర్జాతీయ నటుడిగా ఎదిగాడు.

* ఉర్రూతలూగించిన సంగీతకారుడు..


రాహుల్‌ దేవ్‌ బర్మన్‌ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు అదే... ‘ఆర్‌.డి. బర్మన్‌’ అంటే చాలు... హిందీ సినిమాల్లో యువతరాన్ని వెర్రెత్తించే పాటలు గుండెల్లో మార్మోగుతాయి. ఆయన స్వరపరచిన ప్రతి గీతం నాటికీ, నేటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. మూడు దశాబ్దాల పాటు హుషారైన పాటలెన్నో స్వరపరిచిన ఈయన దాదాపు సుమారు 331 చిత్రాలకు బాణీలను సమకూర్చారు. ఆర్డీ బర్మన్‌ ముద్దు పేరు ‘పంచందా’ (చిన్నప్పుడు ఆయన ఏడిస్తే స్వరం పంచమం స్థాయిలో ఉండేదని) అలా పిలిచేవారట. ప్రముఖ సంగీత దర్శకుడు సచిన్‌ దేవ్‌ బర్మన్‌ కుమారుడు. కొత్త ఒరవడి సృష్టించిన స్వరకర్త, గాయకుడు. పాటల్ని ‘డిస్కో’, ‘రాక్‌’ వంటి కొత్తపుంతలను తొక్కించి భారతీయ సినిమా రంగాన్ని ఓలలాడించాడు. తెలుగు, తమిళ, మళయాళ, బెంగాలీ, ఒరియా, మరాఠీ భాషల చిత్రాలకూ సంగీతాన్ని అందించారు. వైవిధ్య భరితంగా సీసాలతో, వెదురు బొంగులతో, గరుకు కాగితాలతో కూడా సంగీతాన్ని సృష్టించారు. తండ్రి ఎస్‌డీ బర్మన్‌ వద్ద కొంతకాలం సహాయకుడిగా పనిచేశాడు. బెంగాలీ అయినప్పటికీ బర్మన్‌కు హిందీ చిత్రాలంటే మక్కువ. తెలుగులో ‘అంతం’ సినిమాకు సహాయ సంగీత దర్శకులుగా బర్మన్‌ వద్ద కీరవాణి, మణిశర్మలు పనిచేశారు. డార్జిలింగ్‌లో షూటింగ్‌ సమయంలో పరిచయమైన అభిమాని రీతూపటేల్‌ను వివాహం చేసుకొన్నా, ఆ తరువాత విడాకులు తీసుకున్నారు. 1980లో గాయని ఆశాభోస్లేను వివాహం చేసుకొన్నారు. బర్మన్‌ సంగీతం సమకూర్చిన మొదటిచిత్రం ‘తీస్రీమంజిల్‌’(1966)లో అన్ని పాటలూ ఆకట్టుకునేవే. ముఖ్యంగా ‘అజాజా...’ పాట ఇప్పుడు విన్నా యువత ఊగిపోతారు. ‘పడోసన్‌’ (1968) చిత్రంలో ‘మెరె సామ్‌నవాలే కిడికీ మే... ఎక్‌ చాంద్‌కి టుకడా రెహతా హై...’, ‘ఏక్‌ చతురనార్‌... బడె హోషియార్‌...’లాంటి పాటలు అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి. 1980 వరకు బర్మన్‌ ప్రస్థానం సాగింది. ఆయన స్వరాలు సమకూర్చిన ఆఖరు చిత్రం ‘1942 ఎ లవ్‌ స్టోరీ’ (1994). ఈ సినిమా ఆయన మరణించిన తరువాత విడుదలైంది. 2013లో భారత ప్రభుత్వం ఆయన గౌరవార్థం తపాలా బిళ్లను విడుదల చేసింది. జూన్‌ 27, 1939లో జన్మించిన బర్మన్‌ తన 79వ ఏట జనవరి 4, 1994లో మరణించారు. నేడు ఆయన జయంతి.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి) 

* రోజర్‌మూర్‌ బాండ్‌ అవతారం


జేమ్స్‌బాండ్‌ సినిమాలంటే తొలి రోజుల్లో సీన్‌కానరీయే గుర్తుకొస్తాడు. ఆ తరువాత వచ్చిన రోజర్‌మూర్‌ బాండ్‌ పాత్రకి గాంభీర్యంతో పాటు హాస్యాన్ని కూడా జత చేశాడు. రోజర్‌మూర్‌ తొలిసారిగా జేమ్స్‌బాండ్‌గా కనిపించిన ‘లివ్‌ అండ్‌ లెట్‌ డై’ సినిమా 1973లో విడుదలైంది. బాండ్‌ సినిమాల్లో ఎనిమిదవదైన దీన్ని ఇయాన్‌ ఫ్లెమింగ్‌ ఇదే పేరుతో రాసిన నవల ఆధారంగా తీశారు. 7 మిలియన్‌ డాలర్లతో డ్రగ్స్‌ మాఫియా నేపథ్యంలో 7 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తీసిన ఈ సినిమా 161 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసింది.

కథ విషయానికి వస్తే... బ్రిటిష్‌ గూఢచారులు అనూహ్యంగా మరణిస్తూ ఉంటారు. దాంతో జేమ్స్‌బాండ్‌ రంగంలోకి దిగుతాడు. ఆ క్రమంలో మాదక ద్రవ్యాలను తయారు చేసి ప్రపంచమంతటా సరఫరా చేస్తున్న విలన్లను ఎదుర్కోవలసి వస్తుంది. బాండ్‌ సినిమాల్లో ఉండాల్సిన అన్ని హంగులూ ఉన్న సినిమాగా దీన్ని తీర్చిదిద్దారు.

* హిట్‌ సినిమాల సారధి


జెఫ్రీ జాకబ్‌ అబ్రామ్స్‌ అంటే తెలీదు. అదే జె.జె. అబ్రామ్స్‌ అంటే చాలా మందికి తెలుసు. కానీ ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులను అలరించిన ‘ఆర్మెగెడాన్‌’, ‘స్టార్‌ ట్రెక్‌’, ‘స్టార్‌వార్స్‌: ద ఫోర్స్‌ ఎవేకిన్స్‌’, ‘స్టార్‌వార్స్‌: ద రైజ్‌ ఆఫ్‌ స్కైవాకర్‌’, ‘మిషన్‌ ఇంపాజిబుల్‌3’ లాంటి సినిమాల రూపకర్త అంటే అందరికీ తెలుస్తుంది. దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్‌ రచయితగా హాలీవుడ్‌లో యాక్షన్, డ్రామా, సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలను అందిచాడు. టీవీ ప్రొడ్యూసర్లయిన తల్లిదండ్రులకు న్యూయార్క్‌లో 1966 జూన్‌ 27న పుట్టిన జె.జె. అబ్రామ్స్‌ అడుగులు చిన్నప్పుడే నటనారంగం వైపు పడ్డాయి. పదిహేనేళ్లకే ‘నైట్‌ బీస్ట్‌’ అనే హారర్‌ సినిమాకు పనిచేశాడు. ఆపై నేర్చుకుంటూ, విజయాలు పేర్చుకుంటూ ఎదిగాడు. ‘రిగార్డింగ్‌ హన్రీ’, ‘ఫరెవర్‌ యంగ్‌’, ‘క్లోవర్‌ ఫీల్డ్‌’లాంటి సినిమాలతో పాటు ‘ఫెలిసిటీ’, ‘అలియాస్‌’, ‘లాస్ట్‌’, ‘ఫ్రింజ్‌’లాంటి టీవీ సిరీస్‌తో కూడా పేరు తెచ్చుకున్నాడు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.