జులై 29.. (సినీ చరిత్రలో ఈరోజు)

* పాటలు కావవి... సినారె పారిజాతాలు!
(జయంతి-1931)


సినీ కవి, ‘నన్ను దోచుకుందువటే...’ అంటూ తొలి పాటతోనే వెండితెర ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. ‘నవ్వులా, అవి కావు... నవ పారిజాతాలు’ అంటూ ప్రేమ గీతాలకు భావ సౌరభాలు పూశారు. ‘మత్తు వదలరా...’ అని దేవదేవుడి చేత నీతులు చెప్పించారు. ‘శత సోదర సంసేవిత చరణా... అభిమానధనా...’ అంటూ సుయోధనుడి అహంకారాన్ని అలంకారాలతో ప్రస్తుతించారు. ‘చేనులో ఏముంది? నా మేనులో ఏముంది?’ అని వయ్యారాలు పోయే సుందరాంగికి కథానాయకుడి చేత దీటైన సమాధానాలు ఇప్పించారు. ‘మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు...’ అని బాధపడే వన్నెలాడిచేత ‘ఆగేదెట్టాగా? అందాకా వేగేదెట్టాగా?’ అని అడిగించారు. ‘చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన...’ అంటూ సవాలు చేసిన నర్తకికి ప్రతిసవాలుగా పదవిన్యాసాలతో నాట్యమాడించారు... ‘చాంగురే బంగారు రాజా...’ అంటూ వగలాడి చేత భీముడికే వలుపు బాణాలు వేయించారు...ఇలా ఒకటా, రెండా... వందలాది పాటల పారిజాతాల్ని సినీ తోటలో విరబూయించి ‘ఛాంగురే... భళారే... సినారే’ అనిపించారు!

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* సర్వర్‌ వడ్డించిన నవ్వులు!


సర్వర్, హోటల్‌ యజమాని కూతుర్నే ప్రేమిస్తాడా? తన ప్రేమ గురించి ఆమెతో పెళ్లి కుదిరిన తన స్నేహితుడికే చెబుతాడా? ఆ స్నేహితుడు తన వివాహాన్నే త్యాగం చేయదలచి సర్వర్‌ను ఓ మహానటుడిగా మారుస్తాడా? ఇవన్నీ నిజ జీవితంలో జరుగుతాయో లేదో కానీ, సినిమాలో మాత్రం జరిగిపోతాయి. ఈ కథతో తెలుగులోకి అనువాదమైన తమిళ చిత్రం ‘సర్వర్‌ సుందరం’, 56 ఏళ్ల క్రితం విడుదలై నవ్వులు పంచింది. హాస్య నటుడు నగేష్‌ సినీ ప్రస్థానాన్నే ఓ మలుపు తిప్పింది.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* తొలిరేయి జంట..అమెరికా పాట


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* విలక్షణ నటుడు...సంజయ్‌దత్!
‌ (పుట్టినరోజు-1959)


టన విలక్షణం... వ్యక్తిత్వం సున్నితం... జీవితం వివాదాస్పదం... అదీ సంజయ్‌దత్‌ అంటే. నటుడిగా, నిర్మాతగా, బుల్లితెర వ్యాఖ్యాతగా అభిమానులకు సుపరిచితుడు. తల్లి నర్గీస్, తండ్రి సునీల్‌దత్‌ల నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్నాడు. ‘రాకీ’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ‘విధాత’ (1982) చిత్రం ద్వారా కథానాయకుడయ్యాడు. ‘నామ్‌’ చిత్రం సంజయ్‌దత్‌ జీవితాన్ని మలుపుతిప్పింది. ఆయన నటించిన ‘లగేరహో మున్నాభాయ్‌’ చిత్రం గ్లోబల్‌ ఫిలిం అవార్డును సాధించింది. ‘సాజన్‌’, ‘ఖల్‌నాయక్‌’, ‘వాస్తవ్‌’, ‘మిషన్‌ కశ్మీర్‌’, ‘కాంటే’, తదితర చిత్రాలు ఫిలింఫేర్, స్టార్, జీ, బాలీవుడ్‌ మూవీ అవార్డులను సాధించాయి. సంజయ్‌దత్‌ ‘ది ఖాన్‌ ఈజ్‌ ఆన్‌’, ‘రాస్కెల్స్‌’ చిత్రాలను నిర్మించారు. గోవింద, మిథున్, ధర్మేంద్ర, జాకీషర్రాఫ్, సన్నీడియోల్‌ వంటి నటలతో కలిసి నటించాడు. ఇదంతా నటనలో పార్శ్వం మాత్రమే. మరోవైపు మాదక ద్రవ్యాల అలవాటుకు బానిసై, తిరిగి కోలుకున్నాడు. అనధికారికంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే కేసులో న్యాయ పరమైన చిక్కులు ఎదుర్కొన్నాడు. జైలు జీవితం తరువాత ‘దౌడ్‌’(1997)లాంటి చిత్రాలతో సత్తా చాటాడు. ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’, ‘లగేరహో మున్నాభాయ్‌’ చిత్రాలతో అలరించాడు. ఈ ఏడాది విడుదలైన భారీ బడ్జెట్‌ చిత్రం ‘కళంక్‌’లో బలరాజ్‌ చౌధురి పాత్రలో అలరించారు. దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో వచ్చిన ‘ప్రస్థానం’ అనే చిత్రాన్ని ఇదే పేరుతో హిందీలో నిర్మిస్తున్నారు సంజయ్‌. ఇప్పటికి 187పైగా చిత్రాల్లో నటించాడు. 1959 జులై 29న జన్మించిన సంజయ్‌దత్‌ 61వ జన్మదినం నేడు.

* అందాల తార..


ప్ర
పంచంలోనే అందాల మహిళగా గుర్తింపు ఆమె సొంతం... హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా పేరు... ఆమె విలువ 200 మిలియన్‌ డాలర్లుగా అంచనా... ప్రతిష్టాత్మకమైన అవార్డులెన్నో ఆమె సొంతం... ఆ అందాల నటే జెన్నిఫర్‌ అనిస్టన్‌. అమ్మ నాన్సీ డౌ, నాన్న జాన్‌ అనిస్టన్‌ ఇద్దరూ నటులే. టీవీ సీరియల్‌ ‘ఫ్రెండ్స్‌’లో రాచల్‌ గ్రీన్‌ పాత్రలో నటించిన జెన్నిఫర్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడంతో పాటు ఎమ్మీ, గోల్డెన్‌గ్లోబ్, స్కీన్ర్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ లాంటి ఎన్నో అవార్డులు అందుకుంది. వెండితెరై ‘బ్రూస్‌ ఆల్‌మైటీ’, ‘ద బ్రేకప్‌’, ‘మార్లీ మీ’, ‘జస్ట్‌ గో వితిట్‌’, ‘హారిబుల్‌ బాసెస్‌’, ‘ద మిల్లర్స్‌’ చిత్రాలు ఒకోటీ 200 మిలియన్‌ డాలర్లకుపైగా వసూలు చేశాయి. ఈమె 2000 జులై29న ప్రముఖ నటుడు, నిర్మాత బ్రాడ్‌పిట్‌ను పెళ్లాడింది. అయితే ఐదేళ్ల తరువాత ఇద్దరూ విడిపోయారు. తరువాత మరో నటుడు జస్టిన్‌ థెరాక్స్‌ను వివాహం చేసుకున్నా, మూడేళ్లకే విడిపోయింది. కైల్‌ న్యూచెక్‌ దర్శకత్వంలో ఈ మధ్యనే ‘మర్డర్‌ మిస్టరీ’ అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఒంటరిగానే ఉంది.

* పేదరికం నుంచి పెద్ద తెరదాకా...


పదిహేడేళ్ల అమ్మాయి ఒక నాటి రాత్రి నిద్రలోంచి ఎందుకో హఠాత్తుగా మేలుకుంది. ఎవరో మెడ మీద కత్తి పెట్టి చంపబోతున్నారు. ఒక క్షణంలో పీక తెగిపోయేదే. కానీ ఒక్క ఉదుటన ఆ వ్యక్తిని తోసేసి చూసింది. చూస్తే... అమ్మ! ‘సినిమాల్లోకి వెళతాను’ అనడమే ఆ అమ్మాయి చేసిన తప్పు. మానసికంగా సరైన ఆరోగ్యం లేని ఆ తల్లి నుంచి తప్పించుకోకపోయి ఉంటే, హాలీవుడ్‌ ఓ అందాల నటిని కోల్పోయి ఉండేది. నిరుపేద స్థితిగతుల మధ్య నుంచి... తినడానికి తిండి, కట్టుకోడానికి సరైన బట్ట లేని పరిస్థితుల మధ్య నుంచి... నాన్న బాధ్యత లేకుండా తిరుగుతుంటే ఆరుబయట ఎముకలు కొరికే చలిలో అమ్మను వాటేసుకుని ఏడుస్తూ గడిపిన దారుణ బాల్యం నుంచి... ఎదిగిన ఆ అమ్మాయి హాలీవుడ్‌లో అందాల నటిగా పేరు తెచ్చుకుంది. ఆ అమ్మాయే క్లారా గార్డన్‌ బౌ. అటు నిశ్శబ్ద చిత్రాల్లోను, ఇటు మాటలు నేర్చిన చిత్రాల్లోను గొప్ప నటిగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న క్లారా బౌ, ఒక దశలో నెలకు 45,000 ఉత్తరాలను అభిమానుల నుంచి అందుకునేంత స్థాయికి ఎదిగింది. షాపు యజమానిని ఆకర్షించడానికి ప్రయత్నించే సేల్స్‌గర్ల్‌ పాత్రలో ఆమె నటించిన ‘ఇట్‌’ (1927) సినిమా ఆమెకు స్టార్‌డమ్‌ తెచ్చిపెంట్టింది. ఆపై అందరూ ఆమెను ‘ఇట్‌ గర్ల్‌’ అని పిలిచేవారు. అందాల శృంగార నటిగా పేరు తెచ్చుకున్న క్లారా, 46 నిశ్శబ్ద చిత్రాలు, 11 టాకీ చిత్రాల్లో నటించింది. ‘మ్యాన్‌ట్రాప్‌’, ‘వింగ్స్‌’, ‘ఎనిమీస్‌ ఆఫ్‌ ఉమెన్‌’, ‘బియాండ్‌ ద రైన్‌బో’, ‘వైన్‌’ ‘ద అడ్వెంచరస్‌ సెక్స్‌’, ‘ఈవ్స్‌ లవ్‌’, ‘మై లేడీస్‌ లిప్స్‌’, ‘డేంజరస్‌ కర్వ్స్‌’ లాంటి చిత్రాల్లో ఆకట్టుకుంది. న్యూయార్క్‌లో 1905 జులై 29న పుట్టిన క్లారా బౌ తన 60 ఏళ్ల వయసులో 1965 సెప్టెంబర్‌ 27న మరణించింది.

* విలక్షణ నటనకు ఆస్కార్


ప్ర
పంచవ్యాప్తంగా ఆకట్టుకున్న ‘ఎరౌండ్‌ ద వరల్డ్‌ ఇన్‌ 80 డేస్‌’, ‘ద పింక్‌ పాంథర్‌’, ‘సెపరేట్‌ టేబుల్స్‌’, ‘ఎ మ్యాటర్‌ ఆఫ్‌ లైఫ్‌ అండ్‌ డెత్‌’ లాంటి సినిమాల్లో ఆకట్టుకున్న డేవిడ్‌ నివెన్‌ హాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. నటుడిగానే కాకుండా నవలాకారుడిగా కూడా మంచి రచనలు చేశాడు. లండన్‌లో మార్చి 1, 1910 పుట్టిన ఇతడు, జులై 29, 1983న స్విట్జార్లాండ్‌లో మరణించాడు. బ్రిటిష్‌ సైనికాధికారిగా పనిచేసినా, నటన మీద అభిరుచితో టీవీలు, సినిమాలలోకి వచ్చాడు. బ్రిటిష్‌ చిత్రం ‘దేర్‌ గోస్‌ ద బ్రైడ్‌’ (1932) ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఇతడు, ‘ద ఫస్ట్‌ ఆఫ్‌ ద ఫ్యూ’, ‘ద బిషప్స్‌ వైఫ్‌’, ‘ఎన్‌ఛాంట్‌మెంట్‌’, ‘హ్యాపీ ఎవర్‌ ఆఫ్ట్‌ర్‌’, ‘క్యారింగ్టన్‌ వీసీ’లాంటి సినిమాలతో మెప్పించాడు.

బాలీవుడ్‌ను మురిపించిన
నవ్వుల రేడు...జానీవాకర్‌ (వర్ధంతి)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.