జూన్‌ 30.. (సినీ చరిత్రలో ఈరోజు)

* తండ్రికి తగ్గ తనయుడు...
తమ్మారెడ్డి భరద్వాజ (పుట్టినరోజు)


సి
విల్‌ ఇంజినీర్‌గా ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల శాఖలోనూ, హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోనూ పనిచేసిన తమ్మారెడ్డి భరద్వాజ, తన తండ్రి తమ్మారెడ్డి కృష్ణమూర్తి అడుగుజాడల్లో నడుస్తూ 1979లో సినీరంగ ప్రవేశం చేశారు. నిర్మాతగా, దర్శకుడిగా పలు విజయాల్ని సొంతం చేసుకొన్నారు. తండ్రిలాగే కమ్యూనిస్టు భావాలున్న తమ్మారెడ్డి భరద్వాజ చలన చిత్ర వాణిజ్య మండలిలోనూ, నిర్మాతల మండలిలోనూ వివిధ పదవుల్ని అలంకరించి సినీ పరిశ్రమకి సేవ చేశారు. చిత్రసీమలో సమస్యల్ని పరిష్కరించడంలోనూ, కార్మికుల తరఫున పోరాడంలోనూ ఆయన ముందుంటారు. దాసరి నారాయణరావుకి సన్నిహితంగా మెలుగుతూ పలు సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు. చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘కోతలరాయుడు’, ‘మొగుడు కావాలి’ చిత్రాల్ని నిర్మించి ఆరంభంలోనే విజయాల్ని అందుకొన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. ‘మరో కురుక్షేత్రం’, ‘ఇద్దరు కిలాడీలు’ చేశాక ఆయన దర్శకుడిగా మారారు. ‘మన్మథ సామ్రాజ్యం’, ‘అలజడి’, ‘నేటి దౌర్జన్యం’, ‘కడపరెడ్డమ్మ’, ‘శివశక్తి’, ‘నాగజ్యోతి’, ‘ఊర్మిళ’, ‘పచ్చని సంసారం’ తదితర చిత్రాల్ని తెరకెక్కించారు. ‘వన్‌ బైటు’, ‘దొంగరాస్కెల్‌’, ‘సింహగర్జన’ తదితర చిత్రాలతో మళ్లీ నిర్మాతగా విజయాల్ని అందుకొన్నారు. ‘వేటగాడు’, ‘అత్తా నీ కొడుకు జాగ్రత్త’, ‘కూతురు’, ‘అత్తా నీ కొడుకు జాగ్రత్త’, ‘స్వర్ణముఖి’, ‘స్వర్ణక్క’ చిత్రాలతో దర్శకుడిగా చేశారు. విజయవంతమైన ‘అంతఃపురం’కి సహనిర్మాతగా వ్యవహరించారు. ‘సంచలనం’ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తూ తెరకెక్కించారు. ‘రామ్మా చిలకమ్మా’, ‘ఎంత బాగుందో’, ‘పోతే పోనీ’ చిత్రాలతో దర్శకుడిగా మరోసారి ఆకట్టుకున్నారు. చివరిగా ప్రతిఘటన అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఆ చిత్రం అనుకొన్నస్థాయిలో మెప్పించలేకపోయింది. ‘ఈరోజుల్లో’ చిత్రంలో ఒక చిన్న పాత్రతో అలరించిన తమ్మారెడ్డి పుట్టినరోజు (జూన్‌ 30, 1948) ఈరోజు.

* కనిపిస్తే కితకితలే...
అల్లరి నరేష్‌ (పుట్టినరోజు)


రా
జేంద్రప్రసాద్‌ తర్వాత కామెడీకి ఆ స్థాయి హీరోయిజాన్ని తెచ్చిపెట్టిన నటుడు... అల్లరి నరేష్‌. ఆయన తెరపై కనిపించాడంటే చాలు... ప్రేక్షకులకు కితకితలు గ్యారెంటీ. తొలి చిత్రం ‘అల్లరి’తోనే కడుపుబ్బా నవ్వించాడాయన. ఆ సినిమా పేరే ఆయన ఇంటిపేరుగా మారింది. 14 యేళ్ల వ్యవధిలోనే యాభై సినిమాల మైలురాయిని అందుకొన్నాడు. యేడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని నవ్వించడం అల్లరి నరేష్‌ శైలి. కామెడీలోనే కాదు... ‘నేను’, ‘డేంజర్‌’, ‘ప్రాణం’, ‘గమ్యం’, ‘శంభో శివ శంభో’, ‘లడ్డూబాబు’ తదితర చిత్రాల్లో అల్లరి నరేష్‌ నటుడిగా కూడా సత్తా చాటారు. ‘సుడిగాడు’లో ఆయన పంచిన వినోదం పతాక స్థాయిలో ఉంటుంది. ఆ మధ్య వరుసగా పరాజయాలు ఎదురవుతున్నా... ఆయన సినిమాలపై మాత్రం అంచనాలు తగ్గడం లేదు. ఈ మధ్యనే విడుదలైన ‘మహర్షి’ చిత్రంలో మహేష్‌బాబుతో కలిసి సందడి చేశారు. అగ్ర దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ రెండో కుమారుడైన అల్లరి నరేష్‌ మొదట దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఆయన నటుడు అవుతాడని ఇంట్లో ఎవ్వరూ ఊహించలేదట. తండ్రి బాటలోనే దర్శకుడు కావాలనుకొన్నారట నరేష్‌ కూడా. కానీ అనుకోకుండా ‘అల్లరి’లో నటించే అవకాశం వరించిందాయన్ని. తొలి చిత్రమే ఘన విజయం సాధించడంతో ఆయన నటుడిగా స్థిరపడిపోయారు. ‘అల్లరి’కి రీమేక్‌గా తమిళంలో తెరకెక్కిన ‘కురుంబు’ చిత్రంలోనూ నటించారు నరేష్‌. ‘గమ్యం’లో చేసిన గాలిశీను పాత్రకిగానూ ఉత్తమ సహయ నటుడిగా నంది పురస్కారాన్ని, ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాన్ని సొంతం చేసుకొన్నారు. తన తండ్రి పేరుతో స్థాపించిన ఈవీవీ సినిమా పతాకంలో సోదరుడు ఆర్యన్‌ రాజేష్‌తో కలిసి ‘బందిపోటు’ నిర్మించారు. 2015లో విరూప కంఠమనేనిని వివాహం చేసుకొన్న నరేష్‌కి 2016లో ఒక పాప జన్మించింది. ఈరోజు నరేష్‌ పుట్టినరోజు.

* ఇంతింతై.. కథానాయకుడై!...
శివాజీ (పుట్టినరోజు)


టె
లివిజన్‌తో ప్రయాణం మొదలుపెట్టిన నటుడు శివాజీ. ఆ తరువాత డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, సహాయ నటుడిగా, కథానాయకుడిగా, నిర్మాతగా... ఇలా పలు ప్రయత్నాలతో విజయాల్ని అందుకొన్నారు. ప్రస్తుతం నటిస్తూనే, రాజకీయ వ్యవహారాల్లో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. 1997లో వచ్చిన ‘మాస్టర్‌’తో మొదలుపెడితే ‘శ్రీ సీతారాముల కళ్యాణం’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘బ్యాచిలర్స్‌’, ‘ప్రియమైన నీకు’, ‘ఖుషీ’, ‘చిరంజీవులు’, ‘శివరామరాజు’ తదితర చిత్రాల్లో శివాజీ పోషించిన పాత్రలకి మంచి పేరొచ్చింది. కొన్ని చిత్రాల్లో కథానాయకులకి సమానమైన పాత్రలు చేసి పరిశ్రమ దృష్టిని ప్రముఖంగా ఆకర్షించారు. దాంతో ఆయన్ని కథానాయక పాత్రలు కూడా వరించాయి. అందులో భాగంగా చేసిన ‘మిస్సమ్మ’ చిత్రంతో ఆయన మంచి విజయాన్ని సొంతం చేసుకొన్నారు. ఆ తరువాత వరుసగా కథానాయక పాత్రల్లో మెరిశారు. ‘అమ్మాయి బాగుంది’, ‘ఆడంతే అదోటైపు’, ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ శైలజాకృష్ణమూర్తి’, ‘మిస్టర్‌ ఎర్రబాబు’, ‘అదిరిందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘సత్యభామ’, ‘స్టేట్‌రౌడీ’ తదితర చిత్రాలతో కథానాయకుడిగా శివాజీ చేసిన సందడి ఆకట్టుకుంది. ‘మంత్ర’తో మరో విజయాన్ని సొంతం చేసుకొన్న ఆయన ఆ తర్వాత అనుకొన్న ఫలితాలు రాలేదు. దాంతో తన కెరీర్‌ని నిలబెట్టుకొనేందుకు, నిర్మాతగా మారి ‘తాజ్‌మహల్‌’ తెరకెక్కించారు. కానీ కలిసిరాలేదు. ‘అయ్యారే’, ‘కమలతో నా ప్రయాణం’, ‘బూచమ్మ బూచాడు’ తదితర మంచి చిత్రాలు చేసినా అవి ప్రేక్షకులకి చేరలేకపోయాయి. ప్రస్తుతం ‘గ్యాంగ్‌స్టార్స్‌’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారాయన. ‘దిల్‌’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘పిజ్జా’ చిత్రాల్లో కథానాయకుడి పాత్రలకి డబ్బింగ్‌ చెప్పారు శివాజీ. ‘దిల్‌’ చిత్రానికిగానూ ఉత్తమ డబ్బింగ్‌ ఆర్టిస్టుగా నంది పురస్కారాన్ని కూడా సొంతం చేసుకొన్నారు శివాజీ. భాజపాలో చేరి, ఆ తరువాత ఆ పార్టీ నుంచి బయటికొచ్చిన ఆయన, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో జరుగుతున్న ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు శివాజీ జన్మదినం.

* చక్కిలిగింత... కేరింత...
సుమంత్‌ అశ్విన్‌ (పుట్టినరోజు)


‘అం
తకుముందు ఆ తర్వాత’, ‘లవర్స్‌’, ‘కేరింత’ చిత్రాలతో విజయాల్ని అందుకొన్న కథానాయకుడు సుమంత్‌ అశ్విన్‌. ప్రముఖ నిర్మాత ఎమ్‌.ఎస్‌.రాజు తనయుడైన సుమంత్‌ అశ్విన్‌ కథానాయకుడు కాకముందు తండ్రితో కలిసి సొంత నిర్మాణ సంస్థలో పనిచేశారు. 2012లో తండ్రి ఎమ్‌.ఎస్‌.రాజు దర్శకత్వంలోనే కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. రెండో చిత్రంగా చేసిన ‘అంతకుముందు ఆ తరువాత’ చిత్రంతో ఆయనకి మంచి పేరొచ్చింది. ‘లవర్స్‌’తో వాణిజ్య విజయాన్ని అందుకొన్న సుమంత్‌ అశ్విన్‌ ‘కేరింత’తో నటుడిగా అలరించారు. ‘చక్కిలిగింత’, ‘రైట్‌ రైట్‌’, ‘ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌’ చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయాయి. నిహారిక కొణిదెలతో కలిసి ‘హ్యాపీవెడ్డింగ్‌’ చిత్రంలో సందడి చేశాడు. ‘ఎందుకిలా’ అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించిన సుమంత్‌ అశ్విన్‌ ‘ప్రేమకథా చిత్రం2’తో కథానాయకుడిగా మురిపించారు. ఇవాళ ఆయన (జూన్‌30, 1988) పుట్టినరోజు ఈ రోజు.

* స్పైడర్‌మ్యాన్‌ సందడి


స్పై
డర్‌ మ్యాన్‌ వెండితెరపై చాలా సందడి చేశాడు. దశాబ్దాలుగా ఎన్నో సినిమాల్లో అలరించాడు. వాటిలో చెప్పుకోదగినవి స్పైడర్‌మ్యాన్‌ ట్రిలాజీ సినిమాలు. 2002 నుంచి మొదలైన ఈ సీక్వెల్స్‌ ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకున్నాయి. ఈ ట్రయాలజీలో రెండోది 2004లో విడుదలైంది. ఇందులో స్పైడర్‌మ్యాన్‌ డాక్టర్‌ ఒట్టో ఆక్టావియస్‌ అనే విలన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఓ ప్రయోగం వల్ల సాలీడులాంటి యాంత్రిక చేతులు నాలుగు ఏర్పడతాయి అతడికి వాటితో ఎలా కావాలంటే అలా నడవగలడు, వాటితో దాడి చేయగలడు. 200 మిలియన్‌ డాలర్లతో తీసిన ఈ సినిమా 783 మిలియన్‌ డాలర్లు కొల్లగొట్టింది. విజువల్‌ ఎఫెక్స్ట్‌కి ఆస్కార్‌తో పాటు మరెన్నో అవార్డులు గెలుచుకుంది. సూపర్‌హీరోల చిత్రాల్లో మేటిదిగా పేరుతెచ్చుకుంది. దీని విజయంతో 2007లో మూడో సీక్వెల్‌ వచ్చింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.