జులై 31.. (సినీ చరిత్రలో ఈరోజు)

* విలక్షణ నటుడు!
శరత్‌బాబు (పుట్టినరోజు-1951)


థానాయకుడిగా... ప్రతినాయకుడిగా... తండ్రిగా... ఇలా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయిన విలక్షణ నటుడు శరత్‌బాబు. ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్‌. సత్యంబాబు దీక్షిత్‌ అనే పేరుతోనూ పిలుస్తుంటారు. తెరకు శరత్‌బాబు పేరుతో పరిచయమయ్యారు. 1951 జులై 31న ఆముదాలవలసలో జన్మించిన శరత్‌బాబుకి తొలినాళ్లలో పోలీసు అధికారి కావాలనే కల ఉండేదట. అయితే తండ్రి తన కుటుంబానికున్న హోటల్‌ వ్యాపారం చూసుకోమని చెప్పేవారట. ఆయన రూపాన్ని చూసి చాలా మంది సినిమాల్లో ప్రయత్నించమని సూచించడం, తల్లి కూడా ఆ దిశగా ప్రోత్సహించడంతో ఆయన దృష్టి సినిమా రంగంవైపు మళ్లింది. బాలచందర్‌ దర్శకత్వం వహించిన ‘నిరళ్‌ నిజమగిరదు’ చిత్రంతో శరత్‌బాబుకి మంచి గుర్తింపు లభించింది. ఆ చిత్రం తరువాత వెనుదిరిగి చూసుకొనే అవసరం ఆయనకి రాలేదు. అంతకుముందే శరత్‌బాబు ‘రామరాజ్యం’, ‘కన్నెవయసులో’ నటించారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ‘పంతులమ్మ’, ‘అమెరికా అమ్మాయి’ చిత్రాలతోనూ మంచి పేరు తెచ్చుకొన్నారు శరత్‌బాబు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, ఆంగ్ల భాషల్లో కలిపి 220కిపైగా చిత్రాలు చేశారీయన. ఎనిమిది నంది పురస్కారాలు సొంతం చేసుకొన్నారు. తమిళం, తెలుగు భాషల్లో టెలివిజన్‌లోనూ నటించి పేరు ఇంటింటికీ చేరువయ్యారు. తనకంటే వయసులో పెద్దవారైన రమాప్రభని ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు శరత్‌బాబు. పద్నాలుగేళ్ల తరువాత ఈ ఇద్దరూ విడిపోయారు. ఈ రోజు శరత్‌బాబు పుట్టినరోజు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* అలరించిన ‘అగ్గి పిడుగు’!


విభక్త కవలలుగా పుట్టిన వారికి శస్త్రచికిత్స చేసి విడదీయడం ప్రపంచం అంతటా ఉన్నదే. కానీ అన్న కాలులో ముల్లు గుచ్చుకుంటే, తమ్ముడికి బాధ కలగడం మాత్రం ఎక్కడా చూడం, సినిమాల్లో తప్ప. అలాంటి కథతో, ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయంతో వచ్చి అలరించిన చిత్రమే ‘అగ్గి పిడుగు’. విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1964లో జులై 31న విడుదలై వినోదాన్ని పంచింది. ఇంతకీ ఈ కథ ఎక్కడిది? ఎప్పుడో 99 ఏళ్ల క్రితం ఫ్రెంచి భాషలో వచ్చిన ఓ నవలలోది. ఆ కథ అనేక మార్పులకు, చేర్పులకు గురై ఎన్నో భాషల్లో సినిమాలుగా మారి వెండితెర ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* నవ్వుల జల్లు...
అల్లు! (వర్థంతి-2004)


హా
స్య నటనలో అల్లు రామలింగయ్యది ఒక ప్రత్యేకమైన ఒరవడి. కంటి చూపు, మాట విరుపు, శరీర కదలికలతో కూడా అరుదైన హాస్యాన్ని అందించారాయన. ‘ముత్యాల ముగ్గు’ సినిమాలో కోతిని అనుకరణను మర్చిపోగలమా? ‘మాయాబజార్‌’లో ‘పులిహోర ఖాళీ... దద్దోజనం ఖాళీ...’ ప్రహసనాన్ని తల్చుకుంటే చాలు, నవ్వుకోకుండా ఉండగలమా? ‘పరమానందయ్య శిష్యుల కథ’లో విషం అనుకుని సున్నుండలు తిని, రాజ భటుల్ని చూసి యమభటులనుకునే సన్నివేశంలో ఆయన చూపు తీరు మరువగలమా? ‘మూగ మనసులు’ సినిమాలో భార్య బయటపెట్టి తలుపేసేస్తే, ‘చలేస్తంది...’ అనే మాట విరుపు నవ్వించకుండా ఉంటుందా? ‘యమగోల’లో ‘తాళం వేసితిని... గొళ్లెం మరిచితిని...’ తల్చుకోకుండా ఉండగలమా? ‘ముత్యాలు వస్తావా... అడిగింది ఇస్తావా...’ పాట వింటే ఆయన డ్యాన్స్‌ గుర్తుకు రాకుండా ఉంటుందా? ‘కృష్ణార్జున యుద్ధం’లో సురభి బాల సరస్వతితో కలిసి ‘అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమె భామినీ...’ పాటలో ఆయన నటన గిలిగింతలు పెట్టకుండా ఉంటుందా?... ఇలా ఎన్నో సినిమాలు, ఎన్నో సన్నివేశాలు, ఎన్నెన్నో డైలాగులు... ఎప్పటికీ అల్లు రామలింగయ్యను గుర్తు చేస్తూనే ఉంటాయి.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* మరపురాని గాయకుడు!
మహ్మద్‌ రఫీ (వర్థంతి -1980)


తె
లుగు చిత్రం ’ఆరాధన’లో ‘నా మది నిన్ను పిలచింది గానమె’i అనే పాట వింటే చాలు పాడిన గాయకుడెవరో ఇట్టే చెప్పొచ్చు. ‘భలే తమ్ముడు’ సినిమాలో ‘ఎంతవారుగానీ, వేదాంతులైన గానీ... ఓర చూపు సోకగానె తేలిపోదురోయ్‌.. కైపులో...’ పాట వింటే దాని ప్రత్యేకత ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘జీవిత చక్రం’ సినిమాలో ‘కంటి చూపు చెబుతోంది... కొంటె నవ్వు చెబుతోంది...’ పాట, హుషారుకు అర్థం చెబుతుంది. ఇలా విలక్షణమైన గాత్రంతో పాటలకు ప్రాచుర్యాన్ని కలిపించిన మరపురాని గాయకుడే మహ్మద్‌ రఫీ. తెలుగు, హిందీ, ఉర్దూ మరాఠీ భాషలోపాటు 17 భాషల్లో గీతాలను ఆలపించాడు. ‘పద్మశ్రీ’ బిరుదును పొందాడు. మొదటి స్వాతంత్య్ర ఉత్సవాల్లో మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా రజత పతకాన్ని పొందారు. విషాదగీతాలైనా, ప్రేమగీతాలైనా రఫీ గొంతులో కొత్త సోయగాలు అద్దుకున్నాయి. తెలుగులో ‘భక్తరామదాసు’, ‘కబీరు’, ‘భలేతమ్ముడు’, ‘రామ్‌రహీం’, ‘సలీం అనార్కలి’ లాంటి చిత్రాల్లో నేపథ్యగానం చేశారు. ఇక బాలీవుడ్‌లో ‘ఏ దునియా ఏ మోహఫిల్‌’ (హీరా రాంఝూ), ‘సుహానీ రాత్‌ ఢల్‌ చుకీ’ (దులారీ), ‘యే జిందగీ కే మేలే యే జిందగీ’ (మేలా), ‘బాబుల్‌ కీ దువా’ (నీల్‌ కమల్‌) చిత్రాల్లోని గీతాలను ఇప్పటికీ ఆయన అభిమానులు గుర్తుతెచ్చుకుంటారు. ‘హమ్‌ కిసీసే కమ్‌ నహీ’ చిత్రంలోని ‘క్యాహువా తేరా వాదా’ గీతానికి ‘జాతీయ పురస్కారం’ లభించింది. పలు ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్నాడు. లతామంగేష్కర్, రఫీలు గాయక జోడీగా గుర్తింపు పొంది నేపథ్యగాన చరిత్రలోనే కొత్త ఒరవడిని సృష్టించారు. 1950 నుంచి ఇరవైఏళ్లపాటు రఫీ సినీరంగంలో ఎదురులేని గాయకుడిగా స్థానం సంపాదించుకొన్నాడు. సంగీత దర్శకులు నౌషద్‌అలీ, ఓపీ నయ్యర్, శంకర్‌జయ కిషన్, ఎస్‌డీ బర్మన్, రోషన్‌లతో కలిసి పనిచేశారు. ప్రైవేట్‌ ఆల్బమ్‌లను రూపొందించాడు. సుమారు 7,405 గీతాలను ఆలపించాడు. ‘ఆస్‌పాస్‌’ చిత్రంలోని ‘షామ్‌ ఫిర్‌ క్యూం ఉథాస్‌’ గీతాన్ని ఆలపించిన కొద్దిసేపటి తరువాత గుండెపోటుతో 1980 జులై 31న మృతి చెందారు. నేడు ఆయన 40వ వర్థంతి.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* మిలిటరీ నటుడు


ప్ర
ఖ్యాత దర్శక నిర్మాత జేమ్స్‌కామెరాన్‌ తీసిన ఎన్నో సినిమాల్లో అతడు మిలిటరీ పాత్రలు ధరించి మెప్పించాడు. ‘ద టెర్మినేటర్‌’, ‘ఎలియన్స్‌’, ‘ద ఎబిస్‌’ సినిమాల్లో అలాంటి పాత్రల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాడు. అతడే మైకేల్‌ కొన్నెల్‌ బీన్‌. అలబామాలో 1956 జులై 31న పుట్టిన ఇతడు స్కూలు రోజుల నుంచే నాటక రంగం వైపు ఆకర్షితుడయ్యాడు. ‘ద ఫ్యాన్‌’, ‘నేవీ సీల్స్‌’, ‘టూంబ్‌స్టోన్‌’, ‘ద రాక్‌’, ‘మెడిగో’, ‘ప్లానెట్‌ టెర్రర్‌’లాంటి సినిమాలతో పాటు టీవీల ద్వారా కూడా ప్రేక్షకాదరణ పొందాడు. ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.