జూన్‌ 5 .. (సినీ చరిత్రలో ఈరోజు)

* టీవీ రియాలిటీ నుంచి తప్పించుకుంటే?


ఓ పెద్ద ఇల్లు కట్టి... అందులో అడుగడుగునా కెమేరాలు పెట్టి... కొందర్ని ఆ ఇంట్లో ఉంచి... అనుక్షణం వాళ్లేం చేస్తున్నారో చిత్రీకరిస్తే ఏమవుతుంది? ఓ టీవీ రియాలిటీ షో అవుతుంది. బిగ్‌బాస్‌ ఇలాంటిదే అని అందరికీ తెలిసిందే. కానీ ఇలాంటి ఇల్లు ఓ పెద్ద నగరమంత ఉంటే? అందులో అందరూ నటులే అయితే? ఎవరికీ తెలియకుండా కెమేరాలు ఉంటే? ఆ కార్యక్రమం 24 గంటలూ, ప్రపంచమంతా ప్రసారం అవుతుంటే? అదే ‘ద ట్రూమన్‌ షో’ (1998) సినిమా. సైన్స్‌ ఫిక్షన్‌ కథలపై వ్యంగ్యాత్మకంగా తీసిన ఈ సినిమాలో ప్రముఖ హాస్య నటుడు జిమ్‌ క్యారీ నటించాడు. ఇది 60 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి 264.1 మిలియన్‌ డాలర్లను వసూలు చేసి సంచలనం సృష్టించింది.

ఈ కథలో చిత్రమేమిటంటే ఇందులో ఓ బీమా కంపెనీ సేల్స్‌మేన్‌గా పనిచేసే ట్రుమన్‌ (జిమ్‌క్యారీ)కి తానొక రియాలిటీ షోలో భాగమని తెలియదు. తను, తన చుట్టు పక్కల వాళ్లు అందరూ నిజమైన జీవితాలే గడుపుతున్నామనుకుంటాడు. కానీ అతడికి మాత్రమే కొన్ని రేడియో సందేశాలు వినపడడం, ఒకోసారి తన మీద మాత్రమే వర్షం పడడం లాంటి కొన్ని సంఘటనల వల్ల తన జీవితం సహజమైనది కాదని, సిమ్యులేటెడ్‌ రియాలిటీలో బతుకుతున్నానని తెలుసుకుంటాడు. దాంతో ఆ కృత్రిమ జీవితం నుంచి పారిపోవాలని భావిస్తాడు. మరి ఆ ప్రయత్నంలో అలడెలాంటి అవరోధాలు ఎదుర్కొన్నాడు, ఎలా బయట పడ్డాడు, ఆ రియాలిటీ షో చివరకి ఏమైంది... అనేదే సినిమా కథ. ఈ సినిమా గోల్డెన్‌గ్లోబ్, బ్రిటిష్‌ అకాడమీ లాంటి 30 ప్రతిష్ఠాత్మకమైన అవార్డులను అందుకోవడం విశేషం.

* అందరూ ఆడ దొంగలే!


భారీ దొంగతనాల మీద తీసే సినిమాలు ఆసక్తికరంగానే ఉంటాయి. బాలీవుడ్‌లో ‘ధూమ్‌’లాంటి ఇలాంటి సినిమాలు ఎప్పటి నుంచో అన్ని భాషల్లోను వస్తున్నాయి. ఈ తరహా సినిమాలను ‘హీస్ట్‌ ఫిల్మ్స్‌’ అంటారు. వీటిలో ఒకటే ‘ఓషన్స్‌ 8’ (2018) సినిమా. విశేషమేమిటంటే... ఇందులో అందరూ ఆడ దొంగలే. ఎనిమిది మంది భామలు కలిసి న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్‌ మ్యూజియమ్‌ ఆఫ్‌ ఆర్ట్‌లో భారీ చోరీకి ప్రణాళిక వేస్తారు. వాళ్ల ప్లాన్‌ విజయవంతమైందా, ఆ చోరీ తర్వాత ఏం జరిగింది, అనేదే కథ. డెబ్బీ ఓషన్‌ అనే మహిళ ఈ దొంగతనానికి అద్భుతమైన ప్లాన్‌ వేసి మరో ఏడుగురు ఆడవాళ్లను కలుపుకుని ఓ ముఠాను ఏర్పాటు చేస్తుందన్నమాట. ఇందులో అందాల తారలు శాండ్రా బుల్లక్, అన్నే హాత్‌వే, కేట్‌ బ్లాంచెట్‌లాంటి నటీమణులు, చోరశిఖామణుల్లాగా నటించారు. ఈ సినిమాను 70 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో తీస్తే 297.7 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది.

నిజానికి ఈ సినిమా 2001 నుంచి 2007 వరకు వచ్చిన మూడు సినిమాలకు కొనసాగింపులాంటిది. అవి ‘ఓషన్స్‌ 11’, ‘ఓషన్స్‌ 12’, ‘ఓషన్స్‌ 13’ సినిమాలు. ఇవన్నీ చోరీల ఆధారంగా తీసినవే. ఈ ట్రలాజీ సినిమాలన్నీ కలిసి ప్రపంచ వ్యాప్తంగా 1.17 బిలియన్‌ డాలర్లను వసూలు చేసి విజయవంతమయ్యాయి. అయితే ఈ మూడు సినిమాలకు నాంది మరొకటి ఉంది. అది 1960లోనే వచ్చిన ‘ఓషన్స్‌ 11’ సినిమా. లాస్‌వేగాస్‌లో భారీ దొంగతనాలకు తలపడిన ఘరానా దొంగల కథ ఇది. దీని విజయంతో ఈ చోరీల పరంపర సినిమాలు బయల్దేరాయన్నమాట.

* ఆమె అందించిన అద్భుత కథలు


ఓ మహిళ నిర్మాత బాధ్యతలు నిర్వహించడం మామూలు విషయమే కావచ్చు. కానీ ప్రపంచ ప్రఖ్యాత చిత్రాలను అందించిన మహిళ అంటే ఆసక్తికరమే. అలాంటి హాలీవుడ్‌ నిర్మాతే క్యాథలీన్‌ కెన్నెడీ. ‘ఇ.టి.’ (ద ఎక్స్‌ట్రా టెర్రెస్టియ్రల్‌), ‘జురాసిక్‌ పార్క్‌’ (మొదటి రెండు సినిమాలు) సినిమాలను ప్రపంచానికి అందించిన నిర్మాత ఈమె. ఎక్కువగా ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌తో కలిసి సినిమాలు నిర్మించారు. 1953 జూన్‌5న పుట్టిన ఈమె చిత్రనిర్మాణ వ్యవహారాల్లో ఎంతో చురుగ్గా, సృజనాత్మకంగా ఉంటారు. మొత్తం మీద 60 సినిమాలకు పని చేసి 8 అకాడమీ నామినేషన్లు పొందిన మహిళ. ఈమె పని చేసిన సినిమాల వసూళ్లు 11 బిలియన్‌ డాలర్లను ఆర్జించాయి.

* అందాల బాండ్‌ భామ...


ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులను ఆకర్షించే జేమ్స్‌బాండ్‌ సినిమాల్లో హీరోయిన్‌ చేయడమంటేనే ఆసక్తి. ఆ అవకాశమే లభించింది ఓ రష్యాబాలకి. ఆమె పేరు ‘ఇజబెల్లా స్కోరుప్కో’. రష్యాలో మోడల్‌గా, నటిగా పేరు పొందిన ఈమె, 1995లో వచ్చిన 17వ జేమ్స్‌బాండ్‌ సినిమా ‘గోల్డెన్‌ ఐ’లో తొలిసారి బాండ్‌గా నటించిన పియర్స్‌ బ్రాస్నన్‌తో కలిసి సాహసాలతో పాటు రొమాన్స్‌ చేసి ఆకట్టుకుంది. పోలండ్‌లో 1970 జూన్‌ 4న పుట్టిన ఈమె చిన్నతనంలోనే మోడల్‌గా మెరిసింది. మోడలింగ్‌ చేస్తూ యూరప్‌ అంతా తిరిగింది. ‘వోగ్‌’లాంటి అంతర్జాతీయ పత్రికల ముఖచిత్రాల ద్వారా ప్రపంచమంతా తళుక్కుమంది. ఆపై అక్కడి సినిమాల్లో మెప్పించింది. పాప్‌ సింగర్‌గా కూడా ఉర్రూతలూగించింది. తర్వాత ‘గోల్డెన్‌ ఐ’ ద్వారా బాండ్‌గర్ల్‌గా అభిమానులకు గుర్తుండిపోయింది.

* వినోదాల రాణి..


అమెరికాలో వినోదరంగంలో ప్రముఖురాలు జెన్నిఫర్‌ లోపెజ్‌. ఇంగ్లిష్, స్పానిష్‌ బాషల్లో ఎన్నో ఆల్బమ్స్‌ పాడడంతో పాటు, ఎన్నో చిత్రాల్లో, టీవీ కార్యక్రమాల్లో నటించింది. మంచి డ్యాన్సర్, నిర్మాత కూడా. ‘అనకొండ’, ‘ఔట్‌ ఆఫ్‌ సైట్‌’ లాంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న ఈమె హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకునే లాటిన్‌ నటిగా పేరు తెచ్చుకుంది. ఈమె రికార్డులు 8 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. ఈమె నటించిన చిత్రాలు 2.9 బిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేశాయి. ప్రపంచంలోనే ‘మోస్ట్‌ పవర్‌ఫుల్‌ సెలబ్రిటీ’గా ఈమెను ఫోర్బ్స్‌ పత్రిక గుర్తించింది. ఈమె 2004లో ఇదే రోజు సెల్సా ఆర్టిస్ట్‌ మార్క్‌ ఆంథోనిని పెళ్లాడింది.

* నటుడు... అధ్యక్షుడు..


రోనాల్డ్‌ రీగన్‌ అనగానే అమెరికా 40వ అధ్యక్షుడుగానే గుర్తొస్తారు. కానీ ఆయన హాలీవుడ్‌ నటుడు కూడా. పేద కుటుంబంలోంచి వచ్చిన రీగన్‌ మొదట్లో రేడియోలో స్పోర్ట్స్‌ అనౌన్సర్‌గా పనిచేశారు. తొలిసారిగా ‘లవ్‌ ఈజ్‌ ఆన్‌ ద ఎయిర్‌’ (1937)లో తెరపై తళుక్కుమన్నారు. దాదాపు 19 సినిమాల్లో నటించారు. 2004లో ఇదే రోజు తన 93వ ఏట మరణించారు.

* హుషారైన కథానాయిక..


నటి రంభ పుట్టినరోజు. విజయవాడలో పుట్టి పెరిగింది రంభ. ఆమె అసలు పేరు విజయలక్ష్మి ఈది. పాఠశాలలో చదువుతున్నప్పుడే దర్శకుడు హరిహరన్‌ దృష్టిలో పడిన ఆమె, మలయాళ చిత్రం ‘సర్గమ్‌’లో తొలి అవకాశాన్ని అందుకొంది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘ఆ ఒక్కటి అడక్కు’తో కథానాయికగా పరిచయమైంది. ఆ చిత్రంతోనే ఆమె పేరు రంభగా మారిపోయింది. ‘ఏవండీ ఆవిడ వచ్చింది’, ‘భైరవద్వీపం’ తదితర చిత్రాల తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. ‘హలో బ్రదర్‌’, ‘బంగారు కుటుంబం’, ‘ముద్దుల ప్రియుడు’, ‘అల్లరి ప్రేమికుడు’, ‘అల్లుడా మజాకా’, ‘మాతో పెట్టుకోకు’ తదితర చిత్రాలతో కమర్షియల్‌ కథానాయిక అనిపించుకొంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, భోజ్‌పూరి, బెంగాలీ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొంది. బుల్లితెరతోనూ ఆమె అనుబంధం ఏర్పరచుకొంది. పలు షోలకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఇంటింటికీ చేరువైంది. రంభ ఇంద్ర కుమార్‌ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. లాన్య, సాషా అనే ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చింది.

* చలాకీ నటి..


కలర్స్‌ స్వాతి పుట్టినరోజు. బుల్లితెరపై ‘కలర్స్‌’ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి చలాకీ పిల్లగా పేరు తెచ్చుకొంది స్వాతి. ఆ కార్యక్రమం పేరే ఆమె ఇంటిపేరుగా మారింది. రష్యాలో జన్మించిన స్వాతి అసలు పేరు స్వెత్లానా. ఆ తర్వాత స్వాతిగా పేరు మార్చుకొంది. ఇండియన్‌ నేవీ ఉద్యోగి అయిన శివరామకృష్ణారెడ్డి కూతురే స్వాతి. ప్రస్తుతం రష్యాలో ఉన్న సోవియట్‌ యూనియన్‌లో సబ్‌మెరైనర్‌ ట్రైనింగ్‌ తర్వాత స్వాతి తండ్రి విశాఖపట్నంకి రావడంతో ఆమె బాల్యం అక్కడే గడిచింది. 11వ తరగతి తర్వాత ఆమె కుటుంబం హైదరాబాద్‌కి మకాం మార్చింది. 17 యేళ్ల వయసులో బుల్లితెర యాంకర్‌గా బుల్లితెర ప్రయాణం మొదలుపెట్టింది. ‘డేంజర్‌’తో వెండితెరకు పరిచయమైంది. ‘ఆడవారి మాటలకి అర్థాలే వేరులే’ చిత్రంలో ఓ కీలకపాత్ర పోషించి నవ్వులు పూయించింది. ‘అష్టాచమ్మా’ ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ‘సుబ్రమణ్యపురం’తో తమిళంలోకి ప్రవేశించిన ఆమె తెలుగు, తమిళంతో పాటు మలయాళంలోనూ అవకాశాల్ని అందుకొంది. మంచి గాత్రం, అందం, నటన కలగలిసిన స్వాతి ప్రతిభకి తగ్గ అవకాశాలు దక్కలేదనే చెప్పాలి. కానీ వచ్చిన ప్రతి అవకాశానికీ ఆమె తన వంతు న్యాయం చేసింది. ఈమధ్య ఆమె నటించిన చిత్రం ‘లండన్‌ బాబులు’. ‘గోల్కొండ హైస్కూల్‌’, ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ తదితర చిత్రాలు స్వాతికి మంచి పేరు తీసుకొచ్చాయి. నేపథ్య గాయనిగా, డబ్బింగ్‌ కళాకారిణిగా తన ప్రతిభని ప్రదర్శించింది స్వాతి. ‘అష్టాచమ్మా’లో నటనకిగానూ ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని, తెలుగు ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాన్ని అందుకొన్నారు స్వాతి.

* మళ్లి కూయవే గువ్వా...

(భాస్కరభట్ల పుట్టిన రోజు-1974)


‘బొమ్మని గీస్తే నీలా ఉందీ...’ అంటూ అందమైన మెలోడీలు రాస్తారు. ‘గాల్లో తేలినట్టుందే...’ అంటూ మాస్‌ గీతాలు రాస్తారు. ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..’ అంటూ ప్రత్యేక గీతాల్లోనూ ఆయనది అందె వేసిన చేయే. సత్తే ఏ గొడవా లేదు... అంటూ మాస్‌ పాటల్లోనూ వేదాంతం చెప్పగల సమర్థుడు భాస్కరభట్ల రవికుమార్‌. గీత రచయితగా ఆయనది తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానం. మాస్, రొమాంటిక్, మెలోడీ... ఇలా జోనర్‌ ఏదైనా, ఎలాంటి సందర్భానికైనా రాయగల రచయితల్లో భాస్కరభట్ల ఒకరు. పూరి జగన్నాథ్, త్రివిక్రమ్‌ వంటి అగ్ర దర్శకులు మొదలుకొని... నవతరం వరకు ఎంతోమందితో కలిసి పనిచేశారు. కమర్షియల్‌ పాట అనగానే దర్శకనిర్మాతలకి గుర్తుకొచ్చే గీత రచయితల్లో భాస్కరభట్ల ఒకరు. ‘మళ్లి కూయవే గువ్వా...’, ‘ఎందుకే రవణమ్మా...’, ‘చూడొద్దంటున్నా...’ - ఇలా నిత్యం శ్రోతల నోళ్లల్లో నానే పాటలెన్నో భాస్కరభట్ల కలం నుంచి జాలువారాయి. ‘గొప్పింటి అల్లుడు’ చిత్రంతో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన, పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’తో విజయాన్ని అందుకొన్నారు. అక్కడ్నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత పూరి జగన్నాథ్‌తోనే వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు. సంగీత దర్శకుడు చక్రి, భాస్కరభట్ల ప్రయాణం ఒకేసారి మొదలైంది. చక్రి స్వరాలు సమకూర్చిన చిత్రాల్లో, దాదాపు 65 చిత్రాలకి భాస్కరభట్ల గీతాలు రాశారు. 1974 జూన్‌ 5న శ్రీకాకుళంలో జన్మించిన ఆయన రాజమండ్రిలో పెరిగారు. తాత అరవెల్లి రాజగోపాలాచార్య నుంచి సాహిత్యాభిలాషని పుణికి పుచ్చుకున్న భాస్కరభట్ల చిన్నప్పుడే కవితా పఠనంపై దృష్టిపెట్టారు. బి.ఎ (తెలుగు) పూర్తి చేసిన అనంతరం పాత్రికేయుడిగా ప్రయాణం మొదలుపెట్టారు. రాజమండ్రి, హైదరాబాద్‌ల్లో పనిచేసిన ఆయన ఆ తర్వాత పాత్రికేయ ఉద్యోగాన్ని వదిలిపెట్టి గీత రచననే కెరీర్‌గా మలుచుకున్నారు. వరంగంల్‌కి చెందిన లలితని ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు భాస్కరభట్ల. ఆ దంపతులకి ఇద్దరమ్మాయిలు అమంత, సంహిత ఉన్నారు. గీత రచయితగా విజయవంతంగా ప్రయాణం కొనసాగిస్తున్న భాస్కరభట్ల పుట్టినరోజు ఈ రోజు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.