జూన్‌ 6...(సినీ చరిత్రలో ఈరోజు)

* నవ్వుల నటుడు

(సుత్తి వీరభద్రరావు జయంతి-1947)


మామిడిపల్లి వీరభద్రరావు అంటే గుర్తుపట్టేవాళ్లు తక్కువే కావొచ్చు కానీ... సుత్తి వీరభద్రరావు అంటే మాత్రం ఆయన రూపం, రకరకాల పాత్రల్లో ఆయన పంచిన వినోదాలు వెంటనే గుర్తుకొస్తాయి. 1980వ దశకంలో వెండితెరపై ఓ వెలుగు వెలిగారు సుత్తి. మరో నటుడు సుత్తివేలుతో కలిసి సుత్తి ద్వయంగా పలు చిత్రాల్లో నవ్వించారు. తూర్పు గోదావరి జిల్లా అయినాపురంలో జన్మించిన సుత్తి వీరభద్రరావు విజయవాడలో పెరిగారు. తండ్రి ఉద్యోగం రీత్యా ఆయన కుటుంబం విజయవాడలో స్థిరపడింది. ఎస్‌.ఆర్‌.ఆర్‌.కళాశాలలో విద్యాభ్యాసం సాగింది. ప్రముఖ దర్శకుడు జంధ్యాల, వీరభద్రరావు సహాధ్యాయిలు. ఆంధ్రా విశ్వవిద్యాలయం స్థాయిలో ఇద్దరూ కలిసి పలు నాటకపోటీల్లో పాల్గొన్నారు. డిగ్రీ తర్వాత ఆల్‌ ఇండియా రేడియోలో ఉద్యోగం సంపాదించిన సుత్తి ఆ తర్వాత కూడా నాటకాలతో అనుబంధం కొనసాగించారు. 1981లో ‘జాతర’ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. జంధ్యాల దర్శకత్వం వహించిన ‘నాలుగు స్తంభాలాట’తో ఆయనకి మంచి పేరొచ్చింది. సుదీర్ఘమైన సంభాషణల్ని పలుకుతూ అనతికాలంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకొన్నారు. 1982 నుంచి 88 కాలంలోనే 200కి పైగా సినిమాల్లో నటించారు. నరేష్, రాజేంద్రప్రసాద్‌ లాంటి కథానాయకులు చిత్రాల్లో వీరభద్రరావు కీలకపాత్రలు పోషించేవారు. సుత్తి వీరభద్రరావు సినిమాలో ఉంటే విజయం ఖాయమనే ఓ సెంటిమెంట్‌తో పలువురు దర్శకనిర్మాతలు, మా సినిమాలో కనీసం ఓ చిన్న పాత్రలోనైనా కనిపించాలంటూ సుత్తి వీరభద్రరావును సంప్రదించేవారు అప్పట్లో. తన 41వ యేటనే ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన ఆఖరి చిత్రం ‘చూపులు కలిసిన శుభవేళ’. ఆ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే సుత్తి వీరభద్రరావు అనారోగ్యానికి గురయ్యారు. ఇందులో సుత్తి పాత్రకి జంధ్యాల డబ్బింగ్‌ చెప్పారు. ఇవాళ వీరభద్రరావు జయంతి (1947).

(మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి...)

* సమాజ సేవకుడు

(సునీల్‌ దత్‌ జయంతి-1929)


బాలీవుడ్‌లో నటన కంటే సమాజ సేవకుడిగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న నటుడు సునీల్‌ దత్‌. కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత, సమాజ సేవకుడు, కేంద్ర మంత్రిగా బహుముఖంగా రాణించారు. తన సినిమాలకు తనే కథానాయకుడు, దర్శకుడు, నిర్మాతగా మారిపోయిన నటుల్లో మొదటివాడితడు. ఆయన ఎంపీగా ఉన్న సమయంలో కుమారుడు సంజయదత్‌పై అక్రమ ఆయుధాల కేసు విషయంలో కుమారుడిని అరెస్టు చేస్తామని పోలీసులంటే ‘‘చట్టం తన పని తాను చేసుకుపోవాల’’ంటూ యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించిన నిజాయితీపరుడు. సునీల్‌ దత్‌ అసలు పేరు బాల్‌రాజ్‌ దత్‌. తొలిసారిగా హిందీలో ‘రేడియో సిలోన్‌’ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత బాలీవుడ్‌లో ‘రైల్వే ప్లాట్‌ఫారం’ అనే చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆయన ‘మదర్‌ ఇండియా’ చిత్రంలో నర్గీస్‌కి కుమారుడి పాత్రలో నటించారు. ఆ రోజుల్లో ఈ చిత్రం భారీ విజయాన్నుందుకుంది. తర్వాత నర్గీస్‌నే వివాహమాడారు. ‘సాధన’, ‘సుజాత’, ‘మై చుప్‌ రహూంగీ’ వంటి మహిళలను చైతన్యపరిచే చిత్రాల్లో నటించి అందరినీ మెప్పించారు. సునీల్‌ దత్‌ కథానాయకుడిగా నిర్మించిన చిత్రం ‘ముజే జీనే దో’. దీంతో బాలీవుడ్‌లో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. దీనికి తొలిసారిగా ఆయన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు. ఈ చిత్రంతోనే బాలీవుడ్‌ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా మిగిలిపోయారు. సునీల్‌ దత్‌ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో ఆయనే నిర్మించిన చిత్రం ‘యాదేన్‌’. ఇది బాక్సాఫీసు రికార్డులను తిరగరాసింది. ఇది గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఇవి కాకుండా ఆయన ‘రేష్మా ఔర్‌ షేర్‌’, ‘రాకీ’, ‘దర్ద్‌’, వంటి పలు చిత్రాలకు కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత వంటి ఎన్నో బాధ్యతలను మోశారు. ఇవన్నీ మంచి విజయం సాధించాయి. తెలుగులో మంచి హిట్టుకొట్టిన ‘మూగ మనసులు’ చిత్రం హిందీలో సునీల్‌ దత్‌ హీరోగా ‘మిలాన్‌’గా తెరకెక్కింది. ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. ‘కాందాన్‌’తో ఆయన కాందాన్‌ చూపించారు. కుమారుడు సంజయ్‌ దత్‌తో కలసి ‘మున్నాభాయ్‌ ఎమ్‌.బి.బి.ఎస్‌.’ చిత్రంలో నటించి ఆకట్టుకున్నారు. భార్య నర్గీస్‌ మరణం తర్వాత ‘నర్గీస్‌ ఫౌండేషన్‌’ పేరుతో కాన్సర్‌తో బాధపడేవారికి వైద్యసేవలందిస్తున్నారు. ఆయన మన్మోహన్‌ మంత్రివర్గంలో 2004-05 మధ్యలో కేంద్ర యువజన, క్రీడా శాఖా మంత్రిగా పనిచేశారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సత్కరించింది. నటుడిగా ఆయన ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. సునీల్‌ దత్‌ జూన్‌ 6, 1929లో జన్మించారు. ఆయన మే 25, 2005లో మరణించారు. ఇవాళ ఆయన జయంతి.

* విజయం నాడి తెలిసిన నిర్మాత

(నిర్మాత రామానాయుడు జయంతి-1936).(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి)

* మలయాళీ ముద్దుగుమ్మ


తెలుగు తెరపై మెరిసిన మలయాళీ ముద్దుగుమ్మ భావన. కార్తీక మేనన్‌ ఆమె అసలు పేరు. త్రిసూర్‌ జిల్లాలో జన్మించింది. సినిమాటోగ్రాఫర్‌ జి. బాలచంద్రన్‌ కూతురైన భావన తెలుగుతో పాటు తమిళం, మలయాలం, కన్నడ భాషలో నటించి పేరు తెచ్చుకొంది. తెలుగు తెరకు ఆమె ‘ఒంటరి’ చిత్రంతో పరిచయమైంది. ‘హీరో’, ‘మహాత్మ’, ‘నిప్పు’ చిత్రాల్లో నటించింది. ఈమె నటిగా తెలుగు ప్రేక్షకులపై తనదైన ముద్ర వేసింది కానీ విజయాల్ని మాత్రం అందుకోలేకపోయింది. దాంతో మళ్లీ ఎక్కువగా మలయాళం, కన్నడ చిత్రాలపైనే దృష్టిపెట్టింది. పదహారేళ్ల వయసులోనే కథానాయికగా తెర ప్రవేశం చేసిందామె. తన బాయ్‌ఫ్రెండ్‌ అయిన కన్నడ నిర్మాత నవీన్‌ని 2018 జనవరిలో వివాహమాడింది. వివాహానికి ముందు ఒక సినిమా చిత్రీకరణకి వెళ్లొస్తుండగా, కొద్దిమంది అపహరించి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అందుకు కుట్రపన్నిన సూత్రధారి అంటూ మలయాళ కథానాయకుడైన దిలీప్‌కుమార్‌ని అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో భావనకి భారతీయ చిత్ర పరిశ్రమ అంతా బాసటగా నిలిచింది. ఈ రోజు భావన బాలచంద్రన్‌ (కార్తీక మేనన్‌) పుట్టిన రోజు (1986).

* అందాల తార

(ఆర్తి అగర్వాల్‌ వర్థంతి-2015)


(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి)


* ఇండియాలో... బాండ్‌ సినిమా...


జేమ్స్‌బాండ్‌ సినిమాను ఇండియాలో చిత్రీకరించడం ఓ విశేషమైతే, అందులో మన నటులు నటించడం మరో విశేషం. ఈ రెండు విశేషాలు ‘ఆక్టోపస్సీ’ (1983)తో సాధ్యమయ్యాయి. బాండ్‌ చిత్రాల పరంపరలో పదమూడవది ఇది. బాండ్‌ పాత్రను సృష్టించిన ఇయాన్‌ ఫ్లెమింగ్‌ రాసిన చిన్న కథల సంపుటి నుంచి ‘ఆక్టోపస్సీ అండ్‌ ద లివింగ్‌ డేలైట్స్‌’ అనే కథ ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఇందులో బాండ్‌గా రోజర్‌ మూర్‌ నటించారు. మూర్‌ ‘లివ్‌ అండ్‌ లెట్‌ డై’ (1973) నుంచి ‘ఎ వ్యూ టు ఎ కిల్‌’ (1985) వరకు మొత్తం 7 బాండ్‌ సినిమాల్లో నటించారు. సోవియట్‌ నుంచి విలువైన వజ్రాల దొంగతనాలకు సంబంధించిన వివరాలు సేకరించిన ఓ గూఢచారి మరణించడంతో బాండ్‌ రంగంలోకి దిగుతాడు. ఆ పరిశోధనలో భాగంగా ఆఫ్ఘన్‌ యువరాజు కమల్‌ఖాన్‌తో పాటు అతడి భాగస్వామి, అందాల యువతి ఆక్టోపస్సీ పరిచయమవుతారు. చివరకి యూరప్‌లో అణ్వాయుధాల స్వాధీనానికి అమెరికా పేరిట జరుగుతున్న కుట్రను ఛేదిస్తాడు. ఈ క్రమంలో ఇండియాలోని రాజస్థాన్, ఉదయ్‌పూర్‌ కోట తదితర ప్రాంతాల్లో బాండ్‌ సినిమా చిత్రీకరణ జరిపారు. ఇందులో భారతీయ నటుడు కబీర్‌బేడి, టెన్నిస్‌ క్రీడాకారుడు విజయ్‌ అమృతరాజ్‌ నటించారు. ఈ సినిమాను 27.5 మిలియన్‌ డాలర్ల వ్యయంతో చిత్రీకరిస్తే, 187.5 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది.

* ఎవరు నేను?


‘ఇంతకీ నేనెవర్ని?’ అనే ప్రశ్న ఉదయిస్తే కష్టమే. కానీ ఆ ప్రశ్నే ఓ హాలీవుడ్‌ యాక్షన్‌ సినిమాను నడిపించింది. ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులను అలరించింది. ఆ సినిమానే ‘ద బౌర్న్‌ ఐడెంటిటీ’ (2002). అమెరికా రచయిత రాబర్ట్‌ లుడ్మమ్‌ రాసిన బెస్ట్‌ సెల్లర్‌ నవల ఆధారంగా తీసిన ఈ సినిమా మరో నాలుగు సీక్వెల్‌ సినిమాలకు నాంది పలికింది. జేసన్‌ బౌర్న్‌ అనే వ్యక్తి ‘మెమొరీ లాస్‌’ అనే జబ్బుతో బాధపడుతూ, తానెవరో, తన పేరేంటో, ఏ దేశం వాడో తెలుసుకోడానికి ప్రయత్నించడమే మూల కథాంశం. ఓ పడవలో తుపాకీ తూటాలు తగిలి స్పృహ తప్పిపోయిన వ్యక్తిని కొందరు జాలర్లు రక్షించి మెలకువ తెప్పిస్తారు. అతడు అనేక భాషలు మాట్లాడగలడు కానీ తానెవరో చెప్పలేకపోతాడు. కారణం ‘మెమొరీ లాస్‌’ అనే జబ్బు. తన టోపీలో ఉండే ఓ లేజర్‌ ప్రొజెక్టర్‌ ద్వారా జ్యురిచ్‌లో ఓ సేఫ్‌ డిపాజిట్‌ లాకర్‌లోని ఓ పెట్టె వివరాలు తెలుస్తాయి. ఆ పెట్టెలో తన ఫొటోలతో, వేర్వేరు పేర్లతో ఉన్న అనేక పాస్‌పోర్ట్‌లు, ఐడెంటిటీ కార్డులు, వేర్వేరు దేశాల కరెన్సీ నోట్లు ఉంటాయి. అవన్నీ చూసినా తన అసలు పేరేంటో, ఏ దేశంవాడో అతడికి గుర్తు రాదు. ఈ లోగా కొందరు దుండగలు అతడిని చంపడానికి ప్రయత్నించడం, మరో పక్క పోలీసులు అతడి కోసం గాలించడం జరుగుతాయి. వారి నుంచి తప్పించుకుంటూనే తానెవరో తెలుసుకునే ప్రయత్నమే సినిమా కథ. ఈ సినిమాను 60 మిలియన్‌ డాలర్లతో తీస్తే 214 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ఇది విజయవంతం కావడంతో ‘ద బౌర్న్‌ సూపర్‌మసీ’ (2004), ‘ద బౌర్న్‌ అల్టిమేటం’ (2007), ‘ద బౌర్న్‌ లెగసీ’ (2012), ‘జేసన్‌ బౌర్న్‌’ (2016) సినిమాలు వచ్చాయి. వీటిలో ప్రముఖ హాలీవుడ్‌ నటుడు మట్‌డామన్‌ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమాలన్నీ కలిసి ప్రపంచ వ్యాప్తంగా 1.6 బిలియన్‌ డాలర్లు వసూలు చేయడం విశేషం.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.