జూన్‌ 7.. (సినీ చరిత్రలో ఈరోజే)

* అడుగు పెడుతూనే సంచలనంపదహారేళ్ల వయసులో ఓ ఉంగరాల జుట్టు అమ్మాయి సినీ రంగప్రవేశం చేయడం పెద్ద విశేషమేమీ కాదు. కానీ ఆ ప్రస్థానం ఏకంగా 50 ఏళ్ల పాటు సాగడం విశేషమే. అంతేకాదు ‘క్వీన్‌ ఆఫ్‌ మూవీస్‌’గా పేరు తెచ్చుకోవడం మరీ విశేషం. ఇన్ని విశేషాల నటే మేరీ పిక్‌ఫోర్డ్‌. ఈమె 1909లో వెండితెరపై తొలిసారి తళుక్కున మెరిసింది ఈ రోజే.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* భయపెట్టిన విలన్‌


ఒక నటుడు ఒకే పాత్రను దాదాపు 20 ఏళ్ల పాటు పోషించాడంటే ఆశ్చర్యమే. ఆయనే క్రిష్టోఫర్‌ లీ. ఈయన తన కెరీర్‌లో దాదాపు రెండు దశాబ్దాల పాటు డ్రాక్యులా పాత్రలే పోషించాడు. జేమ్స్‌బాండ్‌ సినిమా ‘ద మ్యాన్‌ విత్‌ ద గోల్డెన్‌ గన్‌’ సినిమాలో విలన్‌ ఈయనే. ‘ద లార్డ్‌ ఆఫ్‌ ద రింగ్స్‌’, ‘ద హోబిట్‌’ లాంటి చిత్రాల ద్వారా కొత్త తరం ప్రేక్షకులకు కూడా పరిచితుడే. ఈయన నట జీవితం దాదాపు 70 ఏళ్లు సాగడం విశేషం. ఈయన తన 93వ ఏట 2015లో ఇదే రోజు మరణించారు.

(మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి...)

* అరుదైన నటి (సరిత పుట్టిన రోజు)


గుంటూరు జిల్లాలో జన్మించి... కథానాయికగా.. డబ్బింగ్‌ ఆర్టిస్టుగా దక్షిణాది చిత్ర పరిశ్రమపైన తనదైన ముద్ర వేసిన కథానాయిక సరిత. 1980వ దశకంలో అగ్ర కథానాయికగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఓ వెలుగు వెలిగారు. ‘మరోచరిత్ర’తో సినీ ప్రయాణం ఆరంభించిన ఆమె ఆ తర్వాత తమిళం, తెలుగు భాషల్లో వరుసగా అవకాశాలు అందుకొన్నారు. దాదాపు 160 చిత్రాల్లో నటించారు. 1990 దశకంలో విజయశాంతి, టబు, సుస్మితా సేన్, రమ్యకృష్ణ, సౌందర్య తదితర కథానాయికలకి తమిళంలో డబ్బింగ్‌ చెప్పి అలరించిన నటి సరితే. రోజా, నగ్మా, సిమ్రాన్, సుహాసిని, రాధ, రాధిక, ఆర్తి అగర్వాల్‌లాంటి కథానాయికలకి తెలుగులో గాత్రం అందించారు సరిత. గుంటూరు జిల్లా మునిపల్లెలో జన్మించిన ఆమె 1978లో చిత్ర రంగ ప్రవేశం చేశారు. ప్రస్తుతం దుబాయ్‌లో తన చిన్న కుమారుడు శ్రవణ్‌ దగ్గర ఉంటున్నారు సరిత. విమర్శకుల మెప్పు పొందేలా నటించడంలో దిట్ట సరిత. ఆమెకి ఉత్తమ నటిగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా ఆరు నంది పురస్కారాలు లభించాయి. తమిళం, మలయాళ, కన్నడ భాషల్లోనూ పలు పురస్కారాలు సొంతం చేసుకొన్నారు. నేడు సరిత పుట్టినరోజు.


(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* ఘంటసాల ప్రియశిష్యుడు

(జేవీ రాఘవులు వర్థంతి-2013)


‘జననీ జన్మ భూమిశ్చ...’, ‘అది ఒకటో నెంబరు బస్సు...’, ‘వీణ నాది.. తీగ నాది... తీగ చాటు రాగముంది’, ‘ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరూ సొంతమూ, ఎంతవరకీ బంధమూ’... ఈ పాటల్ని తెలుగు ప్రేక్షకులు అంత తొందరగా మరిచిపోలేరు. రాబోయే తరాలు కూడా పాడుకొనే పాటలు ఇవి. వీటి సృష్టికర్త ఎవరో కాదు... ఘంటసాల ప్రియశిష్యుడైన జె.వి.రాఘవులు. ఇప్పుడు ఆపాత మధురాలు అనిపించే అనేక పాటల వెనక ఉన్న సంగీత దర్శకుడు జేవీ రాఘవులు. ఘంటసాల, కె.వి.మహదేవన్, ఎం.ఎస్‌.విశ్వనాథన్, రామానాయుడు, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ తదితరుల చిత్రాలకి సంగీత దర్శకుడిగా, గాయకుడిగా పనిచేసిన వ్యక్తి. గాయకుడిగా వంద సినిమాలకి, సంగీత దర్శకుడిగా 172 సినిమాలకి పనిచేశారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో పుట్టిన జేవీ రాఘవులు విజయవాడ రేడియో స్టేషన్‌లో లలిత గీతాలు పాడి ప్రాచుర్యం పొందారు. అక్కడే ఆయన ఘంటసాల దృష్టిలో పడ్డారు. మద్రాసు రావాలనుకొంటే నా దగ్గరికి వచ్చేయమంటూ ఆయనకి అడ్రస్‌ ఇచ్చి వెళ్లారట ఘంటసాల. దాంతో మద్రాస్‌ వెళ్లిన జేవీ రాఘవులు ఘంటసాలకి ప్రియశిష్యుడిగా మారిపోయారు. కచేరీల్లో ఇద్దరూ కలిసి పాడేవారు. ఆర్కెస్టాత్రో ప్రాక్టీస్‌ చేయించడం వంటి పనులన్నింటినీ రాఘవులుకే అప్పజెప్పేవారట ఘంటసాల. ‘లవకుశ’ పాటలు గుర్తుండిపోయేలా నిలవడంలో రాఘవులు పాత్ర ఎంతో ఉందని ఘంటసాల పలు వేదికలపై మెచ్చుకొనేవారట. డి.రామానాయుడు నిర్మించిన ‘ద్రోహి’తో సంగీత దర్శకుడిగా మారిన జె.వి.రాఘవులు ఆ తర్వాత కూడా ఘంటసాల శిష్యుడిగానే కొనసాగారు. ‘జీవనతరంగాలు’, ‘బొబ్బిలిపులి’, ‘కటకటాల రుద్రయ్య’, ‘మొగుడు కావాలి’, ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’, ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’ తదితర చిత్రాలకి సంగీతాన్ని అందించారు జేవీ రాఘవులు. ఆర్‌.నారాయణమూర్తి నటించిన ‘ఛలో అసెంబ్లీ’ వరకు ఆయన ప్రస్థానం కొనసాగింది. ఆ తర్వాత సినిమాలకి దూరమయ్యారు. తన అక్క కూతురైన రమణమ్మని వివాహం చేసుకొన్న ఆయన జీవితకాలంలో సంపాదించుకొన్నదేమీ లేదు. జీవిత చరమాంకంలో ఆర్థిక పరమైన సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కి మారాక ఆయనలో సందిగ్ధం మొదలైందని చెబుతారు. క్రమేణా ఆరోగ్యం సహకరించకపోవడంతో చిత్ర పరిశ్రమకి దూరమై, రాజమండ్రిలోని తన కుమారుడి ఇంట్లో గడిపారు. 82 యేళ్ల వయసులో 2013 జూన్‌ 7న తుదిశ్వాస విడిచారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.