ఏప్రిల్‌ 16.. (సినీ చరిత్రలో ఈరోజు)

* ‘శివ’తో పరిచయమై...


రామ్‌గోపాల్‌ వర్మ తీసిన ‘శివ’తో ఎంతోమంది నటులు వెలుగులోకి వచ్చారు. అందులో జేడీ చక్రవర్తి ఒకరు. ‘శివ’లో జేడీగా నటించిన ఆయన... ఆ పాత్ర పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. అదే చిత్రంతో హిందీలోకీ అడుగుపెట్టారు. ‘శివ’ తెచ్చిన గుర్తింపుతో తమిళంలోనూ అవకాశాలు అందుకొన్నారు. కొన్నాళ్లు ప్రతినాయకుడిగా... సహనటుడిగా కొనసాగిన జేడీ ‘వన్‌ బై టు’, ‘మనీ మనీ’, ‘గులాబీ’ చిత్రాలతో కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మృగం’, ‘దెయ్యం’, ‘బొంబాయి ప్రియుడు’, ‘ఎగిరే పావురమా’ చిత్రాలతో జేడీ పేరు మార్మోగిపోయింది. తెలుగులో పలువురు అగ్ర దర్శకులతో వరుసగా సినిమాలు చేశారు. రామ్‌గోపాల్‌ దర్శకత్వం వహించిన ‘అనగనగా ఒక రోజు’తో మరో విజయాన్ని అందుకొన్నారు. 1998లో వర్మ ‘సత్య’తో మరోసారి హిందీలో మెరిశాడు జేడీ. ఆ తర్వాత మళ్లీ తెలుగులో అవకాశాలు అందుకున్నారు. ‘నేను ప్రేమిస్తున్నాను’, ‘ప్రేమకు వేళాయెరా’, ‘హరిశ్చంద్ర’, ‘పాపే నా ప్రాణం’, ‘కోదండరాముడు’, ‘నవ్వుతూ బతకాలిరా’, ‘మా పెళ్లికి రండి’, ‘ప్రేమకుస్వాగతం’... తదితర చిత్రాలు చేసిన ఆయన ‘దర్వాజా బంద్‌ రఖో’ చిత్రంతో దర్శకుడిగా మారారు. ‘హోమం’, ‘సిద్ధం’, ‘మనీ మనీ మోర్‌ మనీ’ చిత్రాలతో తెలుగులోనూ దర్శకత్వం చేసినా.. విజయం మాత్రం దక్కలేదు. నాగచైతన్య కథానాయకుడిగా పరిచయమైన ‘జోష్‌’ నుంచి, మళ్లీ ప్రతినాయక పాత్రలవైపు దృష్టి సారించారు. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషల నుంచి కూడా అవకాశాలు అందుకుంటున్నారు. ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా, సహనటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా... ఇలా పలు విభాగాల్లో ప్రతిభ చూపి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న జేడీ చక్రవర్తి 16 ఏప్రిల్‌ 1972లో జన్మించారు. ఆయన అసలు పేరు నాగులపతి శ్రీనివాస చక్రవర్తి. సూర్యనారాయణరావు నాగులపతి, కోవెల శాంత ఆయన తల్లిదండ్రులు. హైదరాబాద్‌లోని సెంట్‌ జార్జ్‌ గ్రామర్‌ స్కూల్‌లో చదువుకున్న జేడీ, సీబీఐటీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ‘శివ’తో తెరకు పరిచయమయ్యారు. ఎక్కువగా వర్మతో కలిసే ప్రయాణం చేశారు జేడీ. అభిప్రాయాలు వెల్లడించడంలోనూ.. మాట తీరులోనూ వర్మనే గుర్తు చేసే జేడీ చాలాకాలం పాటు బ్రహ్మచారిగానే ఉన్నారు. కానీ తన తల్లి కోరిక మేరకు 2016 ఆగస్టు 18న లక్నోకి చెందిన నటి, మోడల్‌ అనుకృతి గోవింద్‌ శర్మని వివాహం చేసుకొన్నారు. ఈరోజు జేడీ చక్రవర్తి పుట్టినరోజు.

* తాగుబోతు పాత్రల స్పెషలిస్టు

(ఎమ్మెస్‌ నారాయణ జయంతి-1951)


తెలుగు చిత్రసీమ హాస్య నటుల పాలిట ఓ పుష్పకవిమానం అంటుంటారు. ఎంత మంది వచ్చినా మరొకరికి చోటుంటుంది. తెలుగు తెరపై మెరిసిన హాస్యనటుల్లో ఒకొక్కరిది ఒక్కో శైలి. తాగుబోతు పాత్రలపై తనదైన ముద్ర వేశారు ఎమ్మెస్‌ నారాయణ. పేరడీ పాత్రలన్నా... దర్శకనిర్మాతలకి మొట్ట మొదట గుర్తుకొచ్చే నటుడు ఎమ్మెస్‌ నారాయణే. రచయితగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత హాస్య నటుడిగా, దర్శకుడిగా తన ప్రతిభని చాటారు. ఎమ్‌.ఎస్‌.నారాయణ 16 ఏప్రిల్‌ 1951న పశ్చిమ గోదావరి జిల్లా, నిడమర్రులో ఒక మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించారు. మైలవరపు బాపిరాజు, వెంకటసుబ్బమ్మ తల్లిదండ్రులు. ఎమ్మెస్‌ అసలు పేరు మైలవరపు సూర్య నారాయణ. ఇల్లందులో చదువుకున్న ఎమ్మెస్, పదో తరగతి తర్వాత పత్తేపురంలోని ప్రాచ్య కళాశాలలో ఐదేళ్ల భాషా ప్రవీణ కోర్సు పూర్తి చేశారు. పత్తేపురంలోని మూర్తిరాజు కళాశాలలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ లెక్చరర్‌గా పనిచేసేవారు. ఆయన దగ్గరే శిష్యరికం చేశారు ఎమ్మెస్‌. అదే ఆయన రచయితగా స్థిరపడటానికి కారణమైందటంటారు. తన సహాధ్యాయిని అయిన కళాప్రపూర్ణని ప్రేమించి పెళ్లిచేసుకొన్నారు ఎమ్మెస్‌. మొదట అధ్యాపకుడిగా ప్రస్థానం ప్రారంబించిన ఎమ్మెస్‌ కళారంగంపై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి నటనారంగంలోకి అడుగుపెట్టారు. ‘వేగు చుక్క పగటి చుక్క’ చిత్రంతో కథారచయితగా మారారు. ఆ తర్వాత ఎనిమిది చిత్రాలకి పనిచేశారు. ‘ఎమ్‌.ధర్మరాజు ఎమ్‌.ఎ’ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యారు. ‘పుణ్యబూమి నాదేశం’, ‘రుక్మిణి’ చిత్రాల్లో చిన్న పాత్రలు చేసిన ఆయనకి ఈవీవీ దర్శకత్వం వహించిన ‘మా నాన్నకి పెళ్ళి’ తిరుగులేని పేరు తీసుకొచ్చింది. దర్శకులు తనకి ఇచ్చిన పాత్రలకి తానే సంభాషణలు రాసుకొని సినిమాల్లో పలికేవారు ఎమ్మెస్‌. ‘రామసక్కనోడు’, ‘మా నాన్నకి పెళ్లి’, ‘సర్దుకుపోదాం రండి’, ‘శివమణి’, ‘దూకుడు’ చిత్రాలకిగానూ ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. సుమారు 200 చిత్రాల్లో ఆయన తాగుబోతు పాత్రధారిగా నటించి నవ్వించారు. ‘దూకుడు’, ‘డిస్కో’, ‘దుబాయ్‌ శీను’ తదితర చిత్రాల్లో పేరడీ పాత్రలు చేసి మెప్పించారు. తన తనయుడు విక్రమ్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ‘కొడుకు’ చిత్రాన్ని తెరకెక్కించారు ఎమ్మెస్‌. ఆ చిత్రం పరాజయం చవిచూసింది. మళ్లీ ‘భజంత్రీలు’ అనే చిత్రం చేశారు. అది కూడా ఫలితాన్నివ్వలేదు. కుమార్తె శశికిరణ్‌ కూడా దర్శకురాలే. సుమారు 700పైగా సినిమాలు చేసిన ఎమ్మెస్‌ నారాయణ 2015లో సంక్రాంతి పండగకి సొంతూరు వెళ్లి, అక్కడే అస్వస్థతకి గురై తుదిశ్వాస విడిచారు. ఆయన పుట్టినరోజు ఈ రోజు.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* అందాల తారా


(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* నవ్వుల చక్రవర్తి

(చార్లీ చాప్లిన్‌ జయంతి-1989)


(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* అరగంట సినిమాకి ఆస్కార్‌!


ఆ సినిమా నిడివి 29 నిమిషాల 16 సెకన్లు... కానీ చూస్తున్నంత సేపు హాలంతా నవ్వులే నవ్వులు... ఎందుకో తెలుసా? అందులో నటించింది... ప్రపంచ ప్రఖ్యాత హాస్య నటులు లారెల్, హార్డీ. ప్రపంచ వ్యాప్తంగా నవ్వులు పంచిన ఈ సినిమా, లైవ్‌యాక్షన్‌ లఘుచిత్రాల్లో ఆస్కార్‌ అవార్డు అందుకున్న తొలి సినిమాగా రికార్డు సృష్టించింది. అదే ‘ద మ్యూజిక్‌ బాక్స్‌’ (1932) సినిమా. అయోమయం పనులతో ఆకట్టుకునే లారెల్, హార్డీలు కలిసి ఓ కస్టమర్‌ ఆర్డర్‌ మేరకు ఓ పియానోను ఆమె భర్త ఇంటికి చేర్చడానికి ఎన్ని తంటాలు పడ్డారనేదే కథ. పియానోను చేర్చాల్సిన ఇల్లు ఓ ఎత్తయిన ప్రదేశంలో మీద ఉంటుంది. అక్కడకి చేరాలంటే 147 మెట్లు ఎక్కాలి. ఆ దారిలో పియానోకు తీసుకు వెళ్లాల్సి వస్తుంది. వాళ్లకి అడుగడుగునా ఆటంకాలు ఎదురవడం, ఆ పియానో మాటిమాటికి జారిపోవడం లాంటి సన్నివేశాలు ఆద్యంతం నవ్విస్తాయి. ఈ సినిమాను జాతీయ సినీ లైబ్రరీలో భద్రపరిచారు. ఈ సినిమాను లాస్‌ ఏంజెలిస్‌లోని సిల్వర్‌లేక్‌ జిల్లాలోని ఓ ఇంటి దగ్గర చిత్రీకరించారు. విశేషం ఏమిటంటే ఆ మెట్లు, ఇల్లు ఇప్పటికి కూడా ఉన్నాయి. వాటిని మ్యూజిక్‌ బాక్స్‌ స్టెప్స్‌ అని పిలుస్తారు. మరో ఆసక్తికరమైన సంగతి ఏంటంటే, ఈ సినిమా 1927లో తీసిన ‘హ్యాట్స్‌ ఆఫ్‌’ అనే మూకీ సినిమాకి రీమేక్‌. దాన్ని కూడా ఇదే చోట చిత్రీకరించారు. ఈ ‘హ్యాట్స్‌ఆఫ్‌’ సినిమాకి 1945లో ‘ఇట్స్‌ యువర్‌ మూవ్‌’ సినిమాగా రీమేక్‌ చేశారు. ‘ద మ్యూజిక్‌ బాక్స్‌’ సినిమాను 1986లో కలర్‌లోకి మార్చి తిరిగి విడుదల చేశారు. ఈ సినిమాను స్పానిష్‌ సహా ఇతర భాషల్లోకి తర్జుమా చేశారు. హాస్య రచయిత హాల్‌ రోచ్‌ ఓసారి ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు లారెల్, హార్డీలు ఈ మెట్ల మీద ఓ బరువైన వస్తువును తీసుకెళ్తునట్టు సినిమా తీస్తే బాగుంటుందనే ఆలోచనే కథగా మారింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.