ఏప్రిల్‌ 24.. (సినీ చరిత్రలో ఈరోజు)

కళాత్మక ప్రస్థానం!

(ఏడిద నాగేశ్వరరావు జయంతి-1934)

ఆయన తీసిన సినిమాల్లో జాతీయ అవార్డులు అందుకున్నవి, విదేశీ చిత్రోత్సవాల్లో ప్రశంసలకు నోచుకున్నవీ ఉన్నాయి. కళను, కాసును కలగలిపి కళావ్యాపారాత్మక చిత్రాలను అందించిన నిర్మాత ఆయన. కాసుల కోసం అభిరుచిని తాకట్టు పెట్టక్కర్లేదని నిరూపించిన ఆయనే ఏడిద నాగేశ్వరరావు. ‘శంకరాభరణం’, ‘సాగరసంగమం’, ‘స్వయంకృషి’, ‘స్వాతిముత్యం’ లాంటి చక్కని చిత్రాలను అందించిన ఆయన కీర్తి చిరస్మరణీయం. నాటకాల సరదాతో మొదలైన ఏడిద నాగేశ్వరరావు జీవన ప్రస్థానం నాణ్యమైన చిత్రాల నిర్మాతగా మారడం వెనుక ఎన్నో ఉత్థానపతనాలు ఉన్నాయి. వచ్చిన అవకాశాన్ని అందుకుంటూ ముందుకు సాగిన ఆయన పట్టుదలే ఆయన జీవితాన్ని ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుతూ వచ్చింది. రంగస్థలం నుంచి వెండితెరపై కనిపించాలనుకుని కోటి ఆశలతో చెన్నపట్నం బయల్దేరిన నాగేశ్వరరావుకి పరిస్థితులు మరోదారి చూపించాయి. ఆ ప్రయాణ క్రమం స్ఫూర్తిదాయకం...


పాఠశాలలో ప్రదర్శించిన ఓ నాటకంలో ఆడవేషం రంగస్థలం రుచేమిటో చూపించింది. ఆ నటనకు రజతపతకం సాధించిన ఉత్సాహంతో ‘విశ్వభారతి’, ‘పరివర్తన’, ‘ఓటు నీకే’ వంటి నాటకాల్లో నటించి మరిన్ని బహుమతులు పొందారు. కాకినాడలో డిగ్రీ చదువుతున్నప్పుడు వి.బి.రాజేంద్రప్రసాద్, నటులు హరనాథ్, మాడా, కె.కె.శర్మలతో కలిసి కళాప్రపూర్ణ రాఘవ కళాసమితి నాటక సంస్థని ప్రారంభించారు. పలు నాటకాలు ప్రదర్శించి నటించారు. మేనమామ కూతురైన జయలక్ష్మితో 1954 ఏప్రిల్‌ 24న వివాహం జరిగింది. పుట్టిన (ఏప్రిల్‌ 24, 1934) రోజునాడే పెళ్లి జరగడం యాదృచ్ఛికం అనేవారు నాగేశ్వరరావు. అదే రోజున ‘శంకరాభరణం’కు జాతీయ పురస్కారం స్వీకరించడం విశేషం. తన స్నేహితుడు, నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌ నుంచి ‘అన్నపూర్ణ’లో నటించాలని పిలుపు రావడంతో మద్రాసు వెళ్లినా ఆ వేషం దక్కలేదు. తిరిగి ఊరెళితే అవమానంగా ఉంటుందని భావించిన ఆయన చిత్ర పరిశ్రమలో ఏదో ఒకటి సాధించాలని నిర్ణయించుకొని డబ్బింగ్‌ కళాకారుడిగా ప్రయత్నాలు ప్రారంభించాడు. ‘పార్వతీ కల్యాణం’లోని శివుడు పాత్రకి డబ్బింగ్‌ చెప్పి తొలి సంపాదనగా రూ.500 పొందారు. ఆ తరువాత నటుడిగా కూడా అవకాశాలు సొంతం చేసుకొన్నారు. 1962 నుంచి 1974 మధ్యకాలంలో సుమారు 30 సినిమాలలో నటించారు. వంద చిత్రాలకిపైగా డబ్బింగ్‌ చెప్పారు. ఆ తరువాత కాకినాడకి చెందిన భాస్కరరెడ్డి, రామకృష్ణారెడ్డి, లచ్చిరెడ్డి, వీర్రాజులతో కలిసి ‘వెంకటేశ్వర కల్యాణం’ అనే చిత్రాన్ని తెలుగులోకి అనువందించారు. ఆ సినిమాకి లాభాలు రావడంతో ఆ నలుగురూ కలిసి గీతా కంబైన్స్‌ అనే సంస్థని ప్రారంభించి నిర్మాణ సారధ్య బాధ్యతల్ని ఏడిద నాగేశ్వరరావుకి అప్పగించారు. అప్పటికే ‘నేరము శిక్ష’లో ఓ కీలకమైన పాత్ర పోషించడంతో ఆ చిత్ర దర్శకుడు కె.విశ్వనాథ్‌తో పరిచయం ఏర్పడింది. ఆయన్ని ఒప్పించి ‘సిరిసిరిమువ్వ’ సినిమాని నిర్మించారు. అది విజయం సాధించింది. తరువాత తన బంధువులతో కలిసి పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‌ స్థాపించారు. తొలి ప్రయత్నంగా కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వంలో ‘తాయారమ్మ బంగారయ్య’ను నిర్మించారు. అందులో చిరంజీవి ప్రతినాయక ఛాయలున్న ఓ చిన్న పాత్రని పోషించారు. ఆ సినిమా విజయం సాధిండంతోపాటు తమిళం, హిందీ భాషల్లో రీమేక్‌ అయ్యింది. నిర్మాణ సారథిగా ఒక విజయాన్ని, నిర్మాతగా మరో విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. మూడో సినిమా కోసం మళ్లీ కె.విశ్వనాథ్‌ని సంప్రదించి ‘శంకరాభరణం’ నిర్మించారు. ఇక ఆ చిత్రం తరువాత వెనుదిరిగి చూసుకోనే అవకాశం రాలేదు. ‘సీతాకోక చిలుక’, ‘స్వాతిముత్యం’, ‘సితార’ చిత్రాలకి వివిధ విభాగాల్లో జాతీయ పురస్కారాలు లభించాయి. ‘స్వాతిముత్యం’ తెలుగు నుంచి ఆస్కార్‌ పరిశీలనకు ఎంపికైంది. చాలా సినిమాలకు వివిధ విభాగాల్లో నంది పురస్కారాలు వరించాయి. చివరిగా ‘ఆపద్బాంధవుడు’ చిత్రాన్ని నిర్మించారు ఏడిద నాగేశ్వరరావు. నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు కమిటీ సభ్యుడిగా, నంది అవార్డుల కమిటీ ఛైర్మన్‌గా, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శిగా సేవలు అందించిన ఏడిద అక్టోబర్‌ 4, 2015న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.


(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* నటన... తీరు... విలక్షణం!


నటనలో ఆమె జీవన సాఫల్య పురస్కారం అందుకుంది... జీవితంలో సాఫల్యత కోసం ఆధ్యాత్మికంగా సాధన చేసింది... అలా నటిగా, వ్యక్తిగా కూడా విలక్షణంగా జీవించింది షిర్లీ మెక్లైన్‌. బుల్లితెర, వెండితెర, నాటకరంగాల్లో నటిగా, గాయనిగా, డ్యాన్సర్‌గా, ఉద్యమకారిణిగా, రచయిత్రిగా ప్రాచుర్యం పొందింది. అమెరికా సంస్కృతికి దోహదపడిన ఆమె కళాసేవలకు ప్రతిష్ఠాత్మకమైన కెన్నడీ సెంటర్‌ ఆనర్స్‌ నుంచి గౌరవాన్ని పొందింది. నటిగా ఆమె తొలి సినిమా ప్రముఖ దర్శకుడు ఆల్ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ తీసిన ‘ద ట్రబుల్‌ విత్‌ హ్యారీ’ (1955). ఆపై ‘ఎరౌండ్‌ ద వరల్డ్‌ ఇన్‌ 80 డేస్‌’, ‘సమ్‌ కేమ్‌ రన్నింగ్‌’, ‘ది అపార్ట్‌మెంట్‌’, ‘ద టర్నింగ్‌ పాయింట్‌’, ‘టెర్మ్స్‌ ఆఫ్‌ ఎండీర్మెంట్‌’, ‘ఆస్క్‌ ఎనీ గర్ల్‌’ లాంటి సినిమాలతో అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆస్కార్, రెండు బాఫ్టా, ఎమ్మీ, గోల్డెన్‌గ్లోబ్‌లాంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు సాధించింది. వర్జీనియాలో 1934 ఏప్రిల్‌ 24న పుట్టిన ఈమె చిన్నప్పుడే నాటకాలతో నటనా ప్రస్థానం మొదలుపెట్టింది. పునర్జన్మలపై నమ్మకం పెంచుకుని ఆధ్యాత్మికంగా సాధన చేసిన ఆమె ఆ దిశగా ఎన్నో పుస్తకాలు రాసింది. ఆమెకిప్పుడు 84 ఏళ్లు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.